శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?

శ్యామ్ పిట్రోడా ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు.

పిట్రోడా రాజీనామాను ఆమోదించినట్టు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు.

స్టేట్స్‌మెన్ ఇంగ్లీషు వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్‌పిట్రోడా భారతీయుల రూపురేఖలను వివిధ దేశాల వారితో పోల్చి చెప్పారు.

ఉత్తర భారతీయులను శ్వేతజాతీయులతోనూ, పశ్చిమాన నివసించేవారిని అరబ్బులతోనూ, తూర్పున నివసించేవారిని చైనీయులతోనూ, దక్షిణాదివారిని ఆఫ్రికన్లతోనూ పోల్చారు.

అయితే శామ్ పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆమోదనీయం కాదని, ఈ వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ చెప్పారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా పిట్రోడా వ్యాఖ్యలను ఖండించాయి.

శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ఇటు ప్రధాని మోదీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఓ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు.

‘‘నాకు ఈరోజు చాలా కోపంగా ఉంది. ఎవరైనా నన్ను తిడితే నాకు కోపం రాదు. సహిస్తాను. కానీ ఈరోజు యువరాజు గురువు ( శామ్ పిట్రోడా) వ్యాఖ్యలు నాకు చాలా కోపం తెప్పించాయి’’ అని మోదీ అన్నారు.

‘‘రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని డాన్స్ చేస్తున్నవారు చర్మం రంగు ఆధారంగా నా దేశ ప్రజలను అవమానిస్తున్నారు’’ అని అన్నారు మోదీ.

ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

ముర్ముపై ప్రధాని ఏమన్నారు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘నేను ద్రౌపది ముర్ముజీ గురించి ఆలోచిస్తున్నాను. ఆమె గిరిజన బిడ్డ. మనం ఆమెను రాష్ట్రపతిని చేయాలని చూస్తే, కాంగ్రెస్ పార్టీ ఆమెను ఓడించడానికి తెగ కష్టపడింది. కాంగ్రెస్‌కు గిరిజనులపై కోపం ఎందుకో అర్థం కావడం లేదు. బహుశా కాంగ్రెస్ యువరాజుకు ఇటువంటి ఆలోచనలు ఉన్నట్టుంది. అందుకే ముర్ముజీని వ్యతిరేకించారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

‘‘ద్రౌపది ముర్మును ఓడించాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రయత్నించిందో ఈరోజు నాకు తెలిసింది. యువరాజుకు అమెరికాలో ఓ అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ యువరాజుకు గురువు, మార్గదర్శి. క్రికెట్‌లో మూడో అంపైర్ ఉన్నట్టే యువరాజు కూడా గందరగోళంలో ఉన్నప్పుడు మూడో వ్యక్తి నుంచి సలహాలు తీసుకుంటారు. ఈ అంకుల్ ఓ గొప్ప రహస్యాన్ని బయటపెట్టారు. చర్మం రంగు నల్లగా ఉన్నవారందరూ ఆఫ్రికన్లలాగా ఉంటారని అన్నారు. నా దేశ ప్రజలను వారి చర్మం రంగు ఆధారంగా ఎంతో అవమానించారు. ద్రౌపది ముర్ముజీని కూడా ఆమె రంగును బట్టి ఆఫ్రికన్ అని భావించి ఉంటారని ఇప్పుడు అర్థమైంది. ఆమె చర్మం రంగు నలుపుకాబట్టి ఆమెను ఓడించాలని చూశారు’’ అని చెప్పారు.

‘‘ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటున్నారు? కృష్ణుడిని పూజించే సంస్కృతి మనది. ఆయన రంగు కూడా మనలాంటి రంగే’’ అని మోదీ చెప్పారు.

శ్యామ్ పిట్రోడా, మోదీ ఫోటో

ఫొటో సోర్స్, THIERRY MONASSE/PUNIT PARANJPE/AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, శ్యామ్ పిట్రోడా, మోదీ

శ్యామ్ పిట్రోడా ఏమన్నారు?

స్టేట్స్‌మెన్ ఇంగ్లీషు వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామ్ పిట్రోడా మాట్లాడారు.

‘‘భారతదేశంలో తూర్పున నివసించే ప్రజలు చైనీయుల్లానూ, పశ్చిమాన ఉండేవారు అరబ్బుల్లానూ, ఉత్తరాది వారు శ్వేతజాతీయుల్లా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ల మాదిరి కనిపిస్తారు. వారెలా ఉన్నారనేది సమస్యే కాదు. ఇంత భిన్నత్వం ఉన్నా దేశాన్నిఐక్యంగా కలిపి ఉంచవచ్చని చూపుతున్నారు. మనంతా సోదరీ సోదరులం’’ అన్నారు పిట్రోడా.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలకు విభిన్నమైన ఆచారాలు ఉన్నాయని, వారి ఆహారం, మతం, భాష అన్నీ వేరుగా ఉంటాయని, కానీ ఒకరినొకరు గౌరవించుకుంటారని పిట్రోడా చెప్పారు.

‘‘కానీ ఈరోజు భారతదేశం అనే భావనపై దేశం నిజంగా విడిపోయింది. ఇది ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనే ప్రశ్న కాదు, నువ్వేం నమ్ముతున్నావనేది అసలైన ప్రశ్నగా మారింది. రెండువైపులా పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి.’’ అని పిట్రోడా పేర్కొన్నారు.

‘‘ఒక వర్గం హిందూ దేశం కావాలంటోంది. నా దృష్టిలో వీరికి ప్రాతినిథ్యం వహిస్తోంది మహాత్మాగాంధీని చంపినవారు. అది తప్పైనా, రైటైనా దీనిపైన చర్చించాలి. వారి దృష్టిలో ఇది హిందూ దేశం. అక్కడ ఇతరులకు చోటు లేదు ప్రత్యేకించి ముస్లింలకు. దేశంలో 20 కోట్ల మంది ముస్లీంలు ఉన్నారు. వారిని విస్మరించలేం’’ అని శామ్ పిట్రోడా తెలిపారు.

‘‘ఈ పార్టీ రామమందిరం, చరిత్ర, వారసత్వం, హనుమాన్, బజరంగదళ్ లాంటి వాటి చుట్టూ తిరుగుతోంది. వారి అభిప్రాయాలను గౌరవిస్తాను’’

‘‘ఇక మరో వైపు ఉన్న వర్గం బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా పోరాడి, దేశానికి పునాది వేసిన వర్గం. వీరి పోరాటం హిందూ దేశం కోసం కాదు, కానీ లౌకిక దేశం కోసం. పాకిస్తాన్ మత రాజ్యంగా మారి ఏం సాధించిందో చూస్తున్నాం’’ అని అన్నారు.

‘‘ప్రజాస్వామ్యం విషయంలో మనం ప్రపంచానికి ఓ మెరుగైన ఉదాహరణగా నిలుస్తున్నాం. 70 ఏళ్ళపాటు ఈ దేశ ప్రజలు సంతోషంగా జీవించారు. మనమందరం సోదరీసోదరులం. మనమందరం విభిన్న సంస్కృతిని, భాషలను, ఆహారపు అలవాట్లను గౌరవిస్తాం. ఇండియా అంటే అదే. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సోదరభావం మౌలికస్వభావం కలిగినదే ఇండియా అని నేను నమ్ముతాను’’ అని పిట్రోడా అన్నారు.

హేమంత బిశ్వ శర్మ, కిరణ్ రిజిజు

ఫొటో సోర్స్, ANI

పిట్రోడా వ్యాఖ్యలపై ఎవరెవరు ఏమన్నారు?

శ్యామ్ పిట్రోడా వ్యాఖాల్యపై అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ స్పందించారు. ‘‘శ్యామ్ భాయ్ నేను ఈశాన్య భారతానికి చెందినవాడిని. కానీనేను భారతీయుడిలా కనిపిస్తాను. వైవిధ్య భారతదేశంలో మనం భిన్నంగా కనిపించొచ్చు. కానీ అందరం ఒక్కటే. దేశం గురించి కాస్త తెలుసుకోండి’’ అన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌‌కు చెందిన కేంద్రమంత్రి కిరణ్ రెజిజు ‘‘రాహుల్ గాంధీ ముఖ్య సలహాదారు దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల మాదిరి, ఈశాన్య ప్రాంత ప్రజలు చైనీయుల్లా ఉంటారని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యల్లోని స్వరం దేశాన్ని విడదీసినట్టుగా ఉంది. ఇది సిగ్గుచేటు’’ అని ట్వీట్ చేశారు.

శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ఖండించారు.

‘‘కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని ఎప్పడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈశాన్య భారతం ఎప్పుడూ భారతదేశంలో భాగమేనని వారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’’ అని ట్వీట్ చేశారు.

బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో అన్నివైపుల నుంచిపూర్తిగా బయటపడింది. దేశం వెలుపలా, బయటా కూడా ఆపార్టీ అసలు రంగు తెలిసిపోయింది అని చెప్పారు.

శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ‘‘నేను ఆయన మాటలతో ఏకీభవించను. ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో సభ్యుడా, కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినరా అని అడగదలుచుకున్నాను. ఆయన దేశంలో టెలికాం విప్లవం తెచ్చారు. ఆయన మాటలను జాతీయ సమస్యగా చిత్రీకరించడం దురదృష్టకరం. దేశంలోని యువత నిరుద్యోగంతో అల్లాడుతోంది మహిళలు అణచివేతకుగురవుతున్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలన్నీమంచిరోజులు కోసం ఎదురుచూస్తున్నాయి. రైతుల దుస్థితి ఏమిటో దేశం చూసింది. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యాలతో దేశానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)