ఆంధ్రప్రదేశ్: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?

ఫొటో సోర్స్, FB/YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయింది.
మొత్తం 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.
తెలుగుదేశం-జనసేన-బీజేపీల కూటమి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 135 సీట్లు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 నియోజకవర్గాల్లో విజయం సాధించాయి.
వైసీపీ కొత్త ఎమ్మెల్యేలు ఎవరు?
ఈ ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ తరఫున పార్టీ అధినేత జగన్ (పులివెందుల)తో పాటు ఆర్. మత్యలింగం (అరకు), ఎం. విశ్వేశ్వర రాజు (పాడేరు), టి. చంద్రశేఖర్ (ఎర్రగొండపాలెం), బి. శివ ప్రసాద్ రెడ్డి (దర్శి), దాసరి సుధ (బద్వేల్), ఎ. అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), వై. బాలనాగి రెడ్డి (మంత్రాలయం), బి. విరూపాక్షి (ఆలూరు), పి. ద్వారకనాథ రెడ్డి (తంబళ్లపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు) విజయం సాధించారు.
వీరంతా ఎంత మెజారిటీతో గెలిచారు? వారి సమీప ప్రత్యర్థులెవరో ఇక్కడ చూద్దాం.


1. పులివెందులలో వైఎస్ జగన్ ఎంత మెజార్టీ సాధించారు?
పులివెందులలో వైఎస్. జగన్ 61, 687 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఆయన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 54,628 ఓట్లు వచ్చాయి.
జగన్‌కు మొత్తం 1,16,315 ఓట్లు పడినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అంటే ఇక్కడ ఆయనకు 61.38 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధ్రువ కుమార్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
2019లో జగన్‌కు 90 వేలు, 2014లో 75 వేల మెజార్టీ వచ్చింది.
పులివెందులలో టీడీపీ ఓట్లు 2019తో పోలిస్తే సుమారు 22 వేలు, 2014తో పోలిస్తే 14 వేలు పెరిగాయి.

ఫొటో సోర్స్, FB/REGAM MATYALINGAM
2. అరకు: రేగం మత్యలింగం
అరకులో వైసీపీ అభ్యర్థి రేగం మత్యలింగం 31,877 ఓట్ల మెజార్టీతో బీజేపీ నాయకుడు పాంగి రాజారావుపై గెలుపొందారు. జగన్ తరువాత ఈయనదే అత్యధిక మెజార్టీ.
మత్యలింగంకు ఓవరాల్‌గా 65,658 ఓట్లు రాగా, రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్థి వంథల రమణ 13,555 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
2014లో ఇక్కడ వైసీపీకి 34 వేల ఓట్ల మెజార్టీ రాగా, 2019లో 25,441 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు సుమారు 7 వేల మెజార్టీ పెరిగింది.
వైసీపీకి ఓట్ల సంఖ్య కూడా 2014, 2019ల కంటే కాస్త పెరిగింది.

ఫొటో సోర్స్, FB/MATSYARASA VISWESWARA RAJU
3. పాడేరు: ఎం. విశ్వేశ్వర రాజు
పాడేరులో 68, 170 ఓట్లు సాధించిన వైసీపీ అభ్యర్థి ఎం. విశ్వేశ్వర రాజు విజయం సాధించారు.
ఇది ఎస్టీ రిజర్వుడు సీటు. ఇక్కడ ఆయనకు 19, 338 ఓట్ల మెజారిటీ దక్కింది.
తెలుగు దేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వరీ ఓడిపోయారు.
ఇక్కడ ఆసక్తికరంగా వంతల సుబ్బారావు అనే స్వతంత్ర్య అభ్యర్థి 15935 ఓట్లు, కాంగ్రెస్ నుంచి సాతక బుల్లిబాబు 13566 ఓట్లు చీల్చారు.
బీఎస్పీ 2673 ఓట్లు చీల్చగా, వెయ్యికి పైగా ఓట్లు తెచ్చుకున్న ఇండిపెండెంట్లు అయిదుగురు ఉన్నారు.
సుబ్బారావు, కాంగ్రెస్ కలిపితే వైఎస్సార్సీ మెజార్టీ కంటే ఎక్కువ. నోటాకు 1420 ఓట్లు వచ్చాయి. 2019 లో వైయస్సార్సీపీకి 42 వేలు, 2014 లో 26 వేల ఓట్లు మెజార్టీ వచ్చింది.జగన్ తరువాత మూడవ అత్యధిక మెజార్టీ ఇది.

ఫొటో సోర్స్, FB/Tatiparthi Chandra Sekhar
4. ఎర్రగొండపాలెం: టి. చంద్రశేఖర్
ఇది ఎస్సీ రిజర్వుడు సీటు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి టి. చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రాష్ట్ర మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ను కాకుండా ఇక్కడ కొత్త అభ్యర్థి చంద్రశేఖర్‌కు వైసీపీ అవకాశం ఇచ్చింది. తెలుగు దేశం పార్టీ కూడా మొదటిసారిగా గూడూరి ఎరిక్సన్ బాబును బరిలో నిలిచింది.
చంద్రశేఖర్‌కు 91,741 ఓట్లు పడ్డాయి. ఆయన సమీప పత్యర్థి, టీడీపీ నేత గూడూరి ఎరిక్సన్ బాబు ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది.
2019లో ఇక్కడ వైఎస్సార్సీపీకి 31 వేలు, 2014లో 19 వేలు మెజార్టీ వచ్చింది.

ఫొటో సోర్స్, FB/Buchepalli Sivaprasad Reddy
5. దర్శి: శివ ప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేత బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి స్వల్ప మెజారిటీ గెలిచారు.
ఆయనకు 2,456 ఓట్ల మెజారిటీ దక్కింది.
శివ ప్రసాద్ రెడ్డి 1,01,889 ఓట్లు, తెలుగు దేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ 99,433 ఓట్లు సాధించారు.
2019లో వైఎస్సార్సీపీకి 39 వేలు, 2014లో టీడీపీకి 1500 మెజార్టీ వచ్చింది.

ఫొటో సోర్స్, ECE
6. బద్వేల్‌లో మహిళా అభ్యర్థి గెలుపు
దాసరి సుధ ఇక్కడ విజయం సాధించారు. ఆమెకు 18,567 ఓట్ల మెజారిటీ లభించింది.
బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషణ్ణ 71,843 ఓట్లు సాధించి ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి నీరుగట్టు విజయ జ్యోతి మూడో స్థానంలో నిలిచారు.
దాసరి సుధకు మొత్తం 90,410 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, FB/Akepati Amarnath Reddy
7. రాజంపేట: అమర్నాథ్ రెడ్డి
రాజంపేటలో వైసీపీ 7 వేలకు పైగా ఓట్లతో నెగ్గింది.
ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 92,609 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి, టీడీపీ నేత బాల సుబ్రమణ్యంపై ఆయనకు 7,016 ఓట్ల మెజారిటీ లభించింది.
2019 లో ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మేడా మల్లికార్జున రెడ్డికి 35 వేల ఓట్ల మెజారిటీ సాధించారు.
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 2009లో తొలిసారి రాజంపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. అనంతరం 2014లో టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
2019 ఎన్నికలకు ముందు మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో అమర్నాథ్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు. అయినప్పటికీ వైసీపీలోనే కొనసాగిన అమర్నాథ్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

ఫొటో సోర్స్, ECE
8. మంత్రాలయం: బాలనాగిరెడ్డి
మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి వై. బాలనాగిరెడ్డి 12,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డి 74,857 ఓట్లతో ఓడిపోయారు.
కాంగ్రెస్ అభ్యర్థి పీఎస్ మురళీ కృష్ణరాజు మూడో స్థానంలో నిలిచారు.
కాంగ్రెస్, బీఎస్పీలు బలంగా ఓట్లు చీల్చాయి.
2019లో బాలనాగిరెడ్డికి 24 వేల మెజార్టీ వచ్చింది.

ఫొటో సోర్స్, ECE
9. ఆలూరు: విరూపాక్షి
ఆలూరులో వైసీపీ స్వల్ప మెజారిటీతో బయటపడింది.
ఇక్కడ బి. విరూపాక్షి 2,831 ఓట్ల మెజారిటీతో టీడీపీ నాయకుడు బి. వీరభద్ర గౌడ్‌పై గెలుపొందారు.
విరూపాక్షికి 1,00,264 ఓట్లు దక్కాయి.
ఇక్కడ కాంగ్రెస్ బాగా ఓట్లు చీల్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కిషోర్ కి 5772 ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 1369 ఓట్లు, నోటాకి 2634 ఓట్ల వచ్చాయి. నోటా మెజార్టీ దాదాపు సమానం.
2019 లో వైఎస్సార్సీపీకి ఇక్కడ 40 వేల మెజార్టీ, 2014లో రెండు వేలు మెజార్టీ వచ్చింది.

ఫొటో సోర్స్, FB/PeddiReddy Dwarakanath Reddy
10. తంబళ్ల పల్లె: ద్వారకానాథ రెడ్డి
వైసీపీ అభ్యర్థి పి. ద్వారకానాథ రెడ్డి ఇక్కడ 10 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు.
తెలుగు దేశం అభ్యర్థి డి. జయచంద్రా రెడ్డిపై ఆయన విజయం సాధించారు.
ద్వారకానాథ రెడ్డికి 94,136 ఓట్లు, జయచంద్రా రెడ్డికి 84,033 ఓట్లు వచ్చాయి.
మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ చాలా స్వల్ప ఓట్లను సాధించింది.
2019లో ఇదే ద్వారకానాథ రెడ్డికి 47 వేల మెజార్టీ వచ్చింది.

ఫొటో సోర్స్, FB/Ramachandra reddy
11. పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
జగన్ క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారంతా ఘోరంగా ఓటమి పాలవ్వగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,095 ఓట్ల మెజారిటీతో వైసీపీని గెలిపించారు.
రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి 94,698 ఓట్లు పొందగలిగారు.
చాలా రౌండ్లలో ఇరువురి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ కనిపించింది.
ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన బీసీవై (భారత చైతన్య యువజన) పార్టీ అభ్యర్థి బోడె రామచంద్ర యాదవ్‌కు 4 వేల పైచిలుకు ఓట్లు దక్కాయి.
2019 లో రామచంద్రారెడ్డికి 42 వేల మెజార్టీ, 2014లో 31 వేల మెజార్టీ వచ్చింది. 2009లో 40 వేల మెజార్టీ వచ్చింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














