మేజర్ సీత: కేరళ ప్రజలు 'టైగర్' అని పొగుడుతున్న ఈ మహిళా ఆర్మీ ఆఫీసర్ ఎవరు?

కేరళ

ఫొటో సోర్స్, x/@official_dgar

ఫొటో క్యాప్షన్, ఆర్మీ నిర్మించిన వంతెనపై సీతా షెల్కే

కేరళలోని వయనాడ్‌లో కురిసిన భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి.

వందల మంది మరణానికి కారణమైన ఈ విలయం తరువాత అక్కడ సహాయ చర్యల్లోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్మీ అక్కడ యుద్ధప్రాతిపదికన వంతెన నిర్మించింది.

ఈ వంతెన నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఒక మహిళా ఆర్మీ అధికారి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

వయనాడ్ విపత్తు అనంతరం సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించిన ఆ మహిళా అధికారి సీతా షెల్కే.

మహారాష్ట్రకు చెందిన మేజర్ సీతా షెల్కేపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

చూరల్మలై, ముండక్కై గ్రామాలను కలిపే వంతెన వరదల్లో కొట్టుకుపోయింది.

సీతా షెల్కే ఆధ్వర్యంలో ఆర్మీ అక్కడ రికార్డు సమయంలో తాత్కాలిక ఐరన్ బ్రిడ్జి నిర్మించింది.

దీంతో మేజర్ సీతా షెల్కే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు ఆమెను 'టైగర్' అంటూ కొనియాడుతున్నారు.

అసలు ఈ మేజర్ సీతా షెల్కే ఎవరు? ఆమెను ఎందుకు ప్రశంసిస్తున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు

బ్రిడ్జి నిర్మాణం..

వయనాడ్ విపత్తు జరిగిన వెంటనే సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి.

అయితే, చూరల్మలై, ముండక్కై గ్రామాల మధ్యనున్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వంతెన లేకపోవడంతో సహాయ చర్యలకు అవసరమైన పరికరాలు, సామగ్రి తీసుకెళ్లడం సాధ్యపడలేదు. దీంతో ఆ ప్రాంతంలో వెంటనే వంతెన నిర్మించాలి.

వంతెన నిర్మాణం తర్వాతే అంబులెన్స్, ఇతర వాహనాలు, అవసరమైన పరికరాలను ప్రమాద స్థలానికి తీసుకెళ్లగలరు. అప్పుడే సహాయ చర్యలు వేగవంతమవుతాయి.

దీంతో అప్పటికప్పుడు, ఆర్మీ సిబ్బంది బెయిలీ బ్రిడ్జి (తాత్కాలిక ఇనుప వంతెన) నిర్మించారు.

మేజర్ సీతా షెల్కే అనే మరాఠీ ఆర్మీ అధికారి ఈ వంతెన నిర్మాణ బృందానికి నాయకత్వం వహించారు.

కేరళ

ఫొటో సోర్స్, X.COM /

ఫొటో క్యాప్షన్, వంతెన నిర్మాణ పనుల్లో సీతా షెల్కే, ఆర్మీ సిబ్బంది

మేజర్ సీతా షెల్కే ఎవరు?

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గడిల్‌గావ్‌‌కి చెందిన సీతా షెల్కే ఆర్మీలో చేరారు. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేశారు.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక శిక్షణ సంస్థ. ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం అధికారులకు ట్రైనింగ్ ఇస్తుంది.

దీనిలో భాగంగా, సైన్యంలోని ఆర్మీ మెడికల్ కార్ప్స్ మినహా సైన్యంలోని అన్ని విభాగాలకు చెందిన ఆఫీసర్స్ కోసం 49 వారాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రూపొందించారు.

బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌కి చెందిన 70 మంది సభ్యుల బృందంలో మేజర్ సీతా షెల్కే మాత్రమే మహిళా అధికారి.

ఆమె పర్యవేక్షణలో ఆర్మీ సిబ్బంది రికార్డు స్థాయిలో 31 గంటల్లోనే బెయిలీ వంతెనను నిర్మించింది.

కొత్తగా నిర్మిస్తున్న వంతెనపై మేజర్ షెల్కే నిల్చుని ఉన్న ఫోటో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆమె టీంలో సీతా షెల్కే ఒక్కరే మహిళా అధికారి.

ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు టాక్లీ డోకేశ్వర్‌లో ఉంటున్నారు.

ఆమె తండ్రి అశోక్ షెల్కే ఆ తాలూకాలో పేరొందిన న్యాయవాది. సీతకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

'మద్రాస్ శాపర్స్'

మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌ని 'మద్రాస్ శాపర్స్' అని కూడా పిలుస్తారు. ఇదొక ఇంజినీరింగ్ యూనిట్. ఈ టీం సైనిక దళాల కోసం రోడ్లు నిర్మించడం, రోడ్లపై అడ్డంకులను తొలగించడం, వంతెనల నిర్మాణం, యుద్ధ సమయాల్లో ల్యాండ్‌‌మైన్లను గుర్తించడం, వాటిని డీయాక్టివేట్ చేయడం వంటివి ఈ గ్రూప్ నిర్వహిస్తుంది.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యల్లోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తాయి.

2018లో కేరళ వరదల సమయంలోనూ ఈ టీం కీలకంగా పనిచేసింది.

ఐరన్ బ్రిడ్జి నిర్మాణం

జులై 31న ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఆగస్టు 1 సాయంత్రం 5 గంటలకు పూర్తయింది.

ఒకే పిల్లర్‌ ఆధారంగా, 19 స్టీల్ ప్యానెల్స్‌తో నిర్మించారు ఈ వంతెనను.

వంతెన నిర్మాణం పూర్తయిన వెంటనే, తొలుత ఆర్మీ వాహనాన్ని నడిపి బ్రిడ్జిని పరీక్షించారు. ఆ తర్వాత ఇతర వాహనాల రాకపోకలకు అనుమతించారు.

కొండచరియలు విరిగిపడడంతో విధ్వంసానికి గురైన చూరల్మలై, ముండక్కై గ్రామాలను కలపడంలో ఈ వంతెన చాలా కీలకమైంది.

కేరళ

ఫొటో సోర్స్, x.com

సైన్యంలో భాగమైనందుకు గర్విస్తున్నా: షెల్కే

సహాయ చర్యల సందర్భంగా సీతా షెల్కే వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. ఆర్మీ అధికారిని అయినందుకు గర్వపడుతున్నానని ఆమె అన్నారు.

''ఈ టీంలో నేనొక్కరినే మహిళా అధికారినని కాదు.. నేను ఇండియన్ సోల్జర్‌ని. భారత సైన్యానికి ప్రతినిధిని'' అని ఆమె అన్నారు.

''సహాయ చర్యల్లో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నా. సీనియర్ల మార్గదర్శకాలు, సహోద్యోగుల కృషి వల్లే ఇది సాధ్యమైంది'' అన్నారామె.

వంతెన నిర్మాణానికి సహకరించిన పలు సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రతి ఒక్కరికీ మేజర్ సీతా షెల్కే కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతోమంది నుంచి ప్రశంసలు

క్లిష్టపరిస్థితుల్లో తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించిన మేజర్‌ సీతా షెల్కేని ప్రశంసిస్తూ అసోం రైఫిల్స్ డైరెక్టర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ వికాస్‌ లఖేరా ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ చెన్నితాల కూడా మేజర్ సీతా షెల్కేను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ''విధ్వంసానికి గురైన వయనాడ్‌లో ఐరన్ బ్రిడ్జి నిర్మించి, బాధితులను సురక్షితంగా తరలించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మేజర్ సీతా షెల్కేకి ధన్యవాదాలు" అని రాశారు.

మేజర్ సీతా షెల్కే, ఇంజినీరింగ్ రెజిమెంట్‌ను చూసి గర్వపడుతున్నా. 24 గంటల్లో బెయిలీ బ్రిడ్జిని నిర్మించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం అద్భుతం. అందుకే స్థానిక మీడియా ఆమెను 'పులి' అంటూ మెచ్చుకుంది'' అని మరో ట్విటర్ యూజర్ రాశారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)