ఇరాన్ నుంచి చమురును తరలించేందుకు చైనా ఎన్ని ఉపాయాలు చేస్తోందంటే..

ఇరాన్ ఓడలు

ఫొటో సోర్స్, Getty Images

ఏప్రిల్ నెల మధ్యలో ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ 300కి పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది.

అప్పటి నుంచి ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులే మూలాధారం.

దేశానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించినా 2024 మొదటి త్రైమాసికంలో ఇరాన్ 35.8 బిలియన్ డాలర్ల (దాదాపు 2 లక్షల 98 వేల కోట్ల రూపాయలు) విలువైన చమురు ఎగుమతులు చేసింది. గత ఆరేళ్లలో ఇదే అత్యధికమని ఇరాన్ కస్టమ్స్ చీఫ్ తెలిపారు.

అయితే, ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, ఆంక్షలు విధించినా ఇరాన్ లాభాలు ఎలా ఆర్జిస్తోంది?

ఇరాన్‌కు అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయిన చైనా వాణిజ్య విధానంలోనే దానికి సమాధానముంది.

అమెరికా హౌస్ ఫైనాన్షియల్ కమిటీ నివేదిక ప్రకారం, ఇరాన్ మొత్తం ఎగుమతుల్లో చైనాకే 80 శాతం వెళ్తోంది. ఇరాన్ నుంచి చైనా ప్రతిరోజూ 15 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తోంది.

ఇరాన్ అధ్యక్షుడు రైసీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ నుంచి చైనా చమురు ఎందుకు కొంటోంది?

ఇరాన్ చమురు చౌకైనది, నాణ్యతలోనూ ఉత్తమం.

ప్రపంచంలో జరుగుతున్న అనేక ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ, ఇరాన్ తక్కువ ధరలకే చమురును అమ్ముతోంది.

వ్యాపారులు, షిప్ ట్రాకర్ల నుంచి 2023 అక్టోబర్‌లో వార్తా సంస్థ రాయిటర్స్ డేటా సేకరించింది. ఆ గణాంకాల ప్రకారం, 2023లో తొలి తొమ్మిది నెలల్లో ఇరాన్, రష్యా, వెనెజ్వేలా దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా చైనా దాదాపు 10 బిలియన్ డాలర్లను (దాదాపు 83,381 కోట్ల రూపాయలు) ఆదా చేసింది. ఆయా దేశాల నుంచి రాయితీ ధరలకు చమురు లభ్యమయ్యేది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తరచూ మారుతూ ఉన్నప్పటికీ, బ్యారెల్‌ 90 డాలర్ల లోపే ఉంటోంది.

ఇరాన్ బ్యారెల్‌కు 5 డాలర్ల తగ్గించి విక్రయిస్తోందని డేటా అనలిటిక్స్ సంస్థ 'కెప్లర్'కు చెందిన సీనియర్ విశ్లేషకులు హుమాయున్ ఫలక్‌‌షాహీ అంచనా వేశారు. గత ఏడాది ఆ తగ్గింపు 13 డాలర్ల వరకూ ఉంది.

ప్రపంచ రాజకీయాలు కూడా అందుకు ఒక కారణమని ఫలక్‌షాహీ భావిస్తున్నారు.

''ఇది అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఆటలో భాగం'' అని ఆయన అన్నారు.

''ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా చైనా మిడిల్ ఈస్ట్‌ రీజియన్‌లో అమెరికాకు భౌగోళికంగా, రాజకీయంగా సైనిక సవాళ్లను పెంచుతోంది. మరీముఖ్యంగా ప్రస్తుతం ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.''

మరోవైపు, వాణిజ్యం కోసం చైనా, ఇరాన్‌లు మెరుగైన వ్యవస్థను సిద్ధం చేసుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా చైనా బిలియన్ డాలర్లను ఆదా చేసింది.

చైనా టీపాట్‌లు

''చైనీస్ టీపాట్‌లు (చిన్నతరహా స్వతంత్ర శుద్ధి కర్మాగారాలు), డార్క్ ఫ్లీట్ (చమురు ట్యాంకర్లు), అంతర్జాతీయంగా పరిమిత స్థాయిలో లావాదేవాలకు అవకాశం ఉన్న చైనాకు చెందిన ప్రాంతీయ బ్యాంకులు ఈ వాణిజ్య వ్యవస్థలో ముఖ్యమైనవి'' అని అట్లాంటిక్ కౌన్సిల్‌లో ఎకనమిక్ స్టేట్‌క్రాఫ్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ మయా నికోలాడ్జ్ బీబీసీతో చెప్పారు.

ఇరాన్ నుంచి వచ్చిన చమురును శుద్ధి చేసే ప్లాంట్‌లు ఈ టీపాట్‌లు. ఇవి (సెమీ గవర్నమెంట్) ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ప్రైవేటు రిఫైనరీలు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారీ కంపెనీలకు ఇవి ప్రత్యామ్నాయం.

''ఈ పరిశ్రమలను టీపాట్‌లుగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో చాలా తక్కువ సౌకర్యాలతో ఉన్న ఈ రిఫైనరీలు టీపాట్‌ల మాదిరిగా కనిపించాయి. బీజింగ్‌కు ఆగ్నేయంగా ఉండే షాన్‌డాంగ్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీటిని టీపాట్‌లుగా పిలుస్తున్నారు'' అని ఫలక్‌షాహీ చెప్పారు.

చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలోని పెద్ద కంపెనీలతో పోలిస్తే ఈ చిన్నతరహా రిఫైనరీలు తక్కువ నష్టదాయకం. ఎందుకంటే, పెద్ద కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అందువల్ల అమెరికా వాణిజ్య వ్యవస్థతో అనుసంధానం కావాల్సి వస్తుంది.

''చిన్న రిఫైనరీలు విదేశాల్లో వ్యాపారాలు చేయవు, వాటికి డాలర్లతో పనిలేదు, లేదా విదేశీ నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు'' అని ఫలక్‌షాహీ అన్నారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

డార్క్ ఫ్లీట్స్

మహాసముద్రాల్లో చమురు ట్యాంకర్లు ఎక్కడ ఉన్నాయో సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. ట్యాంకర్లు ఉన్న ప్రదేశం, వాటి వేగం, వెళ్తున్న మార్గాన్ని కూడా ట్రాకర్ల ద్వారా పర్యవేక్షిస్తారు.

''ఈ ట్రాకింగ్ వ్యవస్థకు దొరక్కుండా ఉండేందుకు ఇరాన్, చైనా ట్యాంకర్ల నెట్‌వర్క్‌ను సృష్టించాయి. దీని వల్ల ట్యాంకర్లు ఎక్కడున్నాయనే కచ్చితమైన సమాచారం తెలియదు''

''ఇది పాశ్చాత్య దేశాల ట్యాంకర్లు, షిప్పింగ్ సేవలు, బ్రోకరేజీ సేవలందించే సంస్థలకు అంతుచిక్కదు. అందువల్ల చైనా పాశ్చాత్య దేశాల నిబంధనలను, ఆంక్షలను పాటించాల్సిన అవసరం ఏర్పడదు'' అని నికోలాడ్జ్ చెప్పారు.

చమురును ఒక నౌక నుంచి మరో నౌకలోకి మారుస్తారని నిపుణుల అంచనా. సముద్ర జలాల్లో అంతర్జాతీయ సరిహద్దుల వెలుపల ఈ చమురు బదిలీలు జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి, తద్వారా ఆ ప్రదేశం, కార్యకలాపాలను ట్రాక్ చేయలేరు. అప్పుడు, ఆ చమురు చైనాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కష్టం.

ఈ కార్యకలాపాలు సాధారణంగా ఆగ్నేయాసియా జలాల్లో జరుగుతాయని కెప్లర్ అంచనాలు సూచిస్తున్నాయి.

''సింగ‌పూర్, మలేషియాకు తూర్పున ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఎప్పటి నుంచో కార్గో షిప్‌లలో ఒకదాని నుంచి మరోదానికి గూడ్స్ మారుస్తుంటారు'' అని ఆమె చెప్పారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత రీబ్రాండింగ్

''మలేషియా జలాల నుంచి మరో నౌక ఈశాన్య చైనాకు ముడి చమురును తీసుకెళ్తుంది. ఆ ముడిచమురు ఇరాన్ నుంచి వచ్చింది కాదు, మలేషియా నుంచి వచ్చిందని చూపించడమే దాని ఉద్దేశం.

యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేటివ్ (ఈఐఏ) ప్రకారం, 2022తో పోలిస్తే 2023లో మలేషియా నుంచి చైనాకు ముడిచమురు దిగుమతులు 54 శాతం పెరిగినట్లు కస్టమ్స్ డేటా చూపుతోంది.

నిజానికి, మలేషియా చైనాకు ఎగుమతి చేస్తున్న చమురు, ఆ దేశ మొత్తం చమురు ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ.

''అందుకే మలేషియా నివేదికల్లో చూపుతున్న చమురు వాస్తవానికి ఇరాన్ నుంచి ఎగుమతి అవుతున్న చమురుగా భావిస్తున్నారు'' అని అట్లాంటిక్ కౌన్సిల్‌ అనలిస్ట్ నికోలాడ్జ్ అభిప్రాయపడ్డారు.

గత ఏడాది జూలై, అక్టోబర్ నెలల్లో ''అనధికారికంగా చమురు బదిలీ'' చేస్తున్న ఇరాన్ ట్యాంకర్లను మలేషియా, ఇండోనేషియా అధికారులు సీజ్ చేసినట్లు నివేదికలొచ్చాయి.

చిన్న బ్యాంకుల నుంచి చెల్లింపులు

ఇరాన్, చైనా మధ్య లావాదేవీలు పశ్చిమ దేశాల పర్యవేక్షణలోని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ద్వారా కాకుండా చిన్నచిన్న చైనా బ్యాంకుల ద్వారా జరుగుతాయని మయా నికోలాడ్జ్ చెబుతున్నారు.

''ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల కలిగే నష్టాల గురించి చైనాకు బాగా తెలుసు, అందుకే ఈ లావాదేవీల్లో ప్రధాన బ్యాంకులను భాగస్వాములను చేసేందుకు ఇష్టపడడం లేదు'' అని ఆమె చెప్పారు.

''అందుకు బదులుగా అంతర్జాతీయంగా ఎలాంటి ఇబ్బందులూ లేని చిన్నచిన్న బ్యాంకులను ఉపయోగిస్తుంది.''

డాలర్లలో చెల్లింపులను నివారించేందుకు ఇరాన్‌‌కు చైనా కరెన్సీలో చెల్లిస్తున్నట్లు భావిస్తున్నారు.

''ఆ డబ్బు ఇరాన్‌తో సంబంధాలున్న చైనీస్ బ్యాంకుల ఖాతాల్లో జమవుతుంది. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఆ డబ్బును ఉపయోగిస్తారు. అందులో ఎక్కువ భాగం ఇరాన్‌‌కు వెళ్తుంది.

ఈ మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తంగా అనిపిస్తుంది, అసలు మొత్తం డబ్బు ఇరాన్‌కు వెళ్తుందో లేదో అర్థం చేసుకోవడం కూడా కష్టం'' అని ఫలక్‌షాహీ వివరించారు.

ఆర్థిక లావాదేవీలను, వాటి మార్గాలను మరింత రహస్యంగా ఉంచేందుకు ఇరాన్ తమ దేశంలోనే ''మనీ ఎక్స్ఛేంజ్ హౌస్‌''లను వినియోగిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

చమురు ధరలు మరింత పెరుగుతాయన్న భయం

యుక్రెయిన్‌కు విదేశీ సాయానికి సంబంధించిన ప్యాకేజీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్ 24న సంతకం చేశారు. అందులో ఇరాన్ చమురుపై మరిన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి.

ఈ కొత్త చట్టం ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చే చమురని తెలిసి ప్రాసెస్ చేసే విదేశీ పోర్టులు, నౌకలు, రిఫైనరీలకు కూడా నిషేధం వర్తిస్తుంది.

బహుశా ఆంక్షలను పూర్తిగా అమలు చేసేందుకు అమెరికా సంకోచిస్తోందని కెప్లర్స్‌కి చెందిన నిపుణులు ఫలక్‌షాహీ అభిప్రాయపడ్డారు.

''సొంత దేశంలో చమురు ధరలను నియంత్రించడమే బైడెన్ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం. ఇది ఆ దేశ విదేశాంగ విధానం కంటే కూడా ముఖ్యమైనది'' అని అన్నారాయన.

పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలతో ఏర్పాటైన సంస్థ(ఓసీఈసీ - ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్)లో ఇరాన్ మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారు. రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో దాదాపు 3 శాతం.

ఇరాన్ నుంచి చమురు సరఫరా నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

''ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను అమెరికా నియంత్రిస్తే, మార్కెట్లో చమురు సరఫరా తగ్గుతుంది. అది ముడిచమురు ధరలను పెంచుతుందని బైడెన్‌కు తెలుసు. అదే జరిగితే అమెరికాలో కూడా గ్యాస్ ధరలు పెరుగుతాయి'' అని ఫలక్‌షాహీ అన్నారు.

ఎన్నికల ముందు బైడెన్ ఆ పరిస్థితి కోరుకోవడం లేదని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)