పల్నాడు: ‘‘రెండు వారాలుగా కర్ఫ్యూలానే ఉంది, షాపులు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూయిస్తారో తెలియడం లేదు’’

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఎన్నికల వేళ పల్నాడులో జరిగిన రాజకీయ హింస అక్కడి ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
విత్తనాలు దొరక్క కొందరు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
రోడ్ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే చిరు వ్యాపారులకు బతుకు కష్టంగా మారింది.
"ఏటా మే నెల నుంచి పత్తి సాగు మొదలవుతుంది. చినుకులు పడగానే విత్తనాలు నాటాల్సి ఉంటుంది. లేదంటే మొలకెత్తుతుందో లేదో తెలీదు.
ఈసారి పెద్ద చిక్కు వచ్చింది. ఎన్నికలప్పుడు హింస చెలరేగిందంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కర్ఫ్యూలానే ఉంది మాకు. విత్తనాల షాపులు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూయిస్తారో తెలియడం లేదు'' అని బొల్లాపల్లి మండలానికి చెందిన రైతు కొణతం బాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
విత్తనాల కోసం కారంపూడికి వస్తే దుకాణం మూసేసి ఉందని, మూడు, నాలుగుసార్లు తిరగాల్సి వస్తోందని ఆయన బీబీసీతో అన్నారు.
పల్నాడులో ఒక్క బాల్ రెడ్డి మాత్రమే కాదు, వందల మంది రైతులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు.
వ్యాపారులకు కూడా దుకాణాలు నడవడం లేదు.
మామిడి వంటి పంటలు అమ్ముకోలేక మరికొందరు కష్టపడుతున్నారు.

రెండు వారాల నుంచి 144 సెక్షన్
ఎన్నికల పోలింగ్ సందర్భంగా మే 13, 14 తేదీల్లో పల్నాడు ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరిగాయి.
మే 15న 144 సెక్షన్ విధించారు. కేంద్ర బలగాలను రంగంలో దింపారు. పోలీస్ పహారా పెంచారు.
రెండు వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మాచర్ల వంటి ప్రాంతాల్లో రెండు వారాలుగా కర్ఫ్యూ వాతావారణం కనిపిస్తోంది. ఉదయం 10 గంటల తర్వాత షాపులు తీయొద్దంటూ కొన్నిచోట్ల ఆంక్షలు విధించారు. మాచర్ల పట్టణం, కారంపూడి మండల కేంద్రంలో ఈ పరిస్థితి కనిపించింది. ఈ రెండుచోట్లా ఎక్కువగా అల్లర్లు జరగడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
పోలీసు ఆంక్షల కారణంగా వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి వ్యాపారుల జీవనం కష్టంగా మారింది.
"పచ్చళ్ల సీజన్ అని మామిడి కాయలు తెచ్చాం. తీరా ఇక్కడ అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. ఒక రోజు 10 గంటలు, మరోరోజు 11 గంటల వరకు మాత్రమే అనుమతించారు. ఆ సమయాల్లో కొనేవారు రాలేదు. దీంతో కాయలు పాడైపోయాయి. ఎంతొస్తే అంతకే అమ్ముకోవాల్సి వచ్చింది. షాపు అద్దెలకు సరిపడా కూడా సంపాదించలేకపోయాం" అని మాచర్లకు చెందిన చిరు వ్యాపారి సాదిఖ్ తెలిపారు.
ఏటా మామిడి పళ్లతో పాటుగా పచ్చడి కాయల వ్యాపారం కూడా రెండు నెలల పాటు బాగా సాగేదని, ఈసారి 15 రోజులుగా వ్యాపారం సాగక పెట్టుబడులు నష్టపోయామని సాదిఖ్ అన్నారు.

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు
సుమారు రెండు దశాబ్దాల తర్వాత పల్నాడులో మళ్లీ రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పోలింగ్ సమయంలో జరిగిన హింసతో దేశవ్యాప్తంగా పల్నాడు ప్రాంతం చర్చలోకి వచ్చింది.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. వాహనాలకు నిప్పుపెట్టడం, భౌతికదాడులు చేసుకున్నారు.
"రాజకీయ ఆధిపత్యం కోసం వారంతా హింసకు పాల్పడ్డారు. నేరం వాళ్లది. శిక్ష మాత్రం మాకు అన్నట్టుగా ఉంది. చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. రెండేళ్లుగా వర్షాలు లేక చాలామంది పంట కూడా వేయలేదు.
ఈసారి వానలు కురిసినా నాటేందుకు విత్తనాలు దొరకలేదు. విత్తనాల కోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. విత్తనాలు ఎక్కడ తెచ్చుకుంటే, దానికి తగ్గట్టుగా పురుగు మందులు సహా అన్నీ అక్కడే తెస్తాం. పైగా నమ్మకమైన షాపు దగ్గరే విత్తనాలు తెచ్చుకోవడం అలవాటు. ఈసారి షాపులు తెరిచే అవకాశం లేకపోవడం వల్ల మా కష్టాలు అన్నీ ఇన్నీ కావు" అని జూలకల్లు గ్రామానికి చెందిన రైతు కావూరి పీరయ్య చెప్పారు.
విత్తనాల సరఫరాకు ఆటంకాలు లేకుండా చూసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.

కొంత సడలింపు..
పల్నాడులో జరిగిన రాజకీయ హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి నివేదికను సమర్పించింది. మాచర్ల నియోజకవర్గంలో 19 కేసులు నమోదు చేశారు. సుమారు 100 మంది నిందితులను గుర్తించి, కొందరిని అరెస్టు చేశారు.
అరెస్టుల భయంతో అనేక మంది ఊరు వదిలి వెళ్లిపోయారు.
వైసీపీ, టీడీపీ ప్రధాన నేతల మీద కూడా కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, సీఐ నారాయణ స్వామి మీద హత్యాయత్నం వంటి కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి కొంతకాలం పాటు పరారీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో మే 28న పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద హాజరయ్యారు.
నాయకులు, కార్యకర్తల మీద కేసులు, అరెస్టుల కారణంగా పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మార్గం ఏర్పడింది. దాంతో పోలీసులు ఆంక్షలు కూడా కొంత సడలించారు.

మళ్లీ ఆంక్షలు
‘‘రెండు రోజుల నుంచి సాయంత్రం వరకు షాపులు తెరుచుకోవడానికి అనుమతిస్తున్నారు. సీడ్ మర్చంట్ అసోసియేషన్ తరఫున పోలీసులను కలిశాం. వారు కూడా అర్థం చేసుకున్నారు. దానివల్ల కొంత ఉపశమనం వస్తోంది.
మేం కూడా పెట్టుబడులు పెట్టి అంతా తెచ్చుకున్నాం. తీరా రైతులు రావడానికి, వారు వచ్చిన తర్వాత మేం విత్తనాలు అమ్ముకోవడానికి అవకాశాలు ఇవ్వకపోతే నష్టపోతామని చెప్పాం. దాంతో సడలింపు మొదలయ్యింది’’ అని కారంపూడికి చెందిన విత్తనాల వ్యాపారి వెన్నపూసల రాంబాబు అన్నారు.
పదిహేను రోజుల పాటు వ్యాపారం స్తంభించిపోవడం వల్ల చాలా నష్టపోయామని ఆయన బీబీసీతో చెప్పారు.
శాంతిభద్రతల పేరుతో వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తే అందరికీ సమస్య అవుతుందని గుర్తించాలని అభిప్రాయపడ్డారు.
అయితే, మే చివరి వారంలో రెండు, మూడు రోజుల మినహాయింపు ఇచ్చినా మళ్ళీ ఆంక్షలు తీవ్రం చేశారు.
జూన్ 1 నుంచి ఐదు రోజుల పాటు మొత్తం షాపులన్నీ మూసేయాలని పోలీసులు ఆదేశించారు. ఇది రైతులకి మరింత సమస్య కాబోతోంది.

ఫొటో సోర్స్, UGC
కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పోలింగ్ సందర్భంగా వేడి రాజుకోవడంతో ఏపీ ఎన్నికల యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కౌంటింగ్ సమయంలో మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ గుప్తా పల్నాడు జిల్లాలో పర్యటించారు.
ఇప్పటికే పల్నాడులో పలువురు అనుమానితులను బైండోవర్ చేయడం వంటి చర్యలు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, జూన్ 5 తర్వాత అంతా సద్దుమణుగుతుందని ఆశిస్తున్నట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.
ఎలాంటి అల్లర్లకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆంక్షలు కొనసాగిస్తున్నామని, సామాన్యులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఆమె బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














