భూమిలోని కోర్ వ్యతిరేక దిశలో తిరుగుతోందా, ఏం జరగబోతోంది?

భూమి కోర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇప్పటి వరకు భూ అంతర్భాగాన్ని 12 కిలోమీటర్ల వరకు మాత్రమే శాస్త్రవేత్తలు అన్వేషించగలిగారు

భూ ఉపరితలం, అంతరిక్షం గురించి అనేక ఏళ్ళుగా పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడు, అరుణ గ్రహాలను మానవ ఆవాసాలుగా చేసుకునే సాంకేతికను అందిపుచ్చుకుంటున్న తరుణంలో కూడా భూమి కోర్ (కేంద్రం) భాగం సైన్స్‌కు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది.

భూమి కేంద్ర భాగం 5 వేల కిలోమీటర్ల లోతులో ఉంటే, ఇప్పటి దాకా కేవలం 12 కిలోమీటర్ల దాకా మాత్రమే అన్వేషించగలిగారు.

అయితే, భూ ఉపరితలంతో పోల్చినప్పుడు, భూమి కోర్ నెమ్మదిగా, వ్యతిరేక దిశలో తిరుగుతోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.

భూమి కోర్ భ్రమణ వేగం 2010 నుంచి మందగిస్తోందని శాస్త్రవేత్తల బృందం చెప్పింది. అయితే 5 వేల కిలోమీటర్ల లోతులోని కోర్‌ వరకు తవ్వకుండా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు? భూమి కోర్ భాగం భూ ఉపరితలానికి వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
భూ అంతర్భాగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూమి నిర్మాణం మూడు విభిన్న పొరలతో కూడి ఉందని పరిశోధకులు నిర్థరించారు.

మూడు పొరల నిర్మాణం

భూమి నిర్మాణం మూడు విభిన్న పొరలతో కూడి ఉందని పరిశోధకులు నిర్థరించారు.

క్రస్ట్ (భూ పటలం), మాంటిల్, కోర్ (కేంద్రం) అనేవే ఆ మూడు పొరలు.

ఇప్పటిదాకా కోర్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. కోర్‌ గురించి అనేక కల్పిత గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1964లో ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ నవల ప్రచురితమైంది. దీని ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

అయితే భూమి నిర్మాణాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మనం దానిని ఓ గుడ్డుతో పోల్చుకుందాం. గుడ్డుపై ఉండే పెంకును భూమి ఉపరితలంగా, తెల్ల సొనను భూమి మాంటిల్‌ గానూ, పచ్చ సొనను కోర్‌గాను అనుకోవచ్చు.

భూమి అంతర్‌ కోర్ భాగం ఇనుము, నికెల్‌తో రూపొందిన గోళాకారంలో ఉంటుంది.

దాని వ్యాసార్థం 1,221 కిలోమీటర్లు. దాని ఉష్ణోగ్రత 5,400 డిగ్రీల సెల్సియస్. అంటే దాదాపు సూర్యుడి ఉష్ణోగ్రత (5,700 డిగ్రీలు)కు దగ్గరగా ఉంది.

గతంలోని అధ్యయనాలు ఈ కోర్‌ భాగం భూమి నుంచి వేరుగా ఉండేదని, ఓ రకమైన లోహ ద్రవం వల్ల భూమి నుంచి విభజితమై స్వతంత్రంగా పనిచేస్తుందని సూచించాయి. అంటే ఇది ఇది భూమి లోపల స్వతంత్రంగా తిరుగుతుందని, మిగిలిన భూమితో దీనికి సంబంధం లేదని చెప్పేవారు.

కానీ 40 ఏళ్ళలో తొలిసారిగా భూ ఉపరితలానికి కోర్ వ్యతిరేక దిశలో కదులుతోందని, భూమి మాంటెల్ కంటే కోర్ కాస్త నెమ్మదిగా కదులుతోందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

భూమి

ఫొటో సోర్స్, Getty Images

తవ్వకుండా తెలుసుకోవడం ఎలా?

భూకంపం వచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే భూకంప తరంగాల ద్వారా ఎలాంటి తవ్వకాలు జరపకుండానే భూమి కోర్ భాగం గురించి తెలుసుకోవచ్చు.

భూ ఉపరితలంపై భారీ భూకంపాలు సంభవించినప్పుడు, ఆ కంపన తరంగాల శక్తి భూమి కోర్‌ భాగానికి ప్రసారమై, తిరిగి ఉపరితలంపైకి ప్రవహిస్తుంది.

భూమి అంతర్భాగానికి చేరుకుని ఉపరితలానికి తిరిగి వచ్చే ఈ భూకంప తరంగాల శక్తి మార్గాలను శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది.

ఇందుకోసం వారు 1991 నుంచి 2023 మధ్య దక్షిణ శాండ్ విచ్ దీవులలో (అట్లాంటిక్ మహాసముద్రంలో జనావాసాలు లేని ద్వీపాలు) చుట్టూ నమోదైన 121 వరుస భూకంపాల నుంచి భూకంప సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించారు.

1971, 1974 మధ్య సోవియట్ అణు పరీక్షల డేటాను, అలాగే ఫ్రెంచ్, అమెరికన్ అణు పరీక్షల డేటాను కూడా విశ్లేషించారు.

భూమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూమి కోర్ వ్యతిరేక దిశలో తిరుగుతోందనే విషయాన్ని చెప్పలేమని ప్రొఫెసర్ వెంకటేశ్వరన్ అన్నారు.

దీనిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ టీవీ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. ‘‘భూమి కోర్ భాగం వ్యతిరేక దిశలో తిరుగుతోందని చెప్పడం నిజంగా సాధ్యం కాదు. అయితే దీనిని ఓ తేలికైన ఉదాహరణతో చెప్పొచ్చు.

మీరు ఓ కారులో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. మరో కారులో మీ మిత్రుడు కూడా 100 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నారనుకుందాం. మీరిద్దరూ పక్కపక్కనే ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా మీ స్నేహితుడు తన కారు వేగాన్ని 80 కిలోమీటర్లకు తగ్గిస్తే, అతను మీ కంటే వెనుకకు వెళుతున్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు వంద కిలోమీటర్ల వేగంతో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా భూ కక్ష్య పరిభ్రమణ వేగంతో పోల్చినప్పుడు కోర్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. అది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తునట్టుగా అనిపిస్తుంది’’ అని డీవీ వెంకటేశ్వరన్ చెప్పారు.

శాస్త్రవేత్తల అధ్యయన ఫలితం కూడా ఊహాజనితమే అని అభిప్రాయపడ్డారు.

‘‘మనం భూమి కోర్ భాగాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కోర్ ఆకారం కూడా డేటా ఆధారంగా అంచనా వేసిందే. దీనికి కారణం మనం 5 వేల కిలోమీటర్ల లోతుకు చేరుకోకపోవడమే. భూకంప సమాచారం ఆధారంగా కోర్ భ్రమణ వేగం మందగించినట్టుగా శాస్త్రవేత్తలు నిర్ణయానికి వస్తున్నారు. బహుశా వారు భవిష్యత్తులో తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో’’ అని ఆయన అన్నారు.

భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూకంప సమాచారం ద్వారా కోర్ భ్రమణ వేగం మందగించినట్టు శాస్త్రవేత్తలు నిర్థరించారు.

భూమి కోర్ భ్రమణ వేగం మందగించడం వల్ల అయస్కాంతావరణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ప్రొఫెసర్ వెంకటేశ్వరన్ చెప్పారు.

‘‘కోర్ భాగం ఇనుము, నికెల్‌తో కూడి ఉంటుంది. దాని భ్రమణ వేగం తగ్గితే, అది భూ ఊపరితలంలో మార్పుకు కారణమవుతుంది’’ అని ఆయన తెలిపారు.

‘‘ఈ మార్పులలో అయస్కాంతావరణానిది కీలకాంశం. విశ్వంలో భూమి తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తున్నప్పుడు, లోహాలతో తయారైన భూమి లోపలి కోర్ భాగం కూడా పరిభ్రమిస్తుంది. ఈ రెండు పరిభ్రమణల వల్ల, భూమి చుట్టూ అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అదే అయస్కాంతావరణం. ఈ అయస్కాంతావరణంలోని రేడియేషన్‌లు సూర్యుడి వేడి నుంచి భూమిని రక్షించే కవచంగా పనిచేస్తాయి. అలాగే భూకక్ష్యలోని కాలప్రమాణాలకు కూడా ఈ అయస్కాంతావరణం కారణమవుతుంది. అంటే మన రోజు ఎంతసేపు ఉండాలో నిర్ణయించేది ఈ అయస్కాంతావరణమేన్నమాట’’.

‘‘మనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇది మరీ అంత పెద్ద ప్రభావం ఏమీ కాదు. ఓ రోజు కాలప్రమాణంలో మైక్రోసెకను తేడాకు అది కారణమవుతుంది. బహుశా కోర్ భ్రమణ వేగం ఇందుకు కారణమవుతోందేమో.. దీనిపై భవిష్యత్తులో మరింత పరిశోధన చేస్తేనే మనకు విషయం అర్థమవుతుంది’’ అని ప్రొఫెసర్ డీ.వీ. వెంకటేశ్వరన్ చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)