హీరామండీ: సంజయ్ లీలా బన్సాలీ కొత్త వెబ్ సిరీస్‌పై లాహోర్ ప్రజలెందుకు ఆగ్రహంగా ఉన్నారు?

ఫొటో సోర్స్, NETFLIX
- రచయిత, మునజ్జా అన్వార్
- హోదా, బీబీసీ కోసం
హిందీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన వెబ్ సిరీస్ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’ గత వారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.
1910-1940 మధ్య కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో ఎనిమిది ఎపిసోడ్లతో హీరామండి కథనం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హీరామండి కథ మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. స్వాతంత్య్రానికి పూర్వం లాహోర్‌లోని ఈ ప్రాంతం సెక్స్ వర్క్‌కు పేరుపడింది. సెక్స్ వర్కర్లు అక్కడ నివసించేవారు.
కళ్లు మిరిమిట్లు గొలిపే సెట్టింగ్స్, ఖరీదైన లైట్లు, బంగారం, వెండి, విలువైన రత్నాలతో పాటు కథానాయికలు ధరించిన లెహంగాలు, అద్భుతమైన కెమెరా పనితనం, దీంతో పాటు మనీషా కోయిరాల నటన హీరామండి కథనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇవన్నీ ఉన్నప్పటికీ, ఈ సిరీస్ మాత్రం 1940లలోని లాహోర్‌కు చెందిన హీరామండిని సరిగ్గా చూపించడంలో విఫలమైంది.
ఇన్ని సంక్లిష్టతలను కూడుకున్న సెట్‌లో, లోతైన భావోద్వేగాలను చిత్రించే ఈ కథనాన్ని చూపించడంలో దర్శకుడు కాస్త ఇబ్బంది పాలైనట్లు అర్థమవుతుంది.
ఎనిమిది గంటల పాటు ఈ సిరీస్‌ను చూసిన తర్వాత, అంతా ‘కృత్రిమంగా’ రూపొందిన ఈ సిరీస్‌లో స్క్రిప్ట్ కానీ, మాటలు కానీ ఏదీ ఆకట్టుకునేలా లేనట్లు అనిపించింది.
కథానాయికల శైలి కూడా దీనిలో చాలా కృతిమంగా కనిపిస్తుంది. దేశ విభజనకు ముందు నాటి కాలంలో సెక్స్ వర్కర్ల జీవితాన్ని ఈ సిరీస్ ప్రతిబింబించలేదు. విలువలను, సంస్కృతిని, ఉర్దూ భాషను నేర్చుకునేందుకు సంపన్న వర్గాలు తమ పిల్లల్ని వారి వద్దకు పంపించేవారు.
లాహోర్ ప్రజల అభిప్రాయం ప్రకారం.. బన్సాలీ సెట్‌లో చూపించిన హీరామండి ఇళ్ల ప్రాంగణాలు కనీసం ఒకటి కూడా అక్కడ కనిపించవు.
ఈ ప్రాంతంలో ఎన్నో అంతస్తులతో కూడిన పెద్ద పెద్ద భవంతులు, ఇళ్లు ఉంటాయని వారు చెప్పారు. ‘‘ఈ సిరీస్‌లో చూపించిన భవంతులు కనీసం వాస్తవానికి అసలు సరిపోవడం లేదు’’ అని అన్నారు.
ఇవి మాత్రమే కాక, ఇతర తప్పులు కూడా ఈ సిరీస్‌లో కనిపిస్తున్నాయని లాహోర్ ప్రజలంటున్నారు. ఇంత పెద్ద బడ్జెట్‌లో సిరీస్‌ను తీస్తున్నప్పుడు, కాస్త పరిశోధించాల్సిందన్నది లాహోర్ ప్రజల మాట.

ఫొటో సోర్స్, @NETFLIXINDIA
హీరామండిలో ఏముంది?
సంజయ్ లీలా బన్సాలీ ఈ సిరీస్‌ను సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. దీన్ని తన కలల ప్రాజెక్టుగా అభివర్ణించారు.
ఈ సిరీస్‌లో మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ అత్యంత సుందరమైన, రాయల్ ప్యాలస్(హీరామండి)లోని అతిపెద్ద భవనానికి యజమాని. హీరామండిలోని ఇతర సెక్స్ వర్కర్లంతా ఆమెను అపా(అక్క) అని పిలుస్తుంటారు.
రాయల్ ప్యాలస్‌కు యజమాని అయ్యేందుకు గాను చాలా ఏళ్ల క్రితం మల్లికా జాన్ తన అక్క రెహానా (సోనాక్షి సిన్హా) ను చంపేస్తుంది.
ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత రెహానా కూతురు ఫరిదన్(సోనాక్షి సిన్హా డబుల్ రోల్) తిరిగి హీరామండికి వస్తుంది. తన తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకుని, రాయల్ ప్యాలస్ తాళాలు అందుకోవాలని ఫరిదన్ ప్రయత్నిస్తుంటుంది.
ఇక్కడి నుంచి వారిద్దరి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకరిపై మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలా మందిని పావులుగా వాడుకుంటారు. కానీ, దీనిలో ఎక్కువగా లాభపడేది బ్రిటిష్ ప్రభుత్వమే. దీన్ని ఆ తర్వాత గుర్తిస్తారు మల్లికా జాన్, ఫరిదన్‌లు.
అదే సమయంలో, భారత్‌లో తీవ్ర స్థాయిలో స్వాతంత్య్ర ఉద్యమం సాగుతుంటుంది. లాహోర్‌లో కూడా విప్లవకారులు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో పయనిస్తుంటారు. సెక్స్ వర్కర్లు సైతం ఈ విప్లవంలో పాల్గొంటారు.
బన్సాలీ తీసిన ఈ ప్రాజెక్టులో మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, ఫర్దీన్ ఖాన్, ఫరీదా జలాల్, షర్మిన్ సెగల్, తాహా సాలు నటించారు.
మొయిన్ బేగ్ ఈ సిరీస్‌ను రాశారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంతో పాటు స్క్రీన్ ప్లే కూడా వహించారు.

ఫొటో సోర్స్, @NETFLIXINDIA
ఈ సిరీస్‌లో ఉన్న తప్పులేంటి?
అయితే, ఇప్పుడు మనం ఈ సిరీస్‌లో ఉన్న తప్పుల గురించి మాట్లాడుకుందాం.
ఈ సిరీస్‌లో నాలుగో ఎపిసోడ్‌ను చూసుకుంటే, తన చెల్లి ఆలంజేబ్(షర్మిన్ సెగల్) రాసిన లేఖను తాజ్‌దార్‌కు అందజేయాలని కోరుతూ అదితీ రావ్ హైదరీ(బిబ్బో జాన్) నవాజ్ దగ్గరకు వెళ్తుంది. ఆ సమయంలో ఆమె వెనుకాల కప్‌బోర్డులో కొన్ని పుస్తకాలు కనిపిస్తుంటాయి. దానిలో రచయిత ఉమేరా అహ్మద్ రాసిన పీర్-ఎ-కమిల్ రాసిన నవల కనిపిస్తుంటుంది.
అయితే, ఈ సిరీస్ విభజనకు ముందు నాటి పరిస్థితులతో తీసినది. ఈ సీన్ కూడా దానిలో భాగమే. కానీ పీర్-ఎ-కమిల్ అనే నవల 2004లో ప్రచురితమైంది.
మరో సీన్‌లో, సోనాక్షి సిన్హా(ఫరిదన్) చదువుతున్న న్యూస్ పేపర్ 2022 ఏడాదికి చెందినదిగా కనిపిస్తుంది. సోనాక్షి పట్టుకున్న న్యూస్‌పేపర్ పేజీపై కరోనా వైరస్ వార్త అచ్చు అయి ఉంది.
ఈ న్యూస్ పేపర్ సీన్‌కు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

ఫొటో సోర్స్, @PERVAIZALAM
లాహోర్ ప్రజలెందుకు కోపంగా ఉన్నారు?
ఈ సిరీస్‌పై లాహోర్ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.
హీరామండి తొలి ఎపిసోడ్ సగం చూడగానే తమ అమ్మ సిరీస్‌ను ఆపేయాలని కోరిందని జర్నలిస్ట్, అనలిస్ట్ సబాహత్ జాకీయా చెప్పారు.
హీరామండిలో నివసించే చాలా మంది డాక్టర్లు, కాలేజీ ప్రిన్సిపల్స్ తనకు తెలుసని చెప్పినట్లు ఆమె తెలిపారు. హీరామండిని కేవలం సెక్స్ వర్కర్లు నివసించే ప్రాంతంగానే ఈ సిరీస్‌లో చూపించడంపై ఆమె అభ్యంతరకరం వ్యక్తం చేశారు.
ఈ సిరీస్‌ను చూసిన తర్వాత, లాహోర్‌కు చెందిన హమ్ద్ నవాజ్ అనే వ్యక్తి కూడా తీవ్రంగా విమర్శించారు.
హీరా మండి తప్ప హీరామండిలో మిగతా అన్నీ ఉన్నాయన్నారు.
అసలైన రాయల్ ప్రాంతానికి చెందిన ఫోటోను ఈ సిరీస్‌లో చూపించిన సెట్‌తో పోలిస్తూ.. ఎక్కడ ఈ సెట్‌ను ఏర్పాటు చేశారు? అని ప్రశ్నించారు.
ఇటలీలోని లేక్ కోమోలోనా లేదా అమాల్ఫి తీర ప్రాంతంలోనా? అని ప్రశ్నించారు.
నేటికీ లాహోర్‌లో ఉన్న భవంతుల్లో, షాహి ఖిల్లా, మసీదు, మినార్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.
ఈ ప్రాంతం కేవలం గ్లామర్‌కు సంబంధించినదే కాదు. దోపిడి, బానిసత్వం, పేదరికం వంటివి ఈ ప్రాంతంలో ఉండేవి. కానీ, ఈ ప్రాంతంలో నివసించే వారు తమ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందులు చూపించాలని కోరుకుంటారు.
ఒకవేళ సినిమా అనేది కల్పిత అంశంతో రూపొందితే, మీకు కావాల్సింది మీరు చూపించుకోవచ్చని రఫీ అన్నారు.
కానీ, ఒకవేళ వాస్తవ ప్రదేశంతో ముడిపడిన కథాంశాన్ని తీసుకుని దాని ఆధారంగా సినిమా తీస్తున్నట్లు చెబితే, వాస్తవానికి దూరంగా ఉండటం సరైన అంశం కాదన్నారు.
ఈ సిరీస్‌లోని సెక్స్ వర్కర్ల పాత్రలు, ఇతర నటుల భాష, వారి శైలిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లాహోర్ హీరామండిలోని సెక్స్ వర్కర్లంతా లఖ్‌నవూకు చెందిన వారా? పంజాబీ శైలిలో లేదా ఆ భాషలో మాట్లాడలేరా? ఉర్దూ శైలిని ఇంత దారుణంగా ఎలా చూపించగలిగారు? అని వాఖాస్ అల్వి అనే వ్యక్తి ప్రశ్నించారు.
ఇంత పెద్ద తేడాను ఎవరూ కూడా సంజయ్ లీలా బన్సాలీకి చెప్పలేకపోయారా? అని అడిగారు.
షర్మిన్ సెగల్‌ను ప్రముఖ పాత్రలో ఉంచడంపై కొందరు అభ్యంతరకరం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, SOFISCHOOL
బన్సాలీ కల్పిత ప్రపంచాన్ని సృష్టించారు
కొందరు ప్రేక్షకులు బన్సాలీని అండగా నిలుస్తున్నారు. ఆయన ప్రొడక్షన్స్ వాస్తవానికి సంబంధించినవి కావంటున్నారు.
ఒకవేళ వాస్తవ సంఘటనలతో ప్రభావితమైనప్పటికీ, వాస్తవంలో లేని కొన్ని కల్పిత ప్రపంచాలను ఆయన సృష్టించారని చెప్పారు.
వినసొంపైన మ్యూజిక్‌తో అద్భుతమైన సీన్లను ఆయన రూపొందించారని చెబుతున్నారు. సినిమాను ఎంజాయ్ చేయాలని, వినోదాన్ని, కళను, తాజ్‌దార్, ఆలంజేబ్ ప్రేమకథను ఆస్వాదించడాన్ని విమర్శకులు నేర్చుకోవాలని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు 2024: కొత్త ఓటర్ ఐడీ కార్డును ఎలా పొందాలి, 6 ప్రశ్నలు- సమాధానాలు
- ‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’
- లోక్‌సభ ఎన్నికలు 2024: 100 మంది సంపన్న అభ్యర్థులలో 64 మంది తెలుగువాళ్లే, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
- నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు
- యాపిల్: పడిపోయిన ఐఫోన్ల అమ్మకాలు, అసలేమైంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














