జకియా వార్దక్: ఈ మహిళా దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేశారా, ముంబయి ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?

జకియా వార్దక్

ఫొటో సోర్స్, FB/Zakia

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని అఫ్గానిస్తాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్

భారత్‌లోని అఫ్గానిస్తాన్ దౌత్యవేత్త జకియా వార్దక్ తనపై వచ్చిన బంగారం స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.

గత ఏడాది కాలంగా చాలా రకాలుగా వ్యక్తిగత దాడులు, అవమానాలను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

జకియా వార్దక్, ముంబయిలోని అఫ్గానిస్తాన్ కాన్సుల్ జనరల్. అఫ్గానిస్తాన్ తరపున తొలి మహిళా కాన్సుల్ జనరల్ ఆమె.

2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆమె ఈ పదవిలో నియమితులయ్యారు.

దుబయ్ నుంచి రూ. 18 కోట్ల విలువ చేసే 25 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అడ్డుకున్నట్లుగా భారత మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఆమె ప్రకటించారు. తన క్యారెక్టర్‌ను కించపరిచే, తనను లక్ష్యంగా చేసుకునే దాడులు ఇక భరించలేనివిగా మారాయంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

జకియా వార్దక్

ఫొటో సోర్స్, Getty Images

అసలేమైంది?

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ ప్రకారం, జకియా వార్దక్ ఏప్రిల్ 25న దుబయ్ నుంచి ముంబయికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.

ముంబయి విమానాశ్రయంలో భారత కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నప్పుడు ఆమె కుమారుడు కూడా వెంట ఉన్నారు.

వారిద్దరూ విమానాశ్రయంలో కస్టమ్స్ గ్రీన్ చానెల్‌ ఉపయోగించారు. అంటే, తమ వద్ద సుంకం విధించాల్సిన వస్తువులు లేవని పేర్కొంటూ గ్రీన్ చానెల్‌ను వాడారు.

అయితే, వస్తువులను సోదా చేసేటప్పుడు అఫ్గాన్ దౌత్యవేత్త నుంచి 25 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఆ తర్వాత ఆమెపై బంగారం స్మగ్లింగ్ కేసు నమోదైంది. అయితే, దౌత్యపరమైన మినహాయింపు కారణంగా ఆమెను అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు.

అయితే, భారత అధికారుల నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.

ముంబయి విమానాశ్రయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దుబయ్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ కస్టమ్స్ ద్వారా వెళ్లాలి. దీనికోసం అక్కడ గ్రీన్, రెడ్ చానెల్స్ ఉంటాయి.

పన్ను వర్తించే వస్తువులు ఉన్న ప్రయాణీకులు రెడ్ చానెల్ గుండా వెళ్లాలి. ఎగుమతి సుంకం వర్తించని వస్తువులు ఉన్నవారు గ్రీన్ చానెల్ గుండా ప్రయాణించాలి.

ఒకవేళ గ్రీన్ చానెల్‌ గుండా వచ్చిన ప్రయాణీకుల వద్ద పన్ను వర్తించే వస్తువులు దొరికితే, వారిపై చట్టపరమైన చర్యలే కాకుండా జరిమానా విధిస్తారు. వారి వస్తువులను జప్తు చేసుకోవచ్చు.

భారత చట్టాల ప్రకారం, కస్టమ్స్ అధికారులకు తెలియకుండా గ్రీన్ చానెల్ గుండా బంగారాన్ని తీసుకెళ్లే ఏ ప్రయత్నమైనా స్మగ్లింగ్‌తో సమానం. ఆ ప్రయాణీకుడు చట్టపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జకియా వార్దక్

ఫొటో సోర్స్, FB/Zakia

‘‘ఒక పద్ధతిలో నా పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’

ముంబయి కాన్సుల్ జనరల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా జకియా వార్దక్ ప్రకటించారు. ఈమేరకు పష్తో, దరి, ఇంగ్లిష్ భాషల్లో లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో తనపై వచ్చిన బంగారం స్మగ్లింగ్ ఆరోపణల గురించి ఆమె ప్రస్తావించలేదు. కానీ, గత ఏడాది కాలంగా తన పరువు తీసేందుకు ఒక క్రమ పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

తననే కాకుండా తన కుటుంబసభ్యులు, స్నేహితుల్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యక్తిగత దాడులు చేస్తున్నారంటూ వెల్లడించారు. అఫ్గాన్ సమాజపు మహిళలు ఎదుర్కొనే సవాళ్లను ఇవి చూపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.

మే 5నుంచి తన విధులకు దూరంగా ఉంటానని పేర్కొన్న ఆమె తన పదవీకాలంలో ఎంతో మద్దతు అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నియమించిన దౌత్యవేత్తలను తాలిబాన్లు బహిష్కరించడంతో, భారత్‌లో వారికి వీసాల పొడిగింపు దక్కలేదు. దీంతో 2023 నవంబర్‌లో న్యూదిల్లీలోని అఫ్గానిస్తాన్ ఎంబీసీని మూసేశారు.

అయితే, కొన్ని రోజుల తర్వాత కాబుల్‌లోని అధికార తాలిబాన్ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి మధ్య సహకారం కోసం హైదరాబాద్, ముంబయిలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను తిరిగి తెరిచారు.

జకియా వార్దక్

ఫొటో సోర్స్, FB/ZAKIA

తాలిబాన్ ప్రభుత్వంతో అఫ్గాన్ దౌత్యవేత్తల సంబంధాలు

ముంబయి, హైదరాబాద్‌లోని అఫ్గాన్ కాన్సులేట్లు దాదాపు రెండేళ్లుగా తాలిబాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. తాలిబాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశాల్లో దౌత్యవేత్తలు కూడా పాల్గొంటారు.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించిన మహిళా దౌత్యవేత్తల్లో జకియా వార్దక్ ఒకరు. తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతుదారుగా జకియా గురించి చెబుతారు.

వార్దక్ రాజీనామా, ముంబయిలో స్మగ్లింగ్ ఘటన గురించి తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖను బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వార్దక్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో, ఈ నియామకంలో తాలిబాన్ ప్రభుత్వం ఎంత పాత్ర పోషిస్తుందో ఇంకా తెలియదు.

అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ గుర్తింపు ఇవ్వలేదు. కానీ, ఇటీవలి కాలంలో పలుసార్లు కాబుల్‌లో భారత దౌత్యవేత్తలు పర్యటించారు. అక్కడ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖ్‌తో పాటు పలువురు అధికారులను వారు సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)