‘‘నా అనుకున్నోళ్లంతా చనిపోయారు, ఇక డబ్బులు నేనేం చేసుకోను?’’ - వయనాడ్ కన్నీటి గాథలు

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘డబ్బు వద్దు.. డబ్బు నేనేం చేసుకోవాలి? నా ఊరు పోయింది.. నా అనుకున్న చుట్టాలు, స్నేహితులు చచ్చిపోయారు. ఇప్పుడు డబ్బు నేనేం చేసుకోను’’ - ఓ జీపు డ్రైవర్ అన్న మాటలు ఇవి.
చూరుల్మల, ముండక్కై, పుంజరిమట్టం – ఈ దెబ్బతిన్న గ్రామాల మధ్య ప్రభుత్వ సిబ్బందిని తీసుకువెళుతోన్న వాహనాల దగ్గరకు వెళ్లిన ఒక వ్యక్తి, తనను కూడా జీపులో ఎక్కించుకోవాలనీ, కావాలంటే డబ్బు ఇస్తామనీ అన్నారు. దానికి ఆ జీపు డ్రైవర్ నిర్వేదంగా చెప్పిన సమాధానం అది.
తమ సొంతవారినీ, సొంత ఊరినీ కోల్పోయిన గుండె పలికిన మాటలివి. కేరళలో కొండ చరియలు విరిగపడ్డ ప్రాంత పరిస్థితిని పట్టి చూపే మాటలివి.
ఆకుపచ్చని అందమైన టీ తోటలు, కొండలతో దోబూచులాడే మేఘాలు, సాహస క్రీడలు ఆడే పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది కేరళలోని వయనాడ్ ప్రాంతం. కేరళలో అత్యంత ఎత్తైన కొండలు ఈ జిల్లాలోనే ఉన్నాయి.

ఇప్పుడు కూడా ఆ టీ తోటలు, కొండల్లోని మేఘాలు అలానే ఉన్నాయి కానీ, పర్యాటకుల స్థానంలో సహాయ బృందాలు, పోలీసులు, సైన్యం మాత్రమే కనిపిస్తున్నారు. ఈ వారం రోజులు పర్యాటకుల కేరింతల బదులు అంబులెన్సుల సైరన్లు మాత్రమే వినిపించాయి. క్రమంగా ఆ అలికిడి కూడా తగ్గుతూ వస్తోంది.
కొన్నిచోట్ల కేవలం బండరాళ్లను తొలగిస్తోన్న ప్రొక్లెయినర్ల చప్పుళ్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన చోట సహాయ బృందాల హడావుడి ఉన్నప్పటికీ, చుట్టుపక్కల టీ తోటల్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది.

ఇంకా తేలని లెక్కలు..
గత మంగళవారం.. అంటే జూలై 30 తెల్లవారుజామున మొదలైన విధ్వంసం లెక్కలు ఇంకా పక్కాగా తేలలేదు. ఈ విషాదంలో 222 మంది చనిపోయినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
కేరళలోని దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలూ ఈ సంఖ్య 380 పైనే ఉంటుందని చెబుతున్నాయి.
ఒక్క చెలియార్ నదిలోనే 76 మృతదేహాలు, శరీర భాగాలూ దారుణమైన స్థితిలో కొట్టుకువచ్చాయి. ముస్లిం ఖబరిస్తాన్లు, హిందూ శ్మశానవాటికలు అంత్యక్రియలకు చోటులేనంతగా నిండిపోయాయి.
బంధువులు ఎవరూ గుర్తించని 74 మృతదేహాలకు స్వయంగా ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తోంది. వారి మతం తెలియదు కాబట్టి సర్వమత ప్రార్థనలూ చేసి, భవిష్యత్తులో వారి కోసం ఎవరైనా వస్తే ఆనవాళ్లు చెప్పడం కోసం తగిన చర్యలు తీసుకుంటోంది. వారి డీఎన్ఏ సేకరించి, ఆ తర్వాత మృతదేహాలను పూడ్చిపెడుతోంది కేరళ ప్రభుత్వం.

పశ్చిమ కనుమలు అంటేనే భారీ వర్షపాతం. అందుకే కృష్ణా, గోదావరి వంటి నదులు అక్కడే పుట్టాయి. అంత భారీవర్షాలు కేవలం ఒకట్రెండు రోజుల వ్యవధిలోనే కురిస్తే.. ఆ కొండల్లో రాతిపై ఉండే మట్టి, రాళ్లు విరిగిపడడం సాధారణం. కానీ, అవి వచ్చే తీవ్రత, ఆ దారిలో ఉండే మనుషుల ఆవాసాల సంఖ్య విపత్తును పెంచేశాయి.
రెండు రోజుల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని కేరళ ప్రభుత్వం చెప్పింది.
రెండడుగుల నీరు వర్షంగా కురిసి, ఆ వాననీరు వరదగా మారింది. ఆ వరద మట్టిని, రాళ్లను తోసుకుంటూ కొండల మీద నుంచి దూకుతూ వచ్చింది.
సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల పైనుంచి వచ్చిన మట్టి, రాళ్లు, వరద, దాదాపు కిలోమీటరు దూరం కిందకుపడ్డాయి. దీంతో కిందున్న ఊరు తుడిచి పెట్టుకుపోయింది. దారిలో ఇళ్లూ, గుళ్ళూ, చెట్లూ చేమలూ, రాళ్లూ రప్పలూ, చర్చిలూ, మసీదులూ.. అన్ని కొట్టుకుపోయాయి. దెబ్బతిన్నాయి. శవాలు లేక్కతేలనంత విధ్వంసం జరిగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
స్వచ్ఛంద సేవకులు..
ఇదంతా ప్రకృతి కోపం మాత్రమే కాదు, మానవ తప్పిదం కూడా అంటున్నారు పర్యావరణ వేత్తలు. పశ్చిమ కనుమలు చాలా సున్నితమైన ప్రాంతమని చెబుతున్నారు.
ఘటన జరిగిన వారం రోజుల తరువాత కూడా ఆ ప్రాంతాల్లో రంగురంగుల్లో టీషర్టులు, హెల్మెట్లు, గమ్ బూట్లు ధరించిన యువత ఇంకా మృతదేహాల కోసం వెతుకుతూ, నేల చదును చేయడంలో సహకరిస్తూ, చెత్త ఏరుతూ.. ఇలా తోచిన పనిచేస్తూ కనిపిస్తూనే ఉన్నారు.
సాధారణంగా ఎక్కడ ఉపద్రవం వచ్చినా స్థానికులు పెద్ద ఎత్తున సాయం చేస్తూ పనిచేయడం కనిపిస్తుంది. కానీ, ఈ విషయంలో కేరళ ప్రత్యేకం.
ఇక్కడ ఇలా వాలంటీర్లుగా వచ్చిన వారు సైతం నిబంధనల ప్రకారం సేఫ్టీ గేర్.. అంటే హెల్మెట్, గమ్ బూట్లు వంటివి ధరించి, తమ సంఘం లోగో ఉన్న దుస్తులు ధరించి ఒక పద్ధతిగా కార్యక్రమాలు చేస్తున్నారు.
వారంతా తోచిన రీతిలో పనిచేయడం కాకుండా, విపత్తు నిర్వహణ, సహాయక చర్యలు ఎలా చేయాలి, ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకోవాలన్న అంశాలపై ప్రాథమిక అవగాహన ఉన్నవారే.

సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర చిన్న పార్టీల సంఘాలు, ముస్లిం, హిందూ, క్రైస్తవ మతాల అనుబంధ సంఘాలు, ఇక ఏ రంగూ-మతమూ లేని సంఘాలు… ఇలా అనేక రకాల స్వచ్ఛంద సంస్థలకు చెందిన వందల మంది కార్యకర్తలు ఈ విపత్తులో సైనికులతో సమానంగా శ్రమించారు.
కేవలం విపత్తు నిర్వహణలోనే శిక్షణ పొందిన స్వచ్ఛంద సంఘాలు కూడా కేరళలో ఉన్నాయి.
ఇవికాక శిబిరాల దగ్గర, రెస్క్యూ కార్యక్రమాల దగ్గర భోజనాలు, చిరుతిళ్లు, మంచినీళ్లు, టీ కాఫీ, కొబ్బరి నీళ్లు ఉచితంగా పెద్దయెత్తున పంచిపెట్టారు.

ఫొటో సోర్స్, Twitter@DefencePROkochi
కీలకంగా వ్యవహరించిన భారత సైన్యం..
మొత్తం వ్యవహారంలో భారత సైన్యం పాత్ర ప్రత్యేకం. కొండచరియల ప్రమాద ఘటన గురించి సమాచారం అందగానే, కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ అటు వైపే కదిలాయి.
ముందుగా తిరువనంతపురం, తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనిక బృందాలు వచ్చాయి. ఆర్మీతో పాటు, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, కేరళ పోలీసులు, కేరళ ఫైర్, కేరళ ప్రభుత్వ వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలూ పనిచేశాయి.
అయితే, దారి తెగిపోయిన ముండక్కైను మిగతా ప్రపంచంతో కలిపింది ఆర్మీ. వారు నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి సహాయక చర్యల్లో కీలకంగా మారింది.
ఇక మృతదేహాల కోసం వెతకడం, బతికున్న వారిని కాపాడి తరలించడం, భూమిలో కూరుకుపోయిన మృతదేహాల కోసం శిక్షణ పొందిన కుక్కుల, సాంకేతిక పరిజ్నానం వాడడం.. ఇలా ఎన్నో విషయాల్లో భారత సైన్యం, ఇతర ప్రభుత్వ శాఖలూ శ్రమించాయి.
ఘటన జరిగి వారం కావొస్తోంది. సహాయక చర్యలు మొదటి ఐదు రోజులు ఉధృతంగానూ, ఇప్పుడు కాస్త నెమ్మదిగానూ సాగుతున్నాయి. భారత సైనికులు క్రమంగా బాధ్యతలను రాష్ట్ర యంత్రాగానికి అప్పగించి వెనుదిరుగుతున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ కూడా సిబ్బందిని తగ్గిస్తూ వస్తోంది. మీడియా కెమెరాలూ తగ్గాయి. అక్కడకు వెళ్లడానికి అనుమతి ఉంటేనే పంపుతోంది కేరళ ప్రభుత్వం.
మేప్పాడి – చూరుల్మల దారిలో మొదటిరోజు ఉన్నంత జనమూ, ట్రాఫిక్, సహాయ బృందాల హడావుడి ఇప్పుడు లేదు. మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నప్పటికీ, మృతదేహాలు దొరికే అవకాశాలు దాదాపు లేవని వారి అంచనా.
శిథిలాలు, కొట్టుకువచ్చిన బండరాళ్లను తొలగించడం, భూమిని చదును చేయడం వంటి పనుల్లో కేరళ ప్రభుత్వ బృందాలతో పాటు ప్రతిరోజూ స్వచ్ఛందంగా వస్తున్న కార్యకర్తలు నిమగ్నమయ్యారు. వయనాడ్ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఈ పనుల్లో ఉంది.
ఈ ఉపద్రవం నుంచి బయటపడిన వేలాది మందిని కేరళ ప్రభుత్వం క్యాంపులకు తరలించింది.

కన్నీటి గాథలు..
ఈ క్యాంపుల్లో అన్నీ కన్నీటి గాథలే.. కుటుంబంలో అందరినీ కోల్పోయిన వారూ, ఎందర్నో కోల్పోయిన వారూ.. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వారూ.. ఇలా ఎవర్ని కదిలించినా కంటతడి పెట్టించే కథలే.
అక్కడ క్యాంపుల్లో ఉండే వారి ప్రైవసీ కోసమని మీడియాను క్యాంపుల్లోకి పంపడం లేదు. పిల్లలు ఆడుకోవడం కోసం వారికి ఆట బొమ్మలు, రంగులు వేసుకునే పుస్తకాలు, రంగురంగుల పెన్సిళ్లూ ఇస్తున్నారు.
అంతేకాదు, వారి మానసిక ఆరోగ్యం కోసం కౌన్సిలింగ్ సైకాలజిస్టులను కూడా ఏర్పాటు చేసింది.

పునరావాస సహాయ శిబిరాలంటే.. స్కూలు గదిలో వేసేసి పులిహోర పొట్లాలు ఇచ్చి చేతులు దులుపుకోవడంలా కాకుండా మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు.
ఈ ప్రాంతానికి టీ తోటలు ప్రధాన ఆదాయ వనరు. టూరిజం మరో ఆదాయ వనరు. ఇప్పుడు టూరిజం ఆగిపోయింది. వారికి ఉపాధి లేదు. ఇల్లు లేదు. అటు ప్రకృతికి హాని జరగకుండా, ఇటు మనిషి బతకడానికి వీలుగా ఇల్లు – ఉపాధి అవసరం వారికి.
ఇదే కేరళ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న.
ఇంత హడావుడిలోనూ కేరళ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరణించిన వారిలో ఆ కొండల్లో నివసించే ఆదివాసీల సంఖ్య తక్కువ అని.
భారీ వర్షాలు వచ్చినప్పుడు కొండచరియలు విరిగిపడతాయన్న అవగాహన ఉన్న ఆదివాసీలు, ఆ వర్షాల సమయంలో సురక్షిత ప్రదేశాలకు వెళ్లి అక్కడే ఉంటారనీ, అందుకే వారు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారనీ స్థానిక అధికారుల అభిప్రాయం.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














