హఫీజ్ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాకిస్తాన్ కోర్టు - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ముంబయి దాడుల (26 నవంబర్, 2008) సూత్రధారిగా భావిస్తున్న నిషిద్ధ జమాత్ ఉద్ దావా సంస్థ అధినేత మహమ్మద్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని ఒక తీవ్రవాద కార్యకలాపాల నిరోధక న్యాయస్థానం రెండు వేర్వేరు కేసుల్లో దోషిగా నిర్ధరిస్తూ 10 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
తీవ్రవాద నిరోధక శాఖ దాఖలు చేసిన ఈ కేసును లాహోర్‌లోని యాంటీ-టెర్రరిజం కోర్టు-1 న్యాయమూర్తి అర్షద్ హుసేన్ భుట్టా విచారించారు.
సయీద్ ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దానితో పాటు ఒక లక్షల పది వేల రూపాయల జరిమానా కూడా విధించింది.
ఈ కేసులో కోర్టు మరో ముగ్గురికి కూడా శిక్షలు విధించింది.
హఫీజ్ సయీద్‌తో పాటు జఫర్ ఇక్బాల్, యహ్యా అజీజ్‌లకు కూడా లాహోర్ తీవ్రవాద కార్యకలాపాల నిరోధక కోర్టు పదిన్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించింది. అబ్దుర్రహమాన్ మక్కీకి ఆరు నెలల శిక్ష విధించింది.

ఇప్పటివరకు నాలుగు కేసుల్లో శిక్ష
2019 జూలైలో అరెస్టయిన హఫీజ్ సయీద్ మీద ఇప్పటివరకు నాలుగు కేసుల్లో విచారణ పూర్తయింది.
తాజా తీర్పు ప్రకారం ఈ జైలు శిక్షలన్నీ కలిపే అనుభవించాల్సి ఉంటుందని, ఒకవేళ దోషులు కనుక జరిమానా చెల్లించకపోతే అదనపు శిక్ష ఉంటుందని కోర్టు తెలిపింది.
ఈ తీర్పులో 382బి సెక్షన్‌ను ప్రస్తావించారని క్రిమినల్ లాయర్ జుల్ఫికర్ భట్టా అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం దోషి జైలు శిక్ష అతడు పోలీసుల అదుపులోకి వెళ్లిన మొదటి రోజు నుంచి లెక్కిస్తారు.
ఇంతకుముందు కూడా లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు హఫీజ్ సయీద్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష, 30 వేల జరిమానా విధించింది.
అయితే, హఫీజ్ సయీద్, ఆయన అనుచరులు మాత్రం తాము నిర్దోషులమని, అంతర్జాతీయ ఒత్తిళ్ల మూలంగా తమకు శిక్ష విధించారని అంటున్నారు.
హఫీజ్ సయీద్, ఆయన నాయకత్వంలోని నిషిద్ధ సంస్థకు చెందిన వారి మీద పంజాబ్‌లో దాదాపు రెండు డజన్ల కేసులు నమోదయ్యాయి.

తుంగభద్ర పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం
కరోనావైరస్ వ్యాప్తి నడుమ భక్తుల మనోభావాలను, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని తుంగభద్ర పుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ పుస్కరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.

తుంగభద్ర పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 230 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
కర్నూలు జిల్లాలో ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం సమీక్షించారు.

భక్తులకు ఇబ్బంది కలగకుండా పూజలు, పిండ ప్రదానాల స్లాట్ బుకింగ్ కోసం ఉచిత ఇ-టికెట్ సిస్టంను మంత్రులు ప్రారంభించారు.
దీని ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర్ ఘాట్స్ లలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

తుంగభద్ర పుష్కరాల 12 రోజులూ కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో ఉన్న 23 పుష్కర ఘాట్స్ లో నీరు సంవృధ్ధిగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రులు సూచించారు.

భద్రతా ఏర్పాట్ల కోసం కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుండి 5000 ల మంది పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు ఒక ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా ఇక్కడకు చేరుకుంది.
హరిత పారిశ్రామిక విప్లవం: బ్రిటన్‌లో 2030 నుంచి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు నిషిద్ధం

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో 2030 సంవత్సరం నుంచి పెట్రోల్, డీజిల్‌లతో నడిచే కార్లు, వ్యాన్ల విక్రయాలను నిషేధిస్తున్నట్లు ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
అయితే.. కొన్ని హైబ్రీడ్ కార్ల విక్రయానికి మాత్రం అనుమతి ఉంటుందని చెప్పారు.
వాతావరణ మార్పును ఎదుర్కోవటంతో పాటు అణు ఇంధన రంగంలో ఉద్యోగాలను సృష్టించటం కోసం 'హరిత పారిశ్రామిక విప్లవం'లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు జాన్సన్ తెలిపారు.
హరిత పారిశ్రామిక విప్లవం కోసం బోరిస్ జాన్సన్ పది సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. దీనిని అమలు చేయటానికి 400 కోట్ల పౌండ్లు కేటాయించారు. అయితే.. ఎదుర్కోవాల్సిన సవాలు చాలా తీవ్రంగా ఉందని.. ఈ నిధులు సరిపోవని విమర్శకులు అంటున్నారు.
ఈ ప్రణాళిక మొత్తం ప్యాకేజీ 1,200 కోట్ల పౌండ్లని, అందులో 400 కోట్ల పౌండ్లు ప్రభుత్వం సమకూర్చగా.. అధిక భాగం నిధులు ప్రైవేటు రంగం నుంచి వస్తాయని వాణిజ్యశాఖ మంత్రి అలోక్ శర్మ బీబీసీకి చెప్పారు.
బ్రిటన్‌లో రెండున్నర లక్షల ఉద్యోగాల కల్పనకు ఈ నిధులు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
'హరిత పారిశ్రామిక విప్లవం' కోసం బోరిస్ జాన్సన్ పది సూత్రాల ప్రణాళిక

ఫొటో సోర్స్, Getty Images
- సముద్రంలో పవన విద్యుత్ ప్రాజెక్టులు
- హైడ్రోజన్ విద్యుత్ ప్రాజెక్టులు
- అణువిద్యుత్ ప్రాజెక్టులు
- విద్యుత్ వాహనాలు
- ప్రభుత్వ రవాణా, సైక్లింగ్, నడకను ప్రోత్సహించటం
- విమానాలు, నౌకలను హరిత ఇంధనంతో నడపటం
- ఇళ్లు, స్కూళ్లు, ఆస్పత్రులను హిరతమయం చేయటం
- హానికర ఉద్గారాలు గాలిలోకి విడుదల కాకుండా బంధించే సాంకేతికతను అభివృద్ధ చయటం
- సహజ పర్యావరణాన్ని పరిరక్షించటం, పునరుద్ధరించటం
- లండన్ నగరాన్ని అంతర్జాతీయ హరిత పెట్టుబడుల నగరంగా తీర్చిదద్దటం
యాపిల్ ఐపోన్: ఫోన్ల వేగం తగ్గించినందుకు రూ. 839 కోట్ల జరిమానా చెల్లించనున్న యాపిల్

ఫొటో సోర్స్, Getty Images
పాత ఐఫోన్లు నెమ్మదింప చేశారనే ఆరోపణల వివాదంలో 113 మిలియన్ డాలర్లను (రూ. 839.48 కోట్లు) యాపిల్ చెల్లించనుంది.
వినియోగదారులతో కొత్త ఫోన్లు కొనిపించేందుకు కావాలనే పాత ఫోన్లను యాపిల్ నెమ్మదింపజేసిందని 33 అమెరికా రాష్ట్రాలు ఈ కేసు వేశాయి.
2016లో ఐఫోన్ 6, 7, ఎస్‌ఈ ఫోన్లు ఒక్కసారిగా స్లో అయిపోవడంతో కోట్ల మంది ప్రభావితం అయ్యారు. ఈ వివాదాన్ని బ్యాటరీగేట్ వివాదంగా పిలుస్తున్నారు.
ఈ విషయంపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. అయితే బ్యాటరీ ఎక్కువ కాలం వచ్చేలా చూసేందుకే ఫోన్లు నెమ్మదింపజేశామని ఇదివరకు సంస్థ తెలిపింది.
ప్రభావితమైన ఐఫోన్ వినియోగదారులకు 500 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు గత మార్చిలో యాపిల్ అంగీకరించింది. తాజా జరిమానా దీనికి అదనం.
2016లో ఒక్కసారిగా 6, 7, ఎస్ మోడల్స్ ఫోన్ల వేగం విపరీతంగా తగ్గిపోయింది. 2017లో దీన్ని పరిశోధకులు గుర్తించారు.
దీంతో బ్యాటరీ పికప్ పెంచేందుకే ఇలా చేసినట్లు యాపిల్ అంగీకరించింది.
బెన్ వాట్కిన్స్: మాస్టర్ చెఫ్ జూనియర్ స్టార్ కేన్సర్‌తో మృతి

ఫొటో సోర్స్, Getty Images
మాస్టర్ చెఫ్ జూనియర్ నటుడు బెన్ వాట్కిన్స్ సోమవారం నాడు క్యాన్సర్‌తో చనిపోయినట్లు అతడి కుటుంబం ధ్రువీకరించింది. ఈ యువ చెఫ్ వయసు 14 సంవత్సరాలు.
అమెరికాలో ప్రజాదరణ పొందిన మాస్టర్ చెఫ్ జూనియర్ ప్రోగ్రామ్‌లో 2018లో బెన్ వాట్కిన్స్ హాజరయ్యాడు.
''వంటల గురించి నాకు తెలిసినదంతా మా అమ్మే నాకు నేర్పించింది. లేదంటే ఆమె చేస్తున్నపుడు చూసి నేర్చుకున్నాను'' అని బెన్ చెప్పాడు.
చికాగో ప్రాంతానికి చెందిన బెన్ విషాదకరమైన నేపథ్యం నుంచి వచ్చాడు. 2017లో బెన్ తల్లి లైలా ఎడ్వర్డ్స్‌ను, అతడి తండ్రి మైఖేల్ కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
''కేన్సర్‌తో ఏడాదిన్నర పాటు పోరాడిన మన బెన్ ఈ మధ్యాహ్నం తన అమ్మ దగ్గరకు వెళ్లిపోయాడు'' అని బెన్ బామ్మ డోనా ఎడ్వర్డ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
''ఈ భూమి మీద తన 14 ఏళ్ల జీవితంలో బెన్ తన వాటా కన్నా చాలా ఎక్కువ బాధలు అనుభవించాడు. చివరికి అతడి కష్టాలు ముగిశాయి. అయితే ఇంత మంది తనను ప్రేమిస్తున్నారన్న విషయం బెన్‌కు తెలుసు'' అని చెప్పారు.
బెన్ వాట్కిన్స్ అద్భుత నైపుణ్యం గల ఇంటి వంటగాడని, అంతకన్నా బలవంతుడైన యువకుడని మాస్టర్ చెఫ్ జూనియర్ జడ్జిల్లో ఒకరు, టీవీ చెఫ్ గోర్డన్ రామ్సే అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ‘ఐ రిటైర్’ అంటూ పీవీ సింధు కలకలం.. ఇంతకీ ఆమె ఏం చెప్పారు?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








