భారత పర్యటన వాయిదా వేసుకున్నాక కొన్ని రోజులకే చైనాకు వెళ్లిన ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇడో వాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ భారత పర్యటనను వాయిదా వేసుకున్న తర్వాత కొోన్ని రోజుల వ్యవధిలోనే చైనాకు వెళ్లారు.
ఎలాన్ మస్క్ ఆదివారం (ఏప్రిల్ 28) చైనా పర్యటనకు వెళ్లారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
చైనాలోని టెస్లా కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టే అంశంపై చైనా అధికారులతో చర్చించేందుకు ఆయన ఆ దేశానికి వెళ్లినట్లు కథనాలు వచ్చాయి.
చైనాలో అమ్మే టెస్లా కార్లలో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ) సాఫ్ట్‌వేర్‌ను ఎనేబుల్ చేయాలని మస్క్ కోరుకుంటున్నారు. అందుకు తగినట్టుగా తమ సాఫ్ట్‌వేర్ ఆల్గారిథమ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు చైనాలో సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేయాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ) సాఫ్ట్‌వేర్ అమెరికాలో పనిచేస్తోంది. ఆ సాంకేతికతను ఇప్పటి వరకు చైనాకు తీసుకెళ్లలేదు.
మరోవైపు, టెస్లా కార్లలోని సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టం వల్ల ఇటీవల 13 ప్రమాదాలు జరిగాయని, ఒకరు మరణించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మస్క్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనాతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, దీంతో ఇరు దేశాలు మెరుగైన ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నట్లు చైనా ప్రీమియర్ లీ కియాంగ్‌తో ఎలాన్ మస్క్ చెప్పారని చైనా మీడియా తెలిపింది.
విదేశీ కంపెనీలకు చైనీస్ మార్కెట్ ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుందని మస్క్‌కు లీ కియాంగ్ చెప్పినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
టెస్లా కోసం మస్క్ చైనాకు వెళ్లారా?
టెస్లాకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనా. టెస్లా తన కార్లలో అందించే సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ల లాంటి వాటినే ప్రవేశపెడుతూ ఇతర కార్ల కంపెనీలు తీవ్రమైన పోటీ ఇస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత పోటీ ఇచ్చే కార్ల కంపెనీలు చైనావేనని ఎలాన్ మస్క్ అన్నారు.
చైనాలో ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను చాలా జాగ్రత్తగా తీసుకుంటామని చైనా అధికారులకు టెస్లా భరోసా ఇచ్చింది. స్థానిక చట్టాల ప్రకారం, చైనా వినియోగదారుల డేటాను ప్రాసెస్ చేసేందుకు షాంఘైలో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది.
టెస్లా డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌లో ఉన్న భద్రతా సమస్యలను పరిష్కరించిందా? అన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు అమెరికా నేషనల్ ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్ఏ) తెలిపిన రోజుల వ్యవధిలోనే మస్క్ చైనా పర్యటనకు వెళ్లారు.
ఒకవేళ వాహనం సెల్ఫ్ డ్రైవింగ్ విధానంలో ఉన్నప్పటికీ, డ్రైవర్లు రోడ్డుపై దృష్టిపెట్టాలని అంతకుముందు ఎన్‌హెచ్‌టీఎస్ఏ తన రిపోర్టులో తెలిపింది. కానీ, క్రాష్‌కు గురైన కార్లలో, డ్రైవర్లు రోడ్డుపై సరైన దృష్టిపెట్టలేదని గుర్తించింది.

ఫొటో సోర్స్, Getty Images
టెస్లా షేర్ల పతనం..
చైనీస్ కార్ల కంపెనీల ధరలతో టెస్లాకు పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకునేందుకు చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో టెస్లా కార్ల ధరలను తగ్గిస్తోంది.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా కార్ల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. సేల్స్ తగ్గుతుండటంతో ఈ సంస్థ షేర్ల విలువ పడిపోతోంది. 2024లోనే టెస్లా షేర్ల విలువ 32 శాతం పతనమైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్ భారత పర్యటన ఎందుకు వాయిదాపడింది?
ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఎలాన్ మాస్క్ భారత్‌కు వస్తారని అందరూ భావించారు. రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారని, భారత్‌లో పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి.
కానీ, ఆయన తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు ఏప్రిల్ 20న ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శిస్తానని ఆయన చెప్పారు.
"దురదృష్టవశాత్తూ, టెస్లాకు సంబంధించి అత్యంత కీలకమైన బాధ్యతల కారణంగా భారతదేశ పర్యటన ఆలస్యం అవుతోంది" అని ఆయన X (ట్విటర్)లో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా యూనివర్సిటీల్లో వందల మంది విద్యార్థుల అరెస్టులు...అసలు అక్కడేం జరుగుతోంది?
- ‘పరిశోధన నాది..కానీ నోబెల్ ప్రైజ్ నా బాస్ తీసుకున్నారు’: ఓ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆరోపణ
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














