'ఆ ఒక్కటీ అడక్కు' రివ్యూ: క్లాసిక్ టైటిల్‌కి న్యాయం జరిగిందా? అల్లరి నరేష్ కమ్ బ్యాక్ ఇచ్చాడా?

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
- రచయిత, సాహితీ
- హోదా, బీబీసీ కోసం
అల్లరి నరేష్‌కు ఎక్కువగా గుర్తింపు తీసుకొచ్చింది వినోద భరిత చిత్రాలే. ఆయన సోలో హీరోగా సినిమాలు చేయక చాలా రోజులైంది. అయితే, ఈ శుక్రవారం అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కాస్త కామెడీ, ఇంకాస్త సోషల్ మెసేజ్‌తో తీర్చిదిద్దిన చిత్రమే 'ఆ ఒక్కటీ అడక్కు'. ఇంతకీ సినిమా ఎలా ఉంది? క్లాసిక్ టైటిల్‌కు అల్లరి నరేష్ అండ్ కో న్యాయం చేయగలిగారా?
కథలోకి వెళ్దాం. గణ (అల్లరి నరేష్) ప్రభుత్వ ఉద్యోగి. జీవితంలో సెటిలయ్యాడు.పెళ్లి మాత్రం కాలేదు. 49 సంబంధాలు వచ్చినట్టే వచ్చి... అట్నుంచి అటే వెళ్లిపోయాయి. తమ్ముడికి కూడా పెళ్లయిపోయింది. తాను మాత్రం బ్రహ్మచారిలానే ఉండిపోయాడు. చివరాఖరికి హ్యాపీ మాట్రిమొనీలో తన పేరు రిజిస్టర్ చేసుకొంటాడు.
అలా సిద్ది (ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. గణకు సిద్ది బాగా నచ్చుతుంది. కానీ సిద్ది మాత్రం...గణని వెయిటింగ్ లిస్టులో పెడుతుంది. మరి సిద్ది ఓకే చెప్పిందా? గణ పెళ్లి కల తీరిందా? అనేది మిగిలిన కథ.

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
పెళ్లి .. పెళ్లి.. పెళ్లి
పెళ్లికాని ప్రసాద్ లాంటి కథ ఇది. జీవితంలో అన్నీ ఉన్నా అర్థాంగి లేకపోవడం, పెళ్లెప్పుడు పెళ్లెప్పుడూ అంటూ ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు వేధించడం - ఆ క్రమంలో హీరో ప్రేమలో పడటం ఇదివరకు చాలా సినిమాల్లో చూశాం. ఇక్కడా అదే సీన్ రిపీట్ అయ్యింది.
అయితే కొత్త కోణం ఏమైనా ఉందా అంటే...అది ఫేక్ పెళ్లి కూతుర్ల వ్యవహారమే. ‘మ్యాట్రిమొనీ’ పేరుతో జరుగుతున్న మోసాల గుట్టు విప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథలో కాస్త కొత్తదనం తీసుకొచ్చిన ఎలిమెంట్ అదే.
గణ పెళ్లి చూపుల తతంగంతో కథ మొదలవుతుంది. ఆ తరవాత హీరోయిన్ పరిచయం, మాట్రిమొనీలో జాయిన్ అవ్వడం, అక్కడ గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ అంటూ స్కీములు చెప్పడం.. ఈ వ్యవహారాలన్నీ సరదాగా సాగిపోతాయి.
పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చే సీన్లే అవన్నీ. పగలబడి మరీ నవ్వుకొనేంత కామెడీ అయితే లేదు.
నరేష్ సినిమా అంటే హాయిగా నవ్వుకోవడానికే వెళ్తారు. ఈ విషయంలో నరేష్ ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదు. 'ఆ ఒక్కటీ అడక్కు' అంటూ సరదా టైటిల్ పెట్టుకొని, లోపల అంతా సీరియస్ వ్యవహారాలే చూపిస్తానంటే ప్రేక్షకులు భంగపడతారు. ఇక్కడా అదే జరిగింది.
మాట్రిమొనీ పేరుతో జరుగుతున్న మోసాలు ఒకొక్కటీ వెలుగు చూసే కొద్ది.. ఆ పేరుతో ఇంత తతంగం నడుస్తుందా? అని ఆశ్చర్యం ఏమీ వేయదు. ఎందుకంటే అవన్నీ టీవీల్లోనో, పేపర్లలోనో వార్తలుగా చూసిన వాళ్లమే.
సినిమా చూసే ముందు ప్రభుత్వం ప్రజల్ని హెచ్చరించడానికి కొన్ని ప్రకటనలు చూపిస్తుంటారు. అందులో పెళ్లి పేరుతో చేసే మోసాలపైనా హెచ్చరిస్తుంటారు. ఇదీ అలాంటి సినిమానే.
కాకపోతే రెండు నిమిషాల్లో చెప్పాల్సిన సందేశం కూడా రెండు గంటల సమయం తీసుకొన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
ఆ ట్విస్టు బాగుంది
హీరో తన స్నేహితుడ్ని ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లేటప్పుడు ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. తన స్నేహితుడి చెల్లెలు పెళ్లిలో, పెళ్లి కొడుకుని సైతం అనుమానాస్పదంగా చూపిస్తారు.
ఆ ప్రమాదానికి, పెళ్లికి, హీరో ఎదుర్కొనే మోసానికి ఏదో ఓ లింకు ఉందని ప్రేక్షకుడు ఊహించడం పెద్ద కష్టమేం కాదు.
కథని కూడా ఆ అంచనాలను తగ్గట్టుగానే దర్శకుడు నడిపాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ఫేక్ పెళ్లి కూతుర్ల వ్యవహారం వెలుగులోకి వస్తుంది. అక్కడొచ్చే ట్విస్ట్ ఒకటి బాగుంది.
ఇక ద్వితీయార్థంలో అటు ఫేక్ పెళ్లిళ్ల వ్యవహారం లాంటి సీరియస్ అంశాన్నీ, ఇటు నరేష్ నుంచి ఆశించే కామెడీని దర్శకుడు బాలెన్స్ చేయలేకపోయాడు. దాంతో చెప్పాలనుకొన్న విషయాన్ని బలంగా చెప్పలేక, ప్రేక్షకుల్ని నవ్వించనూ లేక తాను ఇబ్బంది పడ్డాడు, ప్రేక్షకుల్నీఇబ్బందులకు గురి చేశాడు.
మధ్యలో షకలక శంకర్, వైవా హర్షల పెళ్లి చూపుల వ్యవహారంతో వినోదాన్ని పంచాలని చూశాడు కానీ, సన్నివేశాల్ని సాగదీయడం తప్ప వాటి వల్ల కొత్త ప్రయోజనాలేం సమకూరలేదు.

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
బాలెన్స్ తప్పిన డ్రామా
చివర్లో కథ కోర్టు రూం డ్రామా వైపు మళ్లుతుంది. అక్కడ హీరో వాదించే సన్నివేశం మరీ కృతకంగా, కృత్రిమంగా తీర్చిదిద్దారు.
ఈ కథని ఎలా ముగించాలో తెలీక దర్శకుడు కోర్టు డ్రామాకి షిఫ్ట్ అయ్యాడన్న భావన కలుగుతుంది తప్ప, సహజంగా అల్లిన క్లైమాక్స్ అనిపించదు.
నరేష్ శైలి వినోదాన్ని అందిస్తూ బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకొనే ప్రయత్నంలో వినోదానికీ, సందేశానికీ దర్శకుడు సమ న్యాయం చేయలేకపోయాడు.

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
ఎవరెలా చేశారు?
నరేష్ హుందాగా ఉన్నాడు. ఎక్కడా వెకిలి కామెడీ చేయలేదు. అయితే ఎందుకనో.. ఇదివరకటి కామెడీ సెన్స్ కాస్త తగ్గింది. బహుశా.. రైటింగ్‌లో ఉన్న లోపమేమో..!
ఫరియా చలాకీగా కనిపించింది. తన పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకొంటుంది. నరేష్ మరదలి పాత్రలో నటించిన అమ్మాయి.. కొంచెం అతి చేసినట్లనిపిస్తుంది.
''మేం చాలా కామెడీ చేసేస్తున్నాం. ప్రేక్షకులు విరగబడి నవ్వేస్తారు'' అని పాత్రలు అనుకొంటే చాలదు. అంత వినోదం పుట్టాలంటే సన్నివేశాల్లో బలం ఉండాలి. అది లేకపోవడంతో తెరపై ఎంతమంది నవ్వించడానికి ప్రయత్నించినా తేలిపోయారు. ఆఖరికి వెన్నెల కిషోర్‌తో సహా.
ఐడియా పరంగా బాగున్న కొన్ని కథలు, తెరపైకి వచ్చేసరికి పట్టాలు తప్పేస్తుంటాయి. దానికి కారణం సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం. ఈ సినిమాలో లోపం కూడా అదే. పెళ్లి గురించి ఎంతమంది చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా బాగుంటుంది. అది ఎవర్ గ్రీన్ ఫార్ములా.
ఆ నమ్మకంతోనే మరో పెళ్లి కాని ప్రసాద్ లాంటి కథని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందులో దర్శకుడు చెప్పాలనుకొన్న సోషల్ మెసేజీ మరో రొటీన్ వ్యవహారం అయిపోవడం మింగుడు పడని విషయం.

ఫొటో సోర్స్, Twitter/Chilaka Productions
సాంకేతికంగా ఎలా ఉంది?
పాటలు, మాటలు మ్యాజిక్ చేయలేకపోయాయి. మేకింగ్ పరంగా నాణ్యత ఉంది.
అయితే రైటింగ్ పదును ఇంకా ఉండాల్సింది. నరేష్ ఎప్పుడూ వాళ్ల నాన్నగారి టైటిల్స్ వాడుకోలేదు. ఈసారికి మాత్రం పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ టైటిల్ 'ఆ ఒక్కటీ అడక్కు' వాడేశాడు.
మరి విజయం అందిందా? అంటే 'ఆ ఒక్కటీ అడక్కండీ' అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- జర్నలిస్టులు బలవంతంగా స్వదేశాలను విడిచి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















