మీ వాటర్ బాటిల్‌లో ఎన్ని కోట్ల క్రిములు ఉన్నాయో తెలుసా?

వాటర్ బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఆండ్రే బీర్నాథ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు బయటికి వెళ్లేటప్పుడు మీ బ్యాగ్‌లో వాటర్ బాటిల్‌ని తీసుకెళ్లడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఈ అలవాటు శరీరానికి క్రమం తప్పకుండా నీరు అందివ్వడానికి సాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. రెండోది, పర్యావరణానికి మేలు చేసే డిస్పోజబుల్ మెటీరియల్స్ వాడకాన్ని తగ్గిస్తుంది. మరి, ఆ వాటర్ బాటిల్ పరిశుభ్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

నీళ్ల బాటిళ్లను సరిగా శుభ్రం చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి అనేక సూక్ష్మజీవులు పేరుకుపోతాయని, అవి ఆరోగ్యానికి హానికరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్
వాటర్ బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

సీసాలో సూక్ష్మజీవులు

వాటర్ బాటిళ్లపై అమెరికాలోని 'వాటర్‌ ఫిల్టర్‌ గురు' అనే స్పెషలిస్ట్ వాటర్ క్వాలిటీ కంట్రోల్ కంపెనీ ఒక అధ్యయనం నిర్వహించింది. ఒక్క రీయూజబుల్ డ్రింకింగ్ బాటిల్‌లో దాదాపు 2.08 కోట్ల కాలనీ ఫార్మింగ్ యూనిట్ల (సీఎఫ్‌యూ) సూక్ష్మజీవులు ఉండవచ్చని ఆ అధ్యయనం చెబుతోంది. సీఎఫ్‌యూ అనేది ల్యాబ్‌ వాతావరణంలో సూక్ష్మజీవుల సంఖ్యను గణించేందుకు ఉపయోగించే ప్రమాణం.

ఈ అధ్యయనంలో మంచి నీటి సీసా అపరిశుభ్రత స్థాయిని ఇతర మురికి వస్తువులతో పోల్చారు.

ఉదాహరణకు టాయిలెట్ సీటు ఉపరితలం సగటున 515 సీఎఫ్‌యూ‌లను కలిగి ఉందని వారు కనుగొన్నారు. ఆ ప్రకారం టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్‌లో 40,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంది.

పెట్ ఫుడ్ డిష్‌లు లేదా పాత్రలు (సగటు 14 లక్షల సీఎఫ్‌యూ), కంప్యూటర్ మౌస్ (40 లక్షలు), కిచెన్ సింక్ (కోటి 10 లక్షలు) కూడా బాటిల్‌తో పోలిస్తే తక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయి.

చైనాలోని హెనాన్ యూనివర్శిటీ నిపుణులు ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. మంచి నీటి బాటిళ్లలో భారీ సంఖ్యలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని అందులో తెలిపారు.

ఒక్కో మిల్లీలీటర్ నీటిలో సగటున 75,000 బ్యాక్టీరియా ఉంటుందని హెనాన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అంచనా వేస్తున్నారు. ఈ సూక్ష్మ జీవులు 24 గంటల్లో మిల్లీలీటర్‌కు 20 లక్షల వరకు వృద్ధి చెందుతాయని చెప్పారు.

అమెరికాలోని పర్డ్యూ యూనివర్శిటీలో 90 మంది వాటర్ బాటిల్ వినియోగదారులపై ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో 15 శాతం మంది బాటిల్ తాగేసి దాన్ని పాడేయకుండా, మళ్లీ నీటిని నింపి తాగినట్లు గుర్తించారు.

'వాటర్‌ఫిల్టర్‌గురు' సర్వే కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించింది. ఆ సర్వేలో పాల్గొన్నవారిలో 42 శాతం మంది తమ బాటిల్‌ను కనీసం రోజుకు ఒక్కసారైనా శుభ్రం చేస్తామని తెలిపారు. 25 శాతం మంది వారానికి కొన్నిసార్లు శుభ్రం చేస్తామని చెప్పారు. అయితే 13 శాతం మంది దానిని నెలకు రెండుసార్లు మాత్రమే శుభ్రం చేసినట్లు తెలిపారు.

వాటర్ బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాక్టీరియా ఎలా చేరుతుంది?

ఇంతకీ వాటర్ బాటిల్‌లోకి ఈ సూక్ష్మజీవులు ఎలా చేరుతాయి? ఇలా అపరిశుభ్రమైన బాటిల్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

మనం ప్రతిచోటా బ్యాక్టీరియా చుట్టూ జీవిస్తున్నామని గుర్తుంచుకోండి. అయితే, అదేమీ చెడు విషయం కాదు, మన మనుగడ కోసం ‘మంచి బ్యాక్టీరియా’ ఎంతో అవసరం. ఈ సూక్ష్మ జీవులు మన నీటి బాటిల్‌లోకి చాలా రకాలుగా ప్రవేశిస్తాయి.

నీరు తాగడానికి మీరు మీ నోటిని బాటిల్‌కు తాకించగానే చర్మం, పెదవులు, చిగుళ్ళు, దంతాలు, నాలుకపై ఉండే కొన్ని సూక్ష్మజీవులు (స్టెఫిలోకాకి, స్ట్రెప్టోకోకి వంటి బాక్టీరియా) సీసాలోకి ప్రవేశిస్తాయి. నీటిలో వృద్ధి చెందడం మొదలెడతాయి.

బాటిల్‌ని తీయడానికి లేదా బాటిల్ మూతను తెరిచేందుకు మన వేళ్లను ఉపయోగించినప్పుడు ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే మనలో చాలామంది శుభ్రంగా లేని ఇతర వస్తువులను (తలుపు బేడాలు, లిప్టు బటన్లు, మెట్ల పక్కనుండే హ్యాండ్ రెయిలింగ్ లాంటివి) తాకుతుంటాం.

బాటిల్ మోసే బ్యాగులు, స్కూల్ లాకర్లు, డెస్క్‌లు, కిచెన్ సింక్‌లలో బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకే బాటిల్‌ను తరచుగా శుభ్రం చేయకపోతే, ఈ సూక్ష్మజీవులు అందులోకి ప్రవేశించి కాలనీలను ఏర్పరుస్తాయి, అనంతరం విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఇలా కేవలం 24 గంటల్లో మిల్లీలీటర్‌కు 75 వేల నుంచి 20 లక్షల వరకు సంఖ్య పెరుగుతుందని చైనీస్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

తేమ, వెచ్చని, చీకటి వాతావరణం (ప్లాస్టిక్ లేదా అల్యూమినియం సీసాలలో) అనేక శిలీంధ్ర జాతులకు అనువైన నివాసం.

అపరిశుభ్రమైన బాటిళ్లలో ఈ సూక్ష్మజీవులను కంటితో కూడా చూడవచ్చు. నీటిలో కొన్ని కణాలు కనిపిస్తాయి.

వాటర్ బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

ఈ బ్యాక్టీరియాలు హాని కలిగిస్తాయా?

"మన శరీరంలో కణాల కంటే పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉందని మనం గుర్తుంచుకోవాలి" అని రియో డి జెనీరో స్టేట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అసోసియేషన్ అధ్యక్షుడు లిన్స్ తెలిపారు.

బాటిల్‌లో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, క్రమం తప్పకుండా బాటిల్ ఉపయోగించే వ్యక్తికి వికారం, వాంతులు వంటి కొన్ని తేలికపాటి లక్షణాలు కలగొచ్చు.

మీకు శిలీంధ్రాల అలర్జీ అయినట్లయితే ఆ సూక్ష్మజీవులు నిండిన బాటిల్‌ను ఉపయోగించడం వలన ముక్కు మూసుకుపోవడం, వికారం, తలనొప్పి, అలసట, ఇతర అసౌకర్యాలు వంటి ప్రతిచర్యలు సంభవించవచ్చు.

"ఇలాంటి వాటికి చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువుల పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలి" అని సావో పాలో యూనివర్సిటీ బయోమెడికల్ సైన్సెస్ విభాగానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ జార్జ్ టైమెనెట్జ్కీ సూచించారు.

వాటర్ బాటిల్

ఫొటో సోర్స్, Getty Images

వాటర్ బాటిల్‌ను సులభంగా శుభ్రం చేయడం ఎలా?

"మీరు దానిని ఉపయోగించిన ప్రతిసారీ కడగడం ఉత్తమం" అని లిన్స్ సూచిస్తున్నారు.

"మీరు ప్రతిరోజూ ఇంటికి వచ్చిన తర్వాత, రోజుకు ఒకసారి శుభ్రం చేస్తే సరిపోతుంది" అని జార్జ్ చెప్పారు.

బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడానికి, మీరు ఆహార పాత్రలను కడగడానికి ఉపయోగించే అదే సబ్బు, నీటిని ఉపయోగించాలని చెబుతున్నారు.

"సూక్ష్మజీవులను తొలగించడానికి బ్రష్‌లను ఉపయోగించడం కూడా చాలాముఖ్యం"అని జార్జ్ చెప్పారు. శుభ్రం చేశాక తాగునీటిని మళ్లీ నింపే ముందు కాసేపు ఆరనివ్వడం కూడా మంచిదని అంటున్నారు.

సీసాలను ఇతరులతో పంచుకోవద్దని (ప్రతి వ్యక్తికి వారి సొంత బాటిల్ ఉండాలి) పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలు వంటి ఇతర ద్రవాలతో బాటిల్‌ను నింపవద్దని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు (అటువంటి ద్రవాలలో సూక్ష్మజీవుల కాలనీలను ప్రేరేపించే పోషకాలు ఉంటాయి).

అల్యూమినియంతో తయారు చేసిన బాటిళ్ల కంటే గాజు సీసాలలో సూక్ష్మజీవులు తక్కువగా ఉన్నాయని పర్డ్యూ యూనివర్సిటీ అధ్యయనం కనుగొంది.

అదే సమయంలో "అది గాజు లేదా అల్యూమినియం అయినా, శుభ్రం చేయడానికి సులభమైన సీసాలు కొనండి. అదే కీలకం," అని లిన్స్ సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, టాయిలెట్ సీటు కంటే బాటిల్‌లో 40 వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)