‘వైట్ గోల్డ్’ కోసం చైనా తీసుకున్న ఈ చర్య ఇతర దేశాల్లో టెన్షన్ పెంచుతోంది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్లోబల్ చైనా యూనిట్
- హోదా, బీబీసీ న్యూస్
ఈ ఏడాది మొదట్లో ఒక రోజు అర్ధరాత్రి ఉత్తర అర్జెంటీనాలో తను నివసించే డార్మిటరీ బయట కొంతమంది ఆగ్రహంతో నినాదాలు చేయడంతో అయ్ ఖింగ్ నిద్రలేచారు.
ఆ భవనం చుట్టూ అర్జెంటీనా కార్మికులు చేరడంతోపాటు గేటు దగ్గర భారీగా టైర్లను దహనం చేయడాన్ని ఆమె కిటికీ లోనుంచి చూశారు.
‘‘చూడటానికి చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే మంటలు చాలా పెద్దవిగా కనిపించాయి. ఘర్షణలు జరుగుతాయేమో అనిపించింది’’ అని అయ్ అన్నారు. బ్యాటరీల్లో ఉపయోగించే లిథియంను ఇక్కడి ఆండిస్ పర్వతాల నుంచి తవ్వితీసే చైనా కంపెనీ కోసం ఆమె పనిచేస్తున్నారు.
అర్జెంటీనా సిబ్బందిలో కొంతమందిని విధుల్లో నుంచి తొలగించడంతో ఈ నిరసన మొదలైంది. ఇలాంటి ఘటనలు చైనా వ్యాపార సంస్థలు, స్థానిక కార్మికుల మధ్య తరచూ జరుగుతున్నాయి. ఇక్కడి ఖనిజాల ప్రాసెసింగ్‌లో చైనా కంపెనీల ప్రాబల్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అన్వేషణలోనూ తమ పరిధిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారీగా లిథియం రిజర్వులు ఉండే అర్జెంటీనా, బొలీవియా, చిలీల ‘లిథియం ట్రయాంగిల్’లో ఖనిజాన్వేష ప్రాజెక్టును తొలి చైనా కంపెనీ దక్కించుకొని నేటికి పదేళ్ల వరకూ గడుస్తున్నాయి.
ఆ తర్వాత కాలంలో స్థానిక మైనింగ్ ఆపరేషన్లలో చాలా చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాయని మైనింగ్ పబ్లికేషన్లు, కార్పొరేట్, మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. చైనా కంపెనీల షేర్ హోల్డింగ్‌లను పరిశీలించడంతో మొత్తం లిథియం ప్రాజెక్టుల్లో వీటి వాటా 33 శాతం వరకు ఉన్నట్లు తేలింది.
చైనా కంపెనీలు నానాటికీ ఒకవైపు విస్తరిస్తుంటే, ఇతర అంతర్జాతీయ ఖనిజాన్వేషణ సంస్థల తరహాలానే వాటిపై వస్తున్న ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి.
ఈ టైర్ల దహనం నిరసన అయ్‌లో ఆందోళన రేకెత్తించింది. అర్జెంటీనాలో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆమె ఆశించారు. కానీ, ఇప్పుడామెకు ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది. స్పానిష్ తెలియడంతో ఆమె స్థానికులతో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు జరుపుతున్నారు.
‘‘కానీ, ఇది అంత తేలిక కాదు’’ అని ఆమె అన్నారు.

‘‘చాలా విషయాల్లో మనం కాస్త తగ్గి ఉండాలి. కార్మికులు బద్ధకస్తులు, అన్నింటికీ కార్మిక సంఘాలపైనా ఆధారపడతారు లాంటి మేనేజ్‌మెంట్ ఆలోచనల నుంచి పక్కకు రావాలి. చైనా ప్రజలు కేవలం తమను దోపిడీ చేయడానికే వచ్చారనే భావన తప్పని స్థానికులకు చెప్పాలి’’ అని ఆమె అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ టెక్నాలజీకి కీలకంగామారే లిథియం లేదా కోబాల్ట్, నికెల్, మాంగనీస్ లాంటి ఖనిజాల అన్వేషణకు చేపడుతున్న ప్రాజెక్టుల్లో చైనా సంస్థల భాగస్వామ్యమున్న 62 మైనింగ్ ప్రాజెక్టులను బీబీసీ గ్లోబల్ చైనా యూనిట్ పరిశీలించింది.
వీటి నుంచి వచ్చే ఖనిజాలను ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. వీటి అన్వేషణ ప్రాజెక్టులకు చైనా పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రపంచంలోనే భారీగా లిథియంను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
లిథియం, కోబాల్ట్‌ల రిఫైనింగ్‌లో ప్రపంచ దేశాల కంటే చైనా చాలా ముందుంది. ఈ ఖనిజాల సరఫరాలో చైనా వాటా వరుసగా 72, 68 శాతం వరకూ ఉన్నట్లు ఛాటమ్ హౌస్ థింక్ ట్యాంక్ చెబుతోంది.
2023లో ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగం కంటే ఎక్కువ, విండ్ టర్బైన్ల తయారీలో 60 శాతం, సోలార్ ప్యానెళ్ల సరఫరా గొలుసులో 60 శాతం వరకు చైనా ప్రాబల్యం పెరగడంలో ఈ రిఫైనింగ్ సామర్థ్యం తోడ్పడుతోంది.
అయితే, గ్రీన్ ఎకానమీకి అవసరమయ్యే ఈ ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్ అనేది చైనా ఒక్క దేశానికే ముఖ్యంకాదు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో 2050 నాటికి నెట్-జీరోకు చేరుకోవాలంటే ఈ ఖనిజాల వినియోగం 2040 నాటికి ఆరు రెట్ల వరకు పెరగాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
చైనా సరఫరాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.
అంతర్జాతీయ మైనింగ్ ఆపరేషన్లలో పాలుపంచుకుంటున్న చైనా కంపెనీల పాత్ర పెరుగుతుండటంతో.. ఈ ప్రాజెక్టులతో వచ్చే ఆరోపణలూ కూడా పెరుగుతున్నాయి.
చైనా కంపెనీలపై వస్తున్న ఇలాంటి 102 ఆరోపణలపై స్వచ్ఛంద సంస్థ ద బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ ఒక నివేదిక ప్రచురించింది. కీలకమైన ఈ ఖనిజాల అన్వేషణలో స్థానిక కార్మికుల హక్కులను ఉల్లంఘించడం, స్థానిక పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగించడం, ప్రమాదకరమైన పని వాతావరణం లాంటి ఆరోపణలు దీనిలో ఉన్నాయి.
ఈ ఆరోపణలు 2021, 2022 నాటివి. 2023లో ఇతర స్వచ్ఛంద సంస్థలు, మీడియాలో కనిపించిన మరో 40 ఆరోపణలను కూడా బీబీసీ పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఏ మహిళా అభ్యర్థి దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది? వీళ్లను మించిన ‘గోల్డ్ మ్యాన్’ ఎవరు? లాంటి కథనాలకు చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ప్రపంచంలోని రెండు భిన్న ధ్రువాలకు చెందిన ప్రజలు ఈ విషయంలో తమ కథలను బీబీసీకి చెప్పారు.
దక్షిణ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని లుబుంబషీ శివార్లలో 2011 నుంచి జిన్‌చువాన్ గ్రూపు నియంత్రణలో నడుస్తున్న రువాషి కోబాల్ట్ మైన్‌ను వ్యతిరేకిస్తున్న బృందానికి క్రిస్టోఫే కబ్వితా నేతృత్వం వహిస్తున్నారు.
తన ఇంటికి 500 మీటర్ల దూరంలోని ఆ ఓపెన్-పిట్ మైన్‌లో వారానికి రెండు మూడు సార్లు పేలుడు పదార్థాలతో బ్లాస్ట్‌లు నిర్వహిస్తుంటారని ఆయన చెప్పారు. బ్లాస్టింగ్ కోసం సైరన్ మోగగానే చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అందరికీ చెబుతారని ఆయన అన్నారు.
‘‘ఎంత ఎండ ఉన్నప్పటికీ లేదా వర్షం పడుతున్నా...మేం మా ఇళ్లను వదిలి దగ్గర్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి’’ అని ఆయన చెప్పారు.
రోగులు, గర్భిణులు అందరూ సురక్షిత ప్రాంతానికి పరుగులు పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

2017లో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న టీనేజీ అమ్మాయి క్యాటీ కబాజో గాల్లో ఎగిరివచ్చిన రాయి తగిలి చనిపోయింది. కొన్ని రాళ్లు అయితే, స్థానికుల ఇంటి పైకప్పులు, గోడలను కూల్చేశాయి.
రువాషి మైన్ అధికార ప్రతినిధి ఎలీసా కలాసా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘ఆ ప్రాంతంలో ఒక బాలిక మరణించింది. ఆ సమయంలో అక్కడ ఆమె ఉండకూడదు. పైనుంచి పెద్ద రాయి తగలడంతో ఆమె మరణించింది’’ అని చెప్పారు.
‘‘ఆ ఘటన తర్వాత మేం టెక్నాలజీని మెరుగుపరిచాం. ప్రస్తుతం మేం బ్లాస్టింగ్ చేస్తున్న చోట రాళ్లు ఎక్కడా ఎగిరిపడటం లేదు’’ అని ఆమె అన్నారు.
అయితే, ఆ కంపెనీలో ప్రాసెసింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్యాట్రిక్ షిసాండ్ కాస్త భిన్నమైన విషయాలు వెల్లడించారు. ‘‘మైనింగ్ చేసేటప్పుడు మేం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తాం. వీటివల్ల రాళ్లు ఎగిరిపడతాయి. చుట్టు పక్కల ప్రజలు వీటికి సమీపంలోనే నివసిస్తుండటంతో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.
గని నుంచి దూరంగా వెళ్లేందుకు 2006 నుంచి 2012 మధ్య 300కుపైగా కుటుంబాలకు పరిహారం ఇచ్చామని కలాసా వివరించారు.
ఇండోనేసియాలోని మారుమూల ఓబీ దీవిలో చైనా కంపెనీ ‘లిజెండ్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ’, ఇండోనేసియా మైనింగ్ దిగ్గజం హరిట గ్రూపు కలిసి నడిపిస్తున్న ఓ గని కవాసీ గ్రామం చుట్టుపక్కల చాలా వేగంగా అడవిని మింగేస్తోంది.
ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులపై ఒత్తిడి పెరుగుతోందని స్థానిక స్వచ్ఛంద సంస్థ జటమ్ తెలిపింది. మార్కెట్ విలువ కంటే తక్కువ డబ్బులు ఇవ్వడంతో ఇక్కడి నుంచి వెళ్లేందుకు డజన్లకొద్దీ కుటుంబాలు నిరాకరిస్తున్నాయి. దీంతో దేశానికి ముఖ్యమైన ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని కేసులు వేస్తామని అధికారులు బెదిస్తున్నారంటూ కొందరు గ్రామస్తులు చెప్పారు.

గని పరిధిని విస్తరించేందుకు ఎలా అడవులను కొట్టేస్తున్నారో, నదులతోపాటు తీర ప్రాంతాలను ఎలా వ్యర్థాలతో పూడ్చి పెడుతున్నారో, ఇక్కడి తీర ప్రాంతాన్ని ఎలా కలుషితం చేస్తున్నారో ఇప్పటికే చాలా నివేదికలు, వార్తలు వచ్చాయని జటమ్ తెలిపింది.
‘‘ఆ నది నీరు తాగడానికి పనికిరాదు. అది విపరీతంగా కలుషితమైంది. నీలం రంగులో ఉండే సముద్రం కూడా వర్షం పడితే ఎర్రగా మారుతోంది’’ అని కవాసీ గ్రామంలో జీవించే ఉపాధ్యాయురాలు నూర్ హయతి చెప్పారు.
ఈ గనికి రక్షణ కల్పించేందుకు ఇండోనేసియా సైనికులను మోహరించింది. ఇక్కడి ప్రాంతాలను పరిశీలిచేందుకు బీబీసీ వెళ్లినప్పుడు పెద్దయెత్తున సైనికులు కనిపించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడేవానిని భయపెట్టేందుకు, దాడులకు సైనికులను ఉపయోగించుకుంటున్నారని జటమ్ చెబుతోంది.
‘‘ఇక్కడ సైన్యం గనికి మాత్రమే రక్షణ కల్పిస్తోంది. సామాన్య ప్రజలకు కాదు’’ అని నూర్ తెలిపారు.
అయితే, ఈ ఆరోపణలను సైనిక అధికార ప్రతినిధి ఖండించారు. ‘‘గనికి రక్షణ కల్పించేందుకే సైనికులను మోహరిచాం. కానీ, వారు స్థానికులను ఎన్నడూ బెదిరించలేదు. అసలు వారితో నేరుగా మాట్లాడరు కూడా’’ అని చెప్పారు.
ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలను పోలీసులు శాంతియుతంగా నిర్వహించారని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

2018 జూన్‌లో ఈ గనికి వ్యతిరేకంగా జకార్తా వెళ్లి నిరసన చేపట్టినవారిలో నూర్ కూడా ఒకరు. అయితే, పర్యావరణానికి హాని కలుగుతోందని ఇప్పటివరకూ ప్రజల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి సాంసు అబూబకర్ అన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు అవసరమైన అన్ని చర్యలనూ హరిట గ్రూపు తీసుకుంటోందని చెప్పే ఒక నివేదికను కూడా ఆయన మాకు చూపించారు.
అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవడంతోపాటు స్థానిక చట్టాలను కూడా గౌరవిస్తున్నామని హరిట కూడా మాకు చెప్పారు. ఈ గని వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు తాము పనిచేస్తున్నామని కూడా వివరించారు.
పెద్దగా అడవులనేమీ తాము తవ్వడంలేదని, స్థానిక మంచి నీటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఎవరినీ బలవంతంగా వేరే ప్రాంతానికి తరలించలేదని, ఎవరినీ భయపెట్టలేదని కూడా వివరిస్తోంది.
చైనా ప్రాజెక్టులపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా ఏడాది క్రితం చైనా మైనింగ్ సంస్థల సమాఖ్య సీసీసీఎంసీ ఒక వ్యవస్థను కూడా ఏర్పాటుచేసింది. ఈ సంస్థ అధికార ప్రతినిధి లెలియా లీ మాట్లాడుతూ.. ‘‘స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు అవసరమైన భాషపరమైన, సాంస్కృతిక నైపుణ్యాల కొరత చైనా కంపెనీలను వెంటాడుతోంది’’ అని చెప్పారు.
అయితే, ప్రస్తుతం ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.
రానున్న కాలంలో విదేశీ మైనింగ్ కార్యకలాపాల్లో చైనా పాత్ర మరింత పెరిగే అవకాశముంది. ‘‘ఇది కేవలం జియోపొలిటికల్ వ్యూహం మాత్రమే కాదు. దీన్ని బిజినెస్ కోణంలోనూ చూడాలి’’ అని బ్రిటన్‌కు చెందిన పర్యావరణ థింక్ ట్యాంక్ ఎంబెర్‌లోని ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆదిత్య లొల్ల చెప్పారు.
‘‘చాలా కంపెనీల్లో వాటాలను చైనా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే వీటి నుంచి భారీ లాభాలు వస్తున్నాయి’’ అని ఆయన తెలిపారు.
ఫలితంగా ప్రపంచంలోని మరిన్ని ప్రాంతాల్లో పనిచేసేందుకు చైనా కార్మికులు వెళ్లబోతున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మంచి ఆదాయం సంపాదించేందుకు వారికి అవకాశం లభిస్తుంది.
డీఆర్ కాంగోలో చైనా కంపెనీ నియంత్రణలో పనిచేస్తున్న గని కోసం పదేళ్ల నుంచీ వాంగ్ గాంగ్ పనిచేస్తున్నారు. 48 ఏళ్ల ఆయన కంపెనీ వసతిలో ఉంటున్నారు. సిబ్బంది కోసం నడిపే క్యాంటీన్‌లో ఆయన భోజనం చేస్తారు. రోజుకు పది గంటలు, వారానికి ఏడు రోజులు పనిచేస్తారు. నెలలో నాలుగు రోజులు ఆయనకు సెలవు లభిస్తుంది.
హుబేయి ప్రావిన్స్‌లో జీవిస్తున్న తన కుటుంబం నుంచి దూరంగా ఉండేటప్పటికీ, ఇంటి దగ్గరకంటే ఇక్కడే ఎక్కువ సంపాదించగలుగుతున్నానని ఆయన చెబుతున్నారు. ఇక్కడి అడవులు, ప్రశాంతమైన ఆకాశం తనకెంతో నచ్చుతాయని వివరిస్తున్నారు.
ఫ్రెంచ్, స్వాహిలి, ఇంగ్లిష్ భాషల సాయంతో స్థానికులతో ఆయన మాట్లాడుతుంటారు. ‘‘అయితే, ఎక్కువగా మేం మాట్లాడుకోం. కేవలం పనికి సంబంధించిన విషయాలనే చర్చించుకుంటాం’’ అని ఆయన అన్నారు.
అయితే, స్పానిష్ చక్కగా మాట్లాడే అయ్ ఖింగ్ మాత్రం అర్జెంటీనాలో ఆఫీసుకు వెలుపల స్థానికులతో పెద్దగా మాట్లాడరు. తనతోపాటు పనిచేస్తున్న చైనా సిబ్బందితోనే ఆమె ఎక్కువగా బయటకు వెళ్తారు.
ఆండిస్ పర్వతాల్లో లిథియం కోసం మైనింగ్ చేసే ప్రాంతాలను చూస్తుంటే తనకు చాలా చక్కగా అనిపిస్తుందని ఆమె చెప్పారు.
‘‘ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కలిగే ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వస్తుంటుంది. నేను సరిగా నిద్రపోలేను. సరిగ్గా తినలేను కూడా. కానీ, అక్కడ చాలా బావుంటుంది. ఆఫీస్ రాజకీయాలు అసలు అక్కడ ఉండవు’’ అని ఆమె అన్నారు.
(అయ్ ఖింగ్, వాంగ్ గాంగ్‌ల పేర్లు మార్చాం)
అదనపు రిపోర్టింగ్: ఎమెరీ మకుమెనో, బ్యోబ్ మలెంగ, లూసీయెన్ కహోజీ
ఇవి కూడా చదవండి:
- నీకా షాకరామీ: ఇరాన్ భద్రతా దళాలే ఈ టీనేజర్‌ను లైంగికంగా వేధించి, చంపేశాయని వెల్లడి చేసిన సీక్రెట్ డాక్యుమెంట్
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


















