విశాఖ టు కంబోడియా: ‘డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పి, సైబర్ నేరాలు చేయించారు’- బాధితులు చెప్పిన విస్తుబోయే నిజాలు

కంబోడియా బాధితులు
ఫొటో క్యాప్షన్, కంబోడియాలో ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయిన తెలుగు వారిని పోలీసులు క్షేమంగా తీసుకొచ్చారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

డేటా ఎంట్రీ ఉద్యోగానికి లక్షల రూపాయల జీతం వస్తుందని ఆశపడి, కంబోడియాలో చిక్కుకు పోయిన తెలుగువాళ్లను ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాపాడారు.

బాధితుల్లో చాలామంది తక్కువ చదువుకున్న వాళ్లు, పెద్దగా నైపుణ్యాలు లేని వాళ్లు. ఏపీ, తెలంగాణల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లు.

మంచి జీతం, మెరుగైన జీవితం కోసం మొదలైన ఆశ.. వాళ్లను ‘‘సైబర్ నేరగాళ్లు’’గా మార్చింది.

గదుల్లో బంధించి వారిని బెదిరించి బలవంతంగా వాళ్లతో సైబర్ నేరాలు చేయించారని బాధితులు చెబుతున్నారు.

కంబోడియా గ్యాంగ్ బాధితుడు
ఫొటో క్యాప్షన్, కంబోడియా గ్యాంగ్ బాధితుడు

‘డేటా ఎంట్రీ జాబ్‌కు లక్షల్లో జీతం’

తక్కువ జీతంతో లేదా నిరుద్యోగంతో ఇబ్బందిపడుతూ ఉండే కొందరు, ఆన్‌లైన్‌లో జాబ్స్ వెతుకుతుంటారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ కొందరు ఉద్యోగ ప్రకటనలు ఇస్తుంటారు.

డేటా ఎంట్రీ వంటి సులువైన పనులతో లక్షల రూపాయలు సంపాదించొచ్చని నమ్మిస్తారు. ఇక్కడే విజయవాడకు చెందిన అజయ్ (పేరు మార్చాం) మోసగాళ్ల వలలో పడ్డారు.

‘‘విజయవాడలో షెఫ్‌గా పని చేస్తూ ఉండేవాడిని. నెలకు 15 వేల రూపాయల జీతం. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతుండగా కంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగం ఉందని సోషల్ మీడియా ద్వారా తెలిసింది’’ అని అజయ్ బీబీసీతో చెప్పారు.

విశాఖపట్నానికి చెందిన వినయ్ (పేరు మార్చాం)ది కూడా ఇదే కథ.

‘‘వచ్చే జీతం సరిపోవడం లేదు. కొత్త ఉద్యోగాలు వెతుకుతూ వారి వలలో పడ్డా’’ అని వినయ్ అన్నారు. వినయ్ చదువుకుంది పదో తరగతే.

“నాకు కంప్యూటర్ పని తెలియదని చెప్పా. పేపరులో ఉన్నది చూసి టైపింగ్ చేస్తే చాలని చెప్పారు’’ అని వినయ్ అన్నారు. ఆ పని కూడా వారికి ఊరికే ఇవ్వలేదు.

‘‘ఆ ఉద్యోగం కోసం లక్షన్నర కట్టాను’’ అని అజయ్ తెలిపారు.

వినయ్ కూడా డబ్బులు కట్టారు. కంబోడియా నుంచి వెనక్కి వచ్చిన బాధితుల్లో అజయ్, వినయ్ ఉన్నారు.

మంచి ఉద్యోగం, జీతం ఎక్కువగా వస్తోంది కాబట్టి డబ్బులు కట్టడానికి కూడా బాధితులు సిద్ధపడ్డారు. ఇలా డబ్బులు కట్టినవారు చాలామందే ఉన్నారు. ఏడు నెలల కిందట ఏజెంట్ల ద్వారా వీరు కంబోడియా వెళ్లారు.

ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 150 మంది బాధితులు ఉంటారని విశాఖపట్నం పోలీసులు తెలిపారు. వారిని రక్షించేందుకు ‘ఆపరేషన్ కంబోడియా’ చేపట్టారు.

అందులో భాగంగా 24 మంది బాధితులు ఈ నెల 24న విశాఖపట్నం చేరుకున్నారు.

అనేక రాష్ట్రాలకు చెందిన వారు కంబోడియాలో చిక్కుకొని పోయారని పోలీసులు వెల్లడించారు.

రవిశంకర్, సీపీ వైజాగ్
ఫొటో క్యాప్షన్, కంబోడియా గ్యాంగ్‌ చేతిలో సుమారు 5 వేల మంది చిక్కుకున్నట్లు తెలిసిందని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు.

‘మోసం చేసి డబ్బులు లాగేవారు’

కంబోడియాలో ఉండే సైబర్ నేరగాళ్లకు ఇక్కడ కొందరు ఏజెంట్లు ఉంటారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఉద్యోగ ప్రకటనలు చూసిన వాళ్లు ఆ ఏజెంట్లను సంపద్రిస్తారు. తరువాత ఆ ఏజెంట్లు చేయాల్సిన పని, జీతం గురించి చెబుతారు.

లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తారు. పాస్‌పోర్ట్‌ అవసరమైన వారికి ఇప్పించడం, వీసాలు అరేంజ్ చేయడం వంటివి వాళ్లే చేస్తారు. ఆ తరువాత వారిని థాయిలాండ్ పంపుతారు.

అయితే, ‘‘మాకు ఎలాంటి కాంట్రాక్టు పత్రాలు ఇక్కడ ఇవ్వలేదు’’ అని బాధితులు చెప్పారు.

బ్యాంకాక్‌లో దిగగానే కొందరు తెలుగు వాళ్లు వచ్చి రిసీవ్ చేసుకున్నారని బాధితులు తెలిపారు.

‘‘బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు? అని అడిగితే టూరిస్టు ప్లేసులు చూడటానికి అని చెప్పమన్నారు” అని వినయ్ అన్నారు.

కారులో కొన్ని గంటల ప్రయాణం తరువాత కంబోడియాకు తీసుకెళ్లారని బాధితులు చెబుతున్నారు.

“కంబోడియా-థాయిలాండ్ సరిహద్దులో ఒక కంపెనీకి తీసుకుని వెళ్లారు. వాళ్లు ఒక అగ్రిమెంట్ ఇచ్చి సంతకం చేయమన్నారు. అదంతా చైనీస్ వంటి భాషలో ఉంది. అందులో ఏం రాశారో తెలియదు. దాని మీద బలవంతంగా సంతకం పెట్టించారు. కొన్ని చోట్ల ఏమీ నింపకుండా ఖాళీగా వదిలేయమన్నారు” అని వినయ్ వెల్లడించారు.

‘ఇండియన్ మోడల్స్ ఫోటోలతో మోసాలు’

మంచి ఉద్యోగం అని నమ్మి అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలిసిందని బాధితులు తెలిపారు. తమను బెదిరించి సైబర్ నేరాలు చేయించారని వెల్లడించారు.

అజయ్ మాట్లాడుతూ...‘‘ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లిన తర్వాత మూడు ఫోన్లు, మూడు సిమ్ కార్డులు ఇస్తారు. ఆ సిమ్ కార్డులు వేసి అందమైన అమ్మాయిల పేరుతో ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసి మన ఇండియాలో బిగ్ షాట్స్, డబ్బున్న వారిని గుర్తించి వారితో చాటింగ్‌కి ప్రయత్నించాలి. ప్రొఫైల్ పిక్ కోసం కొందరు ఇండియన్ మోడల్స్ ఫోటోలు ఇచ్చేవారు. ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ అయి అటునుంచి సమధానం వస్తే ఆ ప్రొఫైల్‌ను తీసుకుని వెళ్లి చైనీస్ టీంకు అప్పగించాలి. ఆ తరువాత ఏం చేస్తారో మాకు తెలియదు.

ఫేస్ బుక్ చాటింగ్‌లో విజయవంతం కాకపోతే మాకు అన్నం పెట్టేవారు కాదు. రోజుకు ముగ్గురు కంటే ఎక్కువమందిని ట్రాప్‌లోకి దింపిన వారికి ఎక్కువ ఫుడ్ పెట్టేవారు.

క్రిప్టో కరెన్సీ, బ్యాంక్ ఓటీపీ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌ వంటివి కూడా చేయమనేవారు. పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. చెప్పినట్లు చేయకపోతే లాఠీలతో కొట్టేవారు, తుపాకీతో బెదిరించేవారు. అగ్రిమెంట్‌లో ఖాళీలు వదిలేసిన చోట 6 వేల డాలర్లు ఫైన్ కట్టాలని రాశారు. కరెంట్ షాకులివ్వడం, కర్రలు, హాకీ స్టిక్స్‌తో కొట్టడం చేసేవారు. ఒక రోజంతా గదిలో ఒంటరిగా ఉంచుతారు. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వరు. మేం ఇళ్లకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నామో కూడా వాళ్లకు తెలిసేది’’ అని వివరించారు.

కంబోడియా గ్యాంగ్ బాధితుడు
ఫొటో క్యాప్షన్, అన్యాయమని ప్రశ్నిస్తే, కొట్టేవారని బాధితుడు రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

‘జీతంలో కోతలు’

ఏవేవో కారణాలు చెప్పి జీతంలో కోతలు వేసేవారని అజయ్ తెలిపారు.

‘‘నిమిషం ఆలస్యంగా వచ్చావు. టార్గెట్ పూర్తి చేయలేదు...వంటి కారణాలు చెప్పి మాకు జీతంగా ఇస్తామన్న 400 నుంచి 600 డాలర్లలో కోత పెడతారు. మా ఖర్చులకు సరిపోయే అంత మాత్రమే చేతికి ఇచ్చేవారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే... అలా అడిగిన వాళ్లని కొట్టేవారు. ఆ వీడియోలు తీసి, గ్రూపులలో పోస్టు చేసేవారు. ఎదురు తిరిగిన వాళ్లకు ఇదే పరిస్థితని బెదిరించే వాళ్లు’’ అని అజయ్ వివరించారు.

‘‘డ్రగ్స్ మా చేతుల్లో పెట్టి ఫోటోలు వీడియోలు తీసేవారు. వాటిని కంబోడియా పోలీసులకు ఇస్తామని బెదిరించేవారు’’ అని బాధితుడు, అనకాపల్లి జిల్లాకు చెందిన రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

అక్కడ ఏజెంట్లు ఇంగ్లిష్, హిందీలో మాట్లాడేవారని బాధితులు తెలిపారు.

కంబోడియా గ్యాంగ్ మోసం

ఎలా బయటపడింది?

కంబోడియా వెళ్లిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నం వచ్చారు. మిగతా వాళ్ల మాదిరిగానే సుమారు 7 నెలల కిందట లక్షన్నర రూపాయలు కట్టి ఆయన కంబోడియా వెళ్లారు.

‘‘అక్కడ ఆ పని నచ్చక వెనక్కి వెళ్లిపోతాను అని చెప్పాను. అందుకు వాళ్లు 2 లక్షల రూపాయలు కట్టించుకున్నారు. ఇక్కడి విషయాలు బయటకు ఎక్కడా చెప్పొద్దని బెదిరించారు’’ అని బొత్స శంకర్ తెలిపారు.

అయినా ధైర్యం తెచ్చుకుని ఈ ఏడాది ఏప్రిల్ 30న సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు విచారణ మొదలు పెట్టి, కంబోడియాలోని బాధితులతో టచ్‌లోకి వెళ్లారు.

గాజువాకకు చెందిన రాజేశ్ విజయ్‌ కుమార్ స్థానిక ఏజెంటుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

“రాష్ట్రంలోని 150 మంది నిరుద్యోగులు రాజేష్‌ను సంప్రదించారు. వీరిని బ్యాంకాక్, సింగపూర్ మీదుగా కంబోడియాకు తరలించారు. అక్కడ వీరికి కంప్యూటర్లపై అవగాహన కల్పించారు. ఆ తరువాత చైనా ముఠాలకు ఒక్కొక్కరిని 4 వేల డాలర్లకు అమ్మేశారు” అని విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఎ. రవిశంకర్ చెప్పారు.

భారతీయులను భారతీయులతోనే మోసం చేసేందుకు వీళ్లను కంబోడియా తీసుకుని వెళ్లారని, ఇలా దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్‌ చేతిలో సుమారు 5 వేల మంది చిక్కుకున్నట్లు తెలిసిందని రవిశంకర్ తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు చుక్కా రాజేష్‌, సబ్బవరపు కొండలరావు, మన్నెన జ్ఞానేశ్వర్‌రావులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కంబోడియా గ్యాంగ్ బాధితుడు
ఫొటో క్యాప్షన్, కంబోడియా గ్యాంగ్ బాధితుడు

‘భారతీయులమంతా తిరగబడ్డాం’

విశాఖ వరకు ఎలా వచ్చారో అనకాపల్లికి చెందిన రామకృష్ణతో పాటు అజయ్, వినయ్‌లు బీబీసీ ప్రతినిధులకు వివరించారు.

‘‘ఒక బిల్డింగులో ఒక ఫ్లోర్ ఆఫీస్ కోసం, ఒక ఫ్లోర్‌లో మా వసతి. బయటకు వెళ్లడానికి లేదు. వీక్ ఆఫ్ అంటే నెలకు రెండు సార్లు. అది కూడా ముగ్గురేసి మాత్రమే బయటకు వెళ్లాలి. హెయిర్ కట్ వంటి పనులు మాత్రమే చేసుకోవాలి. మరి ఎక్కడికీ వెళ్లకూడదు. రోజూ 16 గంటలు పని చేయించుకునేవారు. పైగా మాతో భారతీయులనే మోసం చేయిస్తున్నారు. దాంతో భయమేసింది. మోసపోయిన వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే మా పరిస్థితి ఏంటని మేమంతా చర్చించుకున్నాం.

అప్పటికే కంబోడియా కంపెనీకి డబ్బు కట్టి ఇండియా వచ్చేసిన బొత్స శంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో విశాఖపట్నం పోలీసులు మాతో మాట్లాడేవారు. వారికి వాట్సాప్ ద్వారా ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవాళ్లం.

‘‘ మా బిల్డింగ్‌లో దాదాపు 300 మంది భారతీయులున్నారు. ఆంధ్రా, తెలంగాణ నుంచి 31 మంది ఉన్నాం. కొందరు 7 నెలల కిందట, మరి కొందరు 2 నెలల కిందట ఉచ్చారు. చివరకు అందరం కలిసి కంబోడియా కంపెనీ ప్రతినిధులపై తిరగబడి, కొందర్ని కొట్టాం. అది పెద్ద గొడవ కావడంతో 40 మంది కంబోడియా పోలీసులు వచ్చారు. మా పాస్ పోర్టులు మాకు ఇప్పించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి విశాఖ పోలీసులు మాతో మాట్లాడి, మమ్మల్ని 4 రోజుల్లో భారత్‌కు పంపించారు’’ అని బాధితులు చెప్పారు.

2024 మే 22న బ్యాంకాక్‌కు పంపారని, అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీ అధికారుల సాయంతో భారత్‌కు వచ్చినట్లు బాధితులు తెలిపారు.

కంబోడియా గ్యాంగ్ మోసం
ఫొటో క్యాప్షన్, ఉద్యోగమిస్తామంటే అలా విదేశాలకు వెళ్లిపోవద్దని, ఆ కంపెనీల గురించి పూర్తిగా తెలుసుకోవాలని విశాఖపట్నం సైబర్ క్రైమ్ బ్రాంచ్ సీఐ కె.భవానీ ప్రసాద్ సూచించారు.

బాధితుల్లో చాలా దేశాల వారున్నారు: పోలీసులు

కంబోడియా మోసంలో బాధితులుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, యూరప్ దేశాల వాళ్లు కూడా ఉన్నారని విశాఖపట్నం సైబర్ క్రైమ్ బ్రాంచ్ సీఐ కె.భవానీ ప్రసాద్ తెలిపారు.

‘‘ఏదైనా కంపెనీ ఉద్యోగం ఇస్తుందంటే, ఆ కంపెనీ సర్టిఫికేషన్, ఆ కంపెనీ ఎక్కడుంది? కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు, అపాయింట్‌మెంట్ లెటర్లు అన్నీ పరిశీలించాలి. అది అసలు రిజిస్టర్డ్ కంపెనీయా? కాదా అనేది చెక్ చేసుకోవాలి. అంతేతప్ప విదేశాల్లో ఉద్యోగమని చెప్పుకోడానికి బాగుంటుందనో, ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఆశతోనో వెళ్తే ఇలాంటి ఉచ్చులో చిక్కుకుంటారు’’ అని సీఐ కె. భవానీ ప్రసాద్ సూచించారు.

కంబోడియా ముఠాల మోసాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతుండటంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రత్యేక దృష్టి సారించిదని సీఐ తెలిపారు.

కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ వివరాల ప్రకారం..మన దేశ బాధితుల నుంచి కంబోడియా గ్యాంగులు సుమారు రూ.500 కోట్ల వరకు దోచుకున్నాయని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)