ఐఫోన్ 12: నాలుగు కొత్త మోడళ్లు లాంచ్ చేసిన యాపిల్, దేని ధర ఎంతంటే

ఐఫోన్

ఫొటో సోర్స్, APple

అమెరికా టెక్ కంపెనీ యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది.

మంగళవారం ఒక డిజిటల్ ఈవెంట్‌లో వీటిని లాంచ్ చేశారు.

5జీ నెట్‌వర్కులో అత్యంత వేగంగా పనిచేసే మొదటి హ్యాండ్‌సెట్ ఐఫోన్ 12 అని యాపిల్ చెప్పింది.

ఐఫోన్ తన పూర్తి లైనప్‌లో 5జీ తీసుకొస్తోంది. ఐఫోన్‌ నవశకానికి ఇది ఒక ప్రారంభం అని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ అన్నారు.

యాపిల్ ఐఫోన్ 12(64, 128, 256 జీబీ వేరియంట్లు), ఐఫోన్ 12 MINI (64, 128, 256 జీబీ వేరియంట్లలో), ఐఫోన్ 12 Pro(128, 256, 512 జీబీ వేరియంట్లలో) ఐఫోన్ 12 Pro Max (128, 256, 512 జీబీ వేరియంట్లలో) లాంచ్ చేశారు.

యాపిల్ 12 ప్రో

ఫొటో సోర్స్, APple

ఫొటో క్యాప్షన్, యాపిల్ 12 ప్రో

దేని ధర ఎంత?

వీటి ధర సుమారు రూ. 70 వేల నుంచి, లక్షా 30 వేల వరకూ మధ్య ఉన్నాయి.

ఐఫోన్ 12 Mini బేసిక్ వేరియంట్ ధర రూ. 69,900, ఐఫోన్ 12 ధర రూ. 79,900, ఐఫోన్ 12 Pro రూ. 1,19,900, ఐఫోన్ 12 Pro Max ధర రూ. 1,29,900 ఉంది.

స్టోరేజీ ప్రకారం చూస్తే ధర కాస్త ఎక్కువే ఉంది.

64 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 12 Mini ధర భారత్‌లో రూ. 69,900 ఉంది. కానీ అదే ఫోన్‌ను 256 జీబీ వేరియంట్ కొనాలనుకుంటే దాని ధర రూ. 84,900 ఉంది.

అదే విధంగా 512 జీబీ స్టోరేజ్ ఐఫోన్ 12 Pro Max ధర రూ. 1,59,900 ఉంది.

ఐఫోన్ 12 Mini ప్రపంచంలో 5జీ సాంకేతికత గల అతి చిన్న ఫోన్ అవుతుంది.

ఐఫోన్‌లు

ఫొటో సోర్స్, APple

అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్‌లు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 12 Mini ప్రీ-ఆర్డర్ నవంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 13లో డెలివరీ మొదలవుతుంది.

ఐఫోన్ 12, ఐఫోన్ 12 Pro ప్రీ ఆర్డర్ అక్టోబర్ 16న, డెలివరీ అక్టోబర్ 23న, ఐఫోన్ 12 Pro Max ప్రీ-ఆర్డర్ నవంబర్ 13న, అమ్మకాలు నవంబర్ 20 నుంచి మొదలవుతాయి.

కానీ భారత్‌లో కొత్త ఐఫోన్ ఎప్పటి నుంచి దొరుకుతుంది అనేదానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

కరోనా, ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మందగించినా, యాపిల్ అమ్మకాలు మాత్రం గత ఏడాది పెరిగాయి.

2014లో కంపెనీ ఐఫోన్ 6 లాంచ్ చేసిన తర్వాత నుంచి చూస్తే, ఐఫోన్ 12 కొత్త ఫీచర్లు కంపెనీ వృద్ధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయని సంస్థ చెబుతోంది.

"అప్‌లోడ్లు, డౌన్‌లోడ్లు, హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్, మరింత వేగంగా ఉండే గేమింగ్, రియల్ టైమ్ ఇంటెర్ యాక్టివిటీ ఇంకా చాలా వాటి కోసం తమ 5జీ ఫోన్ ఒక కొత్త స్థాయి ప్రదర్శనను అందిస్తుంది" అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ అన్నారు.

ఐఫోన్

ఫొటో సోర్స్, APple

అన్ని ఐఫోన్‌లలోనూ అదే పెద్ద స్క్రీన్

ఐఫోన్ 12 స్క్రీన్ కూడా ఇంతకు ముందు ఫోన్ల కంటే పెద్దదిగా ఉంటుంది.

యాపిల్ వివరాల ప్రకారం ఐఫోన్ 12 స్క్రీన్ సైజ్ 6.1 అంగుళాలు. కానీ ఇంతకు ముందు ఫోన్లతో పోలిస్తే ఇది 11 శాతం సన్నగా, 16 శాతం తేలిగ్గా ఉంటుంది.

ఐఫోన్ 12 Pro స్క్రీన్ 6.1 అంగుళాలు ఉంటే, ఐఫోన్ 12 Pro Max స్క్రీన్ 6.7 అంగుళాలు ఉంది.

ఈసారీ దీనికి కాస్మటిక్ రెఫ్రెష్ కూడా ఇచ్చారు. ఫోన్‌ మూలలు గుండ్రంగా లేకుండా చదునుగా, షార్ప్‌గా ఉంటాయి.

కొత్త ఫోన్ స్క్రీన్ రిజల్యూషన్ కూడా ఎక్కువ అని కంపెనీ చెబుతోంది. ఇందులో సిరామిక్ షీల్డ్ ఉపయోగించామని అంటోంది.

దీనిలో మొదటిసారి ఎ-14 బయోనిక్ చిప్ అమర్చారు. దీనిని 5 నానోమీటర్ ప్రాసెసర్‌ మీద చేశారు. దాంతో ఫొటోలు మరింత స్పష్టంగా వస్తాయి.

ఐఫోన్

ఫొటో సోర్స్, APple

చార్జర్ ఉండదు

హై ఎండ్ ఐఫోన్ 12 Pro మోడళ్లలో కూడా ఇంతకు ముందు కంటే పెద్ద స్క్రీన్ ఇచ్చారు. తక్కువ వెలుతురులో కూడా ఫొటో తీసుకునేలా ఇందులోని ఒక కొత్త సెన్సర్ సహకరిస్తుంది.

అయితే, మొట్ట మొదటిసారి ఈ సిరీస్ ఫోన్లలో దేనితోనూ హెడ్ ఫోన్స్, చార్జర్ ఇవ్వడం లేదు.

పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి తమ నిర్ణయం సహకరిస్తుందని యాపిల్ చెప్పింది.

“టిమ్ కుక్ సూపర్ సైకిల్ 5జీ ఉత్పత్తుల విడుదలకు వేదిక సిద్ధం చేశార"ని వెడ్‌బుష్ సెక్యూరిటీస్ విశ్లేషకులు డాన్ ఐవెస్ అన్నారు.

“ఉపయోగంలో ఉన్న ఐఫోన్లలో 40 శాతం ఫోన్లను దాదాపు మూడున్నరేళ్లుగా అప్‌గ్రేడ్ చేయలేదు, ఇది దశాబ్దానికి ఒకసారి వచ్చే అవకాశాన్ని అందిస్తోంద”ని అన్నారు.

మిగతా ఫోన్ల కంటే చిన్నదిగా ఉండే Mini కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించడం వల్ల, మిగతా ఫోన్ల కంటే లాభాలు తక్కువగా ఉంటాయని, దానివల్ల యాపిల్ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.

కానీ కొందరు నిపుణులు అలా జరగదని అంటున్నారు.

ఒక చిన్న, చౌకగా ఉండే ఫోన్ కోరుకునే వినియోగదారులు ఉన్నారు. అందుకే మార్కెట్ పోకడలను పరిగణనలోకి తీసుకుంటే ఇది నిరూపిత ఫార్ములా అంటున్నారు.

మార్కెట్ షేర్ విషయానికి వస్తే ఐఫోన్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండో స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.

ఐఫోన్ బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్‌.

ఫొటోలు

ఫొటో సోర్స్, APple

ఫ్లాష్ లేకుండానే చీకట్లో సెల్ఫీ తీసుకోవచ్చు

కొత్త ఫోన్‌లో ఫ్లాష్ ఉపయోగించకుండానే నైట్ మోడ్‌లో సెల్ఫీ తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. కలర్, కాంట్రాస్ట్, ఆడియో విషయంలో కూడా కొత్త ఫోన్ ఫీచర్లు ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉన్నాయంది.

ఐఫోన్ 12లో రెండు 12 మెగా పిక్సెల్ వైడ్ కెమెరాలు ఉపయోగించారు. ఇవి తక్కువ వెలుతురులో కూడా అద్భుతంగా ఫొటోలు క్లిక్ చేస్తాయని యాపిల్ చెప్పింది.

ఇక, వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఐఫోన్ 12లో నైట్ మోడ్ టైమ్ లాప్స్ ఫీచర్ కూడా ఉంది. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన వీడియో రికార్డ్ చేయవచ్చు.

5జీ

ఫొటో సోర్స్, APple

5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందా?

శాంసంగ్ మొదటిసారి 2019లో 5జీ టెక్నాలజీ ఉన్న గాలక్సీ S10 లాంచ్ చేసింది. ఆ తర్వాత హువావే, వన్ ప్లస్, గూగుల్ కూడా 5జీ టెక్నాలజీ ఉన్న ఫోన్లు లాంచ్ చేశాయి.

కానీ నిపుణులు మాత్రం ఈ ఫీచర్లపై జనాలకు పెద్దగా ఆసక్తి ఉండదని చెబుతున్నారు.

“బహుశా ఎప్పుడు కొత్త టెక్నాలజీ లాంచ్ అయినా, అది బాగా పరిపక్వత అయ్యేవరకూ యాపిల్ వేచిచూస్తుంది. అలా, తన వినియోగదారులకు ఒక కొత్త రకం అనుభవాన్ని అందించాలనుకుంటుంద”ని టెక్ పరిశోధన కంపెనీ ఫారెస్టర్‌కు చెందిన థామస్ హసన్ అంటారు.

యాపిల్ మాత్రం తమ కొత్త 5జీ ఫోన్‌లో 3.5 జీబీ పర్ సెకండ్ స్పీడుతో టెస్ట్ చేశామని చెప్పింది. అంటే కొత్త ఫోన్ ద్వారా దాదాపు 20 జీబీల ఒక సినిమాను కేవలం 45 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

“బాటరీ సేవ్ చేసుకోడానికి య ఐఫోన్ 12కు 4జీ, 5జీ మధ్య స్విచ్ చేసుకునే సామర్థ్యం ఉంది, ఇది వినియోగదారులు ఎప్పుడూ 5జీలోనే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంద”ని ఫ్యూచర్ సోర్స్ కన్సల్టెన్సీ స్టీఫెన్ మియర్స్ అన్నారు.

కానీ, కంపెనీ మాత్రం నెట్‌వర్క్, ప్రాంతాన్ని బట్టి వినియోగదారులకు దీని అనుభవం ఉంటుందని చెబుతోంది. వివిధ ప్రాంతాలను బట్టి 5జీ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉండవని అంటోంది..

బ్రిటన్ 5జీ నెట్‌వర్క్ ప్రారంభించిన రెండో యూరోపియన్ దేశంగా నిలిచింది. దానివల్ల బ్రిటన్‌కు ప్రయోజనం లభించినా, ఈ నెట్‌వర్క్ కవరేజ్ చాలా అరుదుగా ఉంటుంది.

అమెరికా యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్. అక్కడ 5జీ స్పీడ్ చాలా తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం కెనెడా 4జీ నెట్‌వర్క్ అమెరికాలో 5జీ నెట్‌వర్క్ కంటే వేగంగా ఉంటుంది.

కొన్ని దేశాల్లో 5జీ టెక్నాలజీ కోసం ఇంకా అందుబాటులోకి రాలేదు.

యాపిల్‌కు రెండో అతిపెద్ద మార్కెట్ చైనా. తమ దేశంలో 5జీ టెక్నాలజీని చైనా ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తోంది. బీజింగ్, షెంజెన్‌లో 5జీ నెట్‌వర్క్ పనులు పూర్తైనట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)