పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు ప్రతి ఈవెంట్‌లోనూ కనిపించిన ఈయన ఎవరు?

స్నూప్ డాగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్నూప్ డాగ్
    • రచయిత, అలాస్టైర్ టెల్ఫర్
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్

పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. ఒలింపిక్ క్రీడలను పారిస్‌లో వేలమంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది వీక్షించారు.

పారిస్ ఒలింపిక్స్ ఆటల వల్లే కాదు, కొన్ని వైరల్ ఫోటోల వల్ల కూడా ఈసారి వార్తల్లో నిలిచాయి.

ఆటగాళ్లు, ప్రేక్షకులు ఇటువంటి వైరల్ ఫోటోలు చూస్తాం అని అనుకుని ఉండరు.

ఆటగాళ్లు ఏదైనా ఆసక్తికరమైన, చారిత్రకమైన పని చేస్తే అది వెంటనే వైరల్ అవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫొగాట్

భారత ఆటగాళ్లలో క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత వినేశ్ ఫొగాట్ చేతులు చాచి రింగ్‌పై పడుకుని భావోద్వేగానికి లోనైన చిత్రం దేశంలో విస్తృతంగా షేర్ అయింది.

ఈ ఫోటో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా వినేశ్ చేసిన నిరసనల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె గెలుపుతో అభిమానులందరూ చాలా సంతోషపడ్డారు.

అయితే, అధిక బరువు కారణంగా వినేశ్‌ను ఒలింపిక్స్‌కు అనర్హురాలిగా ప్రకటించడంతో అభిమానుల ఆనందం ఆవిరైంది.

వినేశ్‌ ఫోటోతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన కొన్ని ఒలింపిక్స్ చిత్రాలను మనం ఇక్కడ చూద్దాం..

తుర్కిష్ షూటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కిష్ షూటర్ యూసుఫ్ డికెక్

1. స్టైల్‌గా వచ్చిన పతకాన్ని ఎగరేసుకుపోయిన తుర్కియే షూటర్

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో 51 ఏళ్ల తుర్కియే షూటర్ యూసుఫ్ డికెక్ లక్ష్యాన్ని ఛేదించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా షూటింగ్‌లో పాల్గొనే అథ్లెట్లు తమ చెవులకు ఇయర్ ప్రొటెక్టర్లు, లక్ష్యాన్ని గురిచూసేందుకు సాయపడే లెన్సులు, బ్లైండర్ల వంటివి ధరిస్తారు.

కంటిపై పడే వెలుతురుని తగ్గించేందుకు ఒక కన్నుపై వైజర్, స్పష్టమైన దృష్టి కోసం మరో కంటిపై బ్లైండర్ ధరిస్తారు. వీటిని షూటింగ్‌కు తప్పనిసరి అవసరాలుగా పరిగణిస్తారు.

కానీ, యూసుఫ్ ఇవేవీ లేకుండానే రోజువారి వాడే కళ్లద్దాలతోనే తన జేబులో చెయ్యి పెట్టుకుని లక్ష్యానికి గురిపెట్టి రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఏదో కాఫీ తాగడానికి వచ్చినట్టు సాదాసీదాగా కనిపించారు. అయితే, ఆ శబ్దం తన దృష్టి మరల్చకుండా యూసుఫ్ చాలా చిన్న ఇయర్ ప్లగ్స్ మాత్రమే చెవుల్లో పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌‌లో తీసిన యూసుఫ్ ఫోటోపై సామాన్యుల నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వరకు అనేకమంది స్పందించారు.

యూసుఫ్ డికెక్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వీడన్‌కు చెందిన అర్మాండ్ డప్లంటిస్, తుర్కియే ఫుట్‌బాల్ ఆటగాడు ఇర్ఫాన్ కెన్ కహ్వేసి కూడా చేతితో గురిపెడుతూ యూసుఫ్‌లాగే పోజ్ పెట్టి విజయాన్ని ఆనందించారు.

చైనీస్ జిమ్నాస్ట్ జౌ యాకిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనీస్ జిమ్నాస్ట్ జౌ యాకిన్

2. పతకంతో చైనీస్ జిమ్నాస్ట్ ఏం చేశారు?

చైనీస్ జిమ్నాస్ట్ జౌ యాకిన్ రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత పోడియంపై నిలబడ్డారు.

ఆ సమయంలో ఇటలీకి చెందిన అలిస్ డి అమాటో, మనీలా ఎస్పోసిటో తమ పతకాలను పళ్లతో కొరికారు.

ఇది చూసిన జౌ యాకిన్ కూడా అదే పని చేయడం ప్రారంభించారు. కానీ ఆమె దానిని పళ్ళతో కొరక్కుండా పెదాలపై ఉంచుకున్నారు. జౌ యాకిన్ అలా పెదాలపై పతకాన్ని ఉంచుకున్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

ఇలా పతకాన్ని పళ్లతో ఎందుకు కొరుకుతారు అంటే, ఒక వస్తువు బంగారమో కాదో తెలుసుకోవడానికి ప్రజలు ఇలా కొరికి చూసేవారు.

ఆంథోనీ అమ్మిరాటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆంథోనీ అమ్మిరాటి

3. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమ్మిరాటి ఫైనల్‌కు ఎందుకు అర్హత సాధించలేకపోయారు?

ఫ్రెంచ్ పోల్ వాల్టర్ ఆంథోనీ అమ్మిరాటి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. ఆంథోనీ జననాంగాలు క్రాస్‌బార్‌కు తగిలినందున ఆయనను అనర్హుడిగా ప్రకటించారు అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది ఎంతగా వైరల్ అయిందంటే, 21 ఏళ్ల ఆంథోనీ అమ్మిరాటి, మా ప్రదర్శన కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉండేలా మీరు వార్త రాస్తారు అని సరదాగా అన్నారు.

పారిస్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

4. టోపీ కోసం ఈత కొలనులో దూకిన వ్యక్తి

17,000 మంది ప్రేక్షకులతో నిండిన లా డిఫెన్స్ అరేనాలో ప్రపంచంలోని ఫిట్‌టెస్ట్ అథ్లెట్లు/ఈతగాళ్లు పోటీలో పాల్గొనడానికి వెళుతున్నారు. అతిపెద్ద క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో ఈత పోటీ కోసం క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు.

అయితే, అప్పుడే ఒక టోపి ఈత కొలనులో పడింది. దాన్ని బయటకు తీయడానికి ఎవరైనా సహాయం చేయవలసిందే.

ఇది చూసి అనూహ్యంగా ఒక నడివయస్కుడు తన దుస్తులు తీసి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆ టోపీని తీశారు. అయితే, ఆయన రంగు రంగుల అండర్‌వేర్ ధరించడం వల్లేమో ఆ ఫోటో వైరల్ అయింది.

నార్వే స్విమ్మర్ హెన్రిక్ క్రిస్టియన్‌సెన్

ఫొటో సోర్స్, andre pain

5. నార్వే స్విమ్మర్ హెన్రిక్ క్రిస్టియన్‌సెన్

నార్వేజియన్ స్విమ్మర్ హెన్రిక్ క్రిస్టియన్‌సెన్ ఒలింపిక్ విలేజ్‌లో దొరికే చాక్లెట్ చిప్ మఫిన్ రుచి అమోఘం అంటూ చెప్పడంపై కూడా చర్చ జరిగింది.

మఫిన్ గురించి ఇతర ప్లేయర్లు కూడా మాట్లాడారు. అయితే, హెన్రిక్ మాటలే వైరల్ అయ్యాయి.

హెన్రిక్ 800 మీటర్లు,1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్‌కి అర్హత సాధించలేదు. అతను 10 కిలోమీటర్ల ఓపెన్ వాటర్ స్విమ్‌లో25వ స్థానంలో నిలిచారు.

కానీ, మఫిన్ మ్యాన్ అనే కొత్త పేరును సంపాదించుకున్నారు.

రాచెల్ గన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాచెల్ గన్

6. రాచెల్ గన్ చేసిన బ్రేక్ డ్యాన్స్

ఆస్ట్రేలియన్ బ్రేక్ డాన్సర్, యూనివర్సిటీ లెక్చరర్ అయిన 36 ఏళ్ల రాచెల్ గన్ మూడో రౌండ్ రాబిన్ పోటీలో 0-54తో ఓడిపోయారు.

దీంతో చాలా మంది సోషల్ మీడియా యూజర్లు రాచల్ గన్‌ను ఎగతాళి చేశారు.

ఆమె కంగారులా ఎగరడమే ఇందుకు కారణం.

ఆమె నేలపై దొర్లుతూ, తలకిందులుగా డ్యాన్స్ చేశారు. దీనిపై రాచల్ గన్ మాట్లాడుతూ.. తాను ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనుకుంటున్నానని చెప్పారు.

Snoop Dogg

ఫొటో సోర్స్, Getty Images

7. స్నూప్ డాగ్ ఏం చేశారు?

పారిస్ ఒలింపిక్స్‌లో దాదాపు ప్రతి ఈవెంట్‌లోనూ రాపర్ స్నూప్ డాగ్ కనిపించారు.

నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎన్‌బీసీ) కోసం ఆయన వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు.

ఈ సమయంలో స్నూప్ డాగ్ హెల్మెట్ ధరించడం, అతని రియాక్షన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫోటో ఆఫ్ ది డే

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఫోటో ఆఫ్ ది డే

8. ఒలింపిక్స్ లో 'ఫోటో ఆఫ్ ది ఒలింపిక్స్' గురించి చెప్పకపోతే ఎలా?

హృదయానికి హత్తుకునే ఒక్క ఫోటో కొన్నివేల పదాలు మాట్లాడుతుందని అంటారు.

ఈ సామెతను నిజం చేస్తూ.. ఈ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్రెజిల్ సర్ఫర్ గాబ్రియల్ మెడీనా ఫోటో వైరల్ అవుతూ ‘ఫోటో ఆఫ్ ది ఒలింపిక్స్’గా నిలుస్తోంది.

దీన్ని ఫోటోగ్రాఫర్ జెరోమ్ బ్రౌలెట్ క్లిక్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)