గుడ్డులో ఏం ఉంటుంది? ఆరోగ్యానికి మంచిదేనా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జో విలియమ్స్, పోషకాహార నిపుణులు
- హోదా, బీబీసీ కోసం
ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.
గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు ఉంటాయి.
తెల్లసొనలో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి.
పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు.
ఉడికించిన గుడ్డులోని పోషకాలు
72 కిలో కేలరీలు
4.8 గ్రాముల ప్రోటీన్
1.4 గ్రాముల సంతృప్త కొవ్వులు
1.8 గ్రాముల మోనో-అసంతృప్త కొవ్వులు
0.8 గ్రాములు పాలీ-అసంతృప్త కొవ్వులు
15ఎంసీజీ ఫోలేట్
1.6 ఎంసీజీ విటమిన్ డి వంటి పోషకాలు ఉంటాయి.
గుడ్డు తినడం వల్ల కలిగే టాప్-8 ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images

పోషకాలు పుష్కలం
గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మీ శరీరానికి అవసరమైన దాదాపు ప్రతి పోషకం గుడ్డులో లభిస్తుంది.
తక్కువ ఎనర్జీ-అత్యధిక పోషకాలు ఉండే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి.
మనకు కష్టంగా దొరికే విటమిన్ ‘డి’, విటమిన్ బీ 12తో పాటు అయోడిన్‌ను గుడ్డు తినడం వల్ల పొందొచ్చు.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కొవ్వులో కరిగే విటమిన్ ఎ, ఈ వంటివి గుడ్డులో లభిస్తాయి.

పూర్తిస్థాయి ప్రోటీన్
ఒక మీడియం సైజు గుడ్డు (53 గ్రాములు)లో 7 గ్రాముల పూర్తి ప్రోటీన్ ఉంటుంది.
పూర్తి ప్రోటీన్ అంటే మన ఎదుగుదల, అభివృద్ధి, మరమ్మత్తుకు కావాల్సిన అన్ని అమైనో యాసిడ్లు ఒక గుడ్డులో ఉంటాయి.
అంటే 9 రకాల అమైనో యాసిడ్లు ఒక గుడ్డులో ఉంటాయి.
ఈ అమైనో యాసిడ్లను మన శరీరం తయారు చేయదు. వీటిని మనం ఆహారం ద్వారానే పొందాలి.
మొక్కల ఆధారిత ఆహారాలైన తృణధాన్యాలు, చిక్కుళ్ల వంటివి అసంపూర్తి ప్రోటీన్లు. వీటిలో మనకు కావాల్సిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవసరమైన అమైనో యాసిడ్లు ఉండవు.
పైగా గుడ్డులోని ప్రొటీన్ తేలిగ్గా జీర్ణమవుతుంది. పాల ఉత్పత్తుల్లో లభించేంత నాణ్యమైన ప్రొటీన్ గుడ్డులో ఉంటుందని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

కోలిన్‌కు మూలం
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, సరిగ్గా పనిచేయడానికి కోలిన్ అనే పోషకం అవసరం.
కణ త్వచాలు ఏర్పడటానికి, జ్ఞాపకశక్తితో పాటు మెదడు పనితీరు సరిగ్గా ఉండటానికి మనందరికీ కోలిన్ చాలా అవసరం.
గర్భిణీలకు, పాలిచ్చే బాలింతలకు ఇది మరింత ముఖ్యమైన పోషకం.
మెదడు సాధారణ అభివృద్ధి కోసం తగు స్థాయిలో కోలిన్ పోషకాన్ని తీసుకోవాలి.

గుండె ఆరోగ్యం కోసం
గుండె ఆరోగ్యానికి దోహదపడే బీటైన్, కోలిన్ వంటి అనేక పోషకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.
రోజుకు ఒక గుడ్డు తినడం ద్వారా గుండె వ్యాధులు, పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని చైనాలో 10 లక్షల మంది ప్రజలపై చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

కళ్ల ఆరోగ్యం
మనకు వయస్సు పెరుగుతున్నకొద్దీ కంటి చూపు తగ్గిపోవడం చాలా సాధారణం.
కానీ, కంటి ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలను సమతుల్య ఆహారం నుంచి మనం పొందవచ్చు.
ఇలాంటి ఆహరానికి మంచి ఉదాహరణ గుడ్లు.
పచ్చసొనలో పెద్ద మొత్తంలో కెరోటీన్లు ఉంటాయి.
ముఖ్యంగా ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్‌లు కళ్ల శుక్లాలు రాకుండా కాపాడతాయి.
కంటి చూపుకు ఎంతో ముఖ్యమైన విటమిన్ ఎ కూడా గుడ్లలో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

సార్కోపేనియా నివారణ
వయస్సు పెరిగిన కొద్దీ కండర సామర్థ్యాన్ని కోల్పోవడాన్ని , కండరాలు క్షీణించే పరిస్థితిని సార్కోపేనియాగా పిలుస్తారు.
తేలిగ్గా జీర్ణమవుతూ గుడ్డులోని ప్రోటీన్, కండరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కండర క్షీణతను నివారిస్తుంది.

బరువు నియంత్రణ
కొవ్వులు, పిండిపదార్థాలు ఉన్న ఆహారాల కంటే ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది.
గుడ్లతో చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు.
ఇంకా చెప్పాలంటే, ఆ తర్వాత రోజులో మీరు తీసుకునే కెలోరీలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థకు మద్దతు
గుడ్లలో చాలా పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, అధిక నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి.
డెయిరీ ఉత్పత్తులతో పాటు గుడ్లను తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థను మాడ్యులేట్ చేయడంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గుడ్లు ఎన్ని తినాలి?
గుడ్లను పరిమితంగా తీసుకోవాలని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆరోగ్యకరమైన, సమతుల డైట్ కోసం రోజుకు ఒక గుడ్డు తింటే మేలని చెబుతున్నాయి.
(గమనిక - ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సలహాలు, సూచనల కోసం వైద్యులను సంప్రదించండి. రచయిత పోషకాహర నిపుణులు)
ఇవి కూడా చదవండి:
- లోక్‌సభ ఎన్నికలు 2024: కొత్త ఓటర్ ఐడీ కార్డును ఎలా పొందాలి, 6 ప్రశ్నలు- సమాధానాలు
- ‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’
- లోక్‌సభ ఎన్నికలు 2024: 100 మంది సంపన్న అభ్యర్థులలో 64 మంది తెలుగువాళ్లే, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..
- నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు
- యాపిల్: పడిపోయిన ఐఫోన్ల అమ్మకాలు, అసలేమైంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














