పదేపదే ఇంటర్నెట్ షట్‌డౌన్లు.. కారణమేంటి?

- రచయిత, జాయ్ టిడీ
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్ని కలిపేందుకు కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నా, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఇంటర్నెట్ స్వేచ్ఛ మాత్రం క్రమక్రమంగా తగ్గిపోతోంది.
లాగోస్‌లో వెచ్చటి ఇసుక తిన్నెలలో కూర్చుని చూస్తున్నప్పుడు, ఒక భారీ సముద్ర జీవి నీలివర్ణపు జలాల నుంచి నగరం వైపుకి దూసుకొస్తున్నట్లు కనిపిస్తుంది.
అది చూడటానికి ఈల్ (ఒకరకం చేప) రూపంలో కనిపిస్తూ, నాజుకుగా సున్నితంగా ఉంది. దీని సైజు ఒక పెద్ద ఇల్లంత ఉంటుంది. కానీ, పొడవు మాత్రం కొలవలేనిది.
ఆ కొన నుంచి ఈ కొనకు దాదాపు 45 వేల కి.మీ.లు ఉంటుంది. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఈ తీగతో చుట్టేయవచ్చు.

ఫొటో సోర్స్, 2Africa
‘2ఆఫ్రికా’ ( ప్రాజెక్ట్ పేరు) అనేది ఇప్పటి వరకు రూపొందించిన అతిపెద్ద సబ్‌సీ ఇంటర్నెట్ కేబుల్. దీన్ని తయారు చేయడాని నాలుగేళ్లు పట్టింది. కనీసం ఒక బిలియన్ డాలర్లు ( సుమారు రూ. 8300 కోట్లు) ఖర్చు అయి ఉంటుంది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలను ఈ కేబుల్ ప్రాజెక్టు కలుపుతుంది.
33 దేశాల్లో 46 ప్రాంతాలను కవర్ చేస్తూ, ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను అందించేందుకు దీన్ని సిద్ధం చేశారు.
ఈ కేబుల్‌కు చెందిన కొన్ని సెక్షన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాదికి ఈ కేబుల్ సంబంధించిన పనులన్ని పూర్తవుతాయి.
ప్రస్తుతం ఆఫ్రికాలో సేవలందిస్తున్న అన్ని సబ్‌సీ కేబుల్స్‌కు చెందిన మొత్తం ఇంటర్నెట్ సామర్థ్యానికి మించిన సేవలను హైటెక్ కేబుల్ అందించనుంది.
వివిధ దేశాలకు చెందిన నిపుణులు, మెటా, చైనా మొబైల్, వొడాఫోన్ లాంటి దిగ్గజ ఇంటర్నెట్ సంస్థలు, పెట్టుబడులతో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నెట్ ప్రాజెక్ట్ ఇది.
‘2ఆఫ్రికా’ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు 70 శాతం ప్రపంచ జనాభాను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఈమెయిల్స్ పంపడం నుంచి ఆన్‌లైన్‌లో వీడియోలు చూడటం వరకు ప్రతి పనికోసం మనం సబ్‌సీ కేబుల్స్‌పైనే ఆధారపడతాం.

ఫొటో సోర్స్, 2Africa
కొన్నిసార్లు దేశమంతా కూడా కొన్ని కేబుల్స్‌పైనే ఆధారపడుతుంది. అప్పుడప్పుడు అవి బ్రేక్ అవుతుండొచ్చు. ఇంటర్నెట్ సేవలలో అంతరాయం ఏర్పడవచ్చు.
చేపల దాడులు, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం, కొన్నిసార్లు అనుకోని విధ్వంసక ఘటనలు ఇంటర్నెట్ కనెక్టివిటీకి ప్రమాదకరంగా మారుతున్నాయి.
అయితే, అతిపెద్ద ప్రమాదం, ముప్పు మాత్రం వివిధ దేశాలలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల నుంచే వస్తుంది.
Top10VPN.com అనే సంస్థలో కనెక్టివిటీ రీసెర్చర్లు సేకరించిన వార్షిక డేటాలో, బ్లాక్ అవుట్‌ల ట్రెండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
భారత్‌లోనైతే, పరీక్షలలో మోసాలను అరికట్టడం నుంచి అల్లర్లను నిరోధించడం వరకు...చాలాసార్లు బ్లాక్ అవుట్‌ల వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది.
2019 నుంచి 2023 వరకు గత ఐదేళ్లలో షట్‌డౌన్ల సంఖ్య పెరిగినట్లు కింద పేర్కొన్న మ్యాప్ సూచిస్తుంది. ఎక్కువ ఎరుపు రంగు ఉన్న దేశాలు ఎక్కువ షట్‌డౌన్లను ఎదుర్కొన్నాయి.
లేత పసుపు రంగులో ఉన్న దేశాలు ఒకటి నుంచి ఐదు షట్‌డౌన్లు, ముదురు ఎరుపు రంగు దేశాలు కనీసం 20 షట్‌డౌన్లు కనిపించాయి.
Top10VPN.com అంచనాల ప్రకారం 2019లో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఇంటర్నెట్ షట్‌డౌన్లు

Top10VPN.com ప్రకారం 2023లో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఇంటర్నెట్ షట్‌డౌన్స్

గత ఐదేళ్లలో షట్‌డౌన్లు పెరిగాయని, అత్యంత ఎక్కువగా 2023లోనే కనిపించాయని తాజా పరిశోధనలలో వెల్లడైంది.
2019.. 134 షట్‌డౌన్లు
2020.. 93 షట్‌డౌన్లు
2021.. 57 షట్‌డౌన్లు
2022.. 130 షట్‌డౌన్లు
2023.. 225 షట్‌డౌన్లు
ఇప్పటి వరకు మరే ఇతర దేశాలలో లేని విధంగా భారత్‌లో ఎక్కువ షట్‌డౌన్లు కనిపిస్తున్నాయి. ఇవి పెరుగుతున్నాయి కూడా. ఇంటర్నెట్ పౌరుల హక్కు కాదని, కేవలం పరిపాలనా సాధనం మాత్రమేనని నాయకులు భావిస్తున్నారు.
‘‘పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రజల హక్కుగా ఇంటర్నెట్‌కు యూనివర్సల్ యాక్సెస్ కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం ప్రివిలేజ్ కాదు’’ అని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
ఇది కేవలం బ్లాక్ అవుట్లకు సంబంధించినది కాదని తెలిపింది.
పరిశోధకులు ఇచ్చిన స్కోర్ల ఆధారంగా గత ఐదేళ్లలో తగ్గిపోతున్న ఇంటర్నెట్ ఫ్రీడమ్ స్థితి ఎలా ఉందో కింది మ్యాప్ చూపిస్తుంది.
ఎరుపు రంగులో ఉన్న దేశాలలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో సెన్సార్‌షిప్, నిఘా ఆధారంగా దేశాలను అనాలసిస్ చేసే ఫ్రీడమ్ హౌస్‌లో వెల్లడైంది. ఎన్ని వెబ్‌సైట్లు బ్లాక్ చేశారో కూడా ఇది వెల్లడించింది.
ఫ్రీడమ్ హౌస్ ఇండెక్స్ స్కోర్ల ఆధారంగా 2019లో ఇంటర్నెట్ ఫ్రీడమ్

ఫ్రీడమ్ హౌస్ ఇండెక్స్ స్కోర్ల ఆధారంగా 2023లో ఇంటర్నెట్ ఫ్రీడమ్

వరుసగా 13 ఏళ్ల నుంచి ఇంటర్నెట్ ఫ్రీడమ్ తగ్గుతూ వస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఇరాన్, మియన్మార్‌లో ఇది ఎక్కువగా ఉంది. చైనాలో కూడా అత్యంత దారుణమైన ఆన్‌లైన్ వ్యవస్థ ఉంది.
ఇదేదో నిరాశతో చెబుతున్న విషయం కాదు. మనకు తెలిసిన ఇంటర్నెట్ క్రమంగా చచ్చిపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ ఎందుకు?
ఇంటర్నెట్‌ను నియంత్రించే విధానాలు పుష్కలంగా ఉన్నా, వాటిని ఉపయోగించే విషయంలో ప్రభుత్వాలు ఇంకా పూర్తిస్థాయిలో ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ ట్రెండ్ ఒక దిశలో మాత్రమే వెళుతోందని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఇంటర్నెట్ అనేది గ్లోబల్ స్పేస్‌గా ఉంటూ.. ప్రభుత్వ నియంత్రణలను మించి ప్రజలను చేరుకుంటుందని తొలినాళ్లలో భావించారు. ప్రతిచోటా ఇలానే ఉండాలనుకున్నారు. కానీ, ఇదొక భ్రమ.’’ అని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ ఫెలో జాకీ కెర్ర్ అన్నారు.
టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మాత్రమే ఇలాంటి భ్రమలు పుడుతుంటాయని కెర్ర్ చెప్పారు.
ఇంటర్నెట్ నియంత్రణలో చైనాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అత్యంత ఖరీదైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ సొల్యుషన్స్‌లతో గ్రేట్ ఫైర్‌వాల్‌ను నిర్మించడం ద్వారా చైనా దీన్ని సాధించింది.
ఇంటర్నెట్ లైవ్‌ను సెన్సార్ చేసేందుకు ప్రజలు ఏం షేర్ చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇంటర్నెట్ వాచర్ల సైన్యాన్ని ఇది ఏర్పాటు చేసింది.
ఈ పరికరాలు చౌకగా, తేలికగా దొరుకుతుండటంతో ఇతర దేశాలు కూడా దీన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇంటర్నెట్ ఫోన్‌బుక్‌గా అభివర్ణిస్తున్న డొమైన్ నేమ్ సిస్టమ్‌ను తక్కువ ఖర్చులో సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని రష్యా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. దీని ద్వారా ప్రధాన అంతర్జాతీయ ఇంటర్నెట్ నుంచి సంబంధాలు తెంచేసుకోవాలని చూస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో రష్యా వాటా 2 పాయింట్లు తగ్గింది.
‘‘డిజిటల్ నిరంకుశతత్వం కచ్చితంగా పెరుగుతుంది’’ అని ఇంటర్నెట్ రైట్స్ గ్రూప్ ‘యాక్సెస్ నౌ’ కు చెందిన మార్వా ఫటాఫ్టా తెలిపారు.
ఉదాహరణకు 2ఆఫ్రికా లబ్దిదారులలో ఒకటైన సౌదీ అరేబియాకు అసమ్మతి స్వరాలను నిరోధించే, శిక్షించే, నియంత్రించే దేశంగా పేరుంది. ఇప్పుడు ఆ దేశ రాజధాని రియాద్‌కు ఈ కంపెనీ చేరుకుంది
స్థానికంగా విస్తరించాలనుకునే కంపెనీలు ముందుగా ప్రభుత్వంతో ఒప్పందానికి రావాలని ఆ దేశం ఓ చట్టాన్ని కూడా రూపొందించింది. భారత్, తుర్కియే, జర్మనీలలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తున్నాయి.
‘‘ఇది కచ్చితంగా పెరుగుతున్న ప్రమాదంగా నాకు అనిపిస్తున్నాయి’’ అని ఇంటర్నెట్ రైట్స్ గ్రూప్ యాక్సెస్ నౌ మార్వా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో పెరుగుతున్న నియంత్రణ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.
పూర్తిగా పశ్చిమ దేశాల ఇంటర్నెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో చైనా ముందు వరసలో ఉంది. ఎన్నో ఏళ్లుగా రష్యా పశ్చిమ దేశాల సంస్థలకు పోటీగా వచ్చే యాప్‌లను ప్రోత్సహిస్తోంది. యాండెక్స్ కంపెనీ గూగుల్, ఉబర్‌లను సవాలు చేస్తుంది. వీకే యాప్‌కు ఆదరణ పెరుగుతుండగా, ఫేస్‌బుక్ కు తగ్గుతోంది. యూట్యూబ్‌కు రూబ్యూట్ సమాధానంగా నిలుస్తుంది.
యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి ఆక్రమణ ప్రారంభించిన తర్వాత, రష్యాకు వ్యతిరేకంగా పనిచేసే అమెరికా సంస్థలను బలవంతంగా బయటికి పంపేయడానికి క్లెమ్లిన్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, 2Africa
భౌగోళిక రాజకీయ ఘర్షణలు పెరుగుతుండటంతో, భారత్ కూడా ఎన్నో చైనా యాప్‌లను తన యాప్ స్టోర్ల నుంచి నిషేధించింది.
కొన్ని పశ్చిమ దేశాలు కూడా స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌కు మీద ఆసక్తి చూపడం లేదు.
తమ దేశంలో పుట్టిన సోషల్ నెట్‌వర్క్‌ల ఆధిపత్యాన్ని చైనాకు చెందిన పలు యాప్‌లు సవాలు చేస్తుండటంతో, సైబర్ సెక్యూరిటీ పేరుతో టిక్‌టాక్‌ను రద్దు చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోంది.
ఇంజినీరింగ్‌లో జరుగుతున్న అద్భుతాలు మనల్ని మరింతగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నా, ఇంటర్నెట్ మాత్రం గతం కన్నా మరింతగా విచ్ఛిన్నమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- ‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..
- సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....
- మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...
- వ్లాదిమిర్ కొమరోవ్: అంతరిక్షం నుంచి కిందపడి మరణించిన తొలి వ్యోమగామి ఇతనే...
- ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు: దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














