తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన ఇన్నేళ్ళలో మొదటిసారి లోక్ సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పార్లమెంటు దిగువ సభకు వరుసగా 2004 నుంచీ ఎన్నికవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.

ఒకప్పుడు పార్లమెంటులో ఇద్దరు ఎంపీలే ఉన్నప్పటికీ తెలంగాణ కోసం సభను స్తంభింపజేసే స్థాయిలో పోరాటం చేసిన పార్టీ ఇక ఐదేళ్ల పాటు ఆ సభలో కనిపించే అవకాశం లేదు.

పార్టీ పెట్టిన తరువాత మొదటిసారి 2004లో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో లోక్‌సభకు పోటీ చేసి 5 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

అప్పట్లో టీఆర్ఎస్‌ (ప్రస్తుతం బీఆర్ఎస్) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని యూపీఏ భాగస్వామిగా ఉంది.

కొంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఆ పార్టీ చేరింది.

తిరిగి 2009లో తెలుగుదేశం, బీజేపీలతో కలసి ఎన్డీయేలో చేరింది. ఆ ఎన్నికల్లో 2 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది టీఆర్ఎస్.

తరువాత 2014 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసింది. ఏ పొత్తూ లేకుండా తెలంగాణలోని 17 స్థానాల్లో 11 స్థానాలను గెలుచుకుంది.

తిరిగి 2019లో లోక్ సభ ఎన్నికల్లో కూడా సొంతంగా పొత్తుల్లేకుండా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకుంది.

తాజా ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కేసీఆర్

ఫొటో సోర్స్, Twitter/BRS Party

ముందే ఆశ వదులుకున్నారా?

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన పద్ధతి, అభ్యర్థులు ప్రచారం చేసిన తీరు, కేసీఆర్-కేటీఆర్‌లు ప్రచారంలో పాల్గొన్న విధానం చూస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికల విషయంలో ఆ పార్టీ గతంలో మాదిరిగా చురుకుగా పని చేయలేదని చెబుతున్నారు విశ్లేషకులు.

అప్పటికే శాసన సభ ఎన్నికల్లో వారు ఓడిపోయి ఉండడంతో, లోక్‌సభలో కూడా తమకు అనుకూలంగా వాతావరణం లేదని గ్రహించిన బీఆర్ఎస్ ముందే కాడి వదిలేసిందని వారి అభిప్రాయం. అయితే ఆ వాదనతో బీఆర్ఎస్ ఏకీభవించడం లేదు.

ఈ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించిన అంశాలు కాకుండా, జాతీయ అంశాలు ఎజెండా కావడం వల్లే తమ పార్టీ నష్టపోయిందని బీఆర్ఎస్ అంటోంది.

కొందరు నాయకులు అకస్మాత్తుగా పార్టీలు మారడం కూడా తమకు నష్టం చేసిందని వారు చెబుతున్నారు.

‘‘ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి మాట్లాడినట్టే, కేసీఆర్ తనను కలిసి పిల్లలకు ఆశీర్వాదం కోరారని చెప్పడం ద్వారా తెలంగాణలో మోదీ మాకు చాలా నష్టం చేశారు. రెండు జాతీయ పార్టీలూ కలిసి తెలంగాణ ఎజెండా ఎన్నికల అంశం కాకుండా, ఒక నేషనల్ నెరేటివ్‌ను ముందు పెట్టడంలో సఫలమయ్యాయి.

ఉదాహరణకు ముస్లిం రిజర్వేషన్లు, మందిరం, కశ్మీర్ ఇలాంటి అంశాల చుట్టూ ఎన్నికలు తిప్పారు. ఇక నీళ్లు, కరెంటు వంటి ఎజెండాలే లేకుండా పోయాయి. అలాగే బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులు, దాదాపు ఏడుగురు పార్టీలు ఫిరాయించి అకస్మాత్తుగా జాతీయ పార్టీలకు వెళ్లిపోయారు. ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. కానీ ఆ ఏడుగురూ ఓడిపోయారు.’’ అని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ బీబీసీతో అన్నారు.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Twitter@revanth_anumula

ఫొటో క్యాప్షన్, రేవంత్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను కట్టడి చేయడంలో సీఎం రేవంత్ సఫలం అయ్యారని చెబుతున్నారు మరికొందరు విశ్లేషకులు. ఇదే సమయంలో బీఆర్ఎస్ స్వయంగా చేసిన తప్పులు కూడా ఉన్నాయనేది వారి మాట.

‘‘ఇది ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీ స్వయంకృతం అని అనవచ్చు. కాస్త రాజకీయ పరిపక్వతతో ప్రజాస్వామికంగా బీఆర్ఎస్ వ్యవహరించి ఉంటే, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిన తరువాత, ముఖ్యమంత్రి రేవంత్ తన వ్యూహంతో ప్రజల్లో బీఆర్ఎస్ వ్యూహం కోల్పోయేలా చేశారు.

అవినీతి అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు. మేడిగడ్డ, కవిత అరెస్టులు ఆ వాదన బలం పెంచాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ వంటి కేసును ఒక నెల రోజుల పాటూ పత్రికల్లో లీకులు ఇస్తూ, చర్చలో ఉంచారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఓటరు, అసంతృప్తి స్థాయి దాటి, వ్యతిరేకత వచ్చే వరకూ, ఆ పార్టీని తిరస్కరించే వరకూ తీసుకెళ్లగలిగారు’’ అని బీబీసీతో అన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి.

అయితే బీజేపీ అన్ని సీట్లు గెలచుకోవడం వెనుక బీఆర్ఎస్ పరోక్ష సహకారం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందు ఆరోపించారు.

‘‘బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదిలీ చేశారు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారు.’’ అని రేవంత్ ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి సహకరించారంటూ సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన ఆరోపణను బీఆర్ఎస్ పార్టీ తప్పు పట్టింది.

‘‘కిషన్ రెడ్డి మీద పద్మారావు, సంజయ్ మీద వినోద్, ఇలా ప్రతిచోటా బలమైన నాయకులను పెట్టాం. మహబూబాబాద్, నాగర్ కర్నూలు వంటి సీట్లలో లక్షల ఓట్లు వచ్చాయి. మేం సహకరిస్తే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ 90 వేల మెజార్టీతో బయట పడేది కాదు. మహబూబాబాద్‌లో గెలిచేదీ కాదు.’’ అని బీబీసీతో అన్నారు బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్.

‘‘ రేవంత్ రెడ్డి, ఒవైసీ ఒకే స్క్రిప్టు చదువుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం ఇలా చేస్తున్నారనడం సరికాదు. ఆయన రాష్ట్రం సాధించారు. రెండుసార్లు సీఎం అయ్యారు. అంతకంటే ఏం ఆశ ఉంటుంది ఆయనకు. వాకింగ్ స్టిక్ పట్టుకుని ప్రచారానికి వెళ్లారు. ఇంత కంటే ఏం పోరాటం చేస్తాం?’’ అని అన్నారు క్రిశాంక్.

తెలంగాణ అమరవీరుల స్థూపం

ఫొటో సోర్స్, @TelanganaCMO

ప్రాంతీయ అస్తిత్వం పోతుందా?

లోక్‌సభకూ టీఆర్ఎస్ పార్టీకీ అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అవుతానన్న నమ్మకం కుదిరే వరకూ అసెంబ్లీకి రాలేదు. లోక్‌సభ సభ్యునిగానే ఉన్నారు.

ఇక దిల్లీలో ఆ పార్టీ చేసిన ఆందోళనలు, లాబీ కోసం తిరిగిన పార్టీ కార్యాలయాలు, దిల్లీలో ముచ్చటపడి కేసీఆర్ సిద్ధం చేయించుకున్న భవనాలూ.. వీటి గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు అదంతా గత వైభవం కాబోతుంది.

ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం లోక్‌సభలో లేకపోవడం తెలంగాణకు నష్టం అని బీఆర్ఎస్ చెబుతోంది.

‘‘నితీశ్, చంద్రబాబు, అఖిలేశ్...వీరంతా ఆయా కూటముల్లో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తూ వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే పాయింట్ కేసీఆర్ ముందు నుంచీ చెబుతున్నారు. మనం కింగ్ మేకర్ అయ్యేవాళ్లం అనే ఆయన అనేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో బీఆర్ఎస్‌కు వచ్చిన ఆ 9 సీట్లూ వచ్చి ఉంటే జాతీయ స్థాయిలో తెలంగాణకు ఎంత మంచి జరిగి ఉండేది’’ అని అన్నారు క్రిశాంక్.

చార్మినార్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇది పూర్తిగా తెలంగాణ ఉనికికి, అస్తిత్వానికి ఇబ్బంది కలిగించే అంశం. పదేళ్ల క్రితం ఏ సభలో ప్రకంపనలు సృష్టించి తెలంగాణ తెచ్చారో ఇప్పుడు అదే సభలో రాష్ట్ర వాదన వినిపించే వారు లేకపోవడం విషాదం.’’ అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి బీబీసీతో అన్నారు.

‘‘ అస్తిత్వం కోసం, అభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీల వల్ల లాభం ఎక్కువ. తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనాలు తెలుగుదేశం ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడే జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కనీసం ఐదు ఎంపీ స్థానాలు గెలిచినా, గౌరవం, గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ఎంపీలంతా, కాంగ్రెస్ వంద మందిలో, బీజేపీలో రెండు వందల మందిలో కొందరిగా మిగలాల్సిందే తప్ప, సొంతంగా తెలంగాణ వాణి వినిపించ లేరు.’’ అని ఘంటా చక్రపాణి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS PARTY

ముఖ్యమంత్రి అయ్యే వరకూ పదేళ్ళ పాటూ ఎంపీగానే కేసీఆర్

తెలంగాణ ఉద్యమం జరిగే కాలంలో ఉప ఎన్నికల ద్వారా ఉద్యమ వేడిని పెంచుతూ ఉండేది టీఆర్ఎస్ పార్టీ. పార్టీ సభ్యులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా జనంలో తెలంగాణ వాదం బలంగా వినిపించారు.

కేసీఆర్-టీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక ఒక మలుపు.

అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఎం.సత్యనారాయణ రావు సవాల్‌ను స్వీకరించిన కేసీఆర్, కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లి తిరిగి ఎంపీగా గెలిచారు.

ఆ ఒక్క లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుందన్నంతగా జరిగింది. అప్పట్లో ఆంధ్రలో రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి కారణం అయిన ఎన్నిక అంటారు అప్పటి రాజకీయాలను దగ్గరగా గమనించిన వాళ్లు.

దక్షిణ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ అంశం లేదన్న వాదన వచ్చినప్పుడు దాన్ని ఖండించడానికి మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు కేసీఆర్.

ఇలా తెలంగాణ వాదానికి పరీక్ష ఎదురైన ప్రతిసారీ కేసీఆర్ ఎంచుకున్న మార్గాల్లో లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవి.

చివరగా ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఎదగడానికి కేసీఆర్ పునాదులు వేసుకుంటున్న తరుణంలో ఆయన పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

ప్రస్తుతానికి ఆ పార్టీ కేవలం రాజ్యసభ సభ్యత్వానికి పరిమితం కాబోతుంది. రాజ్యసభలో వాస్తవానికి బీఆర్ఎస్‌కు ఐదుగురు సభ్యుల బలం ఉండగా, అందులో కే కేశవరావు ఇటీవలే కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. ఇక మొత్తం నలుగురు ఎంపీలు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)