షర్మిల, కౌసల్య, అనసూయ: భర్తలు కుల అహంకారానికి బలి కావడంతో వాళ్ల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి?

ఫొటో సోర్స్, PRAVEEN FAMILY
- రచయిత, శారదా వీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
(గమనిక: ఈ కథనంలో కొన్ని విషయాలు కొందర్ని కలచివేయొచ్చు)
చెన్నైలోని పల్లికరణై ప్రాంతంలో నివసించే దళిత కులానికి చెందిన ప్రవీణ్ ఫిబ్రవరిలో హత్యకు గురయ్యారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని తన సోదరి పెళ్లి చేసుకుందనే కారణంతో తాను పెళ్లి చేసుకున్న యువతి సోదరుడే ప్రవీణ్‌ను హత్య చేశారు.
భర్తను కోల్పోయిన షర్మిల కూడా రెండు నెలల తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పల్లికరణైలోనే ప్రవీణ్ టూవీలర్ రిఫైర్ దుకాణం నడిపేవారు. షర్మిల, ప్రవీణ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు.
అమ్మాయి ఇంట్లో పెద్దలు ఈ ప్రేమను అంగీకరించలేదు. అబ్బాయి ఇంట్లో వాళ్లకు అభ్యంతరం లేదు. దీంతో ప్రవీణ్ గత ఏడాది అక్టోబర్‌లో షర్మిలను పెళ్లి చేసుకున్నారు.
షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తామని బెదిరింపులు వస్తూ ఉండటంతో, ప్రవీణ్ కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత, ఫిబ్రవరిలో పల్లికరణై మార్కెట్‌లో ప్రవీణ్ హత్యకు గురయ్యారు.
ఈ కేసులో షర్మిల సోదరుడు దినేష్, మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ప్రవీణ్ హత్యకు గురైన రెండు నెలల తర్వాత, ఆయన ఇంట్లోనే షర్మిల కూడా ఉరివేసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆమెను, ఆస్పత్రిలో చేర్చారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఆ తర్వాత మరణించారు.

ఫొటో సోర్స్, PRAVEEN FAMILY
కులదురహంకార హత్యకు గురైన వారి జీవిత భాగస్వామి పరిస్థితేంటి?
కులదురహంకార హత్యలలో బాధితులుగా మారిన వారి జీవిత భాగస్వాముల పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. మానసికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా వారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
భర్తను కోల్పోయిన మరో యువతి అనుసూయ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. తిరుపూర్ బనియాన్ కంపెనీలో పనిచేసే సుభాష్‌ను అనుసూయ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో నివసించే ఈ రెండు కుటుంబాలు, తొలుత వారి ప్రేమకు అడ్డు చెప్పలేదు.
కానీ, అమ్మాయి కుటుంబం షెడ్యూల్ కులానికి చెందిన వారని తెలిసిన తర్వాత, సుభాష్ కుటుంబం వారి ప్రేమను ఒప్పుకోలేదు.
‘‘నేను కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశాను. మంచి జీతంతో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్‌గా ఉద్యోగం కూడా పొందాను. సుభాష్ తండ్రి నా కులాన్ని అసలు అంగీకరించేవారు కాదు. అయినప్పటికీ, సుభాష్ ఇవేమీ పట్టించుకోకుండా, నన్ను పెళ్లి చేసుకున్నారు’’ అని అనుసూయ చెప్పారు.
‘‘మీరు చేయాలనుకుంది చేయండి. నేను సుభాష్‌ను పెళ్లి చేసుకుంటున్నాను అని ఆయన తండ్రికి చెప్పాను. అప్పటి నుంచి ఆయనకు నేనంటే కోపం’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అనుసూయ విషయంలో ఏమైంది?
ఒక ఫంక్షన్ కోసం పట్టణానికి రమ్మని సుభాష్ తండ్రి తమను ఆహ్వానించారని అనుసూయ చెప్పారు.
ఆ ఫంక్షన్‌కు వచ్చిన సమయంలో, నిద్రిస్తున్న అనుసూయపై కత్తితో దాడి చేశారు. సుభాష్‌ను చంపేశారు. సుభాష్‌ను కాపాడటానికి ఆయన తల్లి చాలా ప్రయత్నించారు. అనుసూయ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, రెండు చేతులు కోల్పోయారు.
‘‘అప్పట్లో మా ఇంట్లో వాళ్లు నన్ను ఏ ప్రాంతానికైనా ధైర్యంగా పంపించేవారు. కానీ, ఇప్పుడు కొద్దిసేపు బయటకు వద్దామ ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని మా అమ్మ భయపడుతుంటుంది’’ అని అనుసూయ తెలిపారు.
‘‘మేం ప్రేమించుకున్నప్పుడు టీనేజర్లమే. అప్పుడు పెళ్లి చేసుకోలేదు. మా చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఒక్క క్షణం కూడా నేను సుభాష్‌ను మర్చిపోలేకపోతున్నాను. కొన్నిసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించా. మమ్మల్ని వదిలివెళ్లొద్దని మా సోదరుడు ఏడ్చాడు. అన్నింటినీ తట్టుకుని బతుకుతున్నా’’ అని చెప్పారు.
అనుసూయకు ఇప్పటికే రెండు సర్జరీలు అయ్యాయి. మరో మూడు సర్జరీలు జరగాల్సి ఉంది.
అంతకుముందు లాగా అనుసూయ తండ్రి ఈ సంఘటన తర్వాత అంత క్లోజ్‌గా లేరు. అనుసూయ తన ఇంటికి కూడా వెళ్లాలనుకోలేదు. తన తల్లి, తమ్ముడితోనే మరో నగరంలో ఉంటున్నారు. కొందరు వ్యక్తులు, సంస్థల సాయంతో టీచర్ ట్రైనింగ్ తీసుకున్నారు.
కౌసల్య ఎలా కోలుకున్నారు?
ఇలా కేవలం అనుసూయ లేదా షర్మిలకు మాత్రమే కాదు..చాలామంది తమ భాగస్వాములను కోల్పోయాక ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శంకర్ భార్య కౌసల్య కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.
2017లో ఉడుమాలపేట మార్కెట్‌లో శంకర్ హత్యకు గురయ్యారు. భర్త హత్యతో కౌసల్య కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు.
‘‘శంకర్ చనిపోయినప్పుడు, చాలా సంస్థలు, ఉద్యమకారులు వచ్చి నాకు మద్దతు ఇచ్చారు. నాకు వారు చాలా బలం. అందుకే, రెండు కుటుంబాల మద్దతు లేకున్నా నేను బతకగలుగుతున్నాను. కానీ, వాళ్లు మాత్రం నాకు ఎన్నాళ్లు సాయం చేయగలుగుతారు? ప్రభుత్వమే ఏదైనా చేయాలి’’ అని కోరారు.
‘‘చెన్నైలో షర్మిల ఇంటి బయట సెక్యూరిటీ పెట్టినప్పటికీ, ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కులదురంహకారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఆమె నాకు చెప్పింది. భర్తను చంపిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని ఆమె అనుకుంది’’ అని కౌసల్య చెప్పారు.

ఫొటో సోర్స్, SAMUEL RAJ
షర్మిల ఆత్మహత్యకు కారణమేంటి?
భర్త చనిపోవడంతో షర్మిల కుంగిపోయారన్నది నిజమే. ప్రవీణ్ చనిపోయిన రెండు నెలలకే షర్మిల ఆత్మ హత్య పాల్పడటానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
‘‘రెండు వారాల క్రితం, షర్మిల సోదరుడికి చెందిన బెయిల్ నోటీసు మా ఇంటికి పంపారు. ఈ నోటీసు చూసిన తర్వాత, షర్మిల చాలా వేదనకు గురయ్యారు. కోర్టు ముందు హాజరు కావడానికి ఒక్క రోజు ముందే ఈ నోటీసు మాకు వచ్చింది’’ అని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు.
‘‘హత్య చేసిన వారి కొడుకును కాపాడాలంటూ బెయిల్ కోసం అడుగుతున్న తన తల్లిదండ్రులపై షర్మిల చాలా కోపంతో ఉన్నారు’’ అని అన్నారు.
‘‘షర్మిల ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత, దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాం. ఆ తర్వాత, తదుపరి చికిత్స కోసం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్చాం’’ అని చెప్పారు.
అగ్రకులానికి చెందిన మహిళను, తక్కువ కులానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు, కులదురంహకార హత్యలు జరుగుతున్నాయి. కులాన్ని స్వచ్ఛతగా నమ్ముతున్న వారు, తక్కువ కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ స్వచ్ఛతను నాశనమైందని భావిస్తున్నారు’’ అని అన్నారు.
అందుకే మహిళల కుటుంబాలు ఈ హత్యలలో భాగమవుతుండటాన్ని తరచూ చూస్తున్నామని అన్నారు.
‘‘కుటుంబంలోని వ్యక్తులు మహిళను చంపినప్పుడు, బాధిత భర్తలు న్యాయపరమైన, మానసికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ, భర్తలను కోల్పోయిన మహిళలైతే , అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని తమిళనాడు అస్పృశ్యత నిర్మూలన ఫ్రంట్‌లో పనిచేసే రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ రాజ్ చెప్పారు.
‘‘హత్య చేసింది తన కుటుంబం కాబట్టి, ఆమె తన పుట్టింటికి వెళ్లలేరు. అదే సమయంలో భర్త కుటుంబంతో కూడా సన్నిత సంబంధాలుండవు. హత్య తర్వాత ఎలాంటి మద్దతు లభిస్తుందనే దానిపై వారి జీవితం ఆధారపడి ఉంటుంది. కొందరు మళ్లీ పెళ్లి చేసుకుని, మంచి జీవితాన్ని గడుపుతున్నారు’’ అని అన్నారు.
కులదురంహకార హత్యలతో బాధితులుగా మారుతున్న భాగస్వాములకు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వాలని కౌసల్య అన్నారు.
‘‘భర్త చనిపోయిన తర్వాత, ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అమ్మాయికి కేవలం ఆ అబ్బాయి మాత్రమే తెలుసు. పెళ్లి తర్వాతనే కుటుంబం తెలుస్తుంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత, వారికి పదేపదే ఆత్మహత్యా ఆలోచనలు వస్తుంటాయి. వారికి ఏదైనా ఉద్యోగం కల్పించేలా మనం చూడాలి’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, CAUSALYA
ప్రత్యేక చట్టం కావాలి
కులదురంహకార హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం కావాలని దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. హత్య చేసిన వారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అయితే, ఎవరూ కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోవడం ఈ కేసుల్లో ఉన్న ప్రధాన సవాలు.
కొన్నిసార్లు సొంత కుటుంబమే మహిళను హత్య చేసినప్పుడు, ఆ కేసులను ప్రివెన్షన్ ఆఫ్ కాస్ట్ అట్రాసిటీస్ యాక్ట్ కింద దాఖలు చేయడానికి కుదరదు. అందుకే, ప్రత్యేక చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
‘‘ప్రత్యేక చట్టం కోసం లా కమిషన్ రూపొందించిన డ్రాఫ్ట్ రాజ్యసభ ముందుకు వెళ్లింది. అలాగే, తమిళనాడులో కూడా పలు సంస్థలు రూపొందించిన డ్రాఫ్ట్‌ను, ప్రభుత్వానికి ఇచ్చాయి. కానీ, ఏమీ జరగలేదు’’ అని న్యాయవాది మోహన్ అన్నారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు
మెడికేషన్, థెరపీ ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తుంటారు. దీని కోసం మీరు మానసిక వైద్య నిపుణులు సాయం తీసుకోవాలి. అంతేకాక, హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.
స్నేహ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్ నెంబర్ - 044 -2464000(24 గంటలు సేవలందిస్తారు)
స్టేట్ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్ నెంబర్ – 104
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ హెల్ప్‌లైన్ - 1800-599-0019(13 భాషలలో సేవలు)
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, అలయిడ్ సైన్సెస్- 9868396824, 9868396841, 011-22574820
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, న్యూరాలజీ - 080 – 26995000
ఇవి కూడా చదవండి:
- నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- నీళ్లలో మీ మలం తేలుతుందా? అది చెప్పే ఆరోగ్య రహస్యాలు ఇవీ!
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- ‘గ్లూటెన్’ అంటే ఏమిటి? ఇది లేని ఆహారం మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














