అటల్ బిహారీ వాజ్‌పేయి: నెహ్రూను ఇష్టపడిన నేత... మోదీకి 'రాజధర్మం' గుర్తు చేసిన ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిద్ధనాథ్ గణు
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘వాజ్‌పేయి మంచివారే. కానీ, ఆయన పార్టీ కాదు’ అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి.
“అవును అది నిజమే, అది నిజమే” అని పార్లమెంటులో చాలా మంది నాయకులు బల్లలు చరుస్తూ అరిచారు. అప్పుడు వాజ్‌పేయి వేగంగా స్పందించారు. ‘మరి ఈ మంచి వాజ్‌పేయి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు?”
పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉన్నా సరే, తన హాస్య చతురతతో దాన్ని తేలిక చేయడం, ప్రత్యర్థులతో కూడా నవ్వుతూ మాట్లాడడం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రత్యేకత. ఈ విలక్షణ వ్యక్తిత్వంతో పాటు మంత్రిగా ఆయన పని తీరు, భారత రాజకీయాలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
బీజేపీ అగ్ర నాయకులలో ఒకరుగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన పండిట్ నెహ్రూను చాలా ఇష్టపడేవారు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీని ‘అపర దుర్గ’గా కీర్తించారు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి జైలుకు వెళ్లారు. ఆయన విడుదలైన తర్వాత ఆమెపై దేశవ్యాప్తంగా ఇందిరపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆయన బాల్యం ఉత్తరప్రదేశ్‌లో, యౌవనం మధ్యప్రదేశ్‌లో గడిచాయి. ఆయనకు రాజనీతి శాస్త్రం, లా, జర్నలిజంలో ఆసక్తి ఎక్కువ. రాజకీయాల్లో ఉన్నా కవిత్వంపై తనకున్న ఇష్టాన్ని ఏనాడు వదులుకోలేదు. అనేక ప్రతికూలతలను అధిగమించి మూడుసార్లు దేశానికి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
బీజేపీలో ఇతర నాయకులు, సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు హిందూత్వ అమలు గురించి బహిరంగా ప్రస్తావిస్తున్నా, వాజ్‌పేయి ఏనాడూ తన మితవాద ధోరణిని వదులుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారంతో దోబూచులాట...
వాజ్‌పేయి తొలిసారి 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా అధికారంలోకి వచ్చారు. అయితే, అప్పట్లో జనతా ప్రభుత్వం కొద్ది కాలమే అధికారంలో ఉంది. జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రిగా ఉండగానే ఆమె హత్య జరిగింది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు పాలనా కాలంలో బీజేపీ ఎదగడం మొదలైంది. పీవీ ప్రధానిగా ఉన్న ఐదేళ్లలో బీజేపీ ఉవ్వెత్తున ఎగసింది. భారత రాజకీయాల్లో కీలక స్థానానికి చేరింది.
సౌమ్యుడిగా ముద్ర పడిన వాజ్‌పేయిని పక్కన పెట్టి పార్టీని విస్తరించే బాధ్యతలను అడ్వాణీ భుజాలకెత్తుకున్నారు. అతివాద హిందుత్వ, పార్టీ సంస్థాగత నిర్మాణంలో తనకున్న నైపుణ్యంతో అడ్వాణీ పార్టీని కొత్త ఊపిరి పోశారు. సోమనాధ్ నుంచి అయోధ్యకు రథయాత్ర చేపట్టారు.
అడ్వాణీ నాయకత్వంలో బీజేపీ విస్తరించిన తీరుపై వాజ్‌పేయి సంతృప్తికరంగా లేరని అప్పట్లో అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అయితే, వాజ్‌పేయి ఏనాడూ అడ్వాణీ రథయాత్రను బహిరంగంగా వ్యతిరేకించలేదు.
రథయాత్రలో భాగంగా 1992 డిసెంబర్ 5న అడ్వాణీ లక్నో రావాల్సి ఉంది. అంతకు ముందు రోజే అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి అయోధ్య చేరుకున్నారు. ఆ సమయంలో లక్నో ఎంపీగా ఉన్న వాజ్‌పేయి అమీనాబాద్‌లోని జెండావాలా పార్క్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అప్పటి వరకు రథయాత్రకు, కరసేవకు దూరంగా ఉన్న వాజ్‌పేయి ఆ సమావేశంలో చేసిన ప్రసంగం గట్టి ప్రభావం చూపించింది.
ఆ ప్రసంగంలో వాజ్‌పేయి చెప్పిన కొన్ని మాటలు నాటి పరిస్థితులకు అద్దం పట్టాయి. “సుప్రీంకోర్టు మీరు భజనలు చేసుకోవచ్చని, కీర్తనలు పాడుకోవచ్చని చెప్పింది. అయితే, వాటిని నిల్చుని చెయ్యలేము కదా. మేము కూర్చోవడానికి మాకొక ప్రాంతం కావాలి. అక్కడ పదునైన రాళ్లు ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని చదును చేయాల్సి ఉంది” అని అన్నారు.
“రేపు అక్కడ ఏం జరుగుతుందే నాకు తెలియదు. నేను అయోధ్య వెళ్లాలనుకున్నాను. కానీ, నన్ను దిల్లీ వెళ్లాలని ఆదేశించారు. నేను ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను” అని వాజ్‌పేయి ఆ సమావేశంలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పటి వరకు వాజ్‌పేయి రామజన్మభూమి ఉద్యమానికి దూరంగా ఉన్నారు. ఆయన ప్రసంగంతో అప్పటి వరకు ఉన్న గ్యాప్ అంతరించింది. ఆయన రామజన్మభూమి ఉద్యమానికి మద్దతివ్వరని అందరూ భావించారు. డిసెంబర్ 6న జరగబోయే దానికి తన ప్రసంగం ద్వారా వాజ్‌పేయి పరోక్షంగా మద్దతిచ్చారు.
బాబ్రీ విధ్వంసాన్ని వాజ్‌పేయి ఖండించారు. రథయాత్ర, 1993 అల్లర్ల తర్వాత బీజేపీ హిందూత్వ రాజకీయాల్ని విజయవంతంగా నడుపుకొచ్చింది. అయితే దేశంలోని ఓ వర్గం బీజేపీని సందేహాస్పదంగా చూడటం మొదలు పెట్టింది. అధికారాన్ని దక్కించుకోవాలంటే మరిన్ని పార్టీల మద్దతు అవసరమని భావించిన బీజేపీ పెద్దలకు ఆ సమయంలో మితవాద వాజ్‌పేయి సరైన వ్యక్తిగా కనిపించారు.
1995 నవంబర్ 12న ముంబయిలోని శివాజీ పార్కులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అడ్వాణీ అనూహ్య ప్రకటన చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాజ్‌పేయి పేరును ప్రకటించారు.
రెండు నెలల తర్వాత హవాలా కేసు తెరపైకి వచ్చింది. ఇందులో బీజేపీ అధ్యక్షుడు అడ్వాణీపైనా ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ 1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ వాజ్‌పేయిని ఆహ్వనించారు. అలా బీజేపీ తొలిసారి అధికారం చేపట్టింది. అయితే ఆ పార్టీకి లోక్‌సభలో అవసరమైనంత మంది ఎంపీల సంఖ్యా బలం లేదు.
1996 మే16న వాజ్‌పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లోక్‌సభలో విశ్వాస తీర్మానంపై ప్రసంగించాల్సి వచ్చిన్పపుడు తనకు తగినంత సంఖ్యా బలం లేదని ఆయన సభలో అంగీకరించారు. అయితే అదే సమయంలో ప్రతిపక్షాల మధ్య ఉన్న విబేధాలను ఎత్తి చూపారు. ఇప్పటి వరకు వాజ్‌పేయి చేసిన అనేక ప్రసంగాలలో విశ్వాస తీర్మానంపై ఆయన చేసిన ప్రసంగం అత్యుత్తమంగా నిలిచింది. తన ప్రసంగం తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత దేశ చరిత్రలో అతి తక్కువ కాలం పాలించిన ప్రభుత్వంగా వాజ్‌పేయి 13 రోజుల పాలన రికార్డులకెక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దేశ ప్రజలు రకరకాల సంకీర్ణ ప్రభుత్వాలను చూశారు, అవి కూడా పూర్తి కాలం మనుగడ సాగించలేకపోయాయి. 1998లో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా బీజేపీ లోక్‌సభలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయి మరోసారి ప్రధాని అయ్యారు. 1996లో 13రోజుల పాలనలో సాధ్యం కానిది ఈసారి సాధ్యమైంది. 13 పార్టీలతో కలిపి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ.
1996లో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం 13 నెలలు అధికారంలో ఉంది. అయితే 13 నెలల కాలంలో సంకీర్ణ భాగస్వాములు వాజ్‌పేయిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు మద్దతిస్తున్న పార్టీల నుంచి లేఖలు ఇవ్వాలని రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ కోరారు. జయలలిత ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటించినా, అందుకు అనుగుణంగా లేఖ ఇచ్చేందుకు బీజేపీని ముప్పు తిప్పలు పెట్టారు.
రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370లాంటి అంశాల విషయంలో జయలలిత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. డీఎంకే పార్టీని రద్దు చేయాలని, రామ్ జెఠ్మలానీని మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అక్రమాస్తుల కేసుల్లో జరుగుతున్న విచారణ విషయంలో ఏదో ఒకటి చెయ్యాలని ఏదో ఒకటి చెయ్యాలని జయలలిత వాజ్‌పేయి ప్రభుత్వానికి చెప్పినట్లు అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా ఆధారాలను బయట పెట్టారు.
13నెలల కాలంలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక రాజకీయ సంక్షోబాలను ఎదుర్కొన్ని వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో లోక్‌సభలో విశ్వాసాన్ని కోల్పోయింది.
వాజ్‌పేయి ప్రభుత్వం అప్పటి నేవీ చీఫ్‌ను తొలగించడంతో దేశ రాజధానిలో అనూహ్య నాటకం మొదలైంది. ఈ వ్యవహరంపై పార్లమెంటరీ స్థాయి సంఘంతో విచారణ జరిపాలని, నాటి రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను తొలగించాలని జయలలిత డిమాండ్ చేశారు.
జయలలిత డిమాండ్‌ను వాజ్‌పేయి తిరస్కరించగానే అన్నాడీఎంకే ప్రభుత్వం నుంచి వైదొలగింది. నాటి బలపరీక్షలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది.
వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన బహుజన్ సమాజ్ పార్టీ తర్వాత మనసు మార్చుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ సైఫుద్దీన్ సోజ్ పార్టీ గీత దాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిధర్ గమాంగ్ అంతకు రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ బలపరీక్షకు హాజరైన వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. గిరిధర్ గమాంగ్ సభకు గైర్హాజరు అయితే ప్రభుత్వ అనుకూల- వ్యతిరేక ఓట్లు సమానం అవుతాయని, స్పీకర్ ఓటుతో ప్రభుత్వం గట్టెక్కుతుందని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు.
వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సోనియా గాంధీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఎన్నికలు తప్పనిసరిగా మారాయి. 13 పార్టీలతో ఏర్పడిన ఎన్డీయే కూటమి 13నెలలు పాలించింది. ఈ 13నెలల పాలనాకాలంలో అటం బాంబు ప్రయోగం వాజ్‌పేయి ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా నిలిచింది.

ఫొటో సోర్స్, Reuters
పోఖ్రాన్‌లో అణు విస్ఫోటనం, బాంబులా పేలిన కవిత్వం
వాజ్‌పేయి మొదటి నుంచీ అణ్వాయుధాలు విడనాడాలనే వాదనను సమర్థిస్తూ వచ్చారు. అయితే, 1974లో భారత్ అణు పరీక్షలు చేసినప్పుడు ఆయన లోక్‌సభలో ఇందిరపై ప్రశంసల వర్షం కురిపించారు.
1996లో ప్రధానమంత్రి అయిన తర్వాత వాజ్‌పేయికి పీవీ నరసింహారావు నుంచి ఒక సందేశం అందింది. అందులో అణు కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారాన్ని కొనసాగించలేకపోయింది. 1998లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్‌పేయి అణు బాంబు తయారీ కార్యక్రమాన్ని కొనసాగించి విజయవంతంగా పూర్తి చేశారు.
1998 మే11, అధికారం చేపట్టిన రెండు నెలల్లోపే అణు విస్పోటనంలో ప్రపంచం నిర్ఘాంత పోయేలా చేశారు వాజ్‌పేయి. పోఖ్రాన్‌లో భారతదేశం అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించింది. అయితే ఆ ప్రభుత్వం కూడా ఐదేళ్లు అధికారాన్ని కొనసాగించలేకపోయింది.
అబ్దుల్ కలాం, ఇతర శాస్త్రవేత్తలు, భారతసైన్యం కృషితో భారత ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అమెరికన్ శాటిలైట్లు, గూఢచార వ్యవస్థతో పాటు ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేనంత రహస్యంగా ఈ ప్రయోగాలు జరిగాయి.
రాజకీయంగా అస్థిరత్వం ఉన్న సమయంలో ఈ విజయాల్ని ఉపయోగించుకుని ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా ప్రతిష్ట పెంచుకునే అవకాశం ఉన్నా వాజ్‌పేయి అలా చెయ్యలేదు. ఈ విజయం తనతో పాటు తనకు ముందు పని చేసిన ప్రభుత్వాలకు దక్కుతుందని లోక్‌సభలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 11, 13న భారతదేశం ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. దీని వల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో హర్షం పెల్లుబికినప్పటికీ, కొన్ని దేశాలు భారత్ మీద ఆంక్షలు విధించాయి. అణు పరీక్షలు చేస్తే అంతర్జాతీయ సమాజం నుంచి ఆంక్షల్ని ఎదుర్కవాల్సి వస్తుందని ముందే గుర్తించిన వాజ్‌పేయి, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు ముందే సూచనలు ఇచ్చారు.
అణు పరీక్షల ప్రభావం ఎక్కువ కాలం లేదు. పాకిస్తాన్ కూడా విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమయంలో వాజ్‌పేయి పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
లాహోర్ నుంచి ఆగ్రా వరకు, కార్గిల్ మీదుగా
1999 ఫిబ్రవరి 19న దిల్లీ నుంచి లాహోర్ వెళ్లేందుకు ద సదా ఎ సర్హద్ ( సరిహద్దుల చెరిపివేత) పేరుతో బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. మొదటిసారిగా ఈ బస్సులో ప్రధానమంత్రి వాజ్‌పేయి వాఘా సరిహద్దుల నుంచి పెద్ద దౌత్య బృందంతో పాకిస్తాన్‌లో అడుకు పెట్టారు.
అక్కడ నుంచి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, వాజ్‌పేయి విమానంలో లాహోర్ వెళ్లారు. ఇస్లామిక్ గ్రూపుల నుంచి వస్తున్న హెచ్చరికల దృష్ట్యా రోడ్డు ప్రయాణం మంచిది కాదని పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
1977లో వాజ్‌పేయి తొలిసారి పాకిస్తాన్ వెళ్లారు. తొలిసారి అయినప్పటికీ పాకిస్తాన్‌లో ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. లాహోర్‌లో మహారాజా రంజిత్ సింగ్ సమాధిని సందర్శించారు. మినార్ ఇ పాకిస్తాన్‌ను సందర్శించారు. అక్కడున్న పుస్తకంలో “సుస్థిరమైన, సురక్షితమైన, సంపన్నమైన పాకిస్తాన్‌ను భారత్ కోరుకుంటోంది” అని రాశారు.
దీన్ని పాకిస్తాన్‌లో ఎవరూ శంకించలేదు. ఎందుకంటే, భారతదేశం పాకిస్తాన్ ప్రయోజనాల గురించి ఆలోచించింది. వాజ్‌పేయి తన ప్రసంగాలలో, కవితలలో ఎప్పుడూ చెప్పే అఖండ భారత్ అనే భావన నిజమైనదేనని రుజువైంది. ఇలాంటి వాటి వల్లనే వాజ్‌పేయి, “అతివాద హిందూత్వకు మితవాద ముసుగు” అనే విమర్శలు ఎదుర్కొన్నారు.
పాకిస్తాన్‌లో వాజ్‌పేయి పట్ల ఉన్న ఆదరణ చూసి “మీరు పాకిస్తాన్ ఎన్నికల్లో కూడా విజయం సాదించగలరు” అని నవాజ్ షరీఫ్ అన్నారు. వాజ్‌పేయి పాకిస్తాన్ పర్యటనను కొంతమంది దౌత్య విజయంగా చూస్తే, మరి కొంతమంది నాటకంగా అభివర్ణించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాజ్‌పేయి- నవాజ్ షరీఫ్‌తో అనేక అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 21న లాహోర్ డిక్లరేషన్‌పై ఇద్దరు సంతకం పెట్టారు.
వాజ్‌పేయి పాకిస్తాన్ పర్యటనతో రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని అందరు అనుకుంటుంటే, పాకిస్తాన్ సైన్యం తెరచాటున మరో కుట్రకు పావులు కదిపింది.
వాఘా, లాహోర్ సమావేశాల్లో రెండు దేశాల ప్రధానమంత్రులు శాంతి స్థాపన కోసం సహకారం అందించు కోవాలని ప్రకటనలు చేస్తుంటే, జనరల్ పర్వేజ్ ముషరఫ్, సైన్యం సరిహద్దుల్లో కుట్రలకు శ్రీకారం చుట్టింది. శీతాకాలానికి ముందే కార్గిల్ కొండల్లో మాటు వేసిన పాకిస్తానీ చొరబాటుదారులు, పాకిస్తానీ సైనికుల్ని భారత సైన్యం గుర్తించింది.
అంతకు రెండు నెలల ముందు వాజ్‌పేయికి 21 తుపాకులతో సెల్యూట్ చేసిన పాకిస్తాన్ సైన్యం, తర్వాత చొరబాటుదారులకు అండగా నిలిచింది. ఈ చొరబాట్ల గురించి తనకేమీ తెలియదని నవాజ్ షరీఫ్ చెప్పారు.
లోక్‌సభలో మెజార్టీ కోల్పోయి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్న వాజ్‌పేయి “ఆపరేషన్ విజయ్”ను ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగాయి. ఎప్పుడూ పాకిస్తాన్‌కు మద్దతిచ్చే అమెరికా ఈసారి భారత్ వైపు నిలబడింది.
పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆడియో రికార్డుల్ని భారత ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత పాక్ విదేశాంగమంత్రి సర్తాజ్ అజీజ్ చర్చల కోసం దిల్లీ వచ్చారు. ముషారఫ్- లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్ మధ్య జరిగిన సంభాషణలు చూస్తే, కార్గిల్ చొరబాట్ల గురించి షరీఫ్ ప్రభుత్వానికి అంతా తెలుసని భారత ప్రభుత్వ చెప్పింది.
పాకిస్తాన్ కుట్రల్ని బహిర్గతం చేయాలనే భారత ప్రభుత్వం నిర్ణయం ముషారఫ్‌కు కలిసొచ్చింది. 1999 అక్టోబర్‌లో షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడయ్యారు.
ముషారఫ్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ పాలన మీద సైన్యానికి పట్టు పెరిగింది. 1999 డిసెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసి814ను హైజాక్ చేసారు. ఖాట్మండూ నుంచి దిల్లీ వస్తున్న విమానాన్ని హైజాకర్లు పాకిస్తాన్‌లో దించాలని భావించారు. అయితే పాకిస్తాన్ అందుకు అంగీకరించలేదు. అమృత్‌సర్‌లో ఇంధనాన్ని నింపుకున్న ఈ విమానం తాలిబాన్ల పాలనలో ఉన్న కాంధహార్‌లో దిగింది. విమానంలో ఉన్న 189 మంది ప్రయాణికుల్ని విడిచి పెట్టాలంటే భారతదేశంలోని జైళ్లలో ఉన్న 36 మంది ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని వదిలేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విమానం భారతీయ గగనతలంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల నుంచి స్పందన సరిగ్గా లేదని విమర్శలు వచ్చాయి. ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తులు ఎవరూ సరిగ్గా స్పందించలేదనే ఆరోపణల్ని ఎదుర్కొన్నారు.
హైజాకర్లకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ లేదా పాకిస్తాన్ సైన్యం సాయం చేసిందన్న విషయం అందరికీ తెలిసింది. కార్గిల్ యుద్ధానికి బదులుగా పాకిస్తాన్ సైన్యం హైజాక్ సంఘటనకు పాల్పడి ఉంటుందని అందరూ భావించారు.
ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో వాజ్‌పేయి తన ఆశను వదలుకోలేదు. 2001లో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను భారత ప్రభుత్వం ఆహ్వనించింది. “మనం స్నేహితుల్ని ఎంచుకోవచ్చు, మన పొరుగు వారిన కాదు” అనే భావనను వాజ్‌పేయి ఎప్పుడూ నమ్మేవారు.
ముషారఫ్‌తో చర్చల కోసం ఆగ్రాలోని హయత్ హోటల్ సిద్ధమైంది. అయితే ఆగ్ర సదస్సులో రెండు దేశాలకు తమ పొరుగు దేశంలో పరిస్థితులపై సమగ్రమైన అవగాహన లేదని రచయిత వినయ్ సీతాపతి చెప్పారు.
వాజ్‌పేయి- ముషారఫ్ చర్చలు ఫలవంతంగా సాగాయి. ఈ చర్చల్లో కశ్మీర్ గురించే ఎక్కువ చర్చ జరిగింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెద్దగా పట్టించుకోకుండానే సంయుక్త ఒప్పందాన్ని సిద్ధం చేశారు.
ఆగ్రా డిక్లరేషన్ విఫలవం కావడానికి అడ్వాణీ, సంఘ్ పరివార్‌లే కారణమని ముషారఫ్ నిందించారు. వాస్తవంలోనూ ఈ ఒప్పందంలో అంశాల పట్ల వాజ్‌పేయి మినహా ఆయన మంత్రివర్గంలో ఎవరూ ఆమోదించలేదు. పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో వాజ్‌పేయి చేసిన మరో ప్రయత్నం అలా విఫలమైంది.

ఫొటో సోర్స్, Getty Images
2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత, ఇది పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టు గ్రూపుల పనేనని భారత ప్రభుత్వం ఆరోపించింది. జైష్ ఏ మహమ్మద్, లష్కర్ ఏ తయిబా ఈ దాడికి పాల్పడ్డాయని చెప్పింది. ఈ ఆరోపణలను పాకిస్తాన్ తేలిగ్గా తీసుకుంది.
పాకిస్తాన్ పైనే కాకుండా, దేశంలో కశ్మీర్‌లో సుస్థిరతపై కూడా వాజ్‌పేయి దృష్టి పెట్టారు.
కశ్మీర్ విషయంలో ఆయన ప్రకటించిన జమూరియత్, ఇన్సానియత్ విధానానికి మంచి స్పందన వచ్చింది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు అంశాలకు కశ్మీరియత్‌ను జోడించారు.
అయితే, జమ్మూ కశ్మీర్‌లోని పార్టీలు వాజ్‌పేయి మాదిరిగా కశ్మీరీల హృదయాల్ని గెలుచుకోవడంలో మోదీ విఫలం అయ్యారని విమర్శిస్తుంటాయి. వాజ్‌పేయి హయాంలో కశ్మీర్ ప్రశాంతంగా ఉండేది. చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉండేవి. వాజ్‌పేయి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని ఉండేవారని, అయితే అప్పటి రాజకీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అధిపతిగా పని చేసిన దులత్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, PIB
అవినీతి ఆరోపణలు, తెహల్కా వివాదం...
వాజ్‌పేయి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకున్నప్పటికీ ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వంలో ప్రముఖల మీద అలాంటి ఆరోపణలు వచ్చాయి. వాజ్‌పేయి మొదటిసారి ప్రధానిగా ఉన్నప్పుడు అద్వానీ హవాలా కేసులో చిక్కుకున్నారు.
వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు తెహల్కా ఆపరేషన్ బయటపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, నాటి జాతీయ భద్రత సలహాదారు బ్రజేష్ మిశ్ర అల్లుడు రంజన్ బట్టాచార్యపై అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
15 పార్టీలు, పార్టీకో విధానం, సిద్ధాంతం.. అయినప్పటికీ అందర్నీ సమన్వయపరచుకుంటూ, వాజ్‌పేయి ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపించారు.
2002లో గుజరాత్ అల్లర్లు దేశాన్ని కుదిపేశాయి. అయోధ్య నుంచి వస్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి నిప్పంటించడంతో వెయ్యి మంది కాలి బూడిదయ్యారు. దీంతో గుజరాత్‌లో అల్లర్లు భగ్గుమన్నాయి. ఈ సమయంలో అల్లర్లను ఆపడానికి అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ చొరవ చూపలేదనే ఆరోపణలు వచ్చాయి. 2002లో గుజరాత్‌ను సందర్శించిన ప్రధాని వాజ్‌పేయి ఓ విలేఖరుల సమావేశంలో “రాజధర్మాన్ని పాటించాలని” మోదీకి చెప్పారు.
ఈ అల్లర్ల తర్వాత మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని వాజ్‌పేయి భావించారు. ఆయనను తప్పించాల్సిందిగా అడ్వాణీని ఆదేశించారు. అడ్వాణీ కూడా మోదీని తొలగించేందుకు సముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో పనాజీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. అయితే, మోదీ మద్దతుదారులు అందుకు అంగీకరించలేదు. దీంతో అడ్వాణీ మౌనంగా ఉండిపోయారు. వాజ్‌పేయి ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు.
వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. అయితే, విజయం సాధించలేకపోయాయి.
భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో 2004లో ఎన్డీయే కూటమి ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఆ తరువాత పార్లమెంటరీ పార్టీ నాయకత్వం వాజ్‌పేయి నుంచి అడ్వాణీ చేతుల్లోకి వచ్చింది. అయిదు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న వాజ్‌పేయి నెమ్మదిగా వాటికి దూరం జరిగారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?
- ‘రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో ఏడ్చేశాను, యుద్ధంలో ఎన్ని దారుణాలు చూశానంటే’: బీబీసీ గాజా రిపోర్టర్ అనుభవాలు
- కుళాయి నీళ్లు తాగొచ్చా, ఫిల్టర్ వాటరే తాగాలా...ఎలా తేల్చుకోవాలి?
- 'పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే నన్ను పిచ్చిదానిలా చూశారు'
- ఈ అరుదైన పాములు 2,000 కి.మీ. దాటి సూరత్ ఎలా చేరుకున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














