ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఒప్పందం ఎందుకు కుదరలేదు, కాల్పుల విరమణ సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ గ్రిట్టన్
- హోదా, బీబీసీ న్యూస్
గాజాలో కాల్పుల విరమణ కొత్త ప్రతిపాదన ఇజ్రాయెల్ కనీస డిమాండ్లకు ఏమాత్రం దగ్గరగా లేదని, అయితే చర్చలు మాత్రం కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
కాల్పుల విరమణ కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తులు తమ ముందుంచిన షరతులను అంగీకరించినట్లు హమాస్ ప్రకటించిన సమయంలోనే ఆయన ప్రకటన కూడా వచ్చింది.
''బంతి ఇప్పుడు ఇజ్రాయెల్ కోర్టులోనే ఉంది'' అని హమాస్ అధికారి అన్నారు.
హమాస్ అంగీకారం తెలిపిన ఒప్పంద ప్రతిపాదన ''ఇజ్రాయెల్ కనీస డిమాండ్లకు దూరంగా ఉంది'', అయినా చర్చలు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
అదే సమయంలో, ఇజ్రాయెల్ టీవీలో వచ్చిన కథనాల ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు, యుద్ధ ట్యాంకులు రఫా బోర్డర్ క్రాసింగ్ సమీపంలో కనిపించాయి.
దానికి ముందు, రఫాలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. రఫా తూర్పు ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే శరణార్థులకు ఇజ్రాయెల్ సూచించింది. హమాస్ లక్ష్యంగా రఫాలో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది.
ఇజ్రాయెల్ సైనిక చర్య రఫాలో లక్షలాది మందిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. చాలా మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి గాడిదలు లాగుతున్న బండ్లపై వెళ్లిపోవడం కనిపించింది.
ఖాన్ యూనిస్ సమీపంలోని శిబిరం నుంచి ఖాళీ చేయాలని లక్ష మందిని ఇజ్రాయెల్ ఆదేశించింది.
రఫా తూర్పు ప్రాంతాలను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలను యుద్ధంలో ''ప్రమాదకరమైన మలుపు''గా హమాస్ అధికారి ఒకరు అభివర్ణించారు.
కాల్పుల విరమణ ఒప్పందం లక్ష్యం ఏంటంటే, కొద్దివారాల పాటు ఇరువర్గాలు కాల్పులు విరమించడం, హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను విడుదల చేయడం.

ఫొటో సోర్స్, REUTERS
హమాస్ ఏమంటోంది?
కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియే ఖతార్ ప్రధాన మంత్రి, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌కి సమాచారం అందించినట్లు సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో హమాస్ పేర్కొంది.
తమ షరతులకు ఒప్పుకుంటే ''వ్యతిరేక కార్యకలాపాలకు శాశ్వత ముగింపు'' పలుకుతామని హమాస్ అంగీకరించిందని, ఈ ప్రతిపాదన గురించి బాగా తెలిసిన ఒక సీనియర్ పాలస్తీనియన్ అధికారి బీబీసీతో చెప్పారు.
హమాస్ తన సాయుధ పోరాటాన్ని ముగించాలని భావిస్తున్నట్లు ఈ ప్రకటన సూచిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడించలేదు. రెండు దశల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఒక్కో దశ గడువు 42 రోజులు.
ఒప్పందం మొదటి దశలో భాగంగా, హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులను విడుదల చేస్తారు. అలాగే, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 50 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది. వారిలో జీవిత ఖైదు పడిన వారు కూడా ఉన్నారు.
ఈ సమయంలో ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలోనే ఉంటాయి. కానీ, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లో గాజా మధ్య ప్రాంతం, సలా అల్-దిన్ రోడ్డు వద్ద నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటుంది. ఇది ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ఉండే తీరప్రాంత రహదారి.
11 రోజుల అనంతరం, స్థానచలనం కలిగిన పాలస్తీనియన్లను ఉత్తరం వైపు ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తారు.
ఇక కాల్పుల విరమణ రెండో దశ ఇరుప్రాంతాల మధ్య శాంతియుత వాతావరణం, గాజాలో ఆంక్షల ఎత్తివేతతో మగుస్తుందని ఒక అధికారి తెలిపారు.
''కాల్పుల విరమణను అంగీకరించినా, లేదా ఆ ఒప్పందాన్ని అడ్డుకున్నా, బంతి ఇప్పుడు ఇజ్రాయెల్ కోర్టులోనే ఉంది'' అని హమాస్ సీనియర్ అధికారి ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఇజ్రాయెల్ వాదనేంటి?
హమాస్ ప్రకటన గురించి తెలియగానే గాజా ప్రజల్లో సందడి వాతావరణం కనిపించింది.
హమాస్ అంగీకారం తెలిపిన ప్రతిపాదన ఈజిస్ట్ ప్రతిపాదనకు 'సాఫ్ట్ వెర్షన్' అని, అందులో ఆమోదయోగ్యం కాని, ఇజ్రాయెల్ అంగీకరించబోని విషయాలు ఉన్నాయని, ఆ ప్రతిపాదనకు ఆమోదం దాదాపు అసాధ్యమని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఇజ్రాయెల్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.
"ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరిస్తున్నట్లుగా చిత్రీకరించేందుకు ఉద్దేశించిన ఉచ్చులా కనిపిస్తోంది'' అని అధికారి తెలిపారు.
ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ''హమాస్ అంగీకారం తెలిపిన ప్రతిపాదన ఇజ్రాయెల్ కనీస డిమాండ్లకు దూరంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు ఆమోదయోగ్యమైన షరతులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయెల్ మధ్యవర్తుల ప్రతినిధి బృందాన్ని పంపుతుంది'' అని అందులో పేర్కొన్నారు.
''బందీల విడుదల, హమాస్ సైన్యాన్ని మట్టుబెట్టడం ద్వారా హమాస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రఫాలో తమ సైనిక చర్యను కొనసాగించాలని ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ నిర్ణయించింది. భవిష్యత్తులోనూ గాజా ముప్పుగా మారకూడదని ఇజ్రాయెల్ భావిస్తోంది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తూర్పు రఫాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన సమయంలోనే, ఈ ప్రకటన వచ్చింది.
ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదిరేలా అమెరికా ప్రయత్నాలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాకు తెలిపారు. హమాస్ స్పందనను సమీక్షిస్తున్నామని, మిత్రపక్షాలతో చర్చిస్తున్నట్లు చెప్పారు.
''బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందం ఇజ్రాయెల్ ప్రజాప్రయోజనాలకు సంబంధించినదని ఇప్పటికీ భావిస్తున్నాం. ఇది పాలస్తీనియన్లకు కూడా మంచి ఒప్పందమే'' అని ఆయన చెప్పారు.
''దీని వల్ల తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది. మానవతా సాయం అందించడానికి కూడా వీలుపడుతుంది. అందువల్ల ఈ విషయం గురించి అన్ని వర్గాలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాం.''
గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై హమాస్ ఫైటర్స్ దాడి చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో కనీసం 1200 మంది మరణించారు. 250 మంది బందీలుగా ఉన్నారు.
ఆ దాడికి ప్రతిస్పందనగా గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇప్పటి వరకూ 34,700 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
గత ఏడాది నవంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం హమాస్ 105 మంది బందీలను విడుదల చేసింది. ఆ సమయంలో వారం రోజుల పాటు కాల్పుల విరమణ అమలైంది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలు కూడా విడుదలయ్యారు.
ఇప్పటికీ గాజాలో 128 మంది బందీల ఆచూకీ తెలియలేదని ఇజ్రాయెల్ తెలిపింది. వారిలో 34 మంది మరణించినట్లు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- జకియా వార్దక్: ఈ మహిళా దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేశారా, ముంబయి ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?
- ‘డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా దాడి చేశారు’ అంటూ ఎంపీ ఆరోపణ, అసలేం జరిగింది?
- ఇరాన్ నుంచి చమురును తరలించేందుకు చైనా ఎన్ని ఉపాయాలు చేస్తోందంటే..
- బ్యాడ్ ఇంటర్వ్యూ: ‘నన్ను ఆవులా అరవమన్నారు, మోకాళ్ల మీద పాకమన్నారు'
- మగవాళ్లను నపుంసకులుగా మార్చే వీడియోలు పోస్టు చేసి లక్షల యూరోలు ఆర్జించిన వెబ్సైట్ కథ ఏంటి?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














