కరెంటు అవసరం లేని పిండిమర.. ఎలా పనిచేస్తుంది?

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
- రచయిత, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అది 2016. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పది రోజుల వరకూ కరెంటు లేదు. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు కూర్చుని తిరగలిలో విసరిన పిండితో రొట్టెలు చేసుకున్నాం. అవి చాలా రుచిగా ఉన్నాయి. అంత రుచి ఎలా వచ్చింది? అని అడిగితే అమ్మ చెప్పింది. ఇంట్లో తిరగలిలో విసరిన పిండి మృదువుగా ఉంటుందని, పిండిలో సహజ స్వభావం పోకుండా ఉంటుందని, అందువల్ల మరింత రుచిగా ఉంటాయని చెప్పింది.''
ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లా శ్రీపత్ ధమనగావ్ గ్రామానికి చెందిన రైతు సునీల్ శిందె మెదడులో, పెడల్‌తో తొక్కే పిండిమర తయారు చేయాలన్న ఆలోచనకు బీజం వేసింది.
సైకిల్ గేర్లు, పెడల్, సీటు, రాతి తిరగళ్లతో విద్యుత్ అవసరం లేని ఒక పిండిమరను తయారు చేశారు సునీల్.
2016లో మొదలైన పిండిమర తయారీ 2018కి పూర్తయింది. మొదటి పిండిమర అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లలో ఈ పిండిమరలో పలు మార్పులు చేసి ఇప్పుడు అమ్మకానికి సిద్ధం చేశారు సునీల్ శిందె.
ఈ పిండిమర ప్రత్యేకతలను ఆయన వివరించారు.
''పాతకాలంలో ఇంట్లో తిరగలితో పిండి విసిరినట్టు పిండి తయారు చేయడమే దీని ప్రత్యేకత. దీనికి విద్యుత్ అవసరం లేదు. అలాగే వ్యాయామం కోసం బయటికెళ్లాల్సిన పని కూడా లేదు. మనకు కుదిరిన సమయంలో ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు'' అన్నారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
ఎలా తయారు చేశారు?
''సైకిల్ తరహా నిర్మాణం కోసం ఒక మెటల్ పైపును తీసుకుని, పిండిమరకు అనుగుణంగా దానిని రూపొందించాం. దీనికి అమర్చిన సైకిల్ హ్యాండిల్ ఎత్తును మనిషి ఎత్తును బట్టి సవరించుకునేలా తయారు చేశారు. కూర్చునే సీటును కూడా పైకి, కిందకు, ముందుకు, వెనక్కు సవరించుకునేలా తయారు చేశాం. దానికి సరిపడే గేర్‌ను కూడా అమర్చాం'' అని సునీల్ చెప్పారు.
''పిండిమరకు అవసరమైన తిరగలి రాతిపలకల కోసం ఇక్కడ ఒక మంచి గని ఉంది. ఆ రాయి చాలా గట్టిగా ఉంటుంది. రాయితో చేసిన ఈ తిరగలిని అమర్చడం అంత తేలిక కాదు. మా డిజైన్‌కు అనుగుణంగా తిరగలి రాతిపలకలను అమర్చాం. రాతిపలకలు తగినంత మందం, వెడల్పు ఉండేట్టు చూసుకున్నాం'' అన్నారు.
ఈ పిండిమరకు అవసరమైన అన్ని మార్పులూ చేసిన తర్వాత సునీల్ దీనిని అమ్మడం ప్రారంభించారు. ఎగ్జిబిషన్లు, సోషల్ మీడియాలో ఈ పిండిమర గురించి ప్రచారం చేశారు.
ప్రస్తుతం ఆయనకు పుణె, ముంబయి, సాంగ్లి, సతారా, కర్ణాటక నుంచి దాదాపు 50 ఆర్డర్లు వచ్చాయి.
''పిండిమరకు మంచి స్పందన వచ్చింది. అయితే, అందరికీ మేలు జరగాలి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా దగ్గరుండి తయారు చేస్తున్నాం. ఆర్డర్లు ఇచ్చిన వారికి నెల రోజులు వేచి ఉండాలని చెబుతున్నాం. ఎందుకంటే, అది తయారు చేసేందుకు మాకు నెల రోజులు పడుతుంది. ఆ తర్వాతే ఇవ్వగలం'' అని సునీల్ అన్నారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
'పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి'
పెడల్‌తో పనిచేసే ఈ పిండిమరపై కూర్చున్నప్పుడు మన అమ్మమ్మలు, అమ్మలు కిందకూర్చుని తిరగలి తిప్పుతూ పిండి విసిరిన ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకురాక మానవు.
ఇందులో గోధుమలు పడేందుకు ఏర్పాటు చేసిన మార్గం వద్ద ఒక వాల్వ్‌ను ఏర్పాటు చేశారు. పిండిమరలో గోధుమలు పడే వేగాన్ని తగ్గించడానికి, పెంచడానికి ఈ వాల్వ్ ఉపయోగపడుతుంది. ధాన్యం గింజలు నెమ్మదిగా పడుతుంటే పిండి మృదువుగా వస్తుంది. ఆ పక్కనే పిండి బయటికి వచ్చేందుకు మార్గం ఉంటుంది.
ఈ పిండిమరకు పేటెంట్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు సునీల్. ఆయనకు మరికొన్ని ప్రణాళికలు కూడా ఉన్నాయి.
''పాత విధానాలే సహజంగా ఉంటాయి. ఇలా తయారు చేసిన ఆహారం రుచికరంగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే, పిండిమర భిన్నంగా ఉన్నట్టే పరిస్థితులు కూడా తల్లకిందులుగా ఉన్నాయి. ఖర్చు కారణంగా సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అందువల్లే ఈ కొత్తరకం పిండిమర రూపకల్పన దశలోనే ఉంది'' అని సునీల్ శిందె అన్నారు.
2002 నుంచీ సునీల్ వివిధ రకాల యంత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 28 రకాల వస్తువులను తయారు చేసినట్లు ఆయన చెప్పారు.
ఎద్దుతో నడిచే రోటావేటర్, పేడ (ఎరువు) చల్లే యంత్రం వంటివి అందులో ఉన్నాయి.

ఆవిష్కరణల ఆలోచన ఎలా వచ్చింది?
సునీల్ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు.
''పొలం పనులు చేస్తున్న సమయంలో కొత్త పనిముట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. కూలీల సమస్య బాగా ఉండేది. దీంతో పనిని ఎలా సులభంగా పూర్తి చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయడం ఎలా? అనే ఆలోచనల నుంచి కొత్త ఆవిష్కరణల ఆలోచన వచ్చింది'' అని సునీల్ చెప్పారు.

ఫొటో సోర్స్, SUNIL SHINDE
సునీల్ తయారు చేసిన చంద్రికా బంధని యంత్రానికిగానూ రాష్ట్రపతి భవన్‌లో ఆయన సత్కారం అందుకున్నారు. పట్టు పరిశ్రమలో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తారు.
సునీల్ వర్క్‌షాప్ గతంలో కుంభర్ పింపల్‌గావ్‌లో ఉండేది. ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి పెంచడం కోసం ఇటీవల జల్నా ఇండస్ట్రియల్ ఏరియాకి మార్చారు.
ఇవి కూడా చదవండి:
- పులి గోరును ధరించిన ‘బిగ్‌బాస్’ పోటీదారును ఎందుకు అరెస్ట్ చేశారు?
- రాజస్థాన్: కోటా కోచింగ్ సెంటర్లకు కఠినమైన నిబంధనలు... విద్యార్థుల ఆత్మహత్యలను ఇవి అడ్డుకోగలవా?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- భారత్, చైనా: సరిహద్దుకు అటూఇటూ మళ్ళీ సేనల మోహరింపు... నాలుగేళ్ళుగా శీతాకాలంలో ఎందుకీ టెన్షన్స్?
- భారత్-కెనడా దౌత్య వివాదంలో జోక్యం చేసుకున్న బ్రిటన్, అమెరికా... వియాన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














