ప్రజ్వల్ రేవణ్ణ ‘సెక్స్ వీడియో’ కేసు: దేవెగౌడ మనవడిపై ఫిర్యాదు చేసిన పనిమనిషి ఏం చెప్పారు?

ప్రజ్వల్ రేవణ్ణ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రజ్వల్ రేవణ్ణ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలు బయటపడటం ఆ రాష్ట్ర రాజకీయాలలో పెనుదుమారం రేపుతోంది.

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన తరుణంలో ఈ లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి వచ్చాయి.

గతంలో ఎన్నడూ ఇలా ఎన్నికల ముందు ఈ తరహా కేసులు బయటపడలేదు.

సోషల్ మీడియా వేదికల ద్వారా కాకుండా బస్సు స్టాపులలో, పార్కులలో, గ్రామ సభల దగ్గర , ఆఖరికి ఇళ్లలో కూడా ఈ లైంగిక వేధింపుల వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌లు కనిపించడం పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది.

ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈనెల 26న కర్ణాటకలో తొలిదశలో భాగంగా 14 సీట్లకు పోలింగ్ జరిగిన స్థానాలలో హసన్ సీటు కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ జరిగిన తర్వాత రోజు రేవణ్ణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో వీటిపై విచారణ చేపట్టారు పోలీసులు.

కర్ణాటక మహిళా కమిషన్ అభ్యర్థన మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తు చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక ఏడీజీపీ పీకే సింగ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆయన కార్యాలయ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేశారు.

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవె గౌడ మనవడే ప్రజ్వల్ రేవణ్ణ. ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కర్ణాటక అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు.

కాంగ్రెస్ ప్రదర్శన ఫొటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రేవణ్ణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రదర్శన

రాజకీయ ప్రభావమెంత?

ఈ లైంగిక వేధింపుల కుంభకోణం వెలుగులోకి రావడంతో రాజకీయంగా వివిధ రకాలుగా ప్రభావం ఉండొచ్చు. జేడీఎస్, బీజేపీని సంయుక్తంగా లేదా విడివిడిగా ఈ సంఘటన దెబ్బతీయవచ్చు. దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా రెండు రకాల ప్రభావం ఉండొచ్చు. ఇది చాలా సిగ్గుచేటైన విషయమని కొందరు బీజేపీ నేతలు వ్యక్తిగతంగా అంగీకరించారు.

ప్రస్తుతానికైతే ఈ లైంగిక వేధింపుల కుంభకోణం నుంచి బయటపడాలని బీజేపీ, జేడీఎస్ కూటమి చూస్తోంది. అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, వచ్చే దశలో కర్ణాటకలో మిగిలిన 14 లోక్‌సభ సీట్ల ప్రచారాన్ని కాంగ్రెస్ ఎలా చేపడుతుందనే దాని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.

ఈ కుంభకోణాన్ని విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

‘‘హసన్ జిల్లాలో అసభ్యకర వీడియోలు సర్క్యూలేట్ అయ్యాయి. ఈ వీడియోల ద్వారా మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు ఏడీజీపీ బీకే సింగ్ నేతృత్వం వహిస్తారు. జర్నలిస్ట్ గౌరి లంకేష్, ఉద్యమకారుడు ఎంఎం కల్బుర్గి హత్యల విచారణ కూడా బీకే సింగ్‌ నేతృత్వంలోనే జరిగాయి.

మాజీ ప్రధాని దేవెగౌడ, ప్రధాని మోదీ ఫోటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పీఎం మోదీతో హెచ్‌డీ దేవెగౌడ (ఎడమ నుంచిమూడు), హెచ్‌డీ రేవణ్ణ(ఎడమ నుంచి రెండు), హెచ్‌డీ కుమారస్వామి ( కుడి నుంచి రెండు), ప్రజ్వల్ రేవణ్ణ (కుడివైపున మొదటి వ్యక్తి)

తెరపైకి కొత్త అంశాలు

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుటుంబానికి హసన్ జిల్లా కంచుకోట. మాండ్యతో పాటు, శక్తిమంతమైన వొక్కలిగా కమ్యూనిటీ ఆధిపత్యానికి హసన్‌ను కూడా కేంద్రంగా పరిగణించవచ్చు. దక్షిణ కర్ణాటకలో ఇతర జిల్లాల్లోనూ వొక్కలిగలు విస్తరించారు.

2019 ఎన్నికల్లో హెచ్‌డీ దేవె గౌడ తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం హసన్ సీటు నుంచి తమకూరుకు మారారు. మరో మనవడు నిఖిల్ కుమారస్వామి (మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కొడుకు)ని మాండ్య నుంచి బరిలోకి దించడం ద్వారా తన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సమానత్వం కోసం ప్రయత్నించారు. కానీ, నిఖిల్ కుమారస్వామి, ఆయన తాత ఇద్దరూ గత ఎన్నికలలో ఓడిపోయారు.

రాజకీయ కారణాలతో రేవణ్ణను మార్ఫ్ చేసిన ఫోటోలతో ఉన్న అసభ్యకర వీడియోలను బస్సు స్టాపులలో, ప్రజల ఇళ్ల దగ్గర వదిలి వెళ్తున్నారంటూ ఏప్రిల్ 21న హసన్ పోలీసు స్టేషన్‌లో రేవణ్ణ ఎన్నికల ఏజెంట్ ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు, తొలిసారి ఈ పెన్‌ డ్రైవ్‌ల పంపిణీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదులో నవీన్ గౌడ, మరికొందరి ప్రస్తావన వచ్చింది.

2,500కు పైగా పెన్‌డ్రైవ్‌లను పంపిణీ చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనంలో పేర్కొంది.

హెచ్‌డీ రేవణ్ణ, సిద్ధ రామయ్య

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, హెచ్‌డీ రేవణ్ణ, సిద్ధరామయ్య

హెచ్‌డీ రేవణ్ణపైనా ఆరోపణలు

ఏప్రిల్ 28న దేవె గౌడ కుటుంబంపై వస్తున్న ఆరోపణలలో సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది.

హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో వంటమనిషిగా పనిచేసిన 47 ఏళ్ల ఒక మహిళ హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ హోలెనరసిపుర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు.

తాను హెచ్‌డీ రేవణ్ణ భార్య బంధువునని తన ఫిర్యాదులో ఆ మహిళ చెప్పారు. హెచ్‌డీ రేవణ్ణ మరో కొడుకు సూరజ్ పెళ్లి సమయంలో ఇంటి పనుల్లో సాయానికి వీరి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత ఇక్కడే వారి ఇంట్లో వంటపనులు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. 2019 నుంచి 2022 వరకు తాను హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో పనిచేసినట్లు తెలిపారు.

‘‘నేను అక్కడ పనిచేయడం ప్రారంభించినప్పుడు, వారి ఇంట్లోనే పనిచేస్తున్న మరో ఆరుగురు ప్రజ్వల్ అంటే తమకి భయమని చెప్పారు. రేవణ్ణ, ప్రజల్వ ఇద్దరికీ తాము భయపడాలని అక్కడ పనిచేసే పురుషులు కూడా చెప్పారు.’’ అని ఫిర్యాదులో ఆ మహిళ పేర్కొన్నారు.

‘‘ఎప్పుడైనా హెచ్‌డీ రేవణ్ణ భార్య భవాని ఇంట్లో లేకపోతే, రేవణ్ణ నన్ను అసభ్యంగా తాకేవారు. ఆయన నన్ను లైంగికంగా వేధించారు. నా కూతుర్ని తీసుకొచ్చి ఆయిల్ మసాజ్ చేయించమని ఇతరులకు చెప్పేవారు. ప్రజ్వల్ రేవణ్ణ నా కూతురికి వీడియో కాల్స్ చేసేవారు. అసభ్యకరంగా మాట్లాడేవారు’’ అని తెలిపారు.

ప్రజ్వల్ నెంబర్‌ను తన కూతురు బ్లాక్ చేసిందని, ఆ తర్వాత తాను కూడా పని నుంచి వైదొలిగినట్లు ఆమె చెప్పారు.

‘‘నేను వీడియోను చూశాను. వారిలో ఒక మహిళ నాకు తెలుసు’’ అని ఫిర్యాదులో ఆ మహిళ చెప్పారు.

‘‘ప్రస్తుతం సిట్ ఏర్పాటైంది. సిట్ ముందు నేను హాజరవుతాను. పిలిచినప్పుడు, ప్రజ్వల్ కూడా వెళ్తారు. ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలైంది. ఇది నాలుగైదేళ్ల పాత కేసు’’ అని హెచ్‌డీ రేవణ్ణ రిపోర్టర్లకు చెప్పారు.

అయితే, దేవె గౌడ పేరును రిపోర్టులలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? తప్పు చేసినవారే పర్యవసానాలు ఎదుర్కొంటారు అని హెచ్‌డీ కుమారస్వామి రిపోర్టర్లకు తెలిపారు. మరోవైపు విచారణ పూర్తయ్యే వరకు ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు.

ప్రజ్వల రేవణ్ణ దిష్టిబొమ్మ దహనం ఫోటో

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రజ్వల రేవణ్ణపై ఆగ్రహజ్వాల

జేడీఎస్‌ను బీజేపీ మింగేస్తుందా?

రేవణ్ణ గత ఏడాది జూన్‌లోనే ఈ వీడియోల విషయంపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దీని తర్వాత, స్థానిక బీజేపీ నేత దేవరాజ్ గౌడ్ డిసెంబర్ చివరి వారంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షులు బీవై విజయేంద్రకు ఒక లేఖ రాశారు. దానిలో, ప్రజ్వల్ రేవణ్ణ కానీ లేదా ఆయన కుటుంబంలో మరెవరిని కూడా కూటమి నుంచి బరిలోకి దించవద్దని ఆయన డిమాండ్ చేశారు.

మహాకూటమిలో సీట్ల పంపకం నిర్ణయించాక, ఎవరు అభ్యర్థిగా ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయాలు కూటమి భాగస్వామికే వదిలేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.

‘‘ఒకవేళ అది కుంభకోణం అయితే, ప్రస్తుతం అంత పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ఓటింగ్ పూర్తయింది. ఆరోపిత వీడియోలున్న పెన్ డ్రైవ్‌లు కేవలం హసన్ నగరంలో మాత్రం సర్క్యూలేట్ అయ్యాయి. కర్ణాటకలో తొలి దశ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం లేదు. కానీ, మిగిలిన 14 సీట్లలో మహిళా ఓట్లను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే, అప్పుడు నైతికంగా బీజేపీని సవాలు చేయగలదు’’ అని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో పాలసీ అండ్ గవర్నెన్స్ ప్రొఫెసర్ నారాయణ అన్నారు.

ఈ కుంభకోణం బీజేపీకి ఒక అస్త్రంగా మారిందని, భవిష్యత్‌లో జేడీఎస్‌ను శాసించేందుకు వీలు కల్పించనుందని రాజకీయ విశ్లేషకులు డీ ఉమాపతి తెలిపారు.

‘‘జేడీఎస్ పార్టీని బీజేపీ కబళించనుందని మీరు ఊహించవచ్చు. జేడీఎస్ దీన్ని అంచనా వేసి ఉండొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో, భవిష్యత్ దిశగా పయనించాలంటే జేడీఎస్ ఇప్పుడు దీని నుంచి గట్టెక్కాలి’’ అని ఉమాపతి అన్నారు.

ఉమాపతి అభిప్రాయానికి ప్రొఫెసర్ నారాయణ కూడా అంగీకరించారు.

‘‘ఈ సంఘటన జేడీఎస్ ముగింపుకు చివరి దశకు తీసుకొచ్చింది. బీజేపీ నుంచి జేడీఎస్ వేరుకావడానికి ఇది దారితీస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే, జేడీఎస్ నేతలలో ఆందోళన చెలరేగి, వారు బీజేపీలో చేరతారు’’ అని తెలిపారు.

జేడీఎస్ నేత హెచ్‌డీ దేవె గౌడ బతికున్నంత కాలం, పార్టీ ముక్కలు కావడాన్ని అసలు ఒప్పుకోరు. ఒకవేళ జేడీఎస్‌కు ఏదైనా జరిగితే, కాంగ్రెస్ రాజకీయాలు బైపోలర్‌గానే ఉంటాయి. మెజార్టీ పొందడం ఇక బీజేపీకి కలే అవుతుంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)