రుమటాయిడ్ ఆర్థరైటిస్: కాళ్లు, చేతులు వంకరపోయేలా చేసే ఈ వ్యాధి రావడానికి పొగ తాగడం ఓ కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
ఏప్రిల్ నెల రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis) అవగాహన మాసం. కీళ్ళ వాతంలో అత్యంత అధికంగా కనిపించే వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్.
కీళ్ళ వద్ద నొప్పి అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఆ నొప్పి కీళ్ళ నుంచి వస్తుందా లేక కీళ్ళ చుట్టుపక్కల (periarticular) నుంచి వస్తుందా అనేది తెలుసుకోవాలి.
కీళ్ళ దగ్గర మొదలయ్యే నొప్పి, ఎక్కడో లోపలి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఒక్క చోట అని చూపించడం కష్టం. ఆ నొప్పి కారణంగా కీలులో ప్రతి కదలికా నొప్పిగా ఉంటుంది.
ఒకవేళ ఆ నొప్పి కీలు నుంచి కాకుండా పరిసర అవయవాల నుంచి వస్తే, ఆ కీలులో ఒక వైపు కదలిక మాత్రమే ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కీళ్లవాతమా? అరుగుదలా?
ఒకవేళ నొప్పి కీలు నుంచి వస్తే, దానికి కీళ్ళ వాతం (inflammatory Arthritis) లేక కీళ్ళ అరుగుదల (degeneration) కారణమా అన్నది తెలుసుకోగలగాలి.
సాధారణంగా ఎక్కువగా అరుగుదల (osteoarthritis) వల్ల వచ్చే నొప్పులే కనిపిస్తాయి. అది కొద్దికొద్దిగా సంవత్సరాల తరబడి ఎక్కువవుతుంటాయి. ఆ నొప్పి పనితో ఎక్కువ అవుతుంది. విశ్రాంతిలో తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో కొద్దిగా వాపు కూడా ఉంటుంది.
కీళ్ళ వాతంలో నొప్పితో పాటు, వాపు, పొద్దున పూట కనీసం అర గంటకు పైన ఎక్కువ పట్టేసినట్టు ఉండటం, విశ్రాంతి తరవాత నొప్పి ఎక్కువ కావడం, పనితో నొప్పి కొద్దిగా తగ్గడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి నొప్పిని కీళ్ళ వాతంగా గుర్తించాలి. ఈ నొప్పి కొద్ది సమయంలోనే తీవ్రంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల్లోనే ఎక్కువ..
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా నొప్పి కలిగించే కీళ్ళ వాత సమస్య. అది ప్రతి పది వేల మందిలో 5 నుంచి 10 మందికి వస్తుంటుంది. 30 శాతం వరకు జన్యు పరంగా సంక్రమిస్తుంది.
ధూమపానం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం అధికంగా ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పురుషుల కన్నా, మహిళల్లో మూడు రెట్లు అధికంగా వస్తుంది.
సాధారణంగా 30 నుంచి 60 ఏళ్ల మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాధి లక్షణాలు..
ఈ వ్యాధిలో కుడి, ఎడమ, రెండు పక్కలా ముఖ్యంగా చేతి చిన్న కీళ్ళల్లో అంతేకాకుండా ఇతర పెద్ద కీళ్లలో నొప్పి, వాపు అధికంగా కలుగుతుంది.
పెద్ద కీళ్లలో వచ్చే నొప్పి ఎక్కువ వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఉదయం ఎక్కువ సేపు (దాదాపు గంట) పట్టేయడం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి అధికం కవడం, పనితో కొద్దిగా ఉపశమనంగా అనిపించడం దీని ముఖ్య లక్షణాలు.
ఈ నొప్పులు కనీసం ఆరు వారాలు దాటి ఉంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా నిర్ధరించవచ్చును.
అయితే, ఇది ఎక్కువగా దాని లక్షణాలతో నిర్ధరించే వ్యాధి. రక్త పరీక్షలు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి. దీని నిర్ధరణ కోసం చేసే పరీక్షలు, వాటి విధానం కూడా కీలకం.
టెస్టుల్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగటివ్ అని ఫలితం వచ్చినంత మాత్రాన, కీళ్ళ వాతం లేనట్టు కాదు. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చాలావరకు జబ్బు నిర్ధరణ పరీక్ష . అయితే అది ఎలిసా, ఇమ్యూనో టర్బిడోమెట్రీ, ఇమ్యూనో నిఫ్లోమెట్రి వంటి టెస్టులతో చేసినప్పుడే అది సరైన నిర్ధరణగా గుర్తించాలి. .

ఫొటో సోర్స్, Getty Images
సరైన చికిత్స తీసుకోకుండా నొప్పి మాత్రలు వాడితే కొన్ని రోజులు తాత్కాలిక ఉపశమనం ఉండొచ్చు, కానీ, జబ్బు అదుపులోకి రాదు.
స్టెరాయిడ్ మాత్రలు వాడితే నొప్పి, వాపు బాగా తగ్గుతుంది కానీ, ‘అసలు జబ్బు’ అదుపు కాదు. పైగా, దీర్ఘ కాలికంగా అవి వాడటం వల్ల, శరీరం పైన ఇతర దుష్ప్రభావాలు చూపవచ్చు.
ఎక్కువ కాలం సరైన మందులు వాడకపోవడం వల్ల, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు చేతులు, కాళ్ళు వంకర పోవడం, కీళ్లు శాశ్వతంగా కదలికలు లేకుండా బిగుసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఈ వ్యాధి వల్ల కొన్ని సంవత్సరాల తరవాత కీళ్ళల్లోనే కాక ఇతర అవయవాలలో కూడా సమస్యలు రావొచ్చు. కళ్ళు పొడిబారడం, మంటగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొందరిలో ILD అనే ఊపిరితిత్తుల సమస్యలు రావొచ్చు. దాని వల్ల దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక కొందరిలో ఈ వ్యాధితో పాటు ఇతర స్వయం ప్రతిరక్షక వ్యాధులు (autoimmune diseases) కూడా ఉండే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్స ఏంటి?
ఈ వ్యాధికి అనేక రకాల అధునాతన చికిత్సలు ఉన్నాయి.
రుమటాలజీ వైద్యుల సలహాలను పాటిస్తూ, పరీక్షలు చేసుకుంటూ మందులు వాడితే సాధారణ జీవనం గడపొచ్చు. ఏ కారణంతో అయినా చికిత్స మానేస్తే, జబ్బు మళ్ళీ అధికం అవుతుంది. మెడిసిన్లు అవసరం ఎక్కువ పడుతుంది.
మందుల వాడకంతో పాటు, ప్రతి రోజూ వ్యాయామం చేయడం, శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది.
ఇవి కూడా చదవండి:
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- మ్యాగ్నటిక్ ఫిషింగ్: ఇక్కడ గాలం వేస్తే బాంబులు, తుపాకులు, కత్తులు పడుతుంటాయి...ఏమిటా కథ?
- పాకిస్తాన్: ‘సైన్యం మమ్మల్ని చితకబాదింది, ఏ మొహంతో డ్యూటీ చేయగలం’ అని అక్కడి పోలీసులు ఎందుకు వాపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అతిగా తాగితే ఏమవుతుంది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














