నీకా షాకరామీ: ఇరాన్ భద్రతా దళాలే ఈ టీనేజర్‌ను లైంగికంగా వేధించి, చంపేశాయని వెల్లడి చేసిన సీక్రెట్ డాక్యుమెంట్

నీకా షాకరామీ
    • రచయిత, బెర్త్‌రామ్ హిల్, ఐడా మిల్లర్, మైఖెల్ సిమ్కిన్
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొంటూ ఆచూకీ కనిపించకుండాపోయిన ఇరాన్ టీనేజర్ ‘నీకా షాకరామీ’ని ముగ్గురు భద్రతా సిబ్బంది లైంగికంగా వేధించి, హత్య చేశారని బయటకు లీక్ అయిన ఒక రహస్య పత్రం చెబుతోంది.

2022లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతూ నీకా అదృశ్యమయ్యారు. తొమ్మిది రోజుల తర్వాత ఆమె మృతదేహం బయటకు వచ్చింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

ప్రస్తుతం బయటకు వచ్చిన డాక్యుమెంట్‌లో వివరాలపై ఇరాన్ ప్రభుత్వం, రివొల్యూషనరీ గార్డ్స్‌ను సంప్రదించాం. అయితే, వారు స్పందించేందుకు నిరాకరించారు.

నీకా కేసుపై ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌సీజీ) దర్యాప్తులోని వివరాలను తాజా రిపోర్టులో వివరించారు. ఆమెను హత్య చేసిన వారి పేర్లతోపాటు నిజాలను బయటకు రాకుండా అడ్డుకున్న అధికారుల పేర్లు కూడా దీనిలో ఉన్నాయి.

నీకాను అదుపులోకి తీసుకున్న అండర్‌కవర్ వ్యాన్‌లో ఏం జరిగిందో చెప్పే కలవరపరిచే అంశాలు ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఆమెను అదుపులోకి తీసుకున్న వారిలో ఒక వ్యక్తి ఏకంగా ఆమెపై కూర్చొని లైంగికంగా వేధించాడు.

చేతులకు బేడీలు వేసివున్న ఆమె ఆ వ్యక్తిని కాలితో తన్నేందుకు ప్రయత్నించారు.

ఆమె తన్నేందుకు ప్రయత్నించడంతోపాటు తిట్టడంతో లాఠీలతో కొట్టాల్సి వచ్చిందని ఆ ముగ్గురు వ్యక్తులూ అంగీకరించారు.

ప్రస్తుతం ఆమె హత్యపై చాలా డాక్యుమెంట్లు వైరల్ అవుతున్నాయి. అందుకే తాజా నివేదికలోని ప్రతి వివరాన్నీ ధ్రువీకరించేందుకు బీబీసీ ప్రయత్నించింది.

ఆమె చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బీబీసీ విస్తృతంగా పరిశోధన చేపట్టింది.

వీడియో క్యాప్షన్, ఆమెను లైంగికంగా హింసించి, కొట్టి చంపారనేందుకు బయటపడ్డ ఆధారాలు

నీకా షాకరామీ ఆచూకీ గల్లంతు కావడం, అనంతరం హత్యపై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఇరాన్‌లో స్వేచ్ఛను కోరుతూ మహిళలు చేపట్టే నిరసనలకు ఆమె ముఖచిత్రంగా మారారు. 2022లో హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఆందోళనకారులు ఆమె పేరుతో గట్టిగా నినాదాలు చేసేవారు.

22 ఏళ్ల మహసా అమినీ హత్య అనంతరం ఇక్కడ నిరసనలు చెలరేగాయి. హిజాబ్‌ను సరిగా వేసుకోలేదని పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం కస్టడీలోనే గాయాలతో ఆమె మరణించినట్లు ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం పరిశీలనలో తేలింది.

నీకా కేసు విషయానికి వస్తే, నిరసనలు చేపడుతున్న ప్రాంతం నుంచి ఆమె అదృశ్యమయ్యారు. వారం రోజుల తర్వాత ఒక మార్చురీలో ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే, నిరసనలతో నీకా హత్యకు సంబంధముందనే వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

తన ఆచూకీ గల్లంతయ్యేందుకు ముందు, సెప్టెంబరు 20 సాయంత్రం సెంట్రల్ తహరాన్‌లోని లాలెహ్ పార్క్ సమీపంలో నిరసనల్లో భాగంగా హిజాబ్‌లకు నిప్పు పెడుతూ ఒక వీడియోలో ఆమె కనిపించారు.

ఆమె చుట్టుపక్కల ఉండేవారు ‘‘డెత్ టు ద డిక్టేటర్’ అని గట్టిగా అరిచారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖామేనీ గురించి ఆ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఆ సమయంలో తనను అధికారులు గమనిస్తున్నారని నీకాకు తెలియదు. ఈ విషయాన్ని ఆ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.

నీకా షాకరామీ

ఇరాన్ రివొల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌సీజీ) కమాండర్-ఇన్-చీఫ్‌ను సంబోధిస్తూ తాజా నివేదికను రాశారు. నిరసనలను జాగ్రత్తగా గమనించి అధికారులతో విస్తృతంగా మాట్లాడినట్లు దీనిలో వివరాలున్నాయి.

నిరసనలను కొన్ని అండర్ సెక్యూరిటీ యూనిట్లు జాగ్రత్తగా గమనించినట్లు దీనిలో పేర్కొన్నారు.

వీటిలోని ఒక యూనిట్ (టీమ్ 12) నిరసనలకు నీకా నేతృత్వం వహిస్తున్నారని అనుమానించింది. ఆమె ఫోన్‌కు పదేపదే కాల్స్ రావడంతోపాటు ఆమె ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉన్నట్లు ఆ బృందంలోని సభ్యులు తెలిపారు.

నిరసనలకు నేతృత్వం వహించేంది నీకానేనని ధ్రువీకరించుకునేందుకు తమ అధికారుల్లో ఒకరిని నిరసనకారుడిగా ఆ బృందం పంపించింది. అన్నీ ధ్రువీకరించుకున్నాక ఆమెను అరెస్టు చేసేందుకు తమ బృందానికి ఆయన సమాచారం ఇచ్చారు. కానీ, వారి నుంచి ఆమె తప్పించుకున్నారు.

భద్రతా బలగాలు తనను వెంబడిస్తున్నప్పుడు, ఆ రోజు రాత్రి ఒక స్నేహితురాలికి నీకా ఫోన్ చేశారని బీబీసీ పర్షియన్‌కు ఆమె బంధువు ఇదివరకు వెల్లడించారు.

దాదాపు గంటసేపు గాలింపు తర్వాత నీకా కనిపించారని, అప్పుడే ఆమెను అదుపులోకి తీసుకొని తమ వాహనంలోకి ఎక్కించామని భద్రతా సిబ్బంది చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఆ వ్యాన్‌లో టీమ్-12 సభ్యుల్లో ముగ్గురు (అరాష్ కల్హోర్, సదేగ్ మంజాజీ, బేరూజ్ సాడెఘీ) నీకాతోనే ఉన్నారు.

ఆ టీమ్‌కు నాయకుడు మోర్తేజా జలీల్ డ్రైవర్‌తోపాటు ముందు సీటులో కూర్చున్నారు.

వెంటనే ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు టీమ్ ప్రయత్నించిందని నివేదికలో పేర్కొన్నారు.

దగ్గర్లోని ఒక తాత్కాలిక పోలీసు శిబిరానికి ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, అక్కడి పరిసరాలు కిక్కిరిసి ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

దీంతో అక్కడి నుంచి 35 నిమిషాల దూరంలోనున్న ఒక డిటెన్షన్ సెంటర్‌కు ఆమెను తీసుకెళ్లారు. ఆ కేంద్రం కమాండర్ మొదట నీకాను అదుపులోకి తీసుకునేందుకు అంగీకరించారు. అయితే, తర్వాత ఆయన తన మనసును మార్చుకున్నారు.

‘‘ఆమె గట్టిగా తిట్టారు, నినాదాలు కూడా చేశారు’’ అని ఆయన చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు.

నీకా షాకరామీ

‘‘ఆ సమయంలో మా స్టేషన్‌లో మరో 14 మంది మహిళలు ఉన్నాయి. నీకాను కూడా తీసుకుంటే ఆమెను చూసి మిగతవారు కూడా నినాదాలు చేస్తారని అనిపించింది’’ అని ఆయన చెప్పారు.

‘‘ఇక్కడ అల్లర్లు చెలరేగేందుకు ఆమె కారణం అవుతారని నాకు అనిపించింది’’ అని ఆయన తెలిపారు.

వెంటనే సలహా కోసం ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయాన్ని మోర్తేజా జలీల్‌ స్పందించారు. దీంతో తహరాన్‌లోని కరుడుగట్టిన ‘ఎవిన్ ప్రిజన్’కు ఆమెను తీసుకెళ్లాలని ఆయనకు సూచించారు.

అయితే, అక్కడకు వెళ్లే మార్గంలో వ్యాన్ వెనుక భాగం నుంచి పెద్దపెద్ద శబ్దాలు రావడం ఆయనకు వినిపించింది.

ఆ శబ్దాలు ఏమిటో నీకాను అదుపులోకి తీసుకున్న వారి వాంగ్మూలాలను పరిశీలిస్తే మనకు తెలుస్తుంది.

ఆమెను అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఒకరైన బేరూజ్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘డిటెన్షన్ సెంటర్ తిరస్కరించిన వెంటనే మళ్లీ ఆమెను వ్యాన్‌లోకి ఎక్కించాం. అప్పుడు ఆమె గట్టిగా తిట్టడం, నినాదాలు చేయడం మొదలుపెట్టారు’’ అని ఆయన చెప్పారు.

‘‘అరాష్ తన సాక్స్‌ను ఆమె నోటిలోకి కుక్కారు. దీంతో ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఫ్రీజర్‌వైపు ఆమెను బలంగా నొక్కుతూ ఆమెపైకి ఎక్కి సదేగ్ కూర్చున్నారు. దీంతో ఆమె కదలకుండా ఉండిపోయింది’’ అని ఆయన వివరించారు.

‘‘ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే, కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఆమె తిట్టడం మొదలుపెట్టారు. కానీ, నాకు ఏమీ కనిపించలేదు. ఏదో కొడుతున్న శబ్దాలు, గొడవ మాత్రమే నాకు వినిపించాయి’’ అని ఆయన తెలిపారు.

విస్మయానికి గురిచేసే మరికొన్ని వివరాలను అరాష్ వెల్లడించారు.

కొంతసేపటికి తన ఫోన్‌లోని టార్చ్‌ను ఆయన ఆన్ చేశారు. దీంతో నీకా ప్యాంట్ లోపల సదేగ్ చేయిపెడుతూ కనిపించారు.

ఆ తర్వాత పరిస్థితి మొత్తం అదుపు తప్పిందని అరాష్ చెప్పారు.

‘‘అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. కానీ, నీకాను లాఠీతో కొడుతున్న శబ్దాలు వినిపించాయి. చీకట్లో నేను కూడా తన్నడం మొదలుపెట్టారు. అసలు నేను నీకాను కొడుతున్నానో లేదా నా తోటి అధికారులను కొడుతున్నానో కూడా నాకు తెలియలేదు’’ అని ఆయన వివరించారు.

అయితే, తనపై వృత్తిపరమైన అసూయతోనే అరాష్ అలా చెబుతున్నాడని సదేగ్ అంటున్నారు. అసలు ఆమె ప్యాంట్‌లో తాను చేయపెట్టలేదని ఆయన అన్నారు. అయితే, నీకాపై కూర్చొని, ఆమె పిరుదులను తాకినప్పుడు కాస్త ఉద్రేకానికి లోనయ్యానని మాత్రం చెప్పాడు.

చేతులు కట్టేసి ఉన్నప్పటికీ ప్రతి ఘటించేందుకు నీకా ప్రయ్నతించారు. ఆమె కుదుపుకు సదేగ్ పక్కకు పడిపోయారు.

నీకా షాకరామీ

ఫొటో సోర్స్, Social media

ఫొటో క్యాప్షన్, సోదరి ఐడా (కుడి)తో నీకా

‘‘ఆమె నా ముఖంపై తన్నింది. దీంతో నేను ఆత్మరక్షణలో పడ్డాను’’ అని సదేగ్ చెప్పాడు.

వెంటనే వ్యాన్‌ను పక్కన ఆపేయాలని మోర్తేజా జలీల్ సూచించారు.

వ్యాన్ తలుపుతీసి చూసేసరికి తనకు నీకా మృతదేహం కనిపించిందని ఆయన చెప్పారు.

నీకా తల, ముఖం నుంచి వస్తున్న రక్తాన్ని తానే శుభ్రం చేశానని ఆయన వివరించారు.

మార్చురీలో తన కుమార్తె ఎలా తనకు కనిపించిందో ఆమె తల్లి చెబుతున్న వివరాలు దీనితో సరిపోతున్నాయి. పదునైన వస్తువులతో బలంగా మళ్లీమళ్లీ కొట్టడంతోనే ఆమె మరణించినట్లు నీకా శవపరీక్షలో పేర్కొన్నారు.

అసలు అక్కడ ఏం జరిగిదో తెలుసుకునేందుకు తాను ప్రయత్నించలేదని టీమ్ లీడర్ మోర్తేజా అంగీకరించారు.

‘‘అసలు ఆమెను ఇప్పుడు ఏం చేయాలనే నేను ఆలోచించాను. ఆమెకు ఊపిరి ఆడుతోందా? అని మాత్రమే అని అడిగాను. వెంటనే బేరూజ్ మాట్లాడుతూ.. ‘లేదు, ఆమె చనిపోయింది’ అని చెప్పాడు’’ అని మోర్తేజా తెలిపారు.

వెంటనే ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయానికి మరోసారి జలీల్ ఫోన్ చేశారు.

ఆ సమయంలో ‘నయీమ్ 16’గా కోడ్ నేమ్‌తో పేరు ప్రస్తావించిన ఒక ఉన్నతాధికారి జలీల్‌తో మాట్లాడారు.

‘‘అప్పటికే మా స్టేషన్‌లో చాలా మరణాలు సంభవించాయి. ఆమెను బేస్‌కు తీసుకొచ్చినంత మాత్రన ఎలాంటి ఉపయోగం ఉండదని అనిపించింది’’ అని నయీమ్ 16 దర్యాప్తు అధికారులతో చెప్పారు.

‘‘ఆ మృతదేహాన్ని వీధిలో పడేయ్’’ అని జలీల్‌కు చెప్పినట్లు నయీమ్ అంగీకరించారు. ఆ తర్వాత తహరాన్‌లోని యదేగార్-ఈ-ఇమామ్ ప్రధాన రహదారిపై ఎవరూలేని చోట ఆమె మృతదేహాన్ని పడేశామని జలీల్ చెప్పారు.

లైంగిక వేధింపుల వల్లే వ్యాన్‌లో గొడవ జరిగిందని, ‘టీమ్ 12’ సిబ్బంది బలంగా కొట్టడంతోనే ఆమె మరణించారని నివేదికలో పేర్కొన్నారు.

‘‘మూడు ల్యాటీలు, షాక్‌లిచ్చే గన్లు మూడింటిని దాడిలో ఉపయోగించారు. అయితే, అక్కడ ఏ దెబ్బ వల్ల ప్రాణం పోయిందో చెప్పడం కొంచెం కష్టం’’ అని నివేదికలో వివరించారు.

నీకాకు ఏం జరిగిందో ప్రభుత్వం చెబుతున్న వాదనకు పూర్తి విరుద్ధంగా ఈ నివేదికలో వివరాలు ఉన్నాయి. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించిన వారం రోజుల తర్వాత అధికారులు చేపట్టిన దర్యాప్తు వివరాలను ప్రభుత్వ టీవీ చానెల్‌లో ప్రసారం చేశారు. దీనిలో ఒక భవనంపై నుంచి దూకి నీకా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.

నీకా షాకరామీ

ఫొటో సోర్స్, Atash Shakarami

ఒక అపార్ట్‌మెంట్‌లోకి ఒక వ్యక్తి వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను టీవీలో చూపించారు. అయితే, ఆ అమ్మాయి తన కుమార్తె కాదని ఒక ఫోన్ ఇంటర్వ్యూలో బీబీసీ పర్షియన్‌తో నీకా తల్లి నస్రిన్ చెప్పారు.

‘‘వారు అబద్ధాలు చెబుతున్నారని అందరికీ తెలుసు’’ అని నస్రిన్ అన్నారు.

రిపోర్టులోని వివరాలు అబద్ధాలో, నిజాలో లాంటి అంశాల జోలికి పోకుండా.. అసలు నీ రిపోర్టును నమ్మొచ్చోలేదో అనే అంశంపై బీబీసీ ఐ పరిశోధన చేపట్టింది.

కొన్ని ఇరాన్ ప్రభుత్వ డాక్యుమెంట్లుగా భావించే పత్రాలు అనంతర పరిశీలనలో ఫేక్ అని తేలుతుంటుంది.

ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే, అనవసర స్పేస్‌లతోపాటు అక్షర దోషాలు, అన్వయ దోషాలు కనిపిస్తుంటాయి.

కొన్నిసార్లు అధికారిక లోగోలోనూ తేడా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఇరాన్‌లో ప్రభుత్వ సంస్థలు ఉపయోగించే భాష కంటే భిన్నంగా వీటిలో భాష ఉంటుంది.

మేం పరిశీలించిన ప్రస్తుత డాక్యుమెంట్‌లోనూ కొన్ని దోషాలు కనిపించాయి. రిపోర్టులో నాజా అనే పోలీస్ ఫోర్స్ పేరు ప్రస్తావించారు. కానీ, ఆ ఫోర్సు పేరు ఫరాజా.

అందుకే ఈ డాక్యుమెంట్ వాస్తవమైనదేనని ధ్రువీకరించుకునేందుకు మాజీ ఇరాన్ నిఘా అధికారికి దీన్ని చూపించాం.

ఆయన ఐఆర్‌జీసీ అధికారులతో మాట్లాడారు. ఆ డాక్యుమెంట్ వాస్తవమో కాదో ఆయన పరిశీలించారు. అనంతరం 2022నాటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిద్ధంచేసిన 322 పేజీల కేస్ ఫైల్‌లో ఈ రిపోర్టు కూడా భాగమని ఆయన ధ్రువీకరించారు.

ఇరాన్‌లో ఎప్పుడూ వంద శాతం కచ్చితమని ధ్రువీకరించుకోలేం. కానీ, మాజీ ఉన్నతాధికారి చెప్పడంతో దీనిలో విషయాలు నిజమని మేం భావించాం.

ఐఆర్‌జీసీతో ఆ మాజీ అధికారి మాట్లాడినప్పుడు ‘నయీమ్ 16’గా కోడ్ నేమ్‌తో పిలిచే ఆ వ్యక్తి ఎవరో కూడా తెలిసింది.

కెప్టెన్ మహమ్మద్ జమానీని ఆ పేరుతో పిలుస్తారని ఆ మాజీ అధికారి మాకు చెప్పారు.

నీకా హత్యపై జరిగిన విచారణకు హాజరైన అధికారుల జాబితాలో జమానీ పేరు కూడా ఉంది.

ఈ వివరాలన్నీ ఐఆర్‌జీసీతోపాటు ప్రభుత్వ అధికారుల ముందు ఉంచాం. కానీ, వారెవరూ స్పందించలేదు.

నీకా మరణానికి కారణమైన వ్యక్తులకు ఇప్పటివరకు ఎలాంటి శిక్షా విధించలేదు.

అసలు ఎందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదో ఆ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ టీమ్-12లోని సభ్యులంతా ‘హిజ్బొల్లా’ గ్రూపుకు చెందిన వారని దానిలో పేర్కొన్నారు.

ఇది ఇరాన్‌లోని ఒక సాయుధ బలగం. దీనికి లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఎలాంటి సంబంధమూ లేదు. ఈ గ్రూపులోని సభ్యులకు నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని విధులను ఐఆర్‌జీసి అప్పగిస్తుంది.

‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా హిజ్బొల్లాకు చెందినవారు. రెండు, మూడు భద్రతా సంస్థల మధ్య ఆదేశాలు ఇచ్చిపుచ్చుకోవడంతో ఈ కేసును ఫాలోఅప్ చేయడం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కాస్త కష్టమైంది’’ అని నివేదికలో పేర్కొన్నారు.

అయితే, ఐఆర్‌జీసీ అధికారి నయీమ్ 16కి మాత్రం మందలిస్తూ పైఅధికారులు నోటీసులు ఇచ్చారు.

2022నాటి ఇరాన్ నిరసనల్లో దాదాపు 550 మంది ఆందోళనకారులు భద్రతా సంస్థల చేతిలో హత్యకు గురయ్యారు. వీరిలో చాలా మంది కాల్పుల్లోనే మరణించారని ఐక్యరాజ్యసమితి పరిశీలనలో తేలింది.

భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో కొన్ని నెలలకు ఆ నిరసనలు శాంతించాయి. మళ్లీ ఈ నెల మొదట్లో ఇస్లామిక్ రిపబ్లిక్ డ్రెస్ కోడ్‌ పేరుతో కొత్త నిబంధనలను ఇరాన్ మొరాలిటీ పోలీసులు విడుదల చేశారు.

వీడియో క్యాప్షన్, బీబీసీతో తమ అనుభవాలు పంచుకున్న బాధితులు

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)