SRHvsRR: హైదరాబాద్ చేజారిందనుకున్న మ్యాచ్‌ ఎలా మలుపు తిరిగింది?

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్ రెండవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 175 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ రాయల్స్‌కు నిర్దేశించింది.

పరుగుల లక్ష్యం చిన్నదే అయినా.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 139 పరుగులతోనే మైదానం నుంచి వెనుతిరగాల్సి వచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు అయిదు వికెట్లు తీసి, మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఈ ఇద్దరి బౌలింగే మ్యాచ్‌‌లో కీలకంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్‌కు బలమైన టాప్ ఆర్డర్ బ్యాటర్లున్నారని అనుకున్న అభిమానులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుందని భావించారు.

కానీ, అందరి అంచనాలు తప్పాయి. ఆట మొదటి అర్ధభాగంలో బాగా ఆడినా, రెండో అర్ధభాగంలో తడబడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌తో సత్తా చాటి ఫైనల్‌కు బాటలు పరుచుకుంది.

సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోగానే ఆ ఫ్రాంచైజీ సీఈవో కావ్య మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

కష్టమనుకున్న మ్యాచ్‌ను ఎలా మలుపు తిప్పారు?

ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్లు రికార్డులు సృష్టించారు. దీనికంటే ముందు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 263/5. ఈ మార్కును సన్‌రైజర్స్ ఈ సీజన్‌లోనే మూడుసార్లు అధిగమించింది.

హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసక భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోర్లను అందించింది.

కానీ, క్వాలిఫయర్ రెండవ మ్యాచులో మాత్రం అభిషేక్ శర్మ బ్యాటింగ్ అంత ఆశించిన స్థాయిలో లేదు. 5 బంతులకు కేవలం 12 పరుగులే చేయగలిగాడు. కానీ, బౌలింగ్‌లో మాత్రం తన సత్తా చాటాడు.

ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 34 పరుగులతో వెనుతిరిగాడు. టాప్ ఆర్డర్‌ బ్యాటర్లు భారీ స్కోర్లు చేయక పోవడంతో రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నెగ్గడం కష్టమేనని అభిమానులు భావించారు.

కానీ, ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి తన బ్యాటింగ్‌తో అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాడు. 15 బంతుల్లోనే 37 పరుగులను ఇచ్చాడు. ఐదవ బ్యాటర్‌గా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ సైతం దూకుడుగా ఆడేశాడు. 34 బంతుల్లో అర్థ సెంచరీని పూర్తి చేశాడు.

ఇలా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరును ఈ బ్యాటర్లు ఒక స్థాయికి తీసుకురాగలిగారు. అయినప్పటికీ, ఆ స్కోరు స్వల్పమే.

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, కోహ్లెర్ క్యాడ్‌మోర్‌ను దించింది. మొదట్లో వీరిద్దరి దూకుడు చూసిన అభిమానులు రాజస్థాన్ రాయల్స్ సులువుగానే లక్ష్యాన్ని చేరుకుంటుందని అనుకున్నారు.

కానీ, షాబాజ్ వేసిన బంతికి యశస్వి జైశ్వాల్ 21 బంతుల్లో 42 పరుగులకు వెనుతిరగాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి మ్యాచ్ ఒక మలుపు తిరిగిందనే చెప్పొచ్చు.

ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్లు ఒకరి తర్వాత ఒకరు వెనుతిరిగారు. ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లో 56 పరుగులు చేసి ఘోరమైన ఓటమి నుంచి రాయల్స్ జట్లును రక్షించాడు.

స న్ రైజర్స్ బౌలర్ షాబాజ్ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీశారు. వీరిద్దరి బౌలింగే మ్యాచ్‌ను మలుపు తిప్పిందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

పేస్ బౌలర్లను ఎక్కువగా వాడుతాదని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పేరుంది. కానీ, ఈ మ్యాచ్‌లో ఎడమ చేయి స్పిన్నర్లు షాబాజ్, అభిషేక్‌లే కీలకంగా నిలిచారు.

అయితే, ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. దీనికి ముందు షాబాజ్ 14 మ్యాచ్‌లలో కేవలం మూడు వికెట్లే తీశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ రెండవ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

‘ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాననుకోలేదు’

‘‘నిజం చెప్పాలంటే, నేను ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తానని అనుకోలేదు. కానీ, సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే, బౌలింగ్‌ మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నించాను. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌ బాగా చేస్తున్నాను. అందుకే, బౌలింగ్‌ను కూడా మెరుగుపరచుకోవాలనుకున్నాను. మా నాన్నతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను’’ అని మ్యాచ్ అయిన తర్వాత అభిషేక్ శర్మ అన్నారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో అంత ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ, బౌలింగ్ చేయగల అతికొద్ది మంది ఇండియన్ బ్యాటర్లలో అభిషేక్ ఒకరు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అభిషేక్ బౌలింగ్ చేయగలడు.

‘‘అవును, కారణాలు ఏమైనా దేశీయవాళి క్రికెట్‌లో ఈయన చేయగలిగిన బౌలింగ్ చేయలేకపోయాడు. భారత క్రికెట్‌కు భవిష్యత్‌లో ఈయన బౌలింగ్ చాలా అవసరం. మున్ముందు ఇతను భారత క్రికెట్‌కు నిజమైన ఆస్తి’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో టామ్ మూడీ అన్నారు.

కమిన్స్ కెప్టెన్సీపై ప్రశంసలు

పాట్ కమిన్స్ తన కెప్టెన్సీతో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్పిన్ బౌలింగ్‌పై కమిన్స్ ఆధారపడలేదు.

ఎందుకంటే, 15 మ్యాచ్‌లలో కేవలం 14 వికెట్లను మాత్రమే తీశారు సన్‌రైజర్స్ స్పిన్నర్లు.

కానీ, కీలకమైన ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లపై ఆధారపడి మ్యాచ్‌ను గెలిపించాడు కమిన్స్.

బౌలర్ల చేత స్పిన్ అటాక్ చేయిస్తూ రాజస్థాన్ రాయల్స్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాడు.

ఐపీఎల్ 2024

ఫొటో సోర్స్, Getty Images

రేపే ఫైనల్ మ్యాచ్

ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడాల్సి ఉంది.

2024 ఐపీఎల్ సీజన్‌లో ఈ రెండు టాప్ టీమ్స్. క్వాలిఫయర్ 1లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో సన్‌రైజర్స్ ఓడిపోయింది.

సన్‌రైజర్స్ ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. తొలిసారి 2016లో ఐపీఎల్ ట్రోఫీని ఈ జట్టు గెలుచుకుంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్.

అందుకే పాట్ కమిన్స్‌‌ను రూ.20.5 కోట్లు పెట్టి కొనడంలో తప్పులేదంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్ చేశారు. కావ్య మారన్ తెలివి అద్భుతం అని అంటున్నారు.

పాట్ కమిన్స్‌కు ఆస్ట్రేలియా ఆల్-రౌండర్‌గా పేరుంది.

‘‘సీజన్ అంతా మా బాయ్స్ బాగా ఆడారు. మీరు చూసినట్లు స్క్వాడ్‌లో మంచి జోష్ కనిపిస్తుంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పుడు ఫైనల్ మా లక్ష్యంగా ఉండేది. మేం చేరుకున్నాం. బ్యాటింగ్ మా బలమని మాకు తెలుసు. మా స్క్వాడ్‌లో మాకున్న అనుభవాన్ని మేం తక్కువ చేసుకోం’’ అని మ్యాచ్ తర్వాత కమిన్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)