కేఏ పాల్, లక్ష్మీనారాయణలకు ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎన్నికల్లో చిన్న పార్టీల ప్రభావమెంత?

ఫొటో సోర్స్, facebook
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, కేఏ పాల్, రామచంద్ర యాదవ్, జడ శ్రవణ్ కుమార్ వంటి వారు పోటీ చేశారు.
జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించిన వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశాఖపట్నం పార్లమెంట్, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచారు.
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పుంగనూరుతో పాటు మంగళగిరి నుంచి పోటీ చేశారు.
జైభీమ్‌రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.


ఫొటో సోర్స్, Dr KA Paul/facebook
కేఏ పాల్ ఓట్లు రెట్టింపు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు.
నరసాపురం ఎంపీ స్థానంలో ఆయనకు 3,018 (0.26 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన డిపాజిట్ కోల్పోయారు. నరసాపురం అసెంబ్లీ స్థానంలో 281 (0.21 శాతం) ఓట్లు వచ్చాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి బరిలో దిగిన ఆయనకు 1,700 ఓట్లు పడ్డాయి.
టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు.
విశాఖపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన ఆయనకు 7,696 (0.55శాతం) ఓట్లు వచ్చాయి.

జేడీ ప్రభావం అంతంత మాత్రమే..
సీబీఐ అధికారిగా ఉంటూ, వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వీవీ లక్ష్మీనారాయణ తొలుత జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా బరిలో దిగారు.
అప్పట్లో ఆయన ఓటమి పాలయినప్పటికీ గణనీయంగా ఓట్లు సాధించారు. 23.3% శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 2,88,874 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన జనసేనకు దూరమయ్యారు.
2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సొంతంగా పార్టీ స్థాపించారు. జైభారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన రిజిస్టర్ చేసి తనతో పాటుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపారు.
ఈసారి కూడా ఆయన విశాఖ నగరంలోనే పోటీ చేశారు. అయితే, పార్లమెంట్‌కి బదులుగా విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించగా, రెండో స్థానంలో వైఎస్సార్సీపీ, మూడో స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి.
వీవీ లక్ష్మీనారాయణకు 5,160 ఓట్లు వచ్చాయి. ఆయనతో పాటు ఆ పార్టీ తరుపున పోటీ చేసిన ఇతర అభ్యర్థులు కూడా రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు.

ఫొటో సోర్స్, Bode Ramachandra Yadav/facebook
బీసీవైపీ కూడా అంతే...
బోడే రామచంద్రయాదవ్ 2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 16,452 (8.4శాతం) ఓట్లు లభించాయి.
ఆ తరువాత సొంత పార్టీ బీసీవైపీని స్థాపించారు. 2024 ఎన్నికల్లో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను బరిలో దించారు. పుంగనూరు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో ఆయన పోటీ చేశారు.
పుంగనూరులో మూడో స్థానంలో నిలిచిన ఆయనకు, 4,559 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలిచారు.
మంగళగిరిలో 373 ఓట్లు పడ్డాయి. ఇక్కడ నారా లోకేశ్ గెలిచారు.

ఫొటో సోర్స్, facebook
న్యాయవాది జడ శ్రవణ్
జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్‌కు రాష్ట్రవ్యాప్తంగా అడ్వకేట్‌గానూ, సామాజిక అంశాలపై స్పందించే ఉద్యమ నేతగానూ గుర్తింపు ఉంది.
జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ కుమార్, మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆయనకు కేవలం 416 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB
బరిలో తొలిసారి షర్మిల..
ఇక ఈ ఎన్నికల్లో జనసేన కూడా రిజిస్టర్డ్ పార్టీగానే పోటీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కల్యాణ్, 2019లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు.
ఈసారి పిఠాపురం నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
పిఠాపురంలో ఆయనకు 1,34,394 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతను 70,279 ఓట్ల తేడాతో ఓడించారు.
రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీలో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కడప పార్లమెంట్‌కి పోటీ చేశారు. కానీ, ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యారు.
వైఎస్ షర్మిల ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఆమెకు 10.67 శాతం ఓట్లు వచ్చాయి. ఆమెకు 1,41,039 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/DAGGUBATI PURANDESWARI
కొన్ని ఆసక్తికర స్థానాలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుసగా ఎనిమిదోసారి కుప్పం నుంచి గెలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ మీద 48,006 ఓట్ల మెజార్టీ దక్కింది.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచారు. ఈసారి ఆయనకు గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గింది. ఈసారి ఆయనకు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 61,687 ఓట్ల ఆధిక్యం దక్కింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటులో పోటీ చేశారు.
2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి గెలిచిన ఆమెకు 2014లో రాజంపేట, 2019లో విశాఖలో ఓటమి ఎదురయ్యింది.
ఈసారి మరో కొత్త నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఆమెకు తన సమీప వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పై 2,39,131 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- ఎన్నికల్లో మోదీ బలం తగ్గడాన్ని పొరుగు దేశాలు, అమెరికా ఎలా చూస్తాయి?
- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ వ్యూహం ఎలా ఫలించింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















