‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

- రచయిత, రాచెల్ లూకర్
- హోదా, బీబీసీ న్యూస్
మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ (భయంకరమైన ఆకారం కలిగినవి లేదా భూతాలు) ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ, తర్వాత చూస్తే చిన్నారి బెడ్‌రూమ్‌లో వేలాది తేనెటీగలు కనిపించాయి..
ఉత్తర కరోలినాలోని చార్లొట్టెలో ఉన్న ఫామ్‌హౌస్‌లో తన గది గోడలో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ పాప పదేపదే ఫిర్యాదు చేస్తూ ఉండేది.
అలాంటిది ఏమీ ఉండదని తల్లిదండ్రులు పాపకు ధైర్యం చెప్పేవారు.
పిక్సార్ మూవీ, మాన్‌స్టర్స్ ఇంక్ వంటి సినిమాలు చూపించిన తర్వాత తన కూతురుకు ఇలా అనిపిస్తోందేమోనని వారు అనుకున్నారు.
‘‘మేం పాపకు మంచినీళ్ల బాటిల్ సైతం ఇచ్చాం. ఇది మాన్‌స్టర్ స్ప్రే. రాత్రిపూట ఏమైనా కనిపిస్తే వాటిని బయటికి పంపించేందుకు దీన్ని స్ప్రే చేయొచ్చు’’ అని చెప్పామని తల్లి మాసిస్ క్లాస్ తెలిపారు.
కానీ, నెలలు గడుస్తున్నా కొద్దీ, సేలర్ మరింత భయపడుతూ తన గదిని చెక్ చేయమని పట్టుబట్టింది. తన బట్టలు పెట్టుకున్న కప్‌బోర్డులో ఏదో ఉందని, చూడమంటూ భయపడుతూ చెప్పింది.
అయితే, మాసిస్ క్లాస్‌కు తమ వందేళ్ల ఇంటి బయట అటక దగ్గర, పొగవెళ్లే గొట్టం వద్ద గుంపులు గుంపులుగా తిరుగుతున్న తేనెటీగలు కనపబడ్డాయి.
ఆ తర్వాత ఎందుకో, పాప చెప్పే దానిలో నిజం ఉందని ఆమెకు అర్థమవ్వడం ప్రారంభమైంది.
పాప బెడ్‌రూమ్ సీలింగ్‌కు దగ్గర్లో ఇవి ఎగురుతున్న శబ్దాన్ని సేలర్ విని ఉండొచ్చని వారు భావించారు.

ఫొటో సోర్స్, Ashley Massis Class
ఆ తర్వాత పెస్ట్ కంట్రోల్ సేవలు అందించే కంపెనీకి ఆమె ఫోన్ చేశారు. వారి ఇంటికి దగ్గర్లో ఎగిరే రెక్కలున్న ఈ కీటకాలు తేనెటీగలని కంపెనీ గుర్తించింది. అమెరికాలో ఇవి రక్షించదగ్గ కీటకాలు.
తమ కూతురు బెడ్‌రూమ్‌కు పైనున్న అటకపై ఫ్లోర్‌బోర్డుల వద్ద ఎగురుతున్న కీటకాలను గుర్తించిన తర్వాత మాసిక్ క్లాస్, ఆమె భర్త బీకీపర్‌ను ఆశ్రయించారు.
ఈ తేనెటీగలు ఎనిమిది నెలలుగా ఈ భవనంలో ఉంటూ, తుట్టెను ఏర్పాటు చేసుకున్నాయి.
మూడున్నర ఏళ్ల ఈ పాప బెడ్‌రూమ్‌లోని గోడలను స్కాన్ చేసేందుకు బీకీపర్ థర్మల్ కెమెరా తీసుకొచ్చారు.
గోడలోకి అంతగా దూరి మరి తేనెతుట్టెను పెట్టడాన్ని తానెప్పుడూ చూడలేదని బీకీపర్ చెప్పారు.
అటకకు చివర్లో ఒక చిన్న రంధ్రం వద్ద తేనెటీగల గూడును ఉండటాన్ని బీకీపర్ గమించారు. గోడ తెరవగానే, పెద్ద తేనెతుట్టె కనిపించింది. అలా చివరకు పాప పదేపదే చెబుతున్న ఆ మాన్‌స్టర్‌ను గుర్తించారు.

ఫొటో సోర్స్, Ashley Massis Class
దాన్ని బయటకు తీసినప్పుడు అదొక హర్రర్ మూవీలాగా అనిపించిందని మాసిస్ క్లాస్ అన్నారు. బీకీపర్ 55 వేల నుంచి 65 వేల తేనెటీగలను తొలగించారు. 45 కేజీల తేనెతట్టును బయటికి వచ్చింది.
గోడ నుంచి ఈ కీటకాలను తొలగించి, వాటిని బాక్సులలో పెట్టేందుకు మూడు సార్లు వాటిని రివర్స్ వాక్యూమింగ్ ద్వారా బయటికి తీయాల్సి వచ్చింది. వీటిని తేనెటీగలు నివసించే ప్రాంతానికి తరలిస్తున్నట్లు బీకీపర్ చెప్పారు.
తేనెటీగలు, వాటి తేనె వల్ల తమ ఇంట్లో ఎలక్ట్రిక్ వైర్ అంతా పాడైందని మాసిస్ క్లాస్ తెలిపారు. పురుగులకు సంబంధించిన వాటి వల్ల ఇల్లు దెబ్బతింటే, అది ఇన్సూరెన్స్ కిందకు రాదని చెప్పారు. ఎందుకంటే, అవి ముందుగానే అరికట్టవచ్చు.
తేనెటీగల వల్ల తమ ఇంటికి 20 వేల డాలర్లకు పైగా (సుమారు రూ.16,68,523) నష్టం వాటిల్లినట్లు మాసిస్ క్లాస్ అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














