ఒసామా బిన్ లాడెన్: ఓ రాత్రి ఆ ఇంటికి అతిథిగా వచ్చి భోజనం చేసి వెళ్లిన రోజు ఏం జరిగింది?

ఒసామా బిన్ లాడెన్ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

    • రచయిత, ఎం. ఇలియాస్ ఖాన్
    • హోదా, బీబీసీ

మీ ఇంటికి డిన్నర్‌కు వచ్చిన వ్యక్తి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ అని తెలిస్తే మీకెలా అనిపిస్తుంది? మేం చెబుతున్నది తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్ గురించి.

అది 2010 వేసవి కాలం.

పాకిస్తాన్‌లో గిరిజన ప్రాంతమైన వజిరిస్తాన్‌లో ఒసామాబిన్ లాడెన్‌కు ఓ ఇంట్లో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు.

సరిగ్గా ఏడాది తరువాత మే 2, 2011న అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి.

లాడెన్ చనిపోయిన ఏడాది తరువాత 2012లో బీబీసీ ప్రత్యేక కార్యక్రమంలో లాడెన్‌కు ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని వజిర్‌స్తాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వివరించారు.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే తాము ఆతిథ్యం ఇవ్వబోయేది ఒసామా బిన్ లాడెన్‌కు అని ఆ కుటుంబానికి కూడా చివరి క్షణం వరకు తెలియదు.

అయితే ఎవరో ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారని మాత్రం కొన్ని వారాల ముందే తెలిపారు.

ఆ అతిథి పేరు, ఏ సమయంలో వస్తారనే సమాచారం చెప్పలేదు.

లాడెన్ ఫోటో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఒకే రకమైన జీపుల్లో...

వజిరిస్తాన్‌లో ఓ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు ఓ అతిథి కోసం వేచి చూస్తున్నారు. వారికి ఆ అతిథి ఎవరో తెలియదు.

రాత్రి 11 గంటలకు ఆ ప్రాంతంలోని ప్రజలందరూ నిద్రలోకి జారుకున్న సమయంలో వారికి వాహనాల శబ్దాలు వినిపించాయి.

‘‘మా ఇంటి ఆవరణలోకి ఒకేరకమైన ఓ డజను జీపులు వచ్చాయి. అవన్నీ కూడా వివిధ మార్గాల నుంచి వచ్చినట్టుగా కనిపించాయి.’’ అని ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి చెప్పారు. వరండా పక్కన ఆగిన ఓ జీపు వెనుక సీటు నుంచి తెల్లని తలపాగా ధరించిన బక్కపల్చటి వ్యక్తి ఒకరు దిగారు.

అతన్ని చూసి ఆ కుటుంబం దిగ్భ్రమకు గురైంది. ఎందుకంటే తమ ముందు నుంచున్న వ్యక్తి ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్.... ఒసామా బిన్ లాడెన్.

అమెరికా లాంటి దేశం తన సర్వశక్తులు ఒడ్డి ఆయన కోసం వెదుకుతోంది.

ఆయన గురించిన సమాచారం అందించిన వారికి 2.5 మిలియన్ల అమెరికన్ డాలర్ల బహుమానాన్ని కూడా అమెరికా ప్రకటించింది.

‘‘మేం ఆశ్చర్యంపోయాం. లాడెన్ మా అతిథిగా వస్తారని ఊహించలేదు’’ అని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి చెప్పారు.

జీపు నుంచి బయటకు వచ్చిన లాడెన్ అక్కడున్న అందరితోనూ కరచాలనం చేశారు.

ఆ వజిరిస్తాన్ గిరిజన నాయకుడు లాడెన్ చేయిని గట్టిగా పట్టుకున్నారు. దానిని ముద్దుపెట్టుకున్నారు. గౌరవ సూచకంగా తన కళ్ళకు అద్దుకున్నారు.

తరువాత లాడెన్ తన అనుచరుడి భుజంపై చేయి వేసి అతిథుల కోసం సిద్ధం చేసిన గదివైపు వెళ్ళారు.

ఒసామా బిన్ లాడెన్‌తో వచ్చినవారందరూ ఆయనతోపాటు ఇంట్లోకి వెళ్ళలేదు. కేవలం ఇద్దరు మాత్రమే లోపలకు వెళ్ళారు.

ఈ ఘటన లాడెన్ చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది.

ఒసామా బిన్ లాడెన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇంటిచుట్టూ కాపలా

లాడెన్ చనిపోయిన వార్త తెలిసిన తరువాత ఆయనకు అతిథ్యం ఇచ్చిన కుటుంబం తమ స్నేహితులతో అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

తన గ్రామం పేరును, తన పేరును వెల్లడి చేయకూడదనే షరతుతో ఆయన బీబీసీతో మాట్లాడారు.

ఆ రోజురాత్రి లాడెన్ ఆ ఇంట్లో దాదాపు 3గంటలసేపు గడిపారు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకున్నాకా నమాజ్ చేశారు. ఆయనకు అన్నం, మాంసం వడ్డించారు.

ఆ సమయంలో ఆ ఇంట్లోనివారెవరూ బయటకు వెళ్ళకూడదని , బయటివారెవరూ లోపలకు రావడానికి వీల్లేదని చెప్పారు.

సాయుధులైన కొందరు మిద్దెపైనా, గేటు వద్ద, ఇంటిచుట్టూ కాపలాగా ఉన్నారు.

అయితే ఆతిథ్యం ఇచ్చిన వారిలో ఓ వ్యక్తి తన 85 ఏళ్ళ తండ్రి లాడెన్‌ను కలవాలనుకుంటున్నారని చెప్పగానే ఆయన అంగరక్షకులు అసౌకర్యానికి గురయ్యారు.

కానీ అంగరక్షకులు ఈ విషయాన్ని లాడెన్‌కు చేరవేయడం, ఆయన అంగీకరించడంతో ఆ వృద్ధుడు ఆయన్ను కలవగలిగారు.

నలుగురు అంగరక్షకులు ఆ వృద్ధునితోపాటు వెళ్లారు. ఆ వృద్ధుడితో లాడెన్ దాదాపు 10 నిమిషాలపాటు గడిపారు. గిరిజన ప్రాంతాలలో యుద్ధ వ్యూహాలు ఎలా ఉండాలో ఆ వృద్ధుడు వారికి పాస్తో భాషలో వివరించినప్పుడు లాడెన్‌‌కు ఆ సలహాలు అర్థమైనట్టుగా కనిపించలేదు. కానీ లాడెన్ అంగరక్షకుల మొహాలపై మాత్రం నవ్వులు విరిశాయి.

లాడెన్ ఇల్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, లాడెన్ ఉన్న ఈ ఇంటిని 2012లో పూర్తిగా కూలగొట్టారు

ఈ ప్రశ్నకు బదులేది?

ఒసామా బిన్ లాడెన్, ఆయన అనుచరులు ఎలా వచ్చారో, అలాగే వెనుదిరిగారు. దాదాపు 6 జీపులు ముందు బయల్దేరి వివిధ మార్గాలవైపు దూసుకుపోయాయి. వాటిల్లో ఒసామా బిన్ లాడెన్ ప్రయాణిస్తున్న జీపు ఏదో ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం కూడా కనిపెట్టలేకపోయింది.

అయితే ఈ కథనాన్ని వివరిస్తున్నప్పుడు వజిరిస్తాన్‌కు చెందిన ఈ వ్యక్తులు ఇంతకీ లాడెన్‌కు ఆతిథ్యం ఏర్పాటు చేయమని చెప్పింది ఎవరనే విషయాన్ని బయటపెట్టేందుకు నిరాకరించారు.

ఒసామాతో పాటు వచ్చిన వ్యక్తుల గురించి చెప్పడానికి కూడా వారు అంగీకరించలేదు.

అబోట్టాబాద్‌లో ఆల్‌ఖైదా నాయకుడు ఒసామాబిన్ లాడెన్‌ను చంపేశాక, అమెరికా, పాకిస్తాన్ కలిసి లాడెన్ గడిచిన ఐదేళ్ళుగా అబోట్టాబాద్‌ వీడి కాలు బయటపెట్టలేదని చెప్పడం గమనార్హం.

అయితే ఈ కథనం పాకిస్తాన్, అమెరికా మాటలు తప్పని రుజువు చేస్తోంది. కానీ అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు.

లాడెన్ ఆ రాత్రివేళ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆతిథ్యం తీసుకున్న ఆ మారుమూల గ్రామం సహా వజిరిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్లు నిర్వహించింది. డజన్ల కొద్దీ మిలటరీ పోస్టులు పెట్టింది. మరి లాడెన్ పాకిస్తాన్ సైన్యం కళ్ళు ఎలా కప్పగలిగారు?

ఒసామా బిన్ లాడెన్ గురించిన ఏ సమాచారన్నైనా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఖండించేవి. లాడెన్‌కు ఎటువంటి అధికారిక మద్దతు లేవని తెలిపేవి.

అయితే ఇప్పటికీ ఒసామాబిన్ లాడెన్‌కు బస, ఆహారం, ప్రయాణ సౌకర్యాలు సమకూర్చిన ఆ పలుకుబడికలిగిన అజ్ఞాత వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. అలాగే ఒసామా బిన్ లాడెన్ ఆతిథ్యానికి రావడం వెనుక కారణమేంటో ఇప్పటికీ తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)