ఎంపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

మంకీ పాక్స్, ఆఫ్రికా, కాంగో, బురుండీ, ఆరోగ్య అత్యవసర పరిస్థితి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆఫ్రికన్ దేశాల్లో ప్రమాదకరంగా విస్తరిస్తున్న మంకీపాక్స్
    • రచయిత, సిమి జొలాసొ, రిచర్డ్ హోలింగ్హామ్
    • హోదా, బీబీసీ ఫీచర్

ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో విస్తరిస్తున్న మంకీపాక్స్‌ను అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ వ్యాధి వలన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 450 మంది చనిపోయారు.

ప్రస్తుతం ఇది తూర్పు ఆఫ్రికా దేశాల్లో విస్తరించింది. ఈ వ్యాధికి కారణమైన కొత్త వేరియంట్ విస్తరిస్తున్న తీరు, మరణాల గురించి శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యాధి ఆఫ్రికాలో, ఇతర దేశాల్లో వ్యాప్తి చెందేందుకు ఉన్న అవకాశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసిస్ చెప్పారు.

“ప్రజల ప్రాణాలు కాపాడటానికి, ఈ వ్యాధిని కట్టడి చెయ్యడానికి ప్రపంచ దేశాల సహకారం, అంతర్జాతీయ స్పందన తప్పని సరి” అని ఆయన అన్నారు.

ఎంపాక్స్ కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తున్న అంశం గురించి అన్ని దేశాలను అప్రమత్తం చేసినట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్( ఆఫ్రికా సీడీసీ) శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15,600 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వైరస్ సోకిన వారిలో శరీరం అంతటా నీటితో కూడిన చిన్న చిన్న బొబ్బలు ఏర్పడతాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఈ వైరస్ ప్రస్తుతం బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కెన్యా రువాండాలో వ్యాపిస్తోంది.

ఆఫ్రికా ఖండం అంతటా దీనిని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడం వల్ల ఔషధాల సరఫరా, ఇతర జాగ్రత్తలు తీసుకోవడంలో దేశాలు సమన్వయం చేసుకోవడానికి వీలు కుదురుతుంది.

ఈ వ్యాధిని నివారించేందుకు సత్వరం చర్యలు తీసుకోకపోతే తర్వాత ఇది అడ్డు అదుపు లేకుండా విస్తరిస్తుందని ఆఫ్రికా సీడీసీ అధిపతి జీన్ కసేయ చెప్పారు.

“ఈ ప్రకటన లాంఛన ప్రాయమే. ప్రభుత్వాలు సత్వరం స్పందించాలని చెప్పే ప్రయత్నం. మనం స్పందించడానికి ఇంకా సమయం లేదు. ఈ ముప్పను అరికట్టేందుకు మనం వేగంగా, సానుకూలంగా మన ప్రయత్నాలను ప్రారంభించాలి” అని జీన్ కసేయ అన్నారు.

ఎంపాక్స్ ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే ఏం చేయాలనే దానిపై ఆఫ్రికా బయట దేశాలకు చెందిన ఆరోగ్య సంస్థల అధిపతులు పర్యవేక్షిస్తున్నారు.

యూరప్‌లో ఎంపాక్స్ ప్రమాదం చాలా తక్కువగా ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ జులై 29న తెలిపింది.

ఎంపాక్స్ సోకిన జంతువులు, వ్యక్తుల సాన్నిహిత్యం వల్ల ఇతరులకు సోకుతుంది. వ్యాధి సోకిన వారితో శృంగారంలో పాల్గొనడం, వారిని తాకడం, సమీపంగా వెళ్లి మాట్లాడటం వల్ల ఎంపాక్స్ సోకే అవకాశం ఉంది.

ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, కండరాల నొప్పులు, శరీరంపై నీటి బొబ్బలు వస్తాయి. ఈ వ్యాధికి చికిత్స అందించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ వైరస్‌కు సంబంధించి రెండు స్ట్రెయిన్‌లు అస్థిత్వంలో ఉన్నాయి. ఇందులో స్వల్ప లక్షణాలున్న స్ట్రెయిన్2022లో ప్రపంచం అంతటా వ్యాపించింది. ఈ వైరస్ యూరప్, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు మరి కొన్ని దేశాల్లో విస్తరించింది. ఇది సెక్సువల్ కాంట్రాక్ట్ ద్వారా వ్యాపించినట్లు గుర్తించారు.

మరో ప్రమాదకరమైన స్ట్రెయిన్ సెంట్రల్ ఆఫ్రికాలో అంతరించింది. ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో విస్తరిస్తున్న వేరియంట్‌ వెనుక సెంట్రల్ ఆఫ్రికాలో అంతరించిందని భావిస్తున్న వేరియంట్‌ కావచ్చని భావిస్తున్నారు.

ఎంపాక్స్‌కు ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ఉన్నాయి. వ్యాధి సోకి ప్రమాదంలో ఉన్న వారు, వ్యాధి సోకిన వారిని కలిసిన వారు ఈ వ్యాక్సిన్లు వేసుకోవచ్చు.

ఆఫ్రికాలో ఈ వ్యాధివ్యాప్తిని అడ్డుకునేందుకు కోటి డోసులు భద్రపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డాక్టర్ కసేయ చెప్పారు.

వ్యాక్సిన్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ నుంచి రక్షణకు అనేక దేశాలు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చాయి.

ఈ వైరస్ ప్రమాదకరమా?

మంకీపాక్స్ అని పిలిచే ఈ వైరస్‌ను 1950 చివరలో కనుగొన్నారు. కానీ, గడిచిన మూడు నాలుగేళ్ళలో ఈ వైరస్ మ్యుటేట్ అయినట్లు సంకేతాలు ఉన్నాయి. దీనివల్ల ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు తేలికగా సంక్రమించేలా మారింది.

అయితే, ఈ వ్యాధి ‌గురించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి కోతులతో చాలా తక్కువ సంబంధం ఉంది.

‘‘డెన్మార్క్‌లోని ఓ లేబరేటరీలోని కోతుల్లో మొదట దీనిని గుర్తించారు. ఇన్ఫెక్షన్‌కు గురైన కోతులను ఇతర కోతుల నుంచి దూరం చేశారు. కానీ ఆ కోతులు ఈ వ్యాధికి మూల కేంద్రాలైతే కావు’’ అని సాగన్ ఫ్రియాంట్ చెప్పారు.

ఆమె అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వ్యాధిని వ్యాప్తి చేసే జంతువులు ఆ వ్యాధి వల్ల బాధపడవు, లేదా చనిపోవు అని ఆమె చెప్పారు.

ఫ్రయాంట్ 15 ఏళ్ళుగా నైజీరియాలో మంకీపాక్స్‌పై అధ్యయనం చేస్తున్నారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రబలడానికి ముందు ఆమె ఓ కొత్త పరిశోధనా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ వైరస్ ఎలుకల నుంచి పుట్టుకొస్తోందని, కానీ ఈ విషయం నిర్థరణ కావాల్సి ఉందని చెప్పారు.

2022 చివర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌పేరును ఎంపాక్స్‌గా మారుస్తున్నట్టు ప్రకటించింది.

‘‘మనుషులకు కోతులతో జన్యుపరమైన సామీప్యతలు ఉన్న కారణంగా చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు కోతులలోని ఈ వ్యాధి మానవులకు అత్యంత ప్రమాదకారిగా భావించారు. అది నిజం కూడా’’ అని ఆమె చెప్పారు. ‘‘మనుషుల్లో కొత్త వ్యాధుల వ్యాప్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎలుకలు, గబ్బిలాల నుంచి వచ్చే అంటువ్యాధులను గుర్తించాం’’ అని తెలిపారు.

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జోనోటిక్ వ్యాధులంటారు. వీటిల్లో కొన్ని మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ క్రమంలో ఎంపాక్స్‌కు కోవిడ్ -19కు దగ్గరి పోలికలు ఉన్నాయి. అయితే, కరోనా వైరస్ కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఇది ఉంది.

ఎంపాక్స్ వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ వైరస్ (ఎడమ)

ఎంపాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది?

మంకీపాక్స్‌ను మొదట డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హెగెన్‌లోని లాబోరేటరీలో 1958లో కనుగొన్నారు. సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతులలో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అయితే 1970 వరకు కూడా ఇది మనుషులలో వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు. కానీ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ 9 నెలల పిల్లాడిని ఆస్పత్రిలో చేర్చినప్పుడు, ఆ బాలుడికి మంకీపాక్స్ వైరస్‌ ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. పైగా ఈ పిల్లాడి కుటుంబం కోతులు ఎక్కువగా ఉండే వర్షాధార అరణ్య ప్రాంతంలో జీవిస్తోంది. అయితే ఈ బాలుడు ఈ కోతులతో కాంటాక్ట్‌లోకి వెళ్ళాడా? లేక మరో మార్గంలో వైరస్ సోకిందా అనే విషయాన్ని డాక్టర్లు నిర్థరించలేకపోయారు. ఆ బాలుడు ఈ ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్నాడు. కానీ కొన్నిరోజుల తరువాత పొంగు సోకి చనిపోయాడు.

ఆఫ్రికాలోని పలు దేశాలలో మనుషులకు ఈ వైరస్ సోకినప్పటికీ, దీనికి మశూచి వంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల వైరస్‌ను కనుగొనలేకపోయారు. 2003లో అమెరికాలో 70 మందికి ఈ వ్యాధి వ్యాపించింది. ఇన్ఫెక్షన్ సోకిన పైరీ శునకాల ద్వారా ఈ వ్యాధి అమెరికాలోకి వచ్చి ఉంటుందని భావించారు. ఈ కుక్కలతోపాటు ఎలుకలను కూడా ఘనా నుంచి దిగుమతి చేసుకుని పెంచుకునేవారు. దీంతోపాటు తాజాగా యూకే, ఇజ్రాయెల్, సింగపుర్ నుంచి ఆఫ్రికా దేశాలకు ప్రయాణం చేసి వచ్చిన వారిలోనూ ఈ వైరస్ కనిపించింది.

కానీ, 2022 మే నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ ప్రధాన భూభాగం, కెనడాలో మంకీ పాక్స్ కేసులు వ్యాపించాయి. ఈ కేసులలో కొన్ని ఆఫ్రికాలో స్థానికంగా కనిపించే కేసుల లక్షణాలు కలిగి ఉండటం ఆరోగ్యాధికారులను, శాస్త్రవేత్తలను కలవరపరిచింది.

2023 నుంచి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్‌సీ)లో ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించడంతో 19 వేల కేసులు, 9 వేల మరణాలు సంభవించాయి. అయితే డీఆర్‌సీలో భారీగా మంకీపాక్స్ వ్యాపించడానికి ఈ వైరస్‌లోని భయంకరమైన క్లేడ్ 1 రకమే కారణం. 2022లో అమెరికాలో వ్యాప్తి చెందింది క్లేడ్ 2 రకం.

డీఆర్‌సీలో వ్యాప్తిలో ఉన్న ఎంపాక్స్‌తో పోల్చుకుంటే అమెరికాకు ముప్పు తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది. గతంలో పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారు, ఎంపాక్స్‌కు గురైన వ్యక్తులను క్లేడ్ 1 వైరస్‌ నుంచి రక్షణ కల్పించాలని పేర్కొంది.

సరిగ్గా ఈ తాజా వ్యాప్తి ఎక్కడ పుట్టిందనేది ఇప్పటికీ మెడికల్ డిటెక్టివ్ కథే. వ్యాప్తికి కారణమైన వైరస్ వేరియంట్ మొదట్లో పశ్చిమ ఆఫ్రికాలో కనిపించిన ఎంపాక్స్ కుటుంబానికి చెందినదని జన్యు విశ్లేషణలో వెల్లడైంది, కానీ వైరస్ ఏ దేశాలలో ఎండెమిక్ (స్థానికంగా) ఉందనే విషయం స్పష్టంగా తెలియలేదు. పైగా ఆప్రికా వెలుపల పలు దేశాలలోని మానవ జనాభాలో అనేక నెలలు లేదంటే దీర్ఘకాలంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందనే అనుమానం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

ఇంకా సమీక్షించని, ప్రాథమిక దశలోనే ఉన్న కొన్ని జన్యు విశ్లేషణలు పశ్చిమ ఆఫ్రికా, ఎంపాక్స్ వైరస్ (క్లేడ్ 2) మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని 2017 లొనే గ్రహించి ఉండొచ్చని చెప్పాయి. అప్పటి నుంచి ఇది అధిక సంఖ్యలో ఉత్పరివర్తనం (మ్యుటేట్) చెంది, మనుషులలోని రోగనిరోధక శక్తి సహజ లక్షణాలను కూడా ప్రభావితం చేయగలిగేలా సంక్రమణా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని, మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తోందని పేర్కొంది.

ఎంపాక్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఎంపాక్స్ వైరస్‌ను ప్రధానంగా ఆఫ్రికా దేశాలలో కనుగొన్నా, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందుతోంది.

ఎలా వ్యాపిస్తుంది?

కోవిడ్ 19 మాదిరి ఎంపాక్స్ తక్షణం వ్యాపించే వ్యాధి కాదు. ఇది మనిషి నుంచి మనిషికి, లేదంటే జంతువు నుంచి మనిషికి సన్నిహితంగా మెలగడం ద్వారా వ్యాపిస్తుంది.

‘‘ఇది దద్దుర్లు, గాయాలు, గజ్జి, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది’’ అని మెడ్‌లైన్ బారన్ చెప్పారు. ఆయన అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రో బయాలజీ (ఏఎస్ఎం)లో పనిచేస్తున్నారు. ‘‘ఈ వైరస్ బారినపడినవారు తాకిన వస్తువులను తాకడం ద్వారా కూడా మీరూ ఆ వ్యాధికి గురవుతారు’’ అని చెప్పారు.

న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రంలో 2022 ఏప్రిల్, జూన్ మధ్యన 16 దేశాలలో 98 శాతం కేసులు స్వలింగ సంపర్కులలోనే ఉన్నాయని, ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదని చెప్పింది. ఇది కేవలం యాదృచ్ఛికం కావచ్చు. ఏదైనా కమ్యూనిటీలో ఎవరికైనా ఆ వ్యాధి సోకినప్పుడు, ఆ కమ్యూనిటీకంతటికీ అది సోకుతుంది.

అయితే, ఇది మిగిలినవారికంటే స్వలింగ సంపర్కులలో వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే మహిళలకంటే పురుషులకు ఎక్కువగా సోకుతుందనేందుకూ ఆధారాలు లేవు అని ఆ అధ్యయనం పేర్కొంది.

‘‘ఈ వైరస్ లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందుతుందా అనే విషయం తెలియదు. కానీ సన్నిహిత సంబంధాలు ఈ వ్యాధి వ్యాప్తిని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది’’ అని బారన్ చెప్పారు.

వీర్యంలో ఎంపాక్స్ డీఎన్ఏను కనుగొన్నప్పటికీ, లైంగిక సంబంధాల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని కాదు. ఎంపాక్స్ వైరస్ అనేది ప్రొటీన్లు, అవయవాలను అంటిపెట్టుకునే సన్నని పొర కలిగిన జన్యు సమాచార పాకెట్. ఈ భాగాలన్నీ పనిచేసే క్రమంలో ఉంటేనే కణాలకు వైరస్ సోకుతుంది. వీర్యంలో వైరల్ డీఎన్ఏను గుర్తించినప్పటికీ ఆ వైరస్‌ సంక్రమణ సామర్థ్యం కలిగినది కాకపోవచ్చు.

ఎంపాక్స్ లక్షణాలు

ఎంపాక్స్‌తో ప్రమాదమెంత?

ప్రస్తుత ఎంపాక్స్ వైరస్ స్ట్రెయిన్ వల్ల సంభవించే మరణాల రేటు 1శాతంగా ఉంది. ఈ కథనం రాస్తున్న సమయంలో ఆఫ్రికా వెలుపల సంభవించిన వైరస్ వ్యాప్తి కారణంగా ముగ్గురు చనిపోయారు. అలాగే ఆఫ్రికన్ దేశాలలో ఐదుగురు చనిపోయారు.

మధ్య ఆఫ్రికాలోని ఎంపాక్స్ స్ట్రెయిన్‌తో పోలిస్తే పశ్చిమ ఆఫ్రికాలోని ఎంపాక్స్ వైరస్ మరణాల రేటు తక్కువ. అలాగే వ్యాధి తీవ్రత కూడా తక్కువే. అయితే మరణాల రేటు తక్కువ ఉన్నా, మంకీపాక్స్ సోకిన వ్యక్తులు బలహీనపడటమే కాక, తీవ్రమైన బాధకు గురవుతారు.

తొలుత ప్రజలు ఫ్లూలాంటి లక్షణాలను అనుభవిస్తారు. అంటే జ్వరం, తలనొప్పివి కనిపిస్తాయి. కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ నోరు, పాదాలు, జననేంద్రియాల వద్ద చీముతో నిండిన బొబ్బలు అభివృద్ది చెందుతాయి.

వైరస్ పొదుగుకు 6 నుంచి 13 రోజులు పట్టినా, సంక్రమణ వ్యాప్తికి ఐదు నుంచి 21 రోజుల మధ్య సమయం పడుతుంది. తొలుత పైన చెప్పుకున్నట్టు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట ఉంటుంది. ఈ వైరస్‌లో బాగా స్పష్టంగా కనిపించే ఓ లక్షణం లింఫు గ్రంధుల వాపు. జ్వరం కనిపించిన కొన్ని రోజులకే శరీరంపై పగుళ్ళు కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి నాలుగు వారాల తరువాత బొబ్బలు అణిగిపోయి రాలిపోతాయి. వ్యాధి నుంచి బయటపడినా భయం మాత్రం పోదు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం లక్షణాలు తగ్గేందుకు మందులు అందిస్తారు. ఈ వ్యాధి తీవ్రమవడం, లేదా చనిపోవడానికి దారితీయడమనేది ఇతర వ్యాధుల్లానే వయసు, రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది.

మంకీపాక్స్ అచ్చు గతంలో మనం చూసిన ఓ వ్యాధి లక్షణాల్లానే ఉండటమే షాకింగ్ విషయం. అదే మశూచి. స్మాల్‌పాక్స్‌లానే మంకీపాక్స్ కూడా ఒకే గ్రూపుకు చెందింది. కానీ ఇది భిన్నమైన వైరస్.

మంకీ పాక్స్

ఫొటో సోర్స్, REUTERS

ఎంపాక్స్ వ్యాప్తి ఎలా ఉంది?

ఎంపాక్స్ అనేది ద్వితంత్రి డీఎన్ఏను మోసుకుపోయే ఇటుకరాయి ఆకారంలో ఉండే ఓ వైరస్. దీనికి సంబంధించిన మంచి విషయం ఏమిటంటే ఇది స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఇది మరింత ప్రాణాంతకమైన, మరింత వ్యాప్తి చెందే వేరియంట్‌గా పరివర్తన చెందే అవకాశం తక్కువ. కోవిడ్ 19కు కారణమయ్యే సార్స్ కోవ్ 2లో ఏక తంత్రి కలిగిన ఆర్‌ఎన్ఏ నుంచి తయారైన జన్యుపదార్థం ఉంటుంది.

‘‘ఆర్ఎన్ఏ వైరస్ చాలా సమర్థవంతంగా పరివర్తన చెందుతాయి. పైగా దూకుడుగా ఉంటాయి. నా అభిప్రాయంలో అవి నిజంగా భయంకరమైన వైరస్‌లు’’ అని రోడ్నీ రోహ్డె చెప్పారు. ఆయనకు పబ్లిక్ హెల్త్, అండ్ వైరాలజీలో అనుభవం ఉంది. టెక్సాస్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన కరెంట్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ ఎబౌట్ ఎంపాక్స్ అనే అధ్యయనానికి ఈయన సహరచయిత.

‘‘డీఎన్ఏ వైరస్‌లు అంత త్వరగా పరివర్తనం చెందవు. మేం ఎంపాక్స్‌లో 50 పరివర్తనాలను చూశాం. కానీ వ్యాధి తీవ్రతపై ప్రభావం చూసే పరివర్తనాలను మేం చూడలేదు’’ అని చెప్పారు.

దీనికి కారణం కూడా ఉంది. 2018 నుంచి 2022 మధ్య వైరస్‌లో సగానికిపైగా పరివర్తనాలు నిశ్శబ్దంగానే ఉన్నాయి. అంటే దానర్థం అవి కణాలను ఇన్ఫెక్ట్ చేయడానికి అవసరమయ్యే వైరల్ ప్రోటీన్లను మార్చడంకానీ , లేదంటే రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే విధంగా మారలేదని. కానీ 2022లో ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ముందు మూడునాలుగేళ్ళలో ఎన్నిరకాలుగా మార్పు చెందిందనే విషయంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అమెరికాలో వ్యాప్తి చెందిన వైరస్ రెండు విభిన్న కుటుంబాలకు చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆఫ్రికా వెలుపల ఈ వైరస్ 20 ఏళ్ళ నుంచి, గుర్తింపు పొందకుండా, నిశ్శబ్దంగా వ్యాప్తిలో ఉందనేందుకు ఆధారాలు ఉన్నాయి.

డీఆర్సిలోని రోగులలో ఎంపాక్స్ వేరియంట్ల కొత్త సమూహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి 2022 లో వ్యాప్తి చెందుతున్న వేరియంట్ల నుండి జన్యుపరంగా భిన్నంగా ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందాయని చెప్పారు.

మంకీపాక్స్

ఫొటో సోర్స్, Mike Roemer/Getty Images

ఫొటో క్యాప్షన్, ఘనా నుంచి దిగుమతి చేసుకున్న జంతువులలోని శునకాల ద్వారా 2003లో అమెరికాలో మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది.

జంతువుల నుంచి మనుషులకు..

శుభవార్త ఏంటంటే మశూచి కోసం అభివృద్ధి చేసిన టీకానే ఎంపాక్స్‌పైనా 80శాతం పనిచేస్తోంది. ఈ వ్యాధి గురించి మనకు 50 ఏళ్ళకు పైగా తెలుసు. కానీ ఉత్తర అమెరికా, యూరప్‌లో వ్యాధి సోకిన తరువాత మాత్రమే ఆఫ్రికా వెలుపల దేశాలు దీన్ని పట్టించుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఆఫ్రికా అంతటా 2022 నుంచి 1,267 కేసులు నిర్థరణ కాగా, 285 మంది మరణించారని ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సమాచారం తెలియజేస్తోంది.

‘‘ఇలాంటి సమస్యల గురించి దశాబ్దాలుగా మనం భయపడుతూనే ఉన్నాం’’ అని రోహ్డె చెప్పారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం మన చేతుల్లో లేని విషయాల గురించి మనం పదేపదే ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని ఆయన తెలిపారు.

‘‘ఈ వైరస్ ఎండిమిక్‌గా ఉన్న ప్రాంతాలలో, ఇదో దీర్ఘకాల సమస్యగా ఉన్న చోట ఇప్పటికీ వనరులు, వ్యాధినిర్థరణ, వ్యాక్సిన్లు పొందడంలో వెనుకబడే ఉన్నాయి’’ అని బారన్ చెప్పారు. ‘‘కోవిడ్ మనకు ప్రపంచం చాలా చిన్నదని చెప్పింది. వ్యాధులపై మనం సమష్టిగా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే రోగాలకు సరిహద్దులు తెలియవు’’ అని తెలిపారు.

ఈ కొత్త వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ముప్పు పెరుగుతోందని 2020లో ఓ అమెరికా రిపోర్టు హెచ్చరించింది. వాటి సహజ ఆవాసాలపై మన పెత్తనం, వాతావరణ మార్పులు దీనికి కారణం. ఈ విషయంలో బాటమ్ లైన్ ఏంటి అంట అన్నిరకాల జునోటిక్ వ్యాధుల విషయంలో ఉత్తమమైన పర్యవేక్షణ ఉండటమే అంటారు ఫ్రయాంట్.

‘‘వ్యాధులను అర్థం చేసుకోవడానికి , జంతువులనుంచి మనుషులకు సోకకుండా చూసేందుకు మనకు మరిన్నిపెట్టుబడులు కావాలి’’ అని ఆమె చెప్పారు. ‘‘సహకారం, సామర్థ్య నిర్మాణం పెంచాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆయా దేశాలు ఇలాంటి విషయాలను ఎదుర్కోగలుగుతాయి. ఇది కచ్చితంగా కేవలం పశ్చిమ దేశాలను రక్షించడానికి సంబంధించినది కాదు’’ అన్నారామె.

కోవిడ్ -19లానే ఎంపాక్స్ కూడా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. అయితే ఇది నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది, ఇన్ఫెక్షన్లను నిరోధించేందుకు వ్యాక్సిన్లూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్రకృతిలో మంకీపాక్సే చివరి వ్యాధి కాదు. అలాగే ప్రపంచం జాగురుకతతో తరువాత వ్యాధికి సిద్ధంగా ఉండాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)