పెళ్లంటే సప్తపది, కన్యాదానం, మంగళ సూత్రమేనా? అలా చేయకుంటే పెళ్లి చెల్లదా?

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనఘా పాఠక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘అంటే, నా పెళ్లి చెల్లదా?’’ అని నా స్నేహితురాలు గాయత్రి నన్ను అడిగింది.

హిందూ వివాహం గురించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది.

హిందూ వివాహ చట్టం-1955 (హెచ్‌ఎంఏ) ప్రకారం, ఒక పెళ్లికి గుర్తింపు దక్కాలంటే ఆ పెళ్లిలో పద్ధతి ప్రకారం అన్ని ఆచారాలను పాటించాలని కోర్టు చెప్పింది. హిందూ వివాహం అనేది ఒక సంస్కారం లేదా మతపరమైన ప్రక్రియ అని కోర్టు వ్యాఖ్యానించింది.

35 ఏళ్ల గాయత్రి ఒక ఆధునిక మహిళ. ఆమె తన పెళ్లిలో కన్యాదానం తంతును నిర్వహించలేదు. ఎందుకంటే, దానం చేయడానికి తానొక వస్తువును కాదనేది ఆమె అభిప్రాయం. అందుకే, కన్యాదానం క్రతువును తన పెళ్లిలో ఆమె వద్దనుకున్నారు.

గాయత్రితో మాట్లాడుతుండగా నాకు మా ఇద్దరు అక్కల పెళ్లిళ్లలో పెళ్లికొడుకు తరఫు అతిథుల కాళ్లు కడిగే కార్యక్రమాన్ని నిర్వహించని విషయం గుర్తొచ్చింది.

అంటే, ఇప్పుడు ఈ పెళ్లిళ్లన్నీ చెల్లవన్నట్లా?

నో. కానీ, ఈ కథనం చివర్లో చట్టప్రకారం ఈ పెళ్లిళ్లు చెల్లుతాయో లేదో అనే అంశంపై మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది.

కానీ, మొదట అసలు ఈ చర్చంతటికీ దారి తీసిన ఒక కేసు గురించి తెలుసుకుందాం.

విడాకుల పిటిషన్‌ను ముజఫర్‌పూర్‌లోని బిహార్ కోర్టునుంచి రాంచీలోని జార్ఖండ్ కోర్టుకు బదిలీ చేయాలంటూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ కోర్టు విచారిస్తోంది. ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఆ మహిళ తన మాజీ భాగస్వామితో ఒక నిర్ణయానికి వచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 కింద ఒక ఉమ్మడి అప్లికేషన్‌ను దరఖాస్తు చేసి తమ సమస్యను పరిష్కరించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

విధివిధానాల ప్రకారం తమ పెళ్లి జరుగలేదని, కాబట్టి తమ వివాహం చెల్లదని ప్రకటించాలని వారు ఉమ్మడిగా పిటిషన్ వేశారు.

ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు వారి పెళ్లి చెల్లదంటూ నిర్ధారించింది. ఈ కేసులో తీర్పును వెలువరిస్తూ కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. సప్తపది వంటి తగు ఆచారాలు, వేడుకల ప్రకారం ఒక హిందూ పెళ్లి జరుగకపోతే ఆ పెళ్లిని హిందూ వివాహంగా పరిగణించలేమని చెప్పింది.

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

సప్తపది నిర్వహించకుంటే పెళ్లి చెల్లదా?

పెళ్లిలో సప్తపది (అగ్ని చుట్టూ ఏడు అడుగులు నడవడం) క్రతువును చేయకపోతే ఏ పెళ్లి చెల్లదా? అనే అంశం మీద నా సహోద్యోగులతో మాట్లాడుతుండగా ఒకరు ఇలా అన్నారు. కొన్ని పెళ్లిళ్లలో అగ్ని చుట్టూ నాలుగుసార్లే (పేరాస్) తిరుగుతారు, కొందరేమో తిరోగామి సంప్రదాయాలుగా భావించే కొన్ని ఆచారాలు, వేడుకలను నిర్వహించకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. అంటే చట్టం దృష్టిలో వీరందరి పెళ్లిళ్లు చెల్లవన్నట్లేనా? అని నా సహోద్యోగి ప్రశ్నించారు.

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 114 ప్రకారం, పెళ్లికి సంబంధించి ఎప్పుడూ ఒక ఊహ ఉంటుంది.

‘‘కోర్టు ఎల్లప్పుడూ పెళ్లికి సంబంధించిన ఊహ వైపే మొగ్గుతుంది. ఉదాహరణకు, మీరు ఒకరితో చాలా కాలం పాటు కలిసి జీవించారు. మీరిద్దరూ భార్యభర్తల్లా సమాజంలో మెలిగారనుకోండి. చట్టం మీరు వివాహితులనే అనుకుంటుంది. మీలో ఎవరో ఒకరు దాన్ని సవాలు చేసేవరకు చట్టం మీరు వివాహితుల్లాగే భావిస్తుంది’’ అని బీబీసీతో ముంబయికి చెందిన న్యాయవాది వీణా గౌడ చెప్పారు.

ఒకవేళ ఒక పెళ్లి హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగితే, ఆ పెళ్లిలో సదరు ఆచారాలు, వేడుకల్ని జరపాలని ఆమె వివరించారు. వివాహ ధ్రువీకరణ పత్రం పొందడానికి పెళ్లిలో నిర్వహించిన ఆయా వేడుకల రుజువులను చూపించాలని ఆమె చెప్పారు.

‘‘ప్రత్యేక వివాహ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించడమే వివాహం. ముస్లిం పర్సనల్ లా ప్రకారం నిఖానామా అనేది వివాహం. క్రిస్టియన్ చట్టం ప్రకారం చర్చి మీకు పెళ్లి సర్టిఫికెట్‌ను ఇస్తుంది. వీటన్నింటిలో వివాహ ధ్రువీకరణ పత్రం లేదా రిజిస్ట్రేషన్ అనేవి పెళ్లిలో భాగం. అయితే, హిందూ చట్టంలో పెళ్లిని రిజిస్టర్ చేయించాలనే భావనే లేదు. తర్వాత చట్టంలోకి వివాహ నమోదు అంశాన్ని తీసుకొచ్చారు.

హిందూ చట్టంలో వివాహ వేడుకలు, ఆచారాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వ్యక్తుల ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పెళ్లిలో వీటన్నింటిని నిర్వహించాలి. కేవలం రిజిస్ట్రేషన్ అనేది వివాహానికి రుజువు కాదు. కాబట్టి ఈ చట్ట ప్రకారం, కోర్టు చేసిన వ్యాఖ్యలు కొంతవరకు సరైనవి’’ అని ఆమె వివరించారు.

సప్తపది, కన్యాదానం, తాళి కట్టడం వంటి ఆచారాలను తిరోగామి సంప్రదాయాలని, బ్రాహ్మణ పితృస్వామ్య పోకడలను సమర్థిస్తాయంటూ తరచూ విమర్శలు వస్తుంటాయి. ఎందుకంటే, ఈ సంప్రదాయాలు మహిళను మరొకరికి అప్పగించే ఒక ఆస్తిగా పరిగణిస్తాయి.

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

చట్టంలో ఏముంది?

ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఇది ఎలాంటి ఆచారాలు, వేడుకలను నిర్దేశించలేదు. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకుకు చెందిన ఆచారాలు, వేడుకలకు అనుగుణంగా హిందూ వివాహం జరుగొచ్చని హిందూ వివాహ చట్టం-1955లోని సెక్షన్ 7 చెబుతుంది.

ఇందుకు వీణ ఒక ఉదాహరణ ఇచ్చారు. ‘‘కర్ణాటకలోని కొన్ని నిర్ణీత కమ్యూనిటీలు కావేరీ నదిని సాక్షిగా భావిస్తూ పెళ్లి చేసుకుంటారు. కొందరేమో సూర్యుని సాక్షిగా పెళ్లిళ్లు జరుపుతారు. పెళ్లికి సంబంధించి చాలా వేడుకలు ఉన్నాయి. చట్టం ఎటువంటి ప్రత్యేక వేడుకలను సిఫార్సు చేయలేదు. చట్టం కేవలం పెళ్లి చేసుకునే పక్షాల తరఫు ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, వేడుకల ప్రకారం పెళ్లి జరగాలి అని మాత్రమే చెబుతుంది’’ అని వీణ వివరించారు.

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 3, ఆచారం అనే పదాన్ని నిర్వచిస్తుంది. ప్రజల్లో చాలాకాలంగా, నిరంతరంగా, ఏకరీతిలో వాడుకలో ఉంటూ స్థానిక, తెగ, కమ్యూనిటీ, గ్రూపు, లేదా కుటుంబంలో చట్టబద్ధత పొందిన ఏ నియమాన్నైనా ఆచారంగా వ్యవహరించవచ్చు అని సెక్షన్ 3 నిర్వచిస్తోంది.

వివాహం

ఫొటో సోర్స్, UNIVERAL IMAGES GROUP VIA GETTY

సప్తపది వంటి ఆచారాలను సుప్రీం సహా భారతీయ కోర్టులు ఎందుకు నొక్కి చెబుతున్నాయి?

అన్ని పెళ్లిళ్లు బ్రాహ్మణ ఆచారాల ప్రకారం జరుగవని ప్రొఫెసర్, డాక్టర్ సర్సు థామస్ నమ్ముతారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్‌ ప్రొఫెసర్ అయిన ఆమె ఫ్యామిలీ లీ, జెండర్ వంటి అంశాల్లో నిపుణులు.

కానీ, కోర్టులు ఈ బ్రాహ్మణ వేడుకల వైపే చూస్తున్నాయనేది నిజమని ఆమె అన్నారు.

‘‘సప్తపది, హోమం వంటివి ఉండాలని కోర్టు నొక్కిచెప్పినవి నా దృష్టిలో కరెక్టు వాదనలు కావు. కొందరు తాళి కట్టడాన్ని కూడా సమాన ఆచారంగా భావించరు. అయితే, ఒకవేళ పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇరుపక్షాల తరఫున ఇలాంటి ఆచారాల్ని పాటిస్తుంటే హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ పెళ్లికి గుర్తింపు దక్కాలంటే ఆ ఆచారాలన్నింటినీ కచ్చితంగా పెళ్లిలో నిర్వహించాలి’’ అని ఆమె వివరించారు.

కొన్ని కేసుల్లో కోర్టులు భిన్నమైన విధానాన్ని ఎంచుకుంటాయని ఆమె అన్నారు.

ఉదాహరణకు, ఇటీవల ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు, హిందూ వివాహ చట్టం కింద కన్యాదానం తప్పనిసరి వేడుక కాదని చెప్పింది.

పుణేకు చెందిన లాయర్ రమా సరోద్ మహిళా హక్కుల నిపుణురాలు. భారతీయ కోర్టులు ప్రగతిశీల విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకతను ఆమె ఎత్తి చూపారు.

‘‘తప్పనిసరి ఆచారాలు, వేడుకలకు సంబంధించిన నిర్వచనాలను సుప్రీం కోర్టు విస్తరించాల్సిన అవసరం ఉంది. హిందూ వివాహ చట్టాన్ని 1995లో ఆమోదించారు. అప్పట్లో ఈ ఆచారాలన్నీ ముఖ్యమైనవి. కానీ, ఇప్పటి కాలానికి తగినట్లుగా చట్టాన్ని నిర్వచించాలి. సిద్ధాంతాలు, వేడుకల మార్పుకు చట్టంలో స్థానం ఉండాలి. ప్రజలు ముఖ్యమైనవని అనుకునే వేడుకలను నిర్వహించగలగాలి. వాటి ప్రకారం వివాహాన్ని రిజిస్టర్ చేసుకోగలగాలి. వివాహాన్ని నమోదు చేయడం చాలా ముఖ్యం’’ అని ఆమె వివరించారు.

వివాహం

ఫొటో సోర్స్, Getty Images

సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవాలని భావిస్తూ, తిరోగమన ఆచారాలను పాటించడానికి ఇష్టపడని ప్రగతిశీల హిందువుల సంగతి ఏంటి?

ఈ విషయంలో వీణ, డాక్టర్ సర్సు ఇద్దరూ ప్రత్యేక వివాహ చట్టం గురించి ప్రస్తావించారు.

‘‘ఇంకో కొత్త చట్టం అవసరం లేదు’’ అని డాక్టర్ సర్సు అన్నారు.

‘‘చివరగా బాధపడేది మహిళలే. చాలామంది ప్రజలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా తమ పెళ్లి జరగాలి అనుకుంటారు. అలాంటప్పుడు, ఈ మహిళలందరూ చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదని అర్థం.

ఇప్పుడున్న చట్టం బాగానే ఉంది. ప్రగతిశీల జంటలు కావాలంటే ప్రత్యేక వివాహ చట్టాన్ని అనుసరించవచ్చు. కానీ, పెళ్లిలో కొత్త వేడుకను జోడించడానికి మరో కొత్త చట్టం చేయడం తప్పు. అయితే, ఒక వివాహాన్ని చెల్లుబాటు చేయడానికి రిజిస్ట్రేషన్ సరిపోతుందని చట్టం చెబుతుంది’’ అని ఆమె వివరించారు.

లింగపరమైన వేడుకలను తిరస్కరించడంలోనే కాకుండా వివాహ వ్యవస్థ ఎంత సంబద్ధంగా ఉంది, వివాహంలో మహిళల హక్కుల గురించి చర్చించేలా కోర్టులు ప్రగతిశీలంగా ఆలోచించాలని వీణ అభిప్రాయపడ్డారు.

‘‘వైవాహిక అత్యాచారాన్ని భారత చట్టం గుర్తించదు. ఇటీవల, వివాహబంధంలో భర్త అసహజ సెక్స్‌కు పాల్పడితే అది నేరం కాదంటూ ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. పెళ్లిలో సమ్మతి తీసుకోవాలనే భావనే లేదు. మీరు వివాహితులైతే, మీరు సెక్స్‌కు సమ్మతిచ్చినట్లే లెక్క. ఇలాంటి విషయంలో ప్రగతిశీలంగా ముందుకు సాగాలి.

ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య బంధమే పెళ్లి అని చెప్పడం సులభమే. కానీ, చట్టం ఒక మహిళను సమాన భాగస్వామిగా పరిగణిస్తుందా?

నాకు గుర్తున్నంత వరకు, స్త్రీలకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎవర్నీ పెళ్లాడాలి? అనే విషయాలు చెబుతుంటారు.

సమానత్వం కోసం పోరాటంలో మనం ఎక్కడ ఉన్నామో ఇదే చెబుతుంది’’ అని వీణ అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)