హెచ్‌డి దేవెగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేళ్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బెంగళూరు- హసన్- తుముకూరు రోడ్డులో ఏ చిన్న హోటల్‌కైనా వెళ్లి చూడండి. మీకు రాగి ముద్ద కనిపిస్తుంది. రాగి ముద్దతో పాటు సాంబారు కలిపి వడ్డిస్తారు. ఇక్కడి హోటళ్లలో వడ్డించే రాగి ముద్దకు మరో ప్రత్యేకత కూడా ఉంది. మీరు దాని గురించి హోటళ్లలో వారిని విచారిస్తే.. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవెగౌడ కూడా రాగి ముద్ద తినేవారని వారు చెబుతారు. రాగిముద్ద, ఉప్మా ఆయనకు బాగా ఇష్టమైన ఆహారం.
ఆహారంలో రాగులు ప్రధానమైన ప్రాంతంలో ఒక రైతు రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కర్నాటక ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారత దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన హరదనహళ్లి దొడ్డగౌడ దేవెగౌడ.
ఆయన తండ్రి దొడ్డేగౌడ. ఆయనది హసన్ జిల్లాలో హరదనహళ్లి అనే చిన్న గ్రామం. 1933 మే 18న ఆయన జన్మించారు.
దేవెగౌడ పుట్టడానికి ముందు, ఆయన కుటుంబంలో చాలా మంది ఫ్లూ బారిన పడి చనిపోయారు. దీంతో ఆయన తండ్రి రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దొడ్డేగౌడ, ఆయన రెండో భార్యకు తొలి సంతానం దేవెగౌడ.
కర్నాటకలో వక్కలిగ, లింగాయత్ రెండు ప్రధాన వర్గాలు. దేవెగౌడ వక్కలిక వర్గంలో జన్మించారు.
ఈ వర్గం ఎక్కువగా వ్యవసాయం, వ్యవసాయాధారిత పనుల్లో ఉండేవారు. గౌడ కుటుంబం కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ, పశువుల్ని మేపుకుంటూ జీవించేది. వీరికున్న కొద్ది పాటి భూమే వీరికి జీవనాధారం.
హరదనహళ్లిలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత దేవెగౌడను ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలని భావించారు ఆయన తండ్రి. దీంతో తాలూకా కేంద్రం హోలేనరసింగపూర్‌లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు.
ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలంటే తాలూకా కేంద్రంలోనే ఉండాలి. అది దేవెగౌడ కుటుంబానికి కష్టమైన వ్యవహారం. అయినప్పటికీ రాగి ముద్ద తింటూ అక్కడే ఉండి చదువుకోవాలని దేవెగౌడ నిర్ణయించుకున్నారు.
కొన్ని సందర్భాల్లో ఆహారం లేక పస్తులుండేవారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేవెగౌడ ఉన్నత విద్య పూర్తి చేశారు.
స్కూలు విద్య అయిపోయిన తర్వాత టీచర్ కావాలనుకున్న దేవెగౌడ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఉన్న సమయంలో విద్యార్ధి నేతగా పోటీ చేయడంతో రాజకీయాలపై ఆయనకు అవగాహన ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
తొలి రోజులు
చదువు పూర్తైన తర్వాత దేవెగౌడకు రైల్వేల్లో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు ఆయన సొంతఊరు వదిలి చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది.
దీనికి ఆయన తల్లిదండ్రులు అంగీకరించలేదు. ముఖ్యంగా దొడ్డేగౌడ వ్యతిరేకించారు. దీంతో దేవెగౌడ కాంట్రాక్టరుగా మారాలని నిర్ణయించుకున్నారు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేయడం మొదలు పెట్టారు.
1954లో ఆయన హోలేనరసింగపూర్ సహకార సొసైటీ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఆ తర్వాత 1960లో తాలూకా బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత రెండేళ్లకు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో హోలేనరసింగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలిచి కర్నాటక అసెంబ్లీలో అడుగు పెట్టారు.
1972లో కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయ్యారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే కన్నడ రాజకీయాల్లో దేవరాజ్ అర్స్, వీరేంద్ర పాటిల్, రామకృష్ణ హెగ్డే లాంటి నేతలు కీలకంగా ఉన్నారు.
దీంతో రాజకీయాల్లో కుదురుకోవడానికి దేవెగౌడకు కొంత సమయం పట్టింది.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే దేవెగౌడ కావేరీ జలాల సమస్య మీద తన అభిప్రాయాన్ని చెబుతూ ఉండేవారు.

ఫొటో సోర్స్, Getty Images
కర్నాటక ముఖ్యమంత్రి
కర్నాటక రాజకీయాల్లో దేవెగౌడ కీలక నేతగా ఎదిగినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించలేదు.
రామకృష్ణ హెగ్డే లాంటి బలమైన నేతలు ఉండటంతో దేవెగౌడకు ఆ అవకాశం కష్టంగా మారింది. చాలా సందర్భాల్లో దేవెగౌడ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నప్పటికీ, వాస్తవంలో సాధ్యం కాలేదు.
చివరిగా 1994లో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అసలు దేవెగౌడ రాజకీయాల్లోకి వస్తారని, అది కూడా ఆస్థాయికి వస్తారని ఆయన కుటుంబ సభ్యులెవరూ ఊహించలేదు. అయితే కలలో కూడా ఊహించనిది వాస్తవం అయినట్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
1991 ఎన్నికల్లో దేవెగౌడ హసన్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావడంతో తిరిగి రాష్ట్రానికి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్రంలో రాజకీయ పరిణామాలు, అనూహ్యంగా ప్రధానమంత్రి పదవి
సంజయ్ బారు “యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్” అనే పుస్తకం రాసిన తర్వాత యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం పాపులర్ అయింది. వాస్తవానికి ఈ పుస్తకం మన్మోహన్ సింగ్ గురించి రాసినప్పటికీ యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం దేవెగౌడకు చక్కగా సరిపోతుంది.
దేవెగౌడ కర్నాటక ముఖ్యమంత్రి అయిన రెండేళ్లకు కేంద్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి.
1996 సార్వత్రిక ఎన్నికల్లో పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోయింది. లోక్‌సభలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.
రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రధానమంత్రి పదవి చేపట్టవల్సిందిగా వాజ్‌పేయిని ఆహ్వానించారు. వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సభలో తగినంత బలం లేకపోవడంతో ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది.
దీంతో 13 పార్టీల యునైటెడ్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.
ఈ ఫ్రంట్‌లో హరికిషన్ సింగ్ సూర్జీత్, జ్యోతి బసు, శరద్ యాదవ్, శ్రీకాంత్ జెనా, దేవెగౌడ, లాలూ యాదవ్, మూపనార్ లాంటి అనేక మంది నేతలు ఉన్నారు.
కూటమిలో 13 పార్టీలు, ఆయా పార్టీల నాయకులంతా ఉండటం, వారిలో అనేక మంది సీనియర్లు కావడంతో ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలా అనే చర్చ జరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక ముద్ర ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని పార్టీలన్నీ నిర్ణయించాయి.
సుగత్ శ్రీనివాసరాజు రాజు రాసిన “ఫెరోస్ ఇన్ ద ఫీల్డ్” అనే పుస్తకంలో దేవెగౌడ ఏ పరిస్థితుల్లో ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చిందో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ ఫ్రంట్ తరపున ప్రధానిగా వీపీ సింగ్‌ను ఎన్నుకోవాలని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అప్పటికే అనుభవించిన వీపీ సింగ్ పదవికి దూరంగా ఉన్నారు. దీంతో ప్రధాని పదవి చేపట్టేందుకు కమ్యూనిస్టులకు తొలిసారి అవకాశం వచ్చింది. అయినప్పటికీ ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరలేదు.
లాలూ ప్రసాద్ యాదవ్ అప్పటికే దాణా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లాలూకి ప్రధాని పదవి ఇవ్వడాన్ని ములాయం వ్యతిరేకించారు. మూపనార్, కరుణానిధి దిల్లీ రాజకీయాల మీద ఆసక్తి చూపించలేదు.
మూపనార్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో ఆయనకు ప్రధాని పదవి ఇస్తే కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చేందుకు కూడా నిరాకరించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర రాజకీయాలను విడిచి వచ్చేందుకు అంగీకరించలేదు.
నేషనల్ ఫ్రంట్‌లో నేతలు ప్రధాని పదవి చేపట్టేందుకు ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వడమే.
ఎందుకంటే అంతకు ముందు కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చిన ప్రభుత్వాలు కొద్ది కాలానికే కూలిపోయాయి. కాంగ్రెస్‌తో పాటు కూటమిలోని పార్టీలను సమన్వయ పరచుకుని ప్రధాని పదవిలో కొనసాగడం అంత తేలికైన వ్యవహారం కాదు.
ఈ విషయం గ్రహించి కూటమిలోని పార్టీల నేతలంతా కీలక పదవికి దూరంగా జరిగారు.
అనేక రకాలుగా చర్చలు జరిగిన తర్వాత చివరకు కూటమి పెద్దలంతా దేవెగౌడ వైపు మొగ్గు చూపారు. అయితే దేవెగౌడ కూడా ప్రధాని పదవి చేపట్టేందుకు ఇష్టపడలేదు. ఆయన అప్పటికే కర్నాటక రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు.
ఆయన దీర్ఘకాలం కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావించారు. అయితే హరికిషన్ సింగ్ సూర్జీత్, జ్యోతిబసు, లాలూ ప్రసాద్ యాదవ్ ఒత్తిడి చేయడంతో ఆయన ఎట్టకేలకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు.
పీవీ నరసింహారావుతో సత్సంబంధాల వల్ల దేవెగౌడ ప్రధాని అయితే ప్రభుత్వం ఎక్కువ రోజులు స్థిరంగా ఉంటుందని కూటమి నేతలు భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రి దేవెగౌడ
తన ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో దేవెగౌడ దిల్లీ వచ్చారు. 1996 జూన్ 1న ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధానమంత్రిగా దేవెగౌడ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. లోక్‌సభ సభ్యుడిగా ఆయన అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ప్రధాని అయి తర్వాత తన భాష మార్చుకోవాల్సి వచ్చింది.
ప్రధానమంత్రిగా దేవెగౌడ వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్‌ను అందుకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ తరపున ఎంపీగా ఉన్న పి. చిదంబరానికి ఆర్థికమంత్రి పదవి ఇచ్చారు.
అంతకు ముందు కేంద్ర ఆర్థికమంత్రిగా మన్మోహన్ సింగ్ వేసిన బాటను కొనసాగించడంతో పాటు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకు వెళ్లే బాధ్యతను చిదంబరానికి అప్పగించారు దేవెగౌడ.
పీవీ నరసింహారావు ప్రభుత్వంలో చిదంబరం వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు. దీంతో ఆయన పని తీరు గురించి దేవెగౌడకు అవగాహన ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
తన ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందే రైతులు ఉపయోగించే రసాయన ఎరువులకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
తన ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ప్రజలకు కొన్నైనా మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. బడ్జెట్‌లో రైతులకు రాయితీలు ఇస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించారు.
ఆ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధాని దేవెగౌడ, చిదంబరం ఆ సమస్యలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. 1997లో చిదంబరం కలల బడ్జెట్ పేరుతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పన్నులు పెంచకుండానే పన్నుల పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకు రావడం ద్వారా పన్నుల ఆదాయాన్ని పెంచారు.
పన్నుల ఆదాయాన్ని 15 శాతం నుంచి 16 శాతానికి పెంచాలని చిదంబరం భావించారు. ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆరోగ్యం, బీమా రంగాల్లో ప్రైవేట్ రంగానికి అనుమతులు లాంటి అంశాలు చిదంబరం బడ్జెట్‌లో కీలక అంశాలు.
దేవెగౌడ తన హయాంలో పోఖ్రాన్ అణు పరీక్షల కార్యక్రమాన్ని పక్కన పెట్టారు. ఏడాది తర్వాత చేపట్టాలని వాయిదా వేశారు. అయితే అంతకు ముందే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. దేవెగౌడ తర్వాత ఐకే గుజ్రాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయిన తర్వాత పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారు.
దేవెగౌడ ప్రభుత్వం అణు పరీక్షల కార్యక్రమాన్ని వాయిదా వేయడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. వాజ్‌పేయి ప్రభుత్వం అణు పరీక్షలు చేపట్టిన కొన్ని రోజులకే పాకిస్తాన్ కూడా ఈ పరీక్షల్ని చేసింది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినందుకు భారత్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాది నుంచి వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడు దిల్లీలో అధికారం చేపట్టినా పరిస్థితినంతా తన అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉందా? అంతా సవ్యంగా కనిపించినా దిల్లీ అధికారం కోసం జరిగే కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు, ఉద్యమాలు, పోరాటాలకు కేంద్రం.
ఇవన్నీ తెలిసినప్పటికీ దేవెగౌడ తన హసన్- బెంగళూరు తరహా శైలిలోనే దిల్లీలోనూ వ్యవహరించారు. అంతా అదుపులో ఉన్నట్లు కనిపించినా, పరిస్థితి చేయి దాటడం మొదలైంది. కర్నాటకలో అధికారాన్ని చలాయించడం, దిల్లీలో అధికారాన్ని నిలుపుకోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది.
అధికారాన్ని నిలుపుకునేందుకు తమకు బయట నుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ నేతలను దేవెగౌడ తరచూ కలుస్తుండేవారు. ముఖ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో ఎక్కువగా భేటీ అయ్యేవారు.
ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువగా కూటమిలో పార్టీల నేతలు, కాంగ్రెస్ నేతలతోనే సమావేశాలు నిర్వహించేవారు.
ఇదిలా ఉండగానే పీవీ నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
పీవీ తర్వాత సీతారాం కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. శరద్ పవార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అయ్యారు.
ఈ సమయంలో సీబీఐ లఖూభాయ్ పాఠక్ కేసు, జేఎంఎం ముడుపుల కేసు, బిహార్ దాణా కుంభకోణం, సీతారాం కేసరి ప్రమేయం ఉన్న హత్య కేసులో విచారణలో వేగం పెంచింది. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
దేవెగౌడ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారిలో లాలూ కీలకంగా ఉన్నారు. దాణా కుంభకోణంపై కోర్టు విచారణ ప్రారంభించగానే, కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చాలని లాలూ దేవెగౌడపై ఒత్తిడి తెచ్చారు. అయితే, అందుకు దేవెగౌడ నిరాకరించారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహంగా స్పందించారు.
తనపై హత్య కేసుని తిరగదోడటంతో సీతారాం కేసరి కూడా ప్రధాని దేవెగౌడపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవెగౌడ, పీవీ మధ్య స్నేహం కూడా ఆయనకు సీతారాం కేసరికి ఇబ్బందికరంగా మారింది.
ఇదే సమయంలో శరద్ పవార్ కొంతమంది ఎంపీలతో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది.
ఈ పరిస్థితుల్లోనే ఫెరా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపార వేత్త అశోక్‌జైన్, శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లడానికి దేవెగౌడ అనుమతి ఇచ్చారు. తాను అనుమతి ఇచ్చినట్లు ఈడీ స్టేట్‌మెంట్ నమోదు చెయ్యడంతో తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ప్రయత్నించారు.
అశోక్ జైన్‌ను భారత దేశం తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా, అప్పటికే సమయం మించిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి, అశోక్ జైన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే అశోక్ జైన్, ఐకే గుజ్రాల్ మధ్య కుటుంబం బంధం ఉంది.
అశోక్ జైన్ వ్యవహారంలో వెనక్కి తగ్గకూడదని సీతారాం కేసరి నిర్ణయించారు. 1997లో దేవెగౌడ మాస్కో పర్యటనలో ఉన్నప్పుడు, దేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సీతారాం కేసరి స్వయంగా లేఖ రాసి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు పంపించారు.
దేవెగౌడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాను ప్రధాని కావాలని సీతారాం కేసరి భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
కూలిపోయిన ప్రభుత్వం
దేవెగౌడ మాస్కో నుంచి దిల్లీ చేరుకోగానే పరిస్థితిని అంచనా వేశారు. ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటుందని కూటమిలో పార్టీల నేతలు అంచనాకు వచ్చారు.
ఏప్రిల్‌లో విశ్వాస పరీక్షకు దేవెగౌడ సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో ఎంపీలు ఎవరూ ఎన్నికలకు వెళ్లాలని కోరుకోలేదు. దీంతో కూటమిలోనే దేవెగౌడను మార్చి మరో వ్యక్తిని ప్రధాని చెయ్యాలని నిర్ణయించారు.
అనేక తర్జనభర్జనల తర్వాత అందరూ కలిసి ఐకే గుజ్రాల్‌ను ప్రధానమంత్రి చేయాలని నిర్ణయించారు.
దేవెగౌడ ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష జరిగింది. ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఎంపీలు సభలో ప్రసంగించారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు తాము దేవెగౌడకు ఎందుకు మద్దతు ఉపసంహరిస్తున్నామనే దానిపై స్పష్టమైన కారణం చెప్పలేదు.
కాంగ్రెస్‌లో పీవీ, ఏఆర్ అంతూలే, శరద్ పవార్ సభలో ప్రసంగించలేదు. విశ్వాస పరీక్షలో దేవెగౌడ ఓడిపోయారు.
“నేను మళ్లీ నేలలో నుంచి పుడతాను, ఈ స్థానాన్ని ఆక్రమించుకుంటాను. ఇప్పటి వరకు పది సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. సీతారాం కేసరి ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు” అంటూ పదునైన పదాలతో దేవెగౌడ కాంగ్రెస్ నాయకత్వం మీద విరుచుకుపడ్డారు. అయితే అంతా సీతారాం కేసరి అనుకున్నట్లే జరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
దేవెగౌడ ప్రధానమంత్రి అయినంత తేలిగ్గానే ఆ పదవి నుంచి దిగిపోయారు. అయితే దిల్లీ రాజకీయాలు ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, అలా చేస్తే తాము మద్దతిస్తామని బీజేపీ ఆయనకు ప్రతిపాదించింది. అయితే దేవెగౌడ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.
తర్వాతి రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్‌లతో దేవెగౌడ సంబంధాలు కొంచె ఇష్టం- కొంచెం కష్టంగా కొనసాగాయి. ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీ మద్దతుతో, కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.
2020లో దేవెగౌడ కాంగ్రెస్ సహకారంతో రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నిక్లలో దేవెగౌడ బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు.
2018లో కర్నాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అది 13నెలలు మాత్రమే కొనసాగింది.
కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కుమార స్వామి ప్రభుత్వం పడిపోయింది.
“కాంగ్రెస్ జేడీఎస్‌ను నాశనం చేస్తుంది. అందుకే నువ్వు బీజేపీతో జత కట్టు” అని తన కుమారుడితో చెప్పినట్లు దేవెగౌడ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














