చంద్రబాబు క్యాబినెట్‌లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..

ఫొటో సోర్స్, Telugu Desam Party (TDP)
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ముఖ్యమంత్రితోపాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎన్డీయే లెజిస్లేచర్ పార్టీ నాయకుడు చంద్రబాబు విడుదల చేశారు.
మంత్రుల జాబితా ఇదే..
- కొణిదెల పవన్ కల్యాణ్
- నారా లోకేశ్
- కింజరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్

ఫొటో సోర్స్, Telugu Desam Party (TDP)
- పొంగూరు నారాయణ
- అనిత వంగలపూడి
- సత్యకుమార్ యాదవ్
- డాక్టర్ నిమ్మల రామానాయుడు
- ఎన్‌ఎండీ ఫరూఖ్
- ఆనం రామనారాయణ రెడ్డి
- పయ్యావుల కేశవ్

ఫొటో సోర్స్, Anitha Vangalapudi
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారథి
- డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవికుమార్
- కందుల దుర్గేష్
- గుమ్మడి సంధ్యారాణి
- బీసీ జనార్థన రెడ్డి
- టీ.జీ. భరత్
- ఎస్. సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/kanduladurgesh.official
పవన్‌తోపాటు దుర్గేష్
పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పదవి కన్నా ముందుగా ఆయన మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం పొందారు.
ఈసారి జనసేన నుంచి పలువురు సీనియర్లు గెలిచారు. వారిలో కొణతాల, మండలి బుద్ద ప్రసాద్ వంటి వారు కూడా మంత్రి పదవులు ఆశించారు. అయినప్పటికీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వెంట కందుల దుర్గేష్‌కు ఛాన్స్ వచ్చింది.
నిడదవోలు నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గతంలో శాసనమండలి సభ్యుడిగా వ్యవహరించారు. ఈసారి ఆయన రాజమహేంద్రవరం రూరల్ సీటు ఆశించినప్పటికీ చివరి నిమిషంలో నిడదవోలు నుంచి బరిలోకి దిగి గెలిచారు. జనసేన తరపున మంత్రివర్గంలో చోటు దక్కిన ముగ్గురిలో దుర్గేష్ ఒకరు.
తొలిసారి మంత్రులు 17 మంది
చంద్రబాబు కేబినెట్లో సీనియర్ల కన్నా కొత్తతరానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తం 25 మందిలో 17 మంది తొలిసారి మంత్రులు కాబోతున్నారు. అందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (పిఠాపురం) సహా తొమ్మిది మంది మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టిన వారే.
పార్టీల వారీగా చూస్తే టీడీపీ తరపున 20 మందికి మంత్రులుగా అవకాశం వచ్చింది. జనసేన నుంచి ముగ్గురు మంత్రులు కాబోతున్నారు. వారిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో పాటుగా కందుల దుర్గేష్ ఉన్నారు.
బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించారు.
మొత్తంగా సీఎంతో కలిపి ఓసీలు 13 మంది ఉండగా, బీసీలు 8, ఎస్సీ 2, ఎస్టీ 1, మైనార్టీ ఒకరికి చోటు దక్కింది.
గతంలోనూ మంత్రులుగా...
ప్రస్తుత కేబినెట్‌లో చోటు దక్కించుకున్న నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి. నారాయణ, 2014 చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు.
2014-19 మధ్య పి. నారాయణ కీలక మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఎమ్మెల్సీగా మండలి నుంచి ఆయన ప్రాతినిథ్యం వహించారు. తొలిసారి 2019లో నెల్లూరు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.
ఈసారి అదే నెల్లూరు సిటీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవీ పొందారు.
కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లాకేంద్రం మచిలీపట్నం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో చంద్రబాబు కేబినెట్‌లో రవీంద్ర బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖలు నిర్వహించారు.
నారా లోకేష్ తొలుత శాసన మండలి నుంచి ప్రాతినిథ్యం వహించి, 2017లో మంత్రివర్గ విస్తరణ సమయంలో కేబినెట్‌లో చేరారు. కానీ తొలిసారి 2019లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024లోనూ ఇదే నియోజక వర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు.
ఎన్‌ఎండీ ఫరూఖ్ కూడా ఒకనాటి చంద్రబాబు మంత్రివర్గ సహచరుడే. ఆయన ఎమ్మెల్సీగా ఉండగా 2018లో మంత్రివర్గంలో చేర్చుకున్నారు.
2004కి పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫరూక్ మంత్రివర్గంలో ఉన్నారు.
వివిధ సీఎంల వద్ద..
ప్రస్తుత ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొందరికి గతంలో వివిధ ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉంది. వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి వంటివారు ఉన్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి ఎన్టీఆర్, వైఎస్. రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఈసారి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలిచారు.
పార్థ సారధి ఎన్నికల ముందు టీడీపీలో చేరి నూజివీడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా గతంలో మంత్రిగా వివిధ కీలక శాఖలు నిర్వహించారు.
తెనాలి నుంచి గెలిచిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా గతంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా ఉమ్మడి రాష్ట్ర చివరి సభకు పనిచేశారు.
2014లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత జనసేనలో చేరి ఆ పార్టీ వ్యవహారాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈసారి తెనాలి నుంచి భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి మంత్రి పదవి అందుకుంటున్నారు.
ఎదురుచూపులకు ఫలితం
దీర్ఘకాలంగా మంత్రిపదవుల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈసారి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అలాంటివారిలో పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, వంగలపూడి అనిత, డోలా వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు వంటి వారున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన పయ్యావుల కేశవ్ అక్కడి నుంచి గెలిస్తే పార్టీ అధికారానికి దూరమవుతుందనే సెంటిమెంట్ ఉండేది. ఈసారి అది తుడిచిపెట్టుకుపోయింది. అటు పార్టీ అధికారంలోకి రావడంతోపాటు ఆయనకు మంత్రిపదవి కూడా దక్కింది.
గొట్టిపాటి రవి అద్దంకి నుంచి ఇప్పటి వరకు మూడు పార్టీల తరుపున గెలిచిన నాయకుడు. పార్టీలు మారినా ప్రజల ఆదరణ పొందడం ద్వారా తన పట్టు నిలుపుకుంటున్నారు. ఇప్పుడు మంత్రిపదవి పొందారు.
నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉండగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కీలక పాత్ర పోషించారు.
వంగలపూడి అనిత టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2014లో పాయకరావుపేట నుంచి గెలిచిన ఆమెను 2019లో కొవ్వూరు నుంచి బరిలో దింపారు. కానీ ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ సొంత నియోజకవర్గం పాయకరావుపేట నుంచి గెలిచి ఆమె చంద్రబాబు కేబినెట్ కూర్పులో ఛాన్స్ పొందారు.
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న డోలా వీరాంజనేయ స్వామికి కూడా ఈసారి చోటు దక్కింది.
కర్నూలు జిల్లా బనగానపల్లె నుంచి రెండోసారి గెలిచిన బీసీ జనార్థన్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు లభించింది.
తొలిసారి విజేతలకు కూడా..
ఏపీ కొత్త మంత్రివర్గంలో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఎస్. సవిత ఉన్నారు.
మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తొలిసారి గెలవడంతోపాటు మంత్రి వర్గంలోనూ చోటు పొందారు.
ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అవకాశం పొందారు. ఈసారి శాసనసభకు గెలిచిన ఏకైక కురుబ నాయకురాలు ఆమె.
అమలాపురం పట్టణానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. రామచంద్రాపురం నుంచి విజయం సాధించి, మంత్రివర్గంలో చోటు పొందారు.
టీజీ భరత్ తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2019లో ఓడిపోయారు. ఈసారి భారీ విజయం నమోదు చేసి మంత్రి వర్గంలో చోటు పొందారు.
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. మంత్రివర్గంలోనూ బెర్త్ పొందారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ ఈసారి పార్లమెంట్ సీటు ఆశించారు. కానీ ఆయనకు ఆఖరి నిమిషంలో ధర్మవరం అసెంబ్లీ సీటు దక్కింది. బీజేపీ కోటాలో కేవలం ఒక్కరికే ఛాన్స్ దక్కగా అందులో సత్యకుమార్ ఉండడం విశేషం.
అల్లూరి జిల్లా సాలూరు నుంచి గెలిచిన గుమ్మడి సంధ్యారాణి కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఈసారి ఎస్టీ రిజర్వుడు సీట్లలో మూడు చోట్ల టీడీపీ గెలిచింది. ముగ్గురూ మహిళా నేతలే. ఈ ముగ్గురిలో అనుభవం ఉన్న సంధ్యారాణి వైపు అధిష్టానం మొగ్గు చూపింది. దాంతో ఆమె కూడా తొలిసారి మంత్రి అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?
- రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, కిషన్ రెడ్డికి గనులు-బొగ్గు శాఖ.. మోదీ మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ అంటే
- సైబర్ సెక్స్ వర్కర్: పోర్న్ ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
- పెమ్మసాని చంద్రశేఖర్: పోటీ చేసిన తొలిసారే గెలిచి కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న డాక్టర్
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి: కనిపించని ప్రవాహంలో కొట్టుకుపోయిన కెరటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















