కరెన్సీ నోట్లపై కొత్త మ్యాప్, నేపాల్ నిర్ణయంపై భారత్ ఆగ్రహం ఎందుకు?

ఫొటో సోర్స్, GOLDEN BROWN/GETTY IMAGES
- రచయిత, అశోక్ దహాల్
- హోదా, బీబీసీ నేపాలీ న్యూస్
వంద రూపాయల నోట్లపై కొత్త మ్యాప్ ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేపాల్ నిర్ణయంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే, ఈ నిర్ణయం కొత్తదేమీ కాదని నేపాల్ ప్రధాని పుష్ప్‌కుమార్ దహల్ ప్రచండ అన్నారు.
‘‘పాత మ్యాప్‌తో కూడిన నోట్లు అయిపోయాయి. అందుకే కొత్త నోట్ల ముద్రణకు నేపాల్ రాష్ట్ర బ్యాంకుకు అనుమతిచ్చాం. ఇదో సాధారణ ప్రక్రియ’’ అని నేపాల్ సమాచార శాఖ మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖాశర్మ బీబీసీ నేపాలీ న్యూస్‌తో చెప్పారు.
‘‘వందరూపాయల నోట్లు అయిపోవచ్చాయి. తాజా నోట్లపై కొత్త మ్యాప్‌ను ముద్రిస్తున్నాం. నోట్లపై డిజైన్ మార్పుకు సంబంధించిన నిర్ణయం కేబినెట్ తీసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు’’ అని అన్నారు.
‘‘ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలతో కూడిన కొత్త మ్యాప్‌ను నేపాల్ తన కరెన్సీపై ముద్రించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. వాస్తవ పరిస్థితులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు’’ అంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు.
‘‘మా వైఖరి స్పష్టంగా ఉంది. సరిహద్దు వివాదాల గురించి నేపాల్‌తో నియమిత వేదిక ద్వారా చర్చలు జరుపుతున్నాం. కానీ ఇంతలోనే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నంత మాత్రానా, ఆ ప్రాంతాల వాస్తవ పరిస్థితులు ఏమీ మారిపోవు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కొత్త మ్యాప్‌లో వివాదాస్పద ప్రాంతాలు
కొత్త మ్యాప్‌తో కూడిన 100 రూపాయల నోట్లను మద్రించడానికి కిందటి గురువారం నేపాల్ కేబినెట్ ఆ దేశ రాష్ట్ర బ్యాంకుకు అనుమతిచ్చింది.
నేపాల్ ప్రభుత్వ నిర్ణయంపై భారత్ అసంతృప్తిగా ఉంది.
ప్రచండ ప్రభుత్వ నిర్ణయాన్ని దౌత్య, ఆర్థిక రంగాలలో తీసుకున్న అపరిపక్వ నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు.
కాలాపానీ, లింపియాధుర, లిపులేఖ్‌లతో కూడిన అధికారిక మ్యాప్‌ను నేపాల్ 2020 జూన్‌లో విడుదల చేసింది.
దీనిపై ఈ నెలలో నేపాల్ రాజ్యాంగ సవరణ చేయడంతో, ఈ కొత్త మ్యాప్‌ను దేశ అధికారిక పత్రాలలోనూ వినియోగిస్తున్నారు.
నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కేవలం ప్రచారం కోసమే తీసుకుందని కొందరు విశ్లేషకులు తెలిపారు.
నాలుగేళ్ళ కిందట నేపాల్ విడుదల చేసిన ఈ మ్యాప్‌కు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందలేదు.
నేపాల్‌లో ఏం జరుగుతోంది?
నిరుడు ఆగస్టులో చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పుడు నేపాల్ ప్రభుత్వం తన కొత్త మ్యాప్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఏమైనా చర్యలు తీసుకుంటోందా, లేక పాత మ్యాప్‌నే కొనసాగిస్తుందా అనే సందేహాలు వచ్చాయి.
చైనా తన కొత్త మ్యాప్‌లో నేపాల్ కొత్త మ్యాప్‌ను చూపకపోవడంపై నేపాల్ పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నేపాల్ కొత్త మ్యాప్ గురించి అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారా లేదా అంటూ మాజీ ప్రధాని మాధవ్ కుమార్ సహా అనేక మంది ఎంపీలు నేపాల్ పార్లమెంట్ అంతర్జాతీయ సంబంధాల కమిటీలో ప్రశ్నించారు.
‘‘మ్యాప్ విడుదలైనప్పుడు అప్పటి విదేశాంగమంత్రి ప్రదీప్ గ్యావాలీ మాకు సమాచారం ఇచ్చారు. కానీ ఆ తరువాత మంత్రి అయిన ఎన్‌పీ సౌద్ వద్ద దీనికి సంబంధించిన రికార్డులు లభించలేదు’’ అని అంతర్జాతీయ సంబంధాల కమిటీ చైర్మన్ రాజ్‌కిశోర్ యాదవ్ బీబీసీతో చెప్పారు.
‘‘కొత్త మ్యాప్ సమాచారాన్ని ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సమాజానికి లిఖితపూర్వకంగా పంపారా లేదా అని మేం అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వశాఖ బదులివ్వలేదు’’ అని తెలిపారు.
అప్పటి విదేశాంగ మంత్రి గ్యావాలీ మాత్రం నేపాల్‌లోని అంతర్జాతీయ దౌత్యవేత్తలకు ఈ కొత్త మ్యాప్ గురించి తెలియజేశామని చెప్పారు.
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విదేశాలకు పంపలేదని మంత్రిత్వశాఖలోని సంస్థాగత రికార్డుల ద్వారా తెలుస్తోందని యాదవ్ తెలిపారు.
విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.

కొత్త నోట్లతో కొత్త సమస్యలు
‘‘ కొత్త మ్యాప్‌తో కూడిన నోట్ల ముద్రణ వల్ల భారత్‌తో నేపాల్ వాణిజ్యానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది’’ అని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ మాజీ గవర్నర్, అధ్యక్షుడి సలహాదారు చిరంజీవి నేపాల్ చెప్పారు.
‘‘నేపాల్ రాజ్యాంగం దేశంలో మాత్రమే అమలవుతుంది. కానీ నేపాల్ కరెన్సీ మాత్రం ఇండియా సరిహద్దు ప్రాంతాలలోనూ చెలామణిలో ఉంటుంది’’ అని చిరంజీవి నేపాల్ వివరించారు.
‘‘తెరాయ్, నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో వ్యాపార లావాదేవీలు నెరు (నేపాలీ రూపీ), బారు (ఇండియన్ రూపీ) చెలామణిలో ఉన్నాయి. ఎప్పుడైతే కొత్త మ్యాప్‌తో కూడిన నోట్లు వస్తాయో, అవి సరిహద్దు మార్కెట్‌లో పనిచేసే అవకాశం ఉండదు’’ అని చెప్పారు.
దీంతోపాటు 500 రూపాయల కంటే తక్కువ విలువైన భారతీయ నోట్లు నేపాల్‌లో చెల్లుబాటు అవుతాయి. కానీ నేపాలీ నోట్లు ఇండియాలో చెలామణి కావు.
ఈ కొత్త నోట్ల రాకతో సరిహద్దు ప్రాంతాలలో కూడా నేపాల్ నోట్ల చెలామణిని నిలిపివేస్తూ భారత్ నిషేధం విధించే ప్రమాదం ఉందని చెప్పారు.
‘‘ముందు మనం కొత్త మ్యాప్‌పై అంతర్జాతీయ ఆమోదాన్ని పెంచుకోవాలి’’ అని ఆయన తెలిపారు.

'అంతర్గత కారణాల వల్లే ఈ నిర్ణయం.. '
తన దేశం మ్యాప్‌ను నోట్లపై ముద్రించుకోవడానికి సంబంధించి పొరుగుదేశాలు, ఇతర దేశాలు ఏమనుకుంటాయోనని ఓ సార్వభౌమాధికార దేశం ఆందోళన చెందాల్సిన పనిలేదని, త్రిభువన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఖడ్గ కేసీ సార్వభౌమ్ తెలిపారు.
‘‘ఇది పూర్తిగా ఓ సార్వభౌమాధికార దేశానికి సంబంధించిన విషయం’’ అని చెప్పారు.
‘‘కొత్త మ్యాప్‌తో కూడిన నోట్ల ముద్రణను స్వాగతించాలి. కానీ ఐక్యరాజ్య సమితి, దాని ఏజెన్సీలకు ఇది సరైన పద్ధతిలో తెలియజేసి ఉంటే మరింత ఆమోదయోగ్యంగా ఉండేది. కానీ అలా చేయకుండానే నేపాల్ ముందుకు వెళ్ళింది’’ అని ఖడ్గ తెలిపారు.
తన ప్రాంత హక్కుపై నేపాల్ మొహమాట పడాల్సిన పనిలేదని ఆయన చెప్పారు.
‘‘ఇండియా, చైనా మధ్య అనేక సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ అవి వాటి వాణిజ్య బంధాలపై ప్రభావం చూపలేదు’’ అని తెలిపారు.
‘‘కొత్త మ్యాప్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపగానే, మనకు దౌత్య సంబంధాలు ఉన్న అన్ని దేశాలకు, ఐక్యరాజ్యసమితికి ఆ విషయం తెలియజేసి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఇప్పటికైనా దీనిపై ఓ లేఖ రాసి, అప్పుడు నోట్లపై ముద్రించడం సరైన చర్య అవుతుంది’’ అంటారు ఖడ్గ.
నేపాల్ ప్రభుత్వం దీర్ఘకాలిక పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా నోట్లపై కొత్త మ్యాప్‌ను ముద్రించడానికి పూనుకుందని అంతర్జాతీయ సంబంధాల కమిటీ చైర్మన్ రాజ్‌కిశోర్ యాదవ్ కూడా చెప్పారు.
‘‘ఈ నిర్ణయం కేవలం అంతర్గత కారణాల వల్ల తీసుకున్నారు. ఇది మన ప్రయోజనాలపై ఎంత ప్రభావం చూపుతుంది, ఎంతవరకు ప్రయోజనకారి అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు’’ అని తెలిపారు.
నేపాల్ ఇంతకుముందు విడుదల చేసిన మ్యాప్‌లో చూపిన ప్రాంతాలలోకి నేపాల్ ప్రభుత్వం ప్రవేశించే అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- World Asthma Day: ఆస్తమా ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘మా నాన్న సీఎం’
- హీట్ వేవ్: ఉష్ణోగ్రత 37C దాటితే మన శరీరానికి ఏమౌతుంది? మెదడు ఎలా స్పందిస్తుంది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














