ఈ ప్రముఖ నాయకులు సొంత నియోజకవర్గంలో కాకుండా ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు పోటీ చేశారు?

ఎన్టీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, నేదురమల్లి జనార్థన్ రెడ్డి.. ఈ ముగ్గురూ తమ సొంత నియోజకవర్గాల నుంచి కాకుండా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల బరిలోకి దిగారు.

అలాగే ఎన్జీ రంగా (గోగినేని రంగనాయకులు) వంటి స్వాతంత్య్ర సమరయోధులు, రైతు ఉద్యమ నాయకులు కూడా శ్రీకాకుళం నుంచే పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు.

ఒక ఉప ఎన్నికలో లక్ష్మీపార్వతిని ఓడించేందుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మంత్రి వర్గ సభ్యులు కూడా ఎంతో శ్రమించారు.

బాపట్లలో సీటు కుదరకపోతే పురందేశ్వరి కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగారు. వీరే కాదు 1952 నుంచి 2024 వరకు అనేక మంది ప్రముఖులు తమ రాజకీయ వేదికగా ఉత్తరాంధ్రనే ఎంచుకున్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు

ఫొటో సోర్స్, RAJYASABHA

ఫొటో క్యాప్షన్, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు

ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి..

1952లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రకాశం పంతులు అక్కడ ఓడిపోయారు.

అయితే, ఏడాది తర్వాత ఆంధ్ర రాష్ట్రంకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఆ సమయానికి ఆయన ఇంకా ఎమ్మెల్యే కాలేదు. ఆ తర్వాత ఆయన ఉత్తరాంధ్రలోని ఎస్. కోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

అప్పుడు అసలు ఏం జరిగిందో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సీటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జీ. లీలా వరప్రసాద్ బీబీసీకి వివరించారు.

''1952లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. అప్పుడు మన ప్రాంతమంతా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగంగానే ఉండేది.1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలను ఆంధ్రాకు పంపించారు. అప్పుడు పార్టీలపరంగా లెక్కలు చూస్తే కాంగ్రెస్‌కు 41, కమ్యూనిస్టులకు 39, టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలోని ప్రజా పార్టీకి 20 సీట్లు వచ్చాయి. అలాగే సోషలిస్ట్ పార్టీకి 20, ఇంకా గౌతు లచ్చన్న, ఎన్జీరంగా నేతృత్వంలోని కృషికార్ లోక్ పార్టీకి 12 సీట్లు వచ్చాయి'' అని డాక్టర్ లీలా వరప్రసాద్ చెప్పారు.

''ఆ సమయంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలని చర్చించినపుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మద్దతివ్వడానికి ఏకాభిప్రాయం రాలేదు.

అయితే, టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజా పార్టీకి మాత్రం కాంగ్రెస్, కృషికార్ లోక్ పార్టీ, సోషలిస్ట్, కమ్యూనిస్టులు మద్దతిచ్చాయి. దాంతో ప్రకాశం పంతులును ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.

కానీ, 1952లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాస్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే 1953లో ముఖ్యమంత్రిగా ప్రకటించిన నాటికి ఆయన ఇంకా ఎమ్మెల్యే కాదు.

అప్పుడు విశాఖపట్నం పరిధిలో ఉన్న ఎస్. కోట నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోషలిస్టు పార్టీకి చెందిన చాగంటి వెంకట సోమయాజులు ఉన్నారు. ఆయన స్వచ్చందంగా రాజీనామా చేసి ప్రకాశం పంతులును అక్కడి నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు. ప్రకాశం పంతులు ఎస్. కోట నుంచి పోటీకి నిలబడగా, ఇతర పార్టీల వారు ఆయనపై గౌరవంతో తమ అభ్యర్థులను నిలపలేదు. దాంతో ఆయన ఎస్. కోట నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు” అని డాక్టర్ లీలా వరప్రసాద్ వివరించారు.

ఎన్జీరంగా

ఫొటో సోర్స్, Tripurana Venkataratnam

ఫొటో క్యాప్షన్, ఎన్జీరంగా

శిష్యుడి రాజీనామాతో ఎంపీ అయిన ఎన్జీ రంగా

స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నాయకుడైన ఎన్జీ రంగా 1967 ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే, ఆయన శిష్యుడైన గౌతు లచ్చన్న ఆయనను శ్రీకాకుళం ఎంపీగా గెలిపించుకున్నారు.

ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే త్రిపురాన వెంకటరత్నం బీబీసీతో చెప్పారు.

‘‘1967 ఎన్నికల్లో ఎన్జీ రంగా బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అదే ఎన్నికల్లో ఆయన శిష్యుడిగా పేరు పొందిన శ్రీకాకుళానికి చెందిన గౌతు లచ్చన్న శ్రీకాకుళం ఎంపీగా, సోంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. మేధావైన ఎన్జీ రంగా వంటి వారు పార్లమెంట్‌కు వెళ్తే దేశానికి ఉపయోగమని భావించి, గౌతు లచ్చన్న శ్రీకాకుళం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో శ్రీకాకుళం ఎంపీగా ఎన్జీ రంగా పోటీ చేసి గెలుపొందారు.

రైతు ఉద్యమాలు, రైతు సమస్యలపై పోరాటం చేసే ఎన్జీ రంగా గారికి శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ మద్ధతుగానే నిలిచింది. ఎన్జీ రంగా గెలిచిన ఎన్నికలో నేను కూడా ఆయన తరపున ప్రచారం చేశాను” అని త్రిపురాన వెంకటరత్నం అన్నారు.

ఎన్టీఆర్
ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్ టెక్కలి పర్యటనపై అప్పటి పత్రికల్లో ప్రచురితమైన వార్త

టెక్కలి నుంచి గెలిచి ముఖ్యమంత్రైన ఎన్టీఆర్

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు కూడా ఉత్తరాంధ్రలోని టెక్కలి నుంచి ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. ఆయనకు టెక్కలితో ప్రత్యేక అనుబంధం ఉంది.

1995లో ''ప్రజల వద్దకు ప్రభుత్వం" అంటూ టెక్కలిలో ప్రజా సదస్సు నిర్వహించారు. 1994 టెక్కలి నియోజకవర్గం ఎన్నిక విషయాలను శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు పీవీ రమణ బీబీసీతో పంచుకున్నారు.

‘‘1994లో అప్పటి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దువ్వాడ నాగావళితో పాటు ఆ పార్టీ నాయకులైన హనుమంతు అప్పయ్యదొర, బమ్మిడి నారాయణస్వామి, ఎల్ఎల్ నాయుడు, చాపర గణపతి, మళ్ల సూర్యం తదితరులు టెక్కలి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రూపులకు అవకాశం ఇవ్వకుండా, అప్పటికే టీడీపీకి కంచుకోటైన శ్రీకాకుళం జిల్లాను చేజిక్కించుకోవాలని అనూహ్యంగా ఎన్టీఆర్ టెక్కలిలో నామినేషన్ వేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాబూరావుపై 40,890 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

1952లో మొదలైన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకు జిల్లాలో శాసనసభ ఎన్నికల్లో వచ్చిన అత్యధిక మెజార్టీ ఇదే. 1994 నవంబర్ 8వ తేదీన టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి‌గా నామినేషన్ వేసి, గెలుపొందిన ఎన్టీఆర్ 1994 డిసెంబరు 12న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు’’ అని చెప్పారు.

ఎన్టీఆర్‌తో లక్ష్మీపార్వతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్‌తో లక్ష్మీపార్వతి

గెలిచిన లక్ష్మీపార్వతి

1994లో ఎన్టీఆర్ టెక్కలి నుంచి పోటీ చేసిన తర్వాత 1996 అక్టోబరులో ఈ జిల్లాలోని మరో నియోజకవర్గం పాతపట్నంలో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ తరపున పోటి చేశారు.

1996 జనవరిలో ఎన్టీఆర్ మరణించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీపార్వతి ‘ఎన్టీఆర్ టీడీపీ’ పేరుతో పార్టీ పెట్టారు. అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయాయి.

అయితే 1994 ఎన్నికల్లో పాతపట్నంలో గెలిచిన టీడీపీ అభ్యర్థి కలమట మోహనరావు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో దేవుడి ఫోటోలను వాడారని, ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమంటూ ఈసీ ఆయన ఎన్నికను రద్దు చేసింది. ఈ సందర్భంగా పాతపట్నంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

పాతపట్నం ఉప ఎన్నికలో లక్ష్మీపార్వతి ఆమె పార్టీ అయిన ఎన్టీఆర్ టీడీపీ నుంచి బరిలోకి దిగి, గెలిచారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1999 శాసనసభ ఎన్నికలలో ఆమె సోంపేట, ఏలూరు రెండూ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు” అని సీనియర్ జర్నలిస్ట్ శాస్త్రి చెప్పారు.

పాతపట్నం ఉప ఎన్నిక (1996)కు ముందు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ శ్రీకాకుళం ఎంపీగా బరిలో దిగి, టీడీపీ అభ్యర్థి ఎర్రంనాయుడు చేతిలో ఓడిపోయారు.

పురందేశ్వరి

ఫొటో సోర్స్, FACEBOOK/DAGGUBATI PURANDESWARI

ఫొటో క్యాప్షన్, బాపట్లలో టిక్కెట్ లభించకపోవడంతో విశాఖ నుంచి పురందేశ్వరి ఎంపీగా పోటీ చేశారు.

అల్లు అరవింద్, పురందేశ్వరి, విజయమ్మ కూడా...

వీరే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి అనేకమంది ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు మంత్రులు కూడా అయ్యారు.

1989లో నిర్వహించిన ఎన్నికల్లో కేరళలో పుట్టి, విజయనగరం రాజ కుటుంబానికి కోడలుగా వచ్చిన ఆనందగజపతి రాజు భార్య ఉమాగజపతి (కాంగ్రెస్) విశాఖ ఎంపీగా గెలుపొందారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్.జనార్దన రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఈయన మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేయడం విశేషం.

2009 ఎన్నికల్లో ఎంవీవీఎస్ మూర్తి (టీడీపీ)పై దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్) గెలుపొందారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. బాపట్లలో పురందేశ్వరికి టిక్కెట్ లభించకపోవడంతో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున అల్లు అరవింద్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి సబ్బంహరి చేతిలో ఓడిపోయారు.

2014లో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ బీజేపీ పార్టీ తరపున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దాదాపు ప్రతి ఎన్నికలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ ప్రముఖులు బరిలో నిలవడం పరిపాటిగా మారింది.

యుగంధర్ రెడ్డి

ఉత్తరాంధ్రలో ఆదరించే గుణముంది: ఎం. యుగంధర్ రెడ్డి

ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో పోటీ చేసే అనేక మంది బీ ఫారం తీసుకుని నేరుగా వచ్చేసి, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంపీలుగా బరిలో దిగుతుంటారని రాజకీయ విశ్లేషకుడు ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

“బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా ఆదరించే గుణం ఉత్తరాంధ్రలో ఉంది. కాబట్టే బాపట్ల సీటు లభించకపోవడంతో విశాఖపట్నం నుంచి పురంధరేశ్వరి పోటీ చేశారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి గారు ఎప్పుడు ఊహించి ఉండరు. నెల్లూరులో కుదరక విశాఖ వచ్చారు. ఈ ప్రాంతానికి బాగా పేరు, హోదా ఉన్నవారు వస్తుండటంతో ఇక్కడి ప్రజలు కూడా వీరిని నమ్ముతుంటారు. వీరు ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవారని అనుకుంటారు. జస్ట్ భీఫారాలు పట్టుకుని నేరుగా వచ్చి, పోటీ చేసి గెలుపొందుతున్నవారే ఇక్కడ ఎక్కువ” అని యుగంధర్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)