దూరదర్శన్ లోగో రంగు ఎందుకు మారింది? ప్రతిపక్షాల అభ్యంతరం ఏమిటి?

ఫొటో సోర్స్, @DDNEWSHINDI
ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి తన దూరదర్శన్ న్యూస్ లోగో రంగును ఎరుపు నుంచి కాషాయంలోకి మార్చింది. లోక్‌సభ ఎన్నికల వేళ దూరదర్శన్ లోగో రంగును మార్చడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
దీనిపై ప్రసార భారతి మాజీ సీఈఓ జవహర్ సర్కార్ మాట్లాడుతూ ‘‘ఇది ప్రసార భారతి కాదు, ప్రచార భారతి’’ అని విమర్శించారు.
ప్రస్తుత ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.
‘‘లోగోలో ముదురు రంగులు వాడటమనేది వ్యాపార వ్యూహం. ఇందులో రాజకీయాలకు చోటు లేదు’’ అని చెప్పారు.
నిరుడు జనవరిలో దూరదర్శన్ పొదిహై పేరును డీడీ తమిళ్‌గా మార్చారు.
అప్పుడు దీనిపై పెద్ద వివాదమే నడిచింది. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు డీడీ తమిళ్ లోగోను కూడా కాషాయ రంగులోకి మార్చారు.
ఈనెల ఆరంభంలో దూరదర్శన్‌లో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రసారం చేయడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు.
‘‘రాష్ట్రంలో విద్వేషాలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ది కేరళ స్టోరీ సినిమాను ప్రసారం చేయాలనే నిర్ణయాన్ని దూరదర్శన్ తక్షణం ఉపససంహరించుకోవాలి. సంఘ్ పరివార్ మతతత్త్వ ఎజెండాగా దూరదర్శన్ పనిచేయకూడదు’’ అని ఆయన చెప్పారు.
కానీ, ఈ సినిమా ఏప్రిల్ 5న దూరదర్శన్‌లో రాత్రి 8 గంటలకు ప్రసారమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రసార భారతి నిర్ణయంపై విమర్శలు
ప్రసార భారతి నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు.
‘‘దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసింది. దూరదర్శన్ లోగోను హఠాత్తుగా కాషాయ రంగులోకి మార్చారు. ఇది పూర్తిగా అనైతికం, అక్రమం’’ అంటూ తన పోస్టును బీజేపీకి లింక్ చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఈ విషయంపై ప్రశ్నించారు.
‘‘ప్రభుత్వ ప్రసారాల సంస్థ పక్షపాత ధోరణిని ఈ చర్య తేటతెల్లం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి కాషాయరంగు అనుకూల ప్రచారాన్ని ఎన్నికల సంఘం ఎలా అనుమతిస్తుంది? ఎన్నికల సంఘం తక్షణం దీనిని ఆపాలి. దూరదర్శన్ కూడా తన పాత రంగుకు మరలాలి’’ అని మమత రాసుకొచ్చారు.
ప్రసార భారతి మాజీ సీఈఓ జవహర్ సర్కార్ మాట్లాడుతూ రంగు మార్పు ప్రత్యేకంగా ఓ పార్టీని ప్రోత్సహించడానికి ఉద్దేశించినట్టుగా ఉందన్నారు.
జవహర్ సర్కార్ ప్రసార భారతికి సీఈఓగా 2012 నుంచి 2014 దాకా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన తృణముల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
డీడీ న్యూస్ లోగో కాషాయంలోకి మార్చడంపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ మాధ్యమం దూదర్శన్ లోగోను కాషాయరంగులోకి మార్చారు. ఈ సంస్థకు మాజీ సీఈఓగా దూరదర్శన్‌ను కాషాయీకరణ చెందడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా. ఇకపై ఇది ప్రసార భారతి కాదు, ఓ పార్టీ ప్రచార భారతి’’ అని చెప్పారు.
ఇదే విషయాన్ని జవహర్ సర్కార్ ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ వీడియోలో ‘‘ప్రభుత్వ ప్రసార మాధ్యమం తన బ్రాండింగ్ కోసం ఈ రంగును ఎంచుకోవడం విచారకరం. మీరు దానిని ఆరెంజ్ లేదా మరే రంగైనా అని పిలవండి. కానీ దానిని సాధారణంగా ఓ మతంతో ముడిపడిన కాషాయరంగుగానే పిలుస్తారు’’ అని చెప్పారు.
‘‘దూరదర్శన్ న్యూస్ ను లక్షలాదిమంది చూస్తారు. ఓ మతానికి సంబంధించిన రంగును ఉపయోగించుకోవడానికి ఇది వేదిక కాదు. మన జాతీయ జెండాలో కూడా ఈ రంగు ఉంటుంది. కానీ దాంతోపాటు మరో రెండు రంగులు కూడా ఉంటాయి’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దూరదర్శన్ కాషాయీకరణ?
దూదర్శన్ పై చెలరేగిన వివాదం గురించి ఆ సంస్థలో పనిచేస్తున్న, పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి బీబీసీతో మాట్లాడారు. ‘‘దూరదర్శన్ ప్రభుత్వ ఛానల్ గా మొదలైంది. ఆ సమయంలో ఈ చానల్ ప్రయోజనమేమిటనేది ఇక్కడి అధికారులు అర్థం చేసుకోలేకపోయారు. అలాగే దీనిని తరువాత ఎలా అభివృద్ధి చేయాలనే విషయం కూడా వారికి అర్థం కాలేదు’’
‘‘దూరదర్శన్ ప్రజలలో మంచి ఆదరణ పొందింది. ఆ సమయంలో మరో ఛానల్ ఏదీ లేకపోవడం కూడా దీనికి కారణం. 2000లో ప్రైవేటు చానల్స్ రాక మొదలై అవి పాపులర్ అయిపోయాయి. కానీ ఎవరూ కూడా దూరదర్శన్ ను కాలానుగుణంగా మార్చడానికి ప్రయత్నించలేదు. ప్రభుత్వాలు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి’’
‘‘బీఎస్ఎన్ఎల్ ను రద్దు చేసినట్టు దూరదర్శన్‌నూ చేశారు. దూరదర్శన్‌లో ఏం జరుగుతోందనే విషయం ఎవరూ వినలేదు. దీనివల్లే ఈ సంస్థ నియంత్రణ కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది.’’ అని చెప్పారు.
దీనిని మరింత సోదాహరణగా వివరిస్తూ ‘‘ఏదైనా ఎన్నికల ప్రచారానికి సంబంధించి వీడియో దూరదర్శన్‌లో ప్రసారం చేయాల్సి వస్తే, అన్ని రాజకీయ పక్షాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఓ వీడియోలో ప్రతిపక్షానికి చెందిన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏడో స్థానం ఇచ్చి, ఎటువంటి పదవి లేని బీజేపీ నేతను మూడోస్థానంలో ఉంచి ఎక్కువ సమయం ఇస్తే సమానత్వం ఎక్కడున్నట్టు’’ అని చెప్పారు.
‘‘ఇక్కడ పనిచేసే శాశ్వత అధికారులందరూ పరీక్షలు రాసి ఉద్యోగం పొందినవారే. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో వస్తున్నవారందరూ అధికారులు, రాజకీయ పార్టీల సిఫార్సుల మీద వస్తున్నారు. దీనివల్ల వారు తదనుగుణంగా పనిచేస్తున్నారు.
‘‘దూరదర్శన్‌లో ఉద్యోగాలన్నీ ఒక పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారు. తమిళ్ దూరదర్శన్‌లో కూడా ఇదే జరుగుతోంది. ఇటీవల ఓ సెలబ్రిటీకి మెగా సీరియల్ ఒప్పందం ఇచ్చారు. ఇప్పడాయన బీజేపీలో చేరారు’’ అని చెప్పారు.
‘‘ కొంతమంది ఉద్యోగులు ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ అధికారం ముందు వారి గొంతు బయటకు రావడం లేదు. దూరదర్శన్‌ను నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాని మానానా దానిని వదిలేయాలి. కాషాయీకరణ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు’’ అన్నారు.
‘‘గత కొన్నేళ్ళుగా భారతీయ మీడియా తీరు మారుతోంది. మీరు దూరదర్శన్ కార్యక్రమాలు చూస్తుంటే.. ఎక్కడో ఓ చోట అది కాషాయరంగు పులుముకున్న తీరు కళ్ళబడుతుంది’’ అని అధవన్ దిత్సాన్య చెప్పారు. ఆయన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, చిత్రకారుల సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
‘‘ఐఆర్‌సీటీసీ యాప్, వందేభారత్ రైళ్ళు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంతటా కాషాయరంగు తీసుకువచ్చి, దానినో సాధారణ విషయంగా మార్చి, అందరూ దానిని అంగీకరించేలా చేయాలని చూస్తున్నారు’’
‘‘ఒక్క దూరదర్శనే కాదు. టెక్ట్స్ బుక్స్ మార్చేశారు. గత పదేళ్లలో మన చుట్టూ ఏం జరిగిందో చూడండి. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న ప్రధాని మోదీ ప్రతిపక్షాలు మాంసాహారం తింటాయని, ఆలయ ప్రారంభోత్సవానికి రాలేదని విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో దూరదర్శన్ లోగో రంగు మార్చడం పెద్ద వింతేమీ కాదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, THE KERALA STORY
‘కేరళ స్టోరీ ప్రసారం తప్పు’
కేరళ స్టోరీ సినిమా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఎన్నికల సమయంలో ప్రభుత్వ వార్తా ఛానల్ దూరదర్శన్ ఆ సినిమాను ప్రసారం చేసింది. ఇది దూరదర్శన్ కొత్త అవతారం. కచ్చితంగా కాషాయ రూపం’’ అని సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ చెప్పారు.
‘‘ఆ సినిమా సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక సినిమా అని తెలిసి కూడా ప్రభుత్వ వార్తా ఛానల్‌లో ఎందుకు ప్రసారం చేశారు? అని ప్రశ్నను సంధిస్తూ పాండ్యన్ ‘‘ఈ సినిమా ఎవరికి మద్దతు ఇస్తుందో, ఎవరికి ఎన్నికల లబ్ధి చేకూరుస్తుందో దూరదర్శన్‌కు తెలియదా?’’ అన్నారు.
ఒక వేళ పార్లమెంట్ కు కూడా కాషాయరంగు వేస్తే అది కూడా సాధారణమే అవుతుంది.
మరో ఆరుదశల ఎన్నికలు జరగాల్సి ఉండగా, పదేపదే ఇలాంటి చర్యల ద్వారా తాము మెజార్టీ ప్రజలకు అనుకూలమని, మైనార్టీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇలాంటి వి చేస్తూనేఉంటారు’’ అని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘అందుకే రంగు మార్చాం’
దూరదర్శన్ లోగో రంగును మార్చుతున్నట్టు డీడీ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది.
‘‘మేము ఇప్పుడు కొత్త అవతారంలో వస్తున్నాం. కానీ మా విలువల్లో ఎటువంటి మార్పు ఉండదు. సరికొత్త వార్తా ప్రపంచంలోకి ప్రయాణించడానికి సిద్ధం కండి. సరికొత్త డీడీ న్యూస్‌తో నభూతో నభవిష్యతి అనుభూతిని పొందండి’’
‘‘వేగవంతమైన వార్తలు, సంచలనాత్మక వార్తలకు బదులుగా కచ్చితమైన, నిజమైన వార్తలకు దూరదర్శన్ హామీ ఇస్తోంది’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
దృశ్య సౌందర్యం కోసమే దూరదర్శన్ లోగో రంగు మార్చామని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది చెప్పారు.
‘‘ ఆరేడు నెలల కింద జీ20 సదస్సు జరిగినప్పుడు డీడీ ఇండియా (ఇంగ్లీషు న్యూస్ ఛానల్) లోగోను కూడా అదే రంగుకు మార్చాం. దానికి వచ్చిన ప్రతిస్పందన ఆధారంగా ఛానల్ కు కొత్త గ్రాఫిక్స్ జత చేయాలని భావించాం’’ అని చెప్పారు.
‘‘మేం డీడీ న్యూస్ ను దృశ్యపరంగా, సాంకేతికంగా సరికొత్త అవతార్‌లో తీసుకురావడానికి పని మొదలుపెట్టాం. కేవలం లోగో మాత్రమే కాదు. ఆధునిక పరికరాలు, కొత్త వేదికలతో అనేక మార్పులు చేయనున్నాం’’
‘‘గతంలో దూరదర్శన్ లోగోలో బ్లూ, పసుపు రంగులు వాడాం. ప్రకటనల వ్యూహంలో భాగంగా లోగోలో ముదురు రంగులు వాడుతున్నాం. ఇది ఛానల్ అభివృద్ధి కోసమే. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు’’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- 1200 ఎకరాల భూమి.. 200 ఫ్లాట్లు.. భారీ కుంభకోణం ఆరోపణలు.. ఎవరీ నీరజ్ అరోరా?
- ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్‌తో ఇరాన్‌కు బలమైన హెచ్చరిక పంపిందా?
- చైనాలోని నగరాలు ఎందుకు కుంగిపోతున్నాయి?
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














