ఈ నగరం కిందంతా భూగర్భ సొరంగాలే.. మరి వాటిపై భారీ భవనాలు ఎలా కడుతున్నారు?

ఆక్లాండ్ నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆక్లాండ్ నగరం
    • రచయిత, షార్లెట్ లిట్టన్
    • హోదా, ఫీచర్స్ ప్రతినిధి

న్యూజీలాండ్‌లోని అతిపెద్ద నగరం ఆక్లాండ్. దీని కింద లావా సొరంగాల నెట్‌వర్క్ విస్తరించి ఉంది.

సెంట్రల్ ఆక్లాండ్‌ మైదానంలో హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. 70,000 ఏళ్ల కిందట ఏర్పడిన లావా సొరంగానికి అక్కడ మార్గం ఉన్నట్లు ఆ బోర్డు సూచిస్తోంది. ఆక్లాండ్ నగరం కింద విస్తరించి ఉన్న వందల లావా సొరంగాలలో ఇదొకటి.

అంతకుముందు ఎవరూ గుర్తించని సొరంగాలు బయటపడటంతో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తేలియజేసే ఒక మ్యాపింగ్ ప్రాజెక్టును చేపట్టింది న్యూజీలాండ్ ప్రభుత్వం.

‘‘క్రియాశీల అగ్నిపర్వతాలు అధికంగా ఉండే ఒక మైదానం మీద ఆక్లాండ్ నగరాన్ని నిర్మించారు. ఇది చాలా ప్రత్యేక , ఇలాంటిది ఎక్కడా లేదు’’ అని ఆక్లాండ్ కౌన్సిల్ జియోహెరిటేజ్, నేచురల్ ఫీచర్స్ ఎక్స్‌పర్ట్ కేట్ లెవీస్ చెప్పారు.

అందుకే, విస్ఫోటనాల తర్వాత ఏర్పడిన సొరంగాలను గుర్తించి, వాటిని సంరక్షించడం అత్యంత కీలకమని, సవాలుతో కూడుకున్న విషయమని అన్నారు.

ఈ సొరంగాల్లో మనం తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఉంటాయని ఆమె అన్నారు.

మేం నిల్చున్న సొరంగం 70 వేల ఏళ్ల కిందట ఏర్పడింది. దానిమీద అనేక రాళ్లు ఉన్నాయి. మధ్య మధ్యలో మట్టి, ఫెర్న్ మొక్కలు కనిపిస్తున్నాయి.

నగరంలోని ఈ సొరంగాలన్నీ గత 2 లక్షల ఏళ్లుగా తరచూ విస్ఫోటనం చెందుతూ వస్తున్న అగ్ని పర్వతాల వల్ల ఏర్పడినవే. ఇందులో తాజాగా ఏర్పడింది రంగిటొటో అగ్నిపర్వతం పేలుడు వల్ల ఏర్పడింది. ఆక్లాండ్‌లో గత 550 సంవత్సరాలలో రెండుసార్లు పేలిన ఒకే ఒక్క పర్వతం ఇది.

‘‘లావా సొరంగాలనేవి ఖాళీ లావా గొట్టాలు. కరుగుతున్న లావా భూమిలోపల ప్రవహించినప్పుడు ఇవి ఏర్పడుతుంటాయి’’ అని కాలిఫోర్నియాలోని మోంటెరే బే అక్వేరియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వోల్కనోలజిస్ట్ డేవిడ్ క్లాగ్ తెలిపారు.

శక్తిమంతమైన విస్ఫోటనాల సమయంలో మోల్టెన్ రాక్ భూమిపైకి వస్తుంది. అది చల్లబడటానికి ముందు, కిందకి కదులుతూ క్రస్ట్ ఏర్పడుతుంది.

చాలా వరకు లావా ప్రవాహాల్లో సొరంగాలు ఏర్పడతాయి. చాలా వరకు ఈ లావాలు ద్రవ రూపంలో ఉండి, వేగంగా ప్రవహిస్తాయని క్లాగ్ చెప్పారు.

లావా సొరంగం

ఫొటో సోర్స్, Getty Images

లావా సొరంగాలు చూడటానికి వింతగా కనిపించే భౌగోళిక రూపాలు మాత్రమే కాదు. లక్షల ఏళ్లుగా వీటికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది.

ఆక్లాండ్‌లో ఉన్న పొడవైన లావా సొరంగం 290 మీటర్లు ఉంది. ఉత్తర అమెరికాలోని హవాయి, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, ఒరెగాన్ వంటి ప్రాంతాలలో ఇలాంటి సొరంగాలు కనిపిస్తాయి.

ఇడాహోలో ఉన్న బాబ్‌కాట్ కేవ్‌లోని ఈ సొరంగాలను స్థానిక అమెరికన్లు అవసరమైన సమయాల్లో ఫ్రిడ్జ్‌గా ఉపయోగించుకునేవారు. జంతువులను వేటాడి జీవించే రోజుల్లో అడవి దున్న మాంసాన్ని దానిలో దాచిపెట్టుకునే వారు.

న్యూజీలాండ్ మావోరి తెగ పూర్వీకులు ఆక్లాండ్ సొరంగాలను పవిత్రమైనవిగా భావించే వారు. చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాలుగా కూడా వాడేవారు. అయితే, కొత్త వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీటిని సరిగా గౌరవించేవారు కాదని స్థానిక మావోరి తెగ వారసత్వ అభ్యాసకుడు మాల్కో‌మ్ పాటర్సన్ తెలిపారు. ఈయన ఆక్లాండ్ ప్రాంతానికి చెందినవారు.

ఈ సొరంగాల కింద 1940ల్లో రహస్యంగా నడిపిన కమ్యూనిస్ట్ ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా గుర్తించారు.

జాక్సన్ ఇన్‌గోల్డ్, కేట్ లెవిస్

ఫొటో సోర్స్, Charlotte Lytton

ఫొటో క్యాప్షన్, జాక్సన్ ఇన్‌గోల్డ్, కేట్ లెవిస్

ఇక్కడ సొరంగాలను గుర్తించి, తవ్వుతున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే బాధ్యతను లెవీస్ టీమ్‌కు అప్పజెప్పారు.

ప్రైవేట్ భూముల్లో గుర్తించిన సొరంగాలను ఎలా మెయింటెయిన్ చేయాలి? అనేది వీరి ముందున్న సవాలు. నగరంలో 90 శాతం భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంది.

అనుకోకుండా బయటపడ్డ సొరంగాల, వస్తువుల కోసం ‘‘యాక్సిడెంటల్ డిస్కవరీ రూల్’’ అనేది ఒకటి ఉంది. సమాధుల్లో మనుషుల అస్థిపంజరాలను లేదా ప్రమాదకర వ్యర్థాలను లేదా పురావస్తు ప్రాంతాన్ని కనుగొంటే అనుసరించే ప్రక్రియనే ఇక్కడ వీటికి కూడా చేపట్టాల్సి ఉంటుంది. వారు వెంటనే ఆ పనిని నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని సంరక్షించాల్సి ఉంటుంది.

నగరవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో, ఎవరైనా సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టిన వెంటనే తమకు ఒక ఫోన్ వస్తుందని లెవిస్ టీమ్ చెబుతోంది. లెవిస్, ఆమె బృంద సభ్యులు ఈ సొరంగాల పరిమాణాన్ని, లక్షణాలను అంచనావేస్తున్నారు.

‘‘మేం సొరంగం లోపలంతా చూసి, కాంట్రాక్టర్లతో, భూయజమానులతో కలిసి ఏం చేయాలన్నదానిపై చర్చిస్తాం. ప్రాజెక్టును డెవలప్ చేస్తూ ఇది దెబ్బతినకుండా ఎలా చూడగలం అన్నది పరిశీలిస్తాం. ఇందుకోసం చాలా కసరత్తు ఉంటుంది.’’ అని అన్నారు.

ప్రైవేట్ యజమానులకు తమ ఇళ్ల కింద పురావస్తు అవశేషాలు దొరకడం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ బాధంతా పడలేక వాళ్లు ఎవరి తెలియకుండా దాచి పెడుతున్నారు.

విషయం తెలిసి పెద్ద ఎత్తున పర్యాటకులు వాటిని చూడటానికి రావడం వారికి నచ్చడం లేదు.

మ్యాపింగ్ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో ఈ సొరంగాలున్న ప్రాంతాల పేర్లను ప్రకటించడం లేదు.

పేర్లు బయటపెడితే భూముల విలువ తగ్గుతుందని కొందరు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా తమ భూమి కింద ఈ సొరంగాలను గుర్తిస్తే, దాన్ని బేస్‌మెంట్‌లాగా మార్చేయడం లేదా స్విమ్మింగ్ పూల్ చేయడమో చేస్తున్నారని లెవిస్ చెప్పారు.

సొరంగాన్ని గుర్తించడం కూడా ప్రమాదకరం. కొన్నిసార్లు తవ్వకాలు జరిపే యంత్రాలు ఆ సొరంగాలలో కూరుకుపోతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.

సొరంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరోపియన్లు రాకముందు కొన్ని సొరంగాలను శ్మశాన వాటికలుగా వాడిన స్థానిక మావోరి తెగ

‘‘మా దగ్గర హౌసింగ్ సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీటిని పెంచుకోవాలి.’’ అని మ్యాపింగ్ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఆక్లాండ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ స్టూడెంట్ జాక్సన్ ఇన్‌గోల్డ్ తెలిపారు.

‘‘ కన్‌స్ట్రక్షన్ కొనసాగితే మరిన్ని భవనాలు వస్తాయి. అందుకోసం తవ్వకాలు జరపాలి. అప్పుడు మరిన్ని సొరంగాలు బయటపడే అవకాశం ఉంటుంది.’’ అని అన్నారు.

వీటివల్ల నిర్మాణ కార్మికులకు పెద్ద ప్రమాదం లేకపోవచ్చు. కానీ, సొరంగాలపై ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం ప్రమాదకరమే.’’ అన్నారు జాక్సన్.

‘‘మనుషులు సృష్టించే సమస్యలతో పాటు, భౌగోళిక పరంగా కూడా సమస్యలున్నాయి. ఏ సమయంలోనైనా ఆక్లాండ్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది’’ అని లెవిస్ చెప్పారు.

భవిష్యత్‌లో ఈ ప్రకృతి వైపరీత్యాలను నిర్మూలించేందుకు, నిరంతర పర్యవేక్షణ, అగ్నిపర్వతాల పేలుళ్లకు అవకాశాలను గుర్తించేందుకు డేవోరా (డిటర్‌మైనింగ్ వొల్కానిక్ రిస్క్ ఇన్ ఆక్లాండ్.) ఒక ప్రణాళికను రూపొందించింది. దీనికి ఎర్త్‌క్వేక్ కమిషన్, ఆక్లాండ్ కౌన్సిల్ ) ఇందుకు నిధులు సమకూరుస్తుంది.

తర్వాత విస్ఫోటనం ఎప్పుడు వస్తుందో స్పష్టంగా తెలియదు. ఆక్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఏడు భిన్నమైన పరిస్థితులను వివరించింది.

‘‘ఒకవేళ అక్కడ విస్ఫోటనం ఏర్పడితే, అదెలా ఉండబోతుంది? అది ఎటు దారి తీస్తుంది, ప్రజలను తరలించడంలో సమస్యలేంటి, మౌలిక సదుపాయలు ఎలా ఉన్నాయి? వంటి అన్ని విషయాలతో డేవోరా దీన్ని రూపొందించింది.

ఆక్లాండ్‌లో లావా సొరంగాలకు చెందిన డేటా బేస్‌ను తొలిసారి రూపొందించడం నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఇదొక అవకాశం అవుతుందని చాలామంది భావిస్తున్నారు. భవిష్యత్‌ ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఉపయోగపడనుంది.

లావా ఎలా ప్రయాణిస్తుందనే దానిపై మరింత తెలుసుకునేందుకు గత లావా ప్రవాహలను పరిశీలించడం సాయపడుతుందని ఇన్‌గోల్డ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇతర అగ్నిపర్వత ప్రాంతాలకు కూడా తాము రూపొందించిన బ్లూప్రింట్ ఉపయోగపడుతుండొచ్చని ఇన్‌గోల్డ్ ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)