ఆస్ట్రాజెనెకా: కోవిషీల్డ్ వ్యాక్సీన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని కంపెనీ అంగీకరించినట్లేనా, పరిహారం కోరుతున్నవారు ఏమంటున్నారు?

టీకా వేసేందుకు సిద్ధమవుతున్న వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా ఆస్ట్రాజెనెకా టీకా వేసేందుకు సిద్ధమవుతున్న వైద్య సిబ్బంది
    • రచయిత, ఆండ్రూ వెబ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్ట్రాజెనెకా కోవిడ్ టీకాను తీసుకున్న తర్వాత మెదడు దెబ్బతిందని పేర్కొంటూ ఒక తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదుపై కోర్టులో వాదిస్తున్న న్యాయవాది.. కంపెనీ వైఖరిలో కీలక మార్పు కనిపించిందని బీబీసీకి చెప్పారు.

ఆస్ట్రాజెనెకా కోర్టుకు సమర్పించిన పత్రాలలో తొలిసారి, తన కోవిడ్ టీకా వల్ల అత్యంత అరుదైన దుష్ఫ్రభావాలు తలెత్తుతున్నాయని ఒప్పుకుంది.

తన కోవిడ్ టీకాపై నమోదైన క్లాస్ యాక్షన్‌ వ్యాజ్యంలో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ పలు రకాల ఆరోపణలను ఎదుర్కొంటుంది.

టీకా వల్ల తమ ఆప్తులను కోల్పోయినట్లు కొందరు ఫిర్యాదు చేయగా, తాము కూడా ఆరోగ్యపరంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన మరికొందరు చెప్పారు.

అయితే, ఆస్ట్రాజెనెకాతో పాటు పలు కోవిడ్ టీకాలు లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు అధ్యయనాలు సూచించాయి.

యూకేలో వేసిన తొలి కోవిడ్ టీకా ఆస్ట్రాజెనెకా టీకానే

ఫొటో సోర్స్, Press Association

ఫొటో క్యాప్షన్, 2021 జనవరిలో బర్మింగ్‌హామ్ మసీదు వద్ద యూకేలో వేసిన మొట్టమొదటి కరోనా టీకా ఆస్ట్రాజెనెకా టీకానే.

ఇద్దరు పిల్లల తండ్రి అయిన జామీ స్కాట్, గత ఏడాది తొలిసారి కోవిషీల్డ్‌పై కేసు వేశారు. 2021 ఏప్రిలో టీకా తీసుకున్న తర్వాత రక్తం గట్టకట్టడంతో తన బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, తాను సరిగ్గా పని చేయలేకపోయాయని చెప్పారు.

యూకేలో వినియోగదారుల సంరక్షణ చట్టం కింద వేసిన వ్యాజ్యంలో, ఈ టీకాలో చాలా లోపాలున్నాయని ఆరోపించారు. ఇది అనుకున్నంతగా రక్షణనిచ్చే టీకా కాదని ఆయన అన్నారు.

యూకేలో వేసిన తొలి కోవిడ్ టీకా ఆస్ట్రాజెనెకా టీకాయే.

ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా కొట్టివేస్తూ వచ్చింది. కానీ, ఫిబ్రవరిలో హైకోర్టుకు సమర్పించిన లీగల్ డాక్యుమెంట్‌లో మాత్రం తమ కోవిడ్ టీకా వల్ల అత్యంత అరుదైన కేసులలో ఒకటైన టీటీఎస్ (థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) అనే సమస్య కొందరిలో ఏర్పడినట్లు అంగీకరించింది.

ఆస్ట్రాజెనెకా టీకాను చాలా పేద దేశాలకు ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రాజెనెకా టీకాను చాలా పేద దేశాలకు ఇచ్చారు.

టీకా తీసుకున్న తర్వాత ఈ సిండ్రోమ్ సంభవిస్తే వీఐటీటీ (వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా)గా చెబుతుంటారని తెలిపారు.

టీటీఎస్/వీఐటీటీ అనేది అరుదైన సిండ్రోమ్. రక్తం గడ్డకట్టడం వల్ల థ్రోంబోసైటోపెనియా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం మొదలవుతుంది.

టీటీఎస్/వీఐటీటీ వల్ల తలెత్తే పరిణామాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. వాటిలో స్ట్రోక్స్, బ్రెయిన్ డ్యామేజ్, గుండె పోట్లు, పల్మనరీ ఎంబాలిజం వంటివి వస్తుంటాయని కంపెనీ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు చెప్పారు.

థ్రోంబోసిస్ చాలా రకాలుగా వస్తుంటుంది. టీకా వేసుకోని వారికి కూడా వస్తుండొచ్చు. అత్యంత అరుదైన సిండ్రోమ్ టీటీఎస్/వీఐటీటీ మాత్రం టీకా వేసుకున్న తర్వాత వచ్చే థ్రోంబోసిస్‌కు వర్తిస్తుంది.

2023 మే నెలలో పంపిన లేఖలకు స్పందించిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ‘‘టీకా వల్లనే పెద్ద సంఖ్యలో టీటీఎస్ తలెత్తుందని అంటే మేం ఒప్పుకోం’’అని తెలిపిందని జామీ స్కాట్ న్యాయవాదులు బీబీసీకి ధ్రువీకరించారు.

కానీ, ఫిబ్రవరిలో హైకోర్టుకు సమర్పించిన లీగల్ డాక్యుమెంట్‌లో మాత్రం తమ కంపెనీ టీకా వల్ల అత్యంత అరుదైన కేసులలో ఒకటైన టీటీఎస్ తలెత్తుతుందని ఆస్ట్రాజెనెకా చెప్పింది. అయితే, అదెలా తలెత్తుతుందని తమకు స్పష్టంగా తెలియదని పేర్కొంది.

ప్రతి ఫిర్యాదుదారు కూడా టీకా వల్లనే ఈ అరుదైన సిండ్రోమ్ తలెత్తిందని, ఇతర ఏ అంశాలు టీటీఎస్‌కు కారణం కాదని నిరూపించాలని కంపెనీ డిమాండ్ చేసింది.

ఆస్ట్రాజెనెకా టీకా(మరేదైనా టీకా) వేసుకోనప్పటికీ కూడా టీటీఎస్ వస్తుందని, ప్రతి వ్యక్తి కేసులో తలెత్తిన కారకాలు నిపుణుల సాక్ష్యాలతో నిరూపించాల్సిన విషయమని కంపెనీ చెప్పింది.

మహారాష్ట్రలోని సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కనీసం 100 కోట్ల డోసుల కోవిడ్ టీకా కోసం 2021లో ఆస్ట్రాజెనెకాను సంప్రదించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహారాష్ట్రలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కనీసం 100 కోట్ల డోసుల కోవిడ్ టీకా కోసం 2021లో ఆస్ట్రాజెనెకా‌తో కాంట్రాక్టు చేసుకుంది. కోవిషీల్డ్ పేరుతో దేశంలో ఈ టీకాను పంపిణీ చేశారు

‘ఆస్ట్రాజెనెకా వాదనల్లో కీలక మార్పు’

ఈ కేసులో ఆస్ట్రాజెనెకా వాదనల్లో కీలకమైన మార్పు చోటు చేసుకుందనడానికి ఇది సూచనగా ఉందని ఫిర్యాదుదారుల తరఫున వాదిస్తున్న న్యాయవాది చెప్పారు. ఇప్పటి వరకు 51 కేసులు ఈ కంపెనీపై నమోదయ్యాయి.

‘‘ఆస్ట్రాజెనెకా టీకా టీటీఎస్/ వీఐటీటీకి కారణమవుతుందన్న వాస్తవాన్ని ఒప్పుకోవడం అత్యంత కీలకమైన విషయం’’ అని లీ డే న్యాయ సంస్థకు చెందిన సారా మూర్ చెప్పారు. అధికారిక డాక్యుమెంట్లలో తమ వైఖరిని మార్చుకోవాలని వారు నిర్ణయించడం పెద్ద విషయమని అన్నారు.

ఈ ఒప్పుకోలు వల్ల కంపెనీ నుంచి ఫిర్యాదుదారులకు పరిహారం లభించే అవకాశాలు పెరుగుతాయి.

ఈ అంశంపై ఆస్ట్రాజెనెకా కంపెనీ మంగళవారం బీబీసీతో మాట్లాడింది. కానీ, సారా మూర్ లేవనెత్తిన పాయింట్లపై మాత్రం కంపెనీ స్పందించలేదు.

‘‘ఆప్తులను కోల్పోయిన వారికి, ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికీ మా తరఫున సానుభూతి తెలియజేస్తున్నాం. రోగి భద్రత మా అత్యున్నత ప్రాధాన్యత. టీకాలతో సహా అన్ని మెడిసిన్లను ప్రజలకు సురక్షితంగా ఉండేలా స్పష్టమైన, కఠిమైన ప్రమాణాలను రెగ్యులేటరీ అథారిటీలు అమలు చేస్తున్నాయి. క్లినికల్ ప్రయోగాలలో, బాహ్య ప్రపంచంలోని ఆధారాలను చూసుకుంటే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ టీకా చక్కగానే ఉన్నట్లు కనిపించింది. టీకాల వల్ల నష్టాల కన్నా లాభాలే ఎక్కువని ప్రపంచవ్యాప్తంగా అనేక పరీక్షల్లో తేలింది’’ అని బీబీసీకి వెల్లడించిన ప్రకటనలో ఆస్ట్రాజెనెకా తెలిపింది.

చైనాలో లాక్‌డౌన్ ప్రారంభమైన ఏడాది లోపలే ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా టీకాను ఆవిష్కరించారు. మొట్టమొదటి టీకాను 2021 మార్చిలో కెన్యాలో ఒక వైద్య సిబ్బంది వేయించుకున్నారు.

వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఆస్ట్రాజెనెకా కోవిడ్ టీకా వేసేందుకు సిద్ధం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2021 మార్చి 18న బెల్జియంలో వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ఆస్ట్రాజెనెకా కోవిడ్ టీకా వేసేందుకు సిద్ధమవుతున్న వైద్య సిబ్బంది

లేబులింగ్ మార్చాలని సూచన

18 ఏళ్లు, అంతకంటే పైబడి వయసున్న వ్యక్తులకు ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమైనదని, సమర్థవంతమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 జూన్‌లో తెలిపింది.

అయితే, చాలా తక్కువ సంఖ్యలో, అత్యంత అరుదుగా మాత్రమే కొందరికి ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్లు రిపోర్టులు రావడంతో ఆస్ట్రాజెనెకా టీకాకు ప్రత్యామ్నాయ టీకాను 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులకు ఇవ్వాలని 2021 ఏప్రిల్ 7న వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్‌కు చెందిన జాయింట్ కమిటీ సూచించింది.

ఈ సూచనను ప్రతిబింబిస్తూ వ్యాక్సిన్ బాక్సులు, సీసాలపై లేబులింగ్ మార్చాలని ఆస్ట్రాజెనెకాకు కూడా సిఫారసు చేసింది.

2021 మే 7న తన మార్గదర్శకాలను సవరించి, 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్లకి వర్తిస్తుందని తెలిపింది.

‘‘ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 30 సివిల్ ప్రొసీడింగ్స్‌ను వెనక్కి తీసుకున్నారు లేదా ఆస్ట్రాజెనెకాకు అనుకూలమైన తీర్పులు వచ్చాయి’’ అని ఆస్ట్రాజెనెకా బీబీసీకి చెప్పింది.

కెన్యాలో వైద్య సిబ్బందికి ఆస్ట్రాజెనెకా టీకా వేశారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2021 మార్చి 5న కెన్యాలోని నైరోబీలో వైద్య సిబ్బందికి ఆస్ట్రాజెనెకా/ఆక్స్‌ఫర్డ్ కోవిడ్ టీకా వేశారు.

‘న్యాయమైన పరిహారం’

‘‘జామీ పలువురు స్పెషలిస్టుల వద్ద 250కి పైగా రిహాబిలేషన్ సెషన్లను తీసుకున్నారు. మళ్లీ నడవడం ఎలా, శ్వాసతీసుకోవడం, మాట్లాడటం నేర్చుకున్నారు. ఎన్నో మెమరీ సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు’’ అని జామీ భార్య కేట్ స్కాట్‌ అంతకుముందు బీబీసీకి చెప్పారు.

‘‘ఆయన వారి వల్ల కాస్త కోలుకున్నప్పటికీ, జామీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయన ఆలోచనలు, అనుభవాలు ద్వారా అర్థం చేసుకునే, జ్ఞానాన్ని పొందగలిగే సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెదడుపై చూపిన ప్రభావం వల్ల అఫాసియా (భాషను అర్థం చేసుకోవడంలో మాట్లాడటంలో ఒక వ్యక్తి ఇబ్బంది పడటం) తలెత్తింది. తీవ్ర తలనొప్పి, కందిపోవడం వంటివి ఆయన ఎదుర్కొంటున్నారు’’ అని చెప్పారు.

‘‘టీకా వల్ల తలెత్తే ముప్పుకు పరిహారం అందించే స్కీమ్‌ను సవరించాలని మేం యూకే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది చాలా అన్యాయంగా, అసమర్ధంగా ఉంది. మాకు తగిన న్యాయపరిహారం కావాలి’’ అని కేట్ స్కాట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.