టైటానిక్ షిప్ శిథిలాల దగ్గరకు మరో సాహసోపేత యాత్ర

టైటానిక్, ట్రిటాన్, టైటాన్ సబ్ మెరీన్

ఫొటో సోర్స్, The Connor Group

ఫొటో క్యాప్షన్, వ్యాపారవేత్త లారీ కానర్, ట్రిటాన్ సబ్ మెరీన్స్ సహ వ్యవస్థాపకుడు ప్యాట్రిక్ లాహే
    • రచయిత, మైక్ వెండ్లింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సబ్ మెర్సిబుల్‌లో వెళ్లి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్‌ను చూసేందుకు అమెరికన్ రియల్ ఎస్టేట్ బిలియనీర్ లారీ కానర్, సముద్ర అన్వేషకుడు పాట్రిక్ లాహే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

లారీ కానర్ ఒహాయో రియల్ ఎస్టేట్ టైకూన్.

పాట్రిక్ లాహే ట్రిటాన్ సబ్ మెరీన్స్ సహ వ్యవస్థాపకులు.

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సుమారు 3,800 మీటర్ల (12, 467 అడుగులు) లోతున ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వీరిద్దరు సబ్ ‌మెర్సిబుల్ ద్వారా అక్కడకు వెళ్లాలనుకుంటున్నారు.

గతేడాది టైటానిక్ నౌకను చూసేందుకు ఐదుగురితో బయల్దేరిన ఓషన్ గేట్‌కు చెందిన సబ్ మెర్సిబుల్ టైటాన్ పేలిపోవడంతో ప్రైవేట్ సబ్ మెర్సిబుల్ పరిశ్రమకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

మెరైన్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిన తర్వాతే ఈ ప్రయాణం ప్రారంభం అవుతుందని కానర్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ ప్రయాణానికి నిర్ణీత సమయం అంటూ ఏదీ నిర్ణయించలేదు.

టైటానిక్ షిప్ దగ్గరకు వెళ్లేందుకు వీళ్లిద్దరూ ట్రిటాన్ 4000/2 ఎక్స్‌ప్లోరర్ అనే సబ్‌మెర్సిబుల్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇందులో 4000 అనేది ఈ సబ్ మెర్సిబుల్ సురక్షితంగా వెళ్లగలిగిన మీటర్లను సూచిస్తుంది.

సాహసోపేత ప్రయాణాల్ని ఇష్టపడే కానర్ 2022లో డబ్బులు చెల్లించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి వచ్చారు.

అమెరికా, టైటానిక్ షిప్

ఫొటో సోర్స్, Triton Submarines/The Connor Group

ఫొటో క్యాప్షన్, టైటానిక్ వద్దకు వెళ్లేందుకు ఉపయోగించాలని భావిస్తున్న ట్రిటాన్ నమూనా

ఓషన్ గేట్ నిర్మించిన టైటాన్ సబ్ మెర్సిబుల్‌ను కార్బన్ ఫైబర్‌తో నిర్మించారు.

ఇది సముద్రంలో 1300 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రయాణించేందుకు మెరీన్ రిజిస్ట్రేషన్ సంస్థ సర్టిఫై చేసింది. అంటే టైటానిక్ నౌక శకలాలు ఉన్న లోతుతో పోలిస్తే ఇది చాలా తక్కువ దూరం.

2023 జూన్‌లో టైటానిక్ శకలాల వద్దకు వెళ్లేందుకు బయల్దేరిన టైటాన్ సబ్‌మెరీన్ మధ్యలోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఓషన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, మరో నలుగురు ప్రయాణికులు చనిపోయారు.

బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ వ్యాపావేత్త హమిష్ హార్డింగ్, పాల్ హెన్నీ నర్జియోలెట్, ఫ్రెంచ్ మాజీ డైవర్ చనిపోయిన వారిలో ఉన్నారు.

భద్రత విషయానికొచ్చినప్పుడు టైటాన్ సబ్ మెరీన్ విషయంలో అనేక మంది సలహాలు చెప్పినప్పటికీ రష్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రమాదంపై అమెరికా, కెనడా అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

ట్రిటాన్ ప్రయాణం గురించి కానర్ వాల్‌స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడారు.

“నేను ఓ విషయం ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను. సముద్రం శక్తివంతంగా ఉన్నప్పుడు, అందులో మీరు సరైన దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు.

టైటాన్ సబ్ మెరీన్ ప్రమాదంతో ప్రైవేట్ సబ్ మెర్సిబుల్ పరిశ్రమ బాగా నష్టపోయింది. అయితే ఈ ఇద్దరు టైటానిక్ వద్దకు విజయవంతంగా ప్రయాణించి తిరిగి వస్తే, ఈ పరిశ్రమ మళ్లీ పుంజుకుంటుంది.

టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడు తర్వాత ఓషన్ గేట్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుంది. మిగతా సంస్థలు కూడా తమ కార్యక్రమాల్ని నిలిపివేశాయి.

“ఈ దుర్ఘటన ఇలాంటి వాహనాల పట్ల ఆసక్తి ఉన్న ప్రజల్లో వణుకు పుట్టించింది” అని లాహే అన్నారు.

ఓషన్ గేట్, టైటాన్ సబ్ మెర్సిబుల్

ఫొటో సోర్స్, OceanGate

ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో పేలిపోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్

2008లో ఏర్పాటు చేసిన ట్రిటాన్ సబ్‌మెరీన్ల సంస్థకు లాహే సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ కేంద్రంగా నడుస్తున్న రియల్ ఎస్టేట్ పెట్టుబడుల సంస్థ కానర్ గ్రూప్‌కు కానర్ అధిపతి.

2021లో వీళ్లిద్దరూ మెరియానా ట్రెంచ్‌లోని సిరేనా డీప్, చాలెంజర్ డీప్‌ వద్దకు సబ్ మెర్సిబుల్‌లో ప్రయాణించారు. 36 వేల అడుగుల లోతుతో మెరియానా ట్రెంచ్‌లోని సిరియానా డీప్ భూమి మీదనే అత్యంత లోతైన ప్రాంతం.

ఈ ప్రయాణం గురించి వివరాల కోసం ట్రిటాన్ సబ్‌మెరీన్స్‌ సంస్థను బీబీసీ సంప్రదించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)