హెచ్‌డీ కుమారస్వామి: '2019లో 1996 పునరావృతం అవుతుంది'-ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, facebook/NCBN
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారని 'ఈనాడు' కథనం రాసింది. ఆ కథనం ప్రకారం..
జనతాదళ్ (ఎస్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 45 నిమిషాలపాటు సాగింది.
ప్రత్యామ్నాయ కూటమికి కన్నడ నేతలు బాసటగా నిలిచారు.
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసే పనిలో నిమగ్నమైందని చంద్రబాబు అన్నారు.
'ప్రతిపక్షాలను నియంత్రించేందుకే ఈడీ, ఐటీ సంస్థలున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. రఫేల్ ఒప్పందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రధాని నోరు మెదపటం లేదు' అని చంద్రబాబు విమర్శించారు.
దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు భాజపా ప్రత్యామ్నాయ శక్తులన్నీ ఏకం కావాలి' అని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్‌డీఏకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటయ్యే కూటమికి లౌకిక శక్తులన్నీ సహకరించాలని దేవేగౌడ పేర్కొన్నారు.
'1996లో ప్రాంతీయ పార్టీల ఐక్యతతో దేవేగౌడ ప్రధాని అయ్యారు. అది 2019లో పునరావృతం కానుంది' అని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర
కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాకు అధిష్టానం ఆమోదముద్ర పడిందని 'సాక్షి' కథనం రాసింది. దాని ప్రకారం 74 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను మిత్రపక్షాల జాబితాలతో కలిపి శనివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ విడుదల చేయనుంది.
మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14 స్థానాలు, తెలంగాణ జనసమితికి 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించగా.. మిగిలిన 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది.
94 స్థానాలకూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను ప్రతిపాదించగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) 74 స్థానాలకు ఆమోదం తెలిపింది.
మంగళ, బుధవారాల్లో పార్టీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేసి ఒక్కో నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు చొప్పున పేర్లను ప్రతిపాదించి సీఈసీకి పంపింది.
సీఈసీ ఇదివరకే 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా గురువారం 17 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది.
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అనైతికం: హరీష్‌రావు
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ మంత్రి హరీష్‌రావు రాసిన లేఖలపై 'నమస్తే తెలంగాణ' పత్రిక ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చంద్రబాబు చూశారని, విభజనాంశాలు అమలుకాకుండా అడ్డుపడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు.
తెలంగాణపై కుట్రలకు సంబంధించి 19 అంశాలకు సమాధానం చెప్పాలంటూ హరీష్‌రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.
ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం రాజకీయపార్టీల ఇష్టమని, కానీ చంద్రబాబుతో కాంగ్రెస్ కూటమి కట్టడం అనైతికమన్నారు.

ఫొటో సోర్స్, FB/AR Murugadoss
సెన్సార్ క్లియర్ చేశాక ఇంత రాద్ధాంతమా: విశాల్
ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన 'సర్కార్' వివాదంపై 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం రాసింది. దాని ప్రకారం..
సర్కార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలు ప్రవేశపెట్టిన పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులు మండిపడుతున్నారు.
ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మురగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విరుగంబక్కంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లినట్లు కథనాలు వెలువడ్డాయి.
దీనిపై హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ స్పందించాడు. ''డైరెక్టర్ మురుగదాస్ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకసారి సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతించి.. ప్రేక్షకులు కూడా సినిమాను చూసిన తర్వాత ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు'అని విశాల్ ట్వీట్ చేశాడు.
అయితే మురుగదాస్ నివాసం వద్దకు పోలీసులు వచ్చింది ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కాదని, నిరసనల నేపథ్యంలో మురుగదాస్ ఇంటిపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఆయనకు భద్రత కల్పించేందుకేనని చెన్నై పోలీసులు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.
కానీ పోలీసులు మాత్రం మురుగదాస్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన ఆచూకీ గురించి విచారించి వెళ్లిపోయారని సన్ పిక్చర్స్ సంస్థ ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








