నీరజ్ చోప్రాకు ‘జావెలిన్ త్రో’లో రజత పతకం, పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్‌కు స్వర్ణం

neeraj chopra

ఫొటో సోర్స్, Getty Images

భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన నీరజ్ ఈసారి రజతంతో సరిపెట్టుకున్నాడు.

నీరజ్ తన 6 త్రోలలో 5 ఫౌల్స్ చేశాడు. రెండో ప్రయత్నంలో మాత్రమే సరైన త్రో చేసిన ఆయన అందులో తన సీజన్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీం ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకంతో పాటుగా ఒలింపిక్ రికార్డును నెలకొల్పాడు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆండ్రెస్ థోర్‌కిల్డ్‌సన్ (నార్వే; 90.57 మీటర్లు) నెలకొల్పిన రికార్డును నదీం బద్దలు కొట్టాడు.

నీరజ్ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించి అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఒకే ఒక్క త్రోతో జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా, ఫైనల్ రౌండ్‌లో దాన్ని మెరుగుపర్చుకుని 89.45 మీటర్ల దూరం విసిరాడు.

మరోవైపు నీరజ్ సాధించిన ఈ పతకంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి రజతం చేరింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకటే సరైన త్రో, దాంతోనే రజతం

నీరజ్ అదే పనిగా ఫౌల్స్ చేసినా, గతంలో తన కన్నా మెరుగైన ‘అత్యుత్తమ ప్రదర్శనలు’ నమోదు చేసిన క్రీడాకారులపై ఈ ఫైనల్లో కొంతవరకు పైచేయి సాధించాడు.

చెక్ రిపబ్లిక్ ఆటగాడు, 2020 ఒలింపిక్స్ రజత పతకం విజేత జాకబ్ వడ్‌లెక్, 2022 యూరోపియన్ యూనియన్ చాంపియన్, జర్మనీ ఆటగాడు జూలియన్ వెబర్, రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన గ్రెనడా ఆటగాడు పీటర్స్ అండర్సన్‌తో పోలిస్తే... నీరజ్ చోప్రా మెరుగ్గా రాణించాడు.

వీరంతా గతంలో నీరజ్ కంటే ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులు.

ఇప్పటివరకు నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 89.94 మీటర్లు. ఈ ముగ్గురు క్రీడాకారులకు ఇంతకంటే మెరుగైన రికార్డు ఉంది.

neeraj chopra

ఫొటో సోర్స్, Getty Images

క్వాలిఫికేషన్ రౌండ్‌లో..

క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో నీరజ్ మొదటి ప్రయత్నంలో తన రెండో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 89.34 మీటర్లు నమోదు చేశాడు నీరజ్.

అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా ఈ ప్రదర్శన చేశాడు.

ఇప్పటిదాకా అతను పాల్గొన్న అన్ని పోటీల ‘క్వాలిఫికేషన్ రౌండ్‌’లలో ప్యారిస్ ఒలింపిక్స్‌లో చేసిన ప్రదర్శనే అత్యుత్తమమైనది.

ఫైనల్ రౌండ్‌కు ముందు నీరజ్ అందరూ నిర్దేశించుకునే 90.00 మీటర్లను లక్ష్యంగా పెట్టుకున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌కు, టోక్యో ఒలింపిక్స్‌కు మధ్య వాతావరణంలో తేడా ఉందని నీరజ్ చోప్రా చెప్పాడు.

టోక్యోలో సూర్యరశ్మి ఉందని, టోక్యోతో పోలిస్తే పారిస్ కాస్త చల్లగా ఉందని, తేమ తక్కువగా ఉందని నీరజ్ చోప్రా తెలిపాడు. పారిస్ కన్నా టోక్యోలో వేడి, తేమ ఎక్కువన్నాడు.

neeraj chopra

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఫైనల్ కన్నా పారిస్ క్వాలిఫికేషన్‌లో మెరుగైన ప్రదర్శన

నీరజ్ టోక్యోలో స్వర్ణం సాధించినపుడు చేసిన ప్రదర్శనను పారిస్‌లో క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే అధిగమించాడు. అయినప్పటికీ ఫైనల్‌ ఒత్తిడి ఉంటుందని, ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండడం ముఖ్యమని అన్నాడు.

ఈ ఏడాది జూన్‌లో ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మి గేమ్స్ 2024 అథ్లెటిక్స్ మీట్‌లో నీరజ్ బంగారు పతకం సాధించాడు. జావెలిన్‌ను 85.97మీటర్లు విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.

మే 10న జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో 88.36మీటర్ల త్రోతో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఆ తరువాత భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో అతను స్వర్ణం గెలుచుకున్నాడు. ఒలింపిక్స్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత అతను భారత్‌లో పాల్గొన్న తొలి పోటీ అదే.

శిక్షణ సమయంలో కండరాలు పట్టేయడంతో మే చివరి వారంలో జరగాల్సిన ఒస్త్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ నుంచి నీరజ్ తప్పుకొన్నాడు.

నీరజ్ చోప్రా ఈ ఒలింపిక్స్ రజతం సాధించడంతో అతని స్వస్థలమైన హరియాణాలోని పానిపట్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

పతకం కోసం నీరజ్ చోప్రా చాలా కష్టపడ్డాడని తల్లి సరోజ్, తండ్రి సతీశ్ కుమార్ చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)