రోహిత్ వేముల కులంపై ఎందుకింత వివాదం? పోలీసులు కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏముంది?

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, RohitVemula/FB

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోహిత్ వేముల కేసు వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రోహిత్ ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఈ కేసులో నిందితులని చెప్పడానికి సాక్ష్యాలు లేవని పోలీసులు కోర్టుకు నివేదిక ఇవ్వడం వివాదానికి మూలమైంది.

అసలు రోహిత్ వేముల ఎస్సీ కాదని కూడా పోలీసులు కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొనడం వివాదాన్ని మరింత రాజేసింది. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్ధి సంఘాలు పోలీసుల నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును మళ్లీ విచారిస్తామని ప్రకటించింది.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, UGC

రోహిత్ ఆత్మహత్య వివాదమేంటి?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి అయిన వేముల రోహిత్ చక్రవర్తి 2016 జనవరి 17 న ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అంతకు ముందు క్యాంపస్‌లో రోహిత్ వేముల కొన్ని ఆందోళనల్లో పాల్గొనడం, అప్పట్లో వాటిపై బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాయడం, ఆపై రోహిత్ వేముల స్కాలర్ షిప్ ఆగిపోవడం లాంటి పరిణామాలు జరిగాయి.

ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.

యూనివర్సిటీ యాజమాన్యంతోపాటు, బీజేపీ నాయకత్వం, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ప్రతినిధుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ విద్యార్ధి సంఘాలు చాలాకాలంపాటు ఆందోళనలు నిర్వహించాయి.

అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) ఈ ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్ర అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఈ ఆందోళనలకు మద్దతిచ్చారు.

అయితే, రోహిత్ ఆత్మహత్యకు, యూనివర్సిటీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడితే దానికి దానికి కులం రంగు పులిమారని బీజేపీ, ఏబీవీపీలు తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాయి. రోహిత్ దళితుడు కాదని బీజేపీ వాదించింది.

ఈ ఆత్మహత్య ఘటనపై యూనివర్సిటీ హాస్టల్ వార్డెన్‌తోపాటు విద్యార్ధి సంఘం నాయకుడు దొంత ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

ప్రశాంత్ తన ఫిర్యాదులో అప్పటి యూనివర్సిటీ వీసీ పొదిలె అప్పారావు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావులతోపాటు కృష్ణ చైతన్య, నందనం సుశీల్ కుమార్, నందనం దివాకర్ అనే వ్యక్తుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధుల ఆందోళన (ఫైల్ ఫోటో)

అంతకు ముందు అంటే 2015 సంవత్సరం నుంచీ విశ్వవిద్యాలయంలో జరిగిన వివిధ ఘటనల్లో ఏబీవీపీ, ఏఎస్ఏ విద్యార్ధి సంఘాల మధ్య వివాదాలు కొనసాగాయి. ఈ గొడవల్లో బీజేపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని, వారికి వీసీ మద్ధతిస్తూ వచ్చారని ప్రశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ జోక్యం కారణంగానే రోహిత్ వేములతోపాటు మరికొందరు విద్యార్ధులను అన్యాయంగా సస్పెండ్ చేశారని, రోహిత్ వేములకు రావలసిన జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) స్కాలర్‌షిప్పును నిలిపేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టారు.

రోహిత్ వేముల మరణం తర్వాత జరిగిన ఆందోళనలు,పోస్ట్‌మార్టం జరగనీయకుండా అడ్డుకోవడంలాంటి ఘటనలపై పోలీసులు మరో రెండు కేసులు పెట్టారు.

అయితే, తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనికి కౌంటర్‌గా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో పోలీసులు జరిపిన విచారణ నివేదిక ఉంది. ఆ నివేదిక ఆధారంగా, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు వేధింపులకు గురిచేశారని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంటూ ప్రొఫెసర్ అప్పారావు, బీజేపీ నేత రామచంద్ర రావు సహా మిగిలినవారిపై నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, శుక్రవారం సాయంత్రం విద్యార్ధులు యూనివర్సిటీలో ఆందోళన నిర్వహించారు.

పోలీసులు కేసు క్లోజింగ్ రిపోర్టులో ఏం రాశారు?

రోహిత్ వేముల మరణం, కులం ఈ రెండు అంశాలపై 60 పేజీల నివేదిక రాశారు పోలీసులు. అందులో రోహిత్ వేముల షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) కాదని పేర్కొన్నారు.

‘‘వేముల రోహిత్ ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లలో ఎస్సీ అని ఉంది. కానీ ఆయన తమ్ముడు వేముల రాజా కులం సర్టిఫికేట్‌లో వడ్డెర అని ఉంది. రోహిత్ వేముల, ఆయన తండ్రి వడ్డెర (BC-A) కులానికి చెందినవారని గురజాల తహశీల్దారు నివేదిక ఇచ్చారు.

రోహిత్ కులం విషయంలో గందరగోళం రావడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ వేశారు. అందులో జాయింట్ కలెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ (బీసీ వెల్ఫెర్), జాయింట్ డైరెక్టర్ (ఎస్సీ వెల్ఫేర్) సహా 5గురు సభ్యులున్నారు. వారు రోహిత్ కుటుంబం వడ్డెర కులానికి చెందినదని, అతను తీసుకున్న ఎస్సీ సర్టిఫికేట్లు తప్పుడువని తేల్చి వాటిని రద్దు చేయాలని సూచించారు’’ అని పోలీసులు తమ నివేదికలో రాశారు.

‘‘వేముల రాధిక కూడా వడ్డెర కులానికి చెందిన వ్యక్తేనని గుంటూరు జిల్లా గురజాల తహశీల్దార్ రిపోర్టు ఇచ్చారు. అదే సమయంలో రాధిక తల్లి (వడ్డెర కులానికి చెందిన మహిళ) రాధికను ఒక మాల కుటుంబం నుంచి దత్తత తెచ్చుకున్నట్టుగా పలు మీడియా సంస్థలకు చెప్పారు.

అయితే తాను ఎక్కడి నుంచి దత్తత వచ్చిందీ, లేదా తాను జన్మించిన కుటుంబం వివరాలు తనకు తెలియదని రాధిక పేర్కొన్నారు. తాను ఒక ఎస్సీ కుటుంబం నుంచి దత్తత వచ్చానని, భర్త నుంచి వేరుపడిన తరువాత ఎస్సీ కాలనీలోనే ఉండేదానినని రాధిక చెప్పారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా రోహిత్ ఎస్సీ కాదు కాబట్టి ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదు’’ అని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిత్ వేముల మరణంపై జరుగుతున్న ఆందోళనలకు రాహుల్ గాంధీ మద్ధతిచ్చారు (ఫైల్ ఫోటో )

కులంతోపాటు రోహిత్ వేములపై చర్యలు తీసుకోవడం గురించి ఆ నివేదికలో రాశారు. 2015లో యాకుబ్ మెమన్ ఉరితీత సందర్భంగా హెచ్‌సీయూలో జరిగిన నిరసనల నుంచి క్యాంపస్‌లో మొదలైన ఈ గొడవ, తరువాత ఫిర్యాదులు, వాటిపై విచారణలు, తీసుకున్న చర్యల గురించి పోలీసులు నివేదికలో రాశారు.

రోహిత్ పై యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న చర్యలు వర్సిటీ నిబంధనలకు లోబడే ఉన్నాయని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. చర్యలు తీసుకున్న బృందానికి బీజేపీ నేతలు రాసిన లేఖల సంగతి తెలియదనీ, వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారనీ రాశారు.

విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రోహిత్ వేములపై చర్యలు తీసుకున్నారని, రోహిత్ ఆత్మహత్యకు చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న ఒంటరితనం, జీవిత సమస్యలే కారణమని పోలీసులు పేర్కొన్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని రోహిత్ తన లేఖలో పేర్కొన్నారని కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు.

అలాగే ఆత్మహత్యకు నెలరోజుల ముందు యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌కు రాసిన లేఖలో విద్యార్థులకు ఉరితాళ్లు ఇవ్వాలంటూ రాయడాన్ని ప్రస్తావించారు పోలీసులు.

ఎస్సీ కాకపోయినా తన తల్లి తనకు ఎస్సీ సర్టిఫికేట్ తేవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని రోహిత్ భయపడినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ వాక్యాన్ని ఏ ఆధారంతో రాశారన్నది పోలీసులు తమ నివేదికలో వివరించలేదు.

చివరగా ‘రోహిత్ చనిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు’ అంటూ పోలీసులు తమ నివేదికను ముగించారు. ఫిర్యాదులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రోహిత్ మరణానికి కారణమనడానికి సాక్ష్యం లేదని పోలీసులు చెప్పారు.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రోహిత్ వేముల తల్లి రాధిక

పోలీసుల నివేదికపై తీవ్ర అభ్యంతరాలు

పోలీసుల నివేదికపై కొన్ని విద్యార్ధి సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై స్పందించిన హెచ్‌సీయూ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు బీబీసీతో మాట్లాడారు.

‘‘రోహిత్ దళితుడే అని స్వయంగా అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఎవరో ఫిర్యాదు చేశారు అన్నకారణంతో దాన్ని రివైజ్ చేయించి, ఇంకో కమిటీ వేసి, రోహిత్ ఎస్సీ కాదని నివేదిక తెచ్చారు. ఇలా రెండు విరుద్ధ నివేదికలు ఉన్నప్పుడు పోలీసులు వాటిని కోర్టు ముందు ఉంచి కోర్టు నిర్ణయం ప్రకారం చేయాలి. కానీ, ఏదో ఒక నివేదికను మాతమే పోలీసులు ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?

మొదటి నివేదిక కాదని రెండో నివేదికకు వెళ్లడంలోనే కుట్ర ఉందని నా అనుమానం. పోలీసుల ఉద్దేశాలపై కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. రోహిత్ వేముల తన సర్టిఫికేట్ నకిలీదనీ, ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ఎలా ఊహించి రాస్తారు? ఊహలు కోర్టుకి నివేదించటం ఏంటీ? కనీస ఆధారం ఉండాలి కదా? అప్పటి రెవెన్యూ యంత్రాంగం కులం సర్టిఫికేట్ విషయంలో వేముల రాధికను తీవ్రంగా వేధించినట్టు కూడా ఆమె చెప్పారు.’’ అని ప్రొఫెసర్ రాముడు అన్నారు.

ప్రొఫెసర్ శ్రీపతి రాముడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ డిపార్ట్‌మెంట్‌కు హెడ్‌గా పని చేస్తున్నారు.

‘‘ప్రొఫెసర్ అప్పారావు అప్పుడు వీసీగా లేకపోతే రోహిత్ బతికి ఉండేవాడని నేను నమ్ముతున్నాను. తేలికగా పరిష్కారం అయ్యే సమస్యను ఆయన కానివ్వలేదు. దానికి రెండు కారణాలు. ఒకటి ఆయనకు దళితులు అంటే ఉన్న ఏహ్యభావం, వివక్ష, రెండోది పైన ఎవరిదో మెప్పు కోసం ప్రయత్నం.

వీడియో క్యాప్షన్, రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదికపై ఆయన కుటుంబం ఏమంటోంది?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్రలో రెండే రెండుసార్లు విద్యార్థుల రస్టికేషన్ జరిగింది. ఆ రెండుసార్లూ దళిత విద్యార్థులనే రస్టికేషన్ చేశారు. దీని వెనుక అప్పారావు కీలక పాత్ర పోషించారు. పోలీసులు ఈ కోణం టచ్ చెయ్యలేదు.

వాస్తవానికి అప్పారావు వీసీ కాకముందే ఈ కేసు విచారణకు వచ్చింది. అప్పటి వీసీ శర్మ రెండు వర్గాల విద్యార్థులది తప్పు ఉందని, కఠినమైన హెచ్చరికలు చేసి, చివరితప్పుగా క్షమిస్తున్నట్టు చెప్పారు. సమస్య అక్కడితో ముగిసిపోయింది అనుకుంటే, తర్వాత వీసీగా వచ్చిన అప్పారావు ఈ కేసును తిరగదోడారు.

తనకు అనకూల వర్గంతో కమిటి వేసి అయిదుగురు విద్యార్థులను రస్టికేట్ చేశారు. ఈ ఐదుగురూ ఎస్సీలే. మరి పోలీసులు రెండు కమిటీల సంగతిని తమ నివేదికలో ఎందుకు చెప్పలేదు?’’ అని ప్రొఫెసర్ రాముడు ప్రశ్నించారు.

‘‘వివక్ష భరించలేక మాకు ఉరితాళ్లు ఇవ్వండి, సైనెడ్ ఇవ్వండి అని రోహిత్ వేముల అప్పారావుకి లేఖ రాస్తే కనీసం స్పందించలేదు. పోలీసులకి ఈ కోణం ఎందుకు కనిపించలేదు?.’’ అన్నారు ప్రొఫెసర్ రాముడు.

పోలీసులు ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని రోహిత్ వేముల తరఫున కేసును వాదించిన న్యాయవాది జైభీమ్ రావు అన్నారు.

‘‘చనిపోయే ముందు రోహిత్ రాసిన రెండు లేఖల్లో యూనివర్సిటీలో జరుగుతున్న వివక్షపై స్పష్టంగా రాశారు. మానసిక వేధింపులను పేర్కొన్నారు. అవన్నీ వదిలేసి, తనకు కుల ధ్రువీకరణ లేదు కాబట్టి, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందని ముందే ఊహించి చనిపోయాడని పోలీసులు రాయడానికి సాక్ష్యం ఏంటి?

అసలు అట్రాసిటీ కేసులో విచారణకు కుల ధ్రువీకరణ కావాలని ఆ చట్టం ఎక్కడా చెప్పలేదు. అతని సర్టిఫికేట్ మీ ఇంకా గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. స్క్రూటినీ కమిటీ నివేదికపై కలెక్టర్ నిర్ణయం రాలేదు. పైగా రెండోసారి సర్టిఫికేట్ గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తి అసలు కలెక్టరు ముందుకే రావడం లేదు.

మరోవైపు రోహిత్ వేముల దళితుడే అని ఇచ్చిన 18 సాక్ష్యాలు వారి ముందు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసు విచారణ చేస్తోన్న పోలీసు అధికారి, గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రొసీడింగ్స్‌ను పట్టించుకోకుండా, ఆ రికార్డులు తెప్పించుకోకుండా నిర్లక్ష్యంగా ఈ నివేదికను కోర్టుకు ఇచ్చారు.’’ అని ఆయన ఆరోపించారు.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, UGC

యూనివర్సిటీలో ఆందోళనలు

నివేదిక వ్యవహారం బయటకు రాగానే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళనలు జరిగాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించింది.

‘‘రోహిత్ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు కోర్టుకు తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కేసు పునర్విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ అన్నారు.

శుక్రవారం పొద్దుపోయాక తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.

‘‘ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. ఐతే, ఈ విచారణపైనా, విచారణ జరిగిన విధానంపైనా మృతుడు రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని నిర్ణయించాం.

ఈ కేసుపై తదుపరి దర్యాప్తును అనుమతించాలని సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం.’’ అంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

దీంతో క్యాంపస్‌లో ఆందోళనలు చల్లారాయి.

‘‘ఈ నివేదిక ద్వారా చనిపోయిన వ్యక్తిని అవమానించారు. ప్రభుత్వం మళ్లీ విచారణ చేయిస్తామంటోంది కాబట్టి వారేం చేస్తారో చూస్తాం, లేదంటే మేము కూడా చట్ట ప్రకారం ముందుకు వెళతాం.’’ అని న్యాయవాది జై భీమ్ రావు స్పష్టం చేశారు.

వాస్తవానికి పోలీసులు ఈ నివేదికను మార్చి 2024లో కోర్టులో సమర్పించారు. విచారణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని చెప్పే ప్రయత్నం చేసింది డీజీపీ కార్యాలయం.

శనివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ తల్లి, సోదరుడు కలిశారు.

‘‘రోహిత్ తల్లి రాధిక, తమకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.’’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోహిత్ వేముల తల్లి రాధిక ‘‘నా కొడుకు మృతిపై విచారణ జరిపించాలని అడిగితే, రోహిత్ దళితుడు కాదంటున్నారు. నేను దళితురాలినే. నా కొడుకు దళితుడు కాడా?’’ అని రాధిక ప్రశ్నించారు.

న్యాయమైన విచారణ జరిపిస్తామని సీఎం హామీ ఇచ్చారని రాధిక మీడియాకు తెలిపారు.

రోహిత్ వేముల

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్జప్తి చేస్తున్న రాధిక వేముల

రోహిత్ వేముల తండ్రి ఎవరు?

రోహిత్ వేముల తండ్రి గుంటూరు జిల్లా గురజాల ప్రాంతానికి చెందిన వేముల మణి కుమార్. రాధిక ఆయన భార్య. కాగా, ఆయన భార్యాపిల్లల నుంచి వేరుగా ఉంటున్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న తరువాత రాధిక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శిబిరాలతో కలసి తన కుమారుడికి న్యాయం చేయాలంటూ పోరాడుతుండగా, మణి కుమార్ బీజేపీ సభల్లో పాల్గొంటూ ఆ పార్టీకి మద్ధతుగా నిలుస్తున్నారు.

ప్రొఫెసర్ రాముడు చేసిన ఆరోపణలపై మాట్లాడటానికి ప్రొఫెసర్ అప్పారావు నిరాకరించారు. బీజేపీ నేత రామచంద్ర రావును బీబీసీ సంప్రదించింది. ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)