బ్రిటన్‌లో తీవ్రవాదం ముప్పు గణనీయ స్థాయిలోనే ఉందా?

శనివారం బ్రిటన్‌లోని రీడింగ్ ప్రాంతంలో ఒక పార్కులో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దాడి చేసి చంపేసిన అనుమానితుడి గురించి ఆ దేశ నిఘా సంస్థ ఎంఐ5కి ముందే సమాచారం ఉన్నట్లు భద్రతాధికారులు తెలిపారు.
25 సంవత్సరాల ఖైరీ సాదల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇంకెవరినీ అనుమానితులుగా చూడటం లేదని పోలీసులు తెలిపారు. నిందితునిపై టెర్రరిజం చట్టం 2000లో సెక్షన్ 41 ప్రకారం కేసు నమోదు చేసినట్లు కౌంటర్ టెర్రరిజం పోలీసులు తెలిపారు.
నిందితుడు లిబియా దేశస్థుడని, 2019లో అతను ఎంఐ5 దృష్టికి వచ్చాడని నిఘా వర్గాలు బీబీసీకి తెలిపాయి.
ఈ ఘటనలో వోకింగ్హాంలో హోల్ట్ స్కూల్‌లో హిస్టరీ, పాలిటిక్స్ విభాగంలో పని చేస్తున్న 36 సంవత్సరాల జేమ్స్ ఫర్లాన్గ్ అనే టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి మరణించిన వారిలో ఆయన ఒక్కరి పేరునే పోలీసులు బహిర్గతం చేశారు.
జేమ్స్ ఫర్లాన్గ్ "చాలా తెలివైన వారు, నిజాయితీ పరుడు” అని ఆయన తల్లి తండ్రులు చెప్పారు.
ఈ ఘటన తనని దిగ్బ్రాంతికి గురి చేసిందని ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
గతంలో నిందితుడు తీవ్రవాదంలో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో ఉన్నట్లు తమకు సమాచారం లభించినట్లు భద్రతా అధికారులు బీబీసీ హోమ్ అఫైర్స్ ప్రతినిధి డొమినిక్ కాస్కియానీకి తెలిపారు. అయితే, ఈ విషయంపై పోలీసుల పరిశోధన ముందుకు సాగలేదు.
కాగా, ఈ ఘటనకు బాధ్యులయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని జాన్సన్ అన్నారు.
ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మెట్రోపాలిటన్ పోలీసు అసిస్టెంట్ కమీషనర్ నీల్ బసు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఫొటో సోర్స్, James Furlong

బీబీసీ హోమ్ అఫైర్స్ ప్రతినిధి డొమినిక్ కాస్కియానీ విశ్లేషణ:
గత నవంబర్లో తీవ్రవాదం వలన దేశానికున్న ముప్పుని అధికారికంగా తీవ్రమైన స్థాయి నుంచి గణనీయమైన స్థాయికి తగ్గించారు. నిజానికి అది తీవ్ర స్థాయిలోనే ఉన్నట్లు లెక్క. కానీ, ప్రాణాలకు అపాయం ఉన్నట్లు ఇంటలిజెన్స్ వద్ద సమాచారం లేదు.
యూకేలో నవంబర్ నుంచి జరిగిన మూడు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందులో రెండు దాడులు ఇద్దరు వేర్వేరు వ్యక్తులు స్వతంత్రంగా చేసినవే.
శనివారం జరిగిన ఘటన గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా నిందితుని సోషల్ మీడియా అకౌంట్లను, ఫోన్ కాల్ వివరాలు, మెసేజ్‌లను కూడా పరిశీలిస్తారు. అతనికి తీవ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని పరిశీలిస్తారు.

నిందితుని స్నేహితుడు కీరన్ వెర్నాన్ బీబీసీతో మాట్లాడుతూ నిందితుడు “చాలా సాధారణ వ్యక్తి. మేమెప్పుడు కలిసినా విస్కీ గురించి, రకరకాల మాదక ద్రవ్యాలు ఆలోచనా శక్తి మీద ఎలా పని చేస్తాయనే విషయాల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లం” అని చెప్పారు.
శనివారం జరిగిన ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా, ఇంకొకరు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.
ఈ దాడిని తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటన నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటే, నేర్చుకోక తప్పదని ప్రధాని జాన్సన్ అన్నారు. అవసరమైతే చట్టంలో మార్పులు తేవడానికి కూడా చూడాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- న్యూ నార్మల్ ఎలా ఉంటుంది? ఇకపై మనం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ పనిచేస్తామా?
- కరోనావైరస్ సంక్షోభం: సమానత్వం, న్యాయమే పునాదిగా సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా?
- భారత్, చైనా: ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలు పోట్లాడుకుంటే ఏం జరుగుతుంది?
- గల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు వదిలిన 20 మంది భారత సైనికులు, వారి కథలు ఇవే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








