లోక్‌సభ ఎన్నికలు 2024: నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి

ఫొటో సోర్స్, @AKSHAYKANTIBAM
లోక్‌సభ ఎన్నికలలో ఎన్నో సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న సూరత్ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని మధ్యప్రదేశ్ బీజేపీ కమిటీ తెలిపింది.
మే 13న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇండోర్ లోక్‌సభా స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారమే (ఏప్రిల్ 29) తుదిగడవు.
అక్షయ్ కాంతి బమ్ బీజేపీలో చేరారని మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కైలాష్ విజయవార్గియా ట్వీట్ చేశారు. దీంతోపాటు అక్షయ్ కాంతితో ఆయన ఓ కారులో దిగిన సెల్ఫీని కూడా జత చేశారు.
‘‘కాంగ్రెస్ ఇండోర్ లోక్‌సభ అభ్యర్థి శ్రీ అక్షయ్ కాంతి బమ్‌ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వీడి శర్మాజీ నాయకత్వంలో బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు.
నామినేషన్‌ను ఉపసంహరించుకుని అక్షయ్ కాంతి బమ్ బీజేపీలో చేరడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వాగతించారు.
‘‘ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలోని బీజేపీ ప్రగతిశీల ఆలోచనలు నచ్చి మా సహచరుడు కైలాస్ విజయ వర్గీయ, ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి, లోక్‌సభ అభ్యర్థిత్వం నుంచి వైదొలిగి బీజేపీలో చేరుతున్న అక్షయ్ కాంతి బమ్‌కు సాదర స్వాగతం పలుకుతున్నా’’ అని ఆయన రాశారు.
బీజేపీకి సులువుగా..?

ఫొటో సోర్స్, @ISHANKARLALWANI
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వానీ గెలుపు మరింత తేలిక అయిందని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
ఇప్పుడు ఆయనను డీకొట్టేవారు ఎవరూ బరిలో కనిపించడం లేదు.
కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరడం, ఈ విషయాన్ని ముందుగా పసిగట్టలేకపోవడం కాంగ్రెస్‌కు తీవ్ర విఘాతంగా మారింది.
దీనిపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా లేరు.
ఇండియా అలయన్స్‌కు ఖజురహో తరువాత అభ్యర్థులు లేని రెండో నియోజకవర్గంగా ఇండోర్ నిలుస్తోంది.
ఇండియా కూటమిలో భాగంగా ఖజురహో స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కేటాయించారు. కానీ అక్కడ ఎస్పీ అభ్యర్థి మీరాయాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

ఫొటో సోర్స్, RUPESH
సూరత్‌లో ఏం జరిగింది?
కిందటివారం గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ముకేష్ దలాల్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ రద్దుకావడం, ఇతర ఇండిపెండెంట్లు బరిలోనుంచి తప్పుకోవడంతో, ముకేష్ దలాల్ పోటీ లేకుండా గెలిచారు.
ఏడు దశాబ్దాల సూరత్ లోక్‌సభ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
సూరత్ లోక్‌సభా స్థానానికి మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ సహా 6 నామినేషన్లను తిరస్కరించారు.
తరువాత మిగిలిన 8 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
ఇదంతా బీజేపీ ప్రోద్భలంతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది.
కానీ బీజేపీ కాంగ్రెస్ ఆరోపణలను ఖండించింది.
అయితే ఏప్రిల్ 23న జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ త్వదే మాట్లాడుతూ సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రద్దయ్యాక, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరినట్టు అంగీకరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌పై ప్రతిపాదకుల సంతకాలు నకిలీవి కావడమే నామినేషన్ రద్దుకు కారణం
నీలేశ్ కుంభానీ మద్దతుదారులుగా సంతకాలు పెట్టినవారిలో రమేశ్‌భాయ్ బల్వంత్‌భాయ్ పోల్రా, జగదీశ్ నంజిభాయ్ సావలియా, ధ్రువిన్ ధీరుభాయ్ ధమేలియా ఉన్నారు. వీరిలో జగదీశ్.. నీలేశ్‌కు బావ వరుస అవుతారు. ధ్రువిన్ మేనల్లుడు, రమేశ్ పోల్రా ఆయన బిజినెస్ పార్ట్‌నర్.
ఆ ముగ్గురు నీలేశ్‌కు ఆప్తులే అయినా వారు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కుంభానీ నామినేషన్లపై ఉన్నవి తమ సంతకాలు కావని ఎందుకు ప్రమాణపత్రం ఇచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరువాత వీరంతా కనిపించకుండా పోవడంతో తమ అభ్యర్థుల మద్దతుదారులను కొందరు కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ విషయంపై కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?
- ‘రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో ఏడ్చేశాను, యుద్ధంలో ఎన్ని దారుణాలు చూశానంటే’: బీబీసీ గాజా రిపోర్టర్ అనుభవాలు
- కుళాయి నీళ్లు తాగొచ్చా, ఫిల్టర్ వాటరే తాగాలా...ఎలా తేల్చుకోవాలి?
- 'పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే నన్ను పిచ్చిదానిలా చూశారు'
- ఈ అరుదైన పాములు 2,000 కి.మీ. దాటి సూరత్ ఎలా చేరుకున్నాయి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














