యాపిల్: పడిపోయిన ఐఫోన్ల అమ్మకాలు, అసలేమైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐఫోన్ అమ్మకాలు పడిపోయినట్లు యాపిల్ సంస్థ తాజా ఫలితాలు తెలుపుతున్నాయి.
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో తమ స్మార్ట్‌ఫోన్లకు ఓవరాల్ డిమాండ్ 10 శాతానికి పైగా పడిపోయినట్లు యాపిల్ వెల్లడించింది. యూరప్‌లో తప్ప మిగతా అన్ని రీజియన్లలో ఐఫోన్ అమ్మకాలు పడిపోయినట్లు చెప్పింది.
కంపెనీ మొత్తం ఆదాయంలో 4 శాతం అంటే రూ. 7.5 లక్షల కోట్లు (90.8 బిలియన్ డాలర్లు) క్షీణించినట్లు తెలిపింది. గత ఏడాది కాలంలో ఆదాయంలో ఇదే అత్యంత భారీ క్షీణత అని యాపిల్ చెప్పింది.
అయితే, ఈ ఫలితాలతో యాపిల్ షేర్లపై పెద్దగా ప్రభావం పడలేదు.
కోవిడ్ సంబంధిత సరఫరా అంతరాయాల కారణంగా ఈ గణాంకాలు మారిపోయాయని కంపెనీ చెప్పింది. నిరుడు ఇదే సమయంలో ఐఫోన్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నట్లు తెలిపింది.
కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, కృత్రిమ మేథ (ఏఐ) దృష్ట్యా రాబోయే నెలల్లో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
గ్రేటర్ చైనా మార్కెట్‌లో ఐఫోన్ల అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. చైనా ప్రధాన భూభాగం (మెయిన్‌ల్యాండ్)లో ఐఫోన్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొంటూ చైనాలో వ్యాపార పరిస్థితి గురించి పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి కుక్ ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Reuters
హువావే వంటి స్థానిక కంపెనీల నుంచి యాపిల్‌కు మార్కెట్లో పోటీ పెరుగుతోంది.
హువావే కంపెనీ స్వదేశీ బ్రాండ్ కాబట్టి చైనాలో మెరుగైన స్థానంలో ఉందని డీఏ డేవిడ్‌సన్ సీనియర్ సాఫ్ట్‌వేర్ అనలిస్ట్ గిల్ లురియా చెప్పారు.
‘‘కానీ, ఫీచర్లు, పనితీరు, ప్రతిష్ట పరంగా చూసుకుంటే మిగతా అన్ని హ్యాండ్‌సెట్ల కంటే ఐఫోన్‌కు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, వినియోగదారులు ఎప్పుడైనా కావాలనుకుంటే, తగిన వనరులు ఉంటే ఐఫోన్ వైపే మొగ్గుతారు. చైనా ఇందుకు మినహాయింపు కాదు ’’ అని బీబీసీ టుడే ప్రోగ్రామ్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
విస్తృత మార్కెట్‌తో పోలిస్తే యాపిల్ కంపెనీ పరిస్థితి విరుద్ధంగా ఉంది. గత ఆరు క్వార్టర్లలో ఐదింటిలో యాపిల్ అమ్మకాలు క్షీణించాయి.
ప్రపంచవ్యాప్తంగా స్మార్‌ఫోన్ షిప్‌మెంట్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 10 శాతం పెరిగాయని పరిశోధన సంస్థ కెనాలిస్ తెలిపింది.
దాదాపు నాలుగేళ్ల క్రితం ఐఫోన్ 12 లాంచ్ అయినప్పటి నుంచి, తర్వాతి ఐఫోన్ హ్యాండ్‌సెట్లలో ఎలాంటి గణనీయ మార్పులు లేవని లురియా చెప్పారు. యాపిల్ 5జీ కనెక్టివిటీని తీసుకొచ్చినప్పుడు చాలా మంది వినియోగదారులు తమ ఫోన్లను అప్‌గ్రేడ్ చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఈ ఏడాది తర్వాత రాబోయే ఐఫోన్ 16లో తగినన్ని ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యాపిల్ ఆశిస్తోంది. ఇది యాపిల్ ఐఫోన్‌లో భారీ అప్‌గ్రేడ్‌గా మారనుంది’’ అని ఆయన అన్నారు.
యాప్ స్టోర్ ఫీజుల విషయంలో అమెరికా, యూరప్‌లోని రెగ్యులేటర్లతో యాపిల్ సంస్థ చట్టపరమైన పోరాటాలను ఎదుర్కొంటోంది.
యాపిల్ కంపెనీ ఇంటర్నెట్ బ్రౌజర్ అయిన సఫారీలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా చేసినందును గూగుల్ నుంచి యాపిల్ సంస్థకు చెల్లింపులు జరుగుతున్నాయంటూ అమెరికాలో ఒక గుత్తాధిపత్య నిరోధక దావాను నమోదు చేశారు.
కోర్టు పత్రాల ప్రకారం, 2022లో దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు (20 బిలియన్ డాలర్లు) చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం యాపిల్ కంపెనీ లాభాలను పెంచడంలో సహాయపడింది.
ఈ మూడు నెలలకు ప్రీ ట్యాక్స్ లాభం రూ. 2.3 లక్షల కోట్లు (28 బిలియన్ డాలర్లు) ఉన్నట్లుగా, షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి రూ. 9.1 లక్షల కోట్లు (110 బిలియన్ డాలర్లు)ను కేటాయించినట్లు యాపిల్ ప్రకటించింది.
రాబోయే మూడు నెలల్లో యాపిల్ విక్రయాల వృద్ధి సింగిల్ డిజిట్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఫైనాన్స్ చీఫ్ లుకా మేస్త్రీ చెప్పారు.
తమ సర్వీసెస్ బిజినెస్‌లో అభివృద్ధి డబుల్ డిజిట్‌లో ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘వైట్ గోల్డ్’ కోసం చైనా తీసుకున్న ఈ చర్య ఇతర దేశాల్లో టెన్షన్ పెంచుతోంది
- నీకా షాకరామీ: ఇరాన్ భద్రతా దళాలే ఈ టీనేజర్‌ను లైంగికంగా వేధించి, చంపేశాయని వెల్లడి చేసిన సీక్రెట్ డాక్యుమెంట్
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














