వోల్కనో టూరిజం ఎలా ఉంటుంది, అగ్నిపర్వతాలకు దగ్గరగా వెళ్లడం భద్రమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిన్ బ్రౌన్
- హోదా, బీబీసీ ట్రావెల్
బ్రిటన్ వ్యాపారవేత్త థామస్ కుక్ 1841లో ఒక పర్యటకుల బృందాన్ని మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటినుంచి అగ్నిపర్వత పర్యాటకం (వోల్కనో టూరిజం) పెరుగుతూనే ఉంది.
అగ్నిపర్వతాల పేలుడును చూడటానికి ప్రస్తుతం లక్షలాది మంది పర్యటకులు ఐస్‌లాండ్, ఇటలీ, హవాయి వంటి ప్రాంతాలకు పోటెత్తుతున్నారు.
ఈ అగ్నిపర్వతాలను పర్యాటకులు చూడగలిగే మార్గాలు కూడా పెరుగుతున్నాయి. ఒక ఎత్తయిన ప్రాంతం నుంచి హవాయి వోల్కనోస్ నేషనల్ పార్క్‌లోని అగ్నిపర్వతాన్ని పర్యాటకులు చూడొచ్చు. వనౌతు అంబ్రిమ్ ద్వీపంలోని మండుతున్న అగ్నిపర్వతాన్ని చూడటానికి రాపెలింగ్ (కొండ మీద నుంచి తాడు సహాయంతో కిందకు దిగడం) మార్గం అందుబాటులో ఉంది.
ఐస్‌ల్యాండ్‌లోని అత్యంత దర్శనీయ ప్రాంతాల్లో ఒకటి బ్లూ లగూన్ స్పా. అయితే, ఈ ప్రాంతంలోని అగ్నిపర్వతం, 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు అయిదుసార్లు విస్పోటనం చెందడంతో బ్లూ లగూన్ స్పాను ఇటీవలే ఖాళీ చేయించారు. అగ్నిపర్వత విస్పోటనం జరిగిన గ్రిండావిక్ పట్టణానికి కేవలం 5 కి.మీ దూరంలో బ్లూ లగూన్ స్పా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ
లావా క్షేత్రంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా జియో థర్మల్ శక్తితో సెగలు కక్కుతుంది. అయితే, అగ్నిపర్వత విస్పోటనం కారణంగా ఈ ప్రాంతంలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. కానీ, ఇతర అగ్నిపర్వత క్షేత్రాల్లో పలువురు పర్యటకులు మృతి చెందడంతో అసలు అగ్నిపర్వత పర్యాటకం ఎంత సురక్షితమనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
న్యూజీలాండ్‌లోని వైట్ ఐలాండ్ వకారి అగ్నిపర్వతం భగభగలాడే ఆవిర్లను ఎగజిమ్మడంతో 22 మంది పర్యాటకులు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ‘ద వోల్కనో: రెస్యూ ఫ్రమ్ వకారి’ పేరుతో 2022లో నెట్‌ఫ్లిక్స్ డ్యాక్యుమెంటరీ వచ్చింది.
ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న అత్యంత యాక్టివ్, పాపులర్ అగ్నిపర్వతాల్లో ఒకటైన మౌంట్ మరాపి అకస్మాత్తుగా దహించేంత వేడిగా ఉన్న బూడిదను వెదజల్లడంతో 23 మంది హైకర్లు చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు.
ఇదంత చూస్తుంటే, వోల్కనో టూరిజం ఎంత వరకు భద్రం అన్న అనుమానం వస్తుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సాహసయాత్రికులకు ఇది భద్రమే అని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గైడ్ ఉంటే మంచిది
అందులో మొదటిది, అగ్నిపర్వతం చూడబోయే ముందుగా అక్కడి పరిస్థితుల గురించి కాస్త పరిశోధించడం.
‘‘ఒక అగ్నిపర్వతం దగ్గరకు వెళుతున్నప్పుడు అక్కడి పరిస్థితులపై కాస్తయినా అవగాహన కలిగి ఉండాలి. అక్కడ ఏయే ఆంక్షలు ఉన్నాయి. ప్రజల భద్రత కోసం స్థానిక అధికారులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. భద్రతా సమాచారం కోసం స్థానిక పర్యాటక వెబ్‌సైట్లను చూడాలి. నేషనల్ పార్క్‌లకు వెళ్లినప్పుడు వార్నింగ్ అలర్టులు ఫోన్‌కు వచ్చేలా లాగిన్ అవ్వాలి’’ అని మాథ్యూ ప్యాట్రిక్ అన్నారు. హవాయి వోల్కనో అబ్జర్వేటరీలో ఆయన జియాలజిస్ట్.
క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతాన్ని చూడటానికి వెళ్లాలనుకుంటే ఒక మంచి గైడ్‌ను నియమించుకోవడం ఉత్తమం. గ్వాటెమాలాలోని అకాటెనాంగో అగ్నిపర్వతం వంటి కొన్ని ప్రదేశాల వద్దకు వెళ్లేందుకు గైడ్ అక్కర్లేదనే సంగతి నిజమే. కానీ, భద్రత దృష్ట్యా ఒక క్రియాశీల అగ్నిపర్వతం వద్దకు వెళ్లాలనుకుంటే గైడెడ్ టూర్ మంచిది అని ఆయన చెప్పారు.
‘‘ఒక్కో అగ్నిపర్వతం ఒక్కోలా ఉంటుంది. టూరిస్టులు ఈ విషయం తెలుసుకోవాలి. కొన్నేళ్ల కిందటి వరకు ప్రాథమిక భద్రతా ఏర్పాట్లతో హవాయిలోని కొన్ని అగ్నిపర్వతాల లావా ప్రవాహం వరకు వెళ్లే వీలుండేది. కానీ, పేలే గుణం ఉన్న అగ్నిపర్వతాలైతే అంత దగ్గరకు వెళ్లాలని ఎవరూ అనుకోరు’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అగ్నిపర్వతం పేలుతుందో, లేదో ముందే తెలుసుకోవచ్చా?
చాలా టూరిజం సంస్థలు స్థానిక అగ్నిపర్వతాలను భద్రంగా, బాధ్యతాయుతంగా ఎలా సందర్శించాలనే దానిపై మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.
ఐస్‌ల్యాండ్‌లో ఇటీవలి విస్పోటనం నేపథ్యంలో, ఆ దేశ టూరిజం వెబ్‌సైట్‌లో అగ్నిపర్వతాల తాజా సమాచారానికి సంబంధించిన ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేశారు.
విస్పోటనం జరిగిన రేక్‌జాన్స్ ద్వీపంలో ప్రజలను ఖాళీ చేయించే చర్యలు జరుగుతున్నప్పటికీ, దేశంలోని మిగతా ప్రాంతాల్లో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
ఐస్‌ల్యాండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అగ్నిపర్వతాల విస్పోటనాన్ని, అందులో నుంచి విషపూరిత వాయువుల ఉద్గారాలను అంచనా వేయడంలో పురోగతి సాధించడం అగ్నిపర్వత పర్యాటకాన్ని సురక్షితంగా మార్చిందని క్రిస్టిన్ వోగ్జిరో అన్నారు. ఐస్‌ల్యాండ్ మెటెరోలాజికల్ ఆఫీస్ జియోసైన్స్ రీసెర్చ్ లీడర్ క్రిస్టిన్.
‘‘ఐస్‌ల్యాండ్‌లో కొన్ని అగ్నిపర్వత విస్పోటనాలను మేం ముందే అంచనా వేయగలిగాం. గంటల ముందుగానే విస్పోటనాలను అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ, ఒక్కోసారి అవి మనకు షాకిచ్చే అవకాశం ఉంది.’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునగడానికి 25 ఏళ్ల ముందే భారత్‌లో ఘోర ప్రమాదం, సముద్రంలో మునిగిపోయిన 750 మంది.. అసలేం జరిగింది?
- అంతరించి పోయిందనుకున్న ఈ ‘పర్వత రత్నం’ మళ్లీ కనిపించింది, ఎక్కడంటే..
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: పోలీసులు ఏం చెప్పారు? అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో ఏం చేస్తారు?
- ఓవర్సీస్ హైవే: సముద్రంలో 182 కిలోమీటర్ల రోడ్డు.. ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














