ఆకు పసరుతో సొంతంగా వైద్యం చేసుకున్న ఒరంగుటాన్.. ఎప్పుడూ చూడని దృశ్యం ఇది..

ఫొటో సోర్స్, Armas
- రచయిత, జార్జినా రన్నార్డ్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
ఇండోనేషియాలో సుమత్రన్ ఒరంగుటాన్ తన ముఖంపై అయిన పెద్ద గాయానికి తనకు తానే వైద్యం చేసుకుంది. చెట్ల నుంచి సేకరించిన ఆకులను నమిలి పేస్టుగా చేసుకుని దాన్ని గాయానికి రాసుకుంది. అలా ఒక్క నెలలోనే ఒరంగుటాన్ తన గాయాన్ని నయం చేసుకుందని శాస్త్రవేత్తలు చెప్పారు.
అడవుల్లోని ఒక వన్యప్రాణి వైద్య మూలికలతో తన గాయానికి చికిత్స చేసుకోవడాన్ని రికార్డు చేయడం ఇదే తొలిసారి.
రకుస్ అనే పేరు గల ఈ ఒరంగుటాన్, ఔషధ చెట్ల ఆకులతో తయారు చేసుకున్న పసరును గాయంపై రాసుకోవడాన్ని శాస్త్రవేత్తలు చూశారు. ఆ తర్వాత నెలలోనే ఆ గాయం మాయమైంది.
పూర్వకాలంలో మానవులు, కోతుల నుంచి ఈ ప్రవర్తనను ఒరంగుటాన్ కూడా అలవాటు చేసుకుని ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘‘మనుషుల అలవాట్లను పోలిన మన దగ్గరి బంధువులు ఒరంగుటాన్‌లు. ఎన్నో రకాల పనుల్లో మనకు వాటికి సారూప్యత ఉంటుందని ఇది మరోసారి రుజువు చేసింది’’ అని ఈ పరిశోధనలో భాగమైన ప్రధాన రచయిత, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే బయోలజిస్ట్ డాక్టర్ ఇసాబెల్లా లామర్ చెప్పారు.
ఇండోనేషియాలోని గునుంగ్ లిజర్ నేషనల్ పార్క్‌లో పరిశోధనా బృందం ఉన్నప్పుడు, 2022 జూన్‌లో రకుస్ ముఖంపై పెద్ద గాయాన్ని శాస్త్రవేత్తలు చూశారు.
మగ ఒరంగుటాన్లతో ఇది పోట్లాడినప్పుడు దానికి గాయమై ఉంటుందని వారు భావించారు.
ఎందుకంటే, ఈ గాయాన్ని వారు చూడటానికి కొన్ని రోజుల ముందు ‘‘లాంగ్ కాల్స్’’ను అంటే గట్టిగా ఏడుస్తున్న శబ్దాలను శాస్త్రవేత్తలు విన్నారు.

ఫొటో సోర్స్, Safruddin
ఆ తర్వాత అకర్ కునింగ్ అని పిలిచే చెట్ల ఆకులను, కాండాన్ని తెంచుకుని రకుస్ నమలడాన్ని పరిశోధకుల బృందం చూసింది.
అకర్ కునింగ్ అనేది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్లాంట్. స్థానికంగా దీన్ని మలేరియా, మధుమేహం వంటి రుగ్మతలను నయం చేసేందుకు వాడతారు.
నమిలిన ఆకుల నుంచి వచ్చిన పసరును ఏడు నిమిషాల పాటు పదేపదే తన బుగ్గపై అయిన గాయానికి రాసుకుంది. ఈ గాయం పూర్తిగా మానేంత వరకు ఈ చెట్ల ఆకులను కోసుకోవడం, నమలడం, ఆ రసాన్ని ముఖానికి రాసుకోవడం చేసింది రకుస్.
ఈ చెట్ల ఆకులు మ్యాజిక్ చేశాయి. ఒరంగుటాన్ ముఖంపై నెల రోజుల తర్వాత ఎలాంటి గాయాన్ని పరిశోధకులు చూడలేదు.
ఐదు రోజుల వ్యవధిలోనే ముఖంపై గాయం మాడిపోయింది. ఆ తర్వాత నెలకు, రకుస్ ముఖంపై ఈ గాయం పూర్తిగా మాయమైందని తెలిపారు.
తాను ఔషధాన్ని అప్లయి చేసుకుంటున్నానని రకుస్‌కు తెలుసని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే, ఒరంగుటాన్లు ఒక నిర్దిష్ట మొక్కను చాలా అరుదుగా తింటుంటాయి.
‘‘ఈ మొక్క పసరను పదేపదే ఒరంగుటాన్ తన ముఖానికి రాసుకోవడం, ఆ తర్వాత మరింత గట్టి పదార్థాన్ని తీసుకుని అప్లయి చేసుకోవడం చూశాం. ఈ మొత్తం ప్రక్రియకు కాస్త సమయం పట్టడంతో, ఇది కావాలనే ఇలా చేస్తుందని అనుకున్నాం’’ అని డాక్టర్ లామర్ చెప్పారు.
రకుస్ అంతకుముందు కంటే ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడాన్ని తాము గమనించినట్లు పరిశోధకులు తెలిపారు.
రోజులో సగానికి పైగా నిద్రపోయేదని చెప్పారు. ఈ గాయం తర్వాత కోలుకునేందుకు రకుస్ ప్రయత్నించడాన్ని ఇది సూచించింది.
గాయాల నుంచి కోలుకునేందుకు పెద్ద కోతులు వైద్య మూలికలను వాడేవని శాస్త్రవేత్తలకు అప్పటికే అవగాహన ఉంది.
చింపాజీలు ముఖాలపై చెట్ల ఆకుల పసరను రాసుకోవడాన్ని బయోలజిస్ట్ జేన్ గుడాల్ 1960ల్లోనే చూశారు. పెద్ద కోతులు వైద్య మూలికల ఆకులను మింగడంపై ఇతరులు డాక్యుమెంట్ రూపొందించారు.
కానీ, వన్యప్రాణులు కూడా చెట్ల ఆకుల పసరను గాయాలకు రాసుకోవడాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు.
రకుస్ తొలిసారి ఇలాంటి రకమైన చికిత్సను తీసుకోవడంతో వన్యప్రాణులు కూడా గాయాలను చెట్ల ఆకుల పసరతో తగ్గించుకుంటున్నాయని డాక్టర్ లామర్ చెప్పారు.
‘‘అనుకోకుండా ఒరంగుటాన్ తన ముఖానికి అయిన గాయాన్ని, ఈ చెట్లను తాకిన చేతితో ముట్టుకుని ఉండొచ్చు. ఆ తర్వాత నొప్పి ఉపశమనానికి చెందిన ఈ మూలికలతో దీనికి వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలిగి ఉండొచ్చు. అందుకే, పదేపదే గాయానికి ఈ చెట్ల పసరను రాసుకుంది’’ అని తెలిపారు.
లేదంటే తమ గ్రూప్‌లోని ఇతర ఒరంగుటాన్లను చూసైనా ఈ విధానాన్ని నేర్చుకుని ఉండొచ్చని చెప్పారు. రకుస్ మాదిరి ఇదే రకమైన వైద్య విధానాలను ఇతర ఒరంగుటాన్లు అనుసరిస్తున్నాయో లేదో ప్రస్తుతం పరిశోధకులు పరిశీలించనున్నారు.
‘‘దీని ద్వారా వచ్చే కొన్నేళ్లలో మనిషిని పోలిన వన్యప్రాణుల సామర్థ్యాలు, ప్రవర్తనల గురించి మరింత తెలుసుకుంటామని ఆశిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.
ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలు, సైంటిఫిక్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....
- ఆస్ట్రాజెనెకా: కోవిషీల్డ్ వ్యాక్సీన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కంపెనీ అంగీకరించినట్లేనా, పరిహారం కోరుతున్నవారు ఏమంటున్నారు?
- మనలో ‘రెండో గుండె’ ఉందని మీకు తెలుసా? అది ఎలా పని చేస్తుందంటే...
- ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?
- నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.














