సీ కుకుంబర్‌: సెక్స్ సమస్యలను తీర్చే ఈ సముద్ర జీవులకు ఎందుకంత డిమాండ్?

సీ కుకుంబర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వద్ది ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సీ కుకుంబర్...సముద్రంలో విలువైన జీవ జాతులుగా వీటికి పేరుంది. తమిళనాడులోని సముద్రతీరంలో వీటిని అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు.

భారత్, శ్రీలంకల మధ్య ఉండే పాక్ జలసంధి లోని ఉత్తర వెదలై సముద్ర తీరంలో 97 కిలోల 'సీ కుకుంబర్‌'లను కోస్ట్‌గార్డ్ స్వాధీనం చేసుకుంది.

స్వాధీనం చేసుకున్న వాటిని, సంరక్షణ కోసం తమిళనాడు అటవీ శాఖకు అప్పగించారు.

ఇంతకీ ఈ సీ కుకుంబర్‌లు ఎందుకంత విలువైనవి? వీటిని తరలించడం నేరమా?.

సీ కుకుంబర్

ఫొటో సోర్స్, Getty Images

దోసకాయ మాదిరి ఉంటుందని..

‘సీ కుకుంబర్‌’ అనేది సముద్రం అడుగుభాగంలో బతికే ఒక జీవి. దీని శరీరం ఆకృతి పొడవాటి దోసకాయ మాదిరిగా ఉండటంతో ‘సీ కుకుంబర్‌’ అని పిలుస్తుంటారు.

ఈ సముద్ర జీవులకు తోలు చర్మం ఉంటుంది. భారత్‌లో అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించిన ఈ 'సీ కుకుంబర్‌‌'ల రక్షణకోసం వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో నియమాలు పొందుపరిచారు. దాని ప్రకారం సీ కుకుంబర్‌‌ సాగు నిషేధించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరకు లభిస్తుంటాయి.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఏ దేశాలలో డిమాండ్ ఉంది?

స్టిర్లింగ్స్ యూనివర్సిటీలోని ఆక్వాకల్చర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం.. సీ కుకుంబర్‌ ఆహారం కోసం ముఖ్యంగా ఆసియాలో చాలా డిమాండ్‌ ఉంది, అయితే సరఫరా తక్కువగా ఉంది.

కొన్ని ప్రాంతాలలో అధిక చేపలు పట్టడానికి కూడా ఇది కారణంగా ఉంటుంది.

చైనా, జపాన్, కొరియా, ఆఫ్రికా దేశాలలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. సీ కుకుంబర్‌లను ఆహారం, ముఖ్యంగా వైద్య రంగంలో వాడుతారు.

ప్రాసెస్ చేసిన సీ కుకుంబర్ ఆహారాన్ని విదేశాల్లో ఎక్కువగా 'బెచే-డి-మెర్' అని పిలుస్తుంటారు. చైనాలో హైసోమ్‌ అంటారు. చైనీయులు ఈ సీ కుకుంబర్‌లను ఆహారం కంటే టానిక్‌ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు.

సీ కుకుంబర్‌లను జపాన్, కొరియాలలో పచ్చిగా, ఊరగాయగా తింటారు. అమెరికాలో ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటారు.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

ప్రోటీన్ల సమాహారం..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌ విభాగమైన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-సీఎంఎఫ్ఆర్ఐ) ప్రకారం.. సీ కుకుంబర్‌లు మంచి పోషకాహారాలు.

ఇది ఒక టానిక్, కొవ్వు తక్కువుండే పదార్ధం, దీనిలో విలువైన పోషకాలు అధికంగా ఉంటాయి.

విటమిన్ A, విటమిన్ B1 (థయామిన్), విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B3 (నియాసిన్), ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, లోహాలు, ఖనిజాలు, ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ లభిస్తాయి.

దీనిలోని ప్రోటీన్లను కోడి గుడ్డుతో పోల్చవచ్చు. కొవ్వు తక్కువ కారణంగా అధిక రక్త పోటు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

సెక్స్ సమస్యలకు ఔషధంగా..

సీ కుకుంబర్‌‌లు ఆసియా దేశాల ఫోక్ మెడిసిన్ సిస్టం ( దేశీ వైద్య విధానం )లో చాలా కాలంగా ఉన్నాయి.

సంప్రదాయ చైనీస్ ఔషధాలలో సీ కుకుంబర్‌‌లు శరీర బలహీనత, సెక్స్ సమస్యలు (నపుంసకత్వం), వృద్ధుల బలహీనత, తరచుగా మూత్రవిసర్జన కారణంగా వచ్చే మలబద్ధకంతోపాటు పలు సమస్యల చికిత్సకు ఉపయోగిస్తుంటారు.

దీనిలో యాంటీ-యాంజియోజెనిక్, యాంటీ క్యాన్సర్, యాంటీకోగ్యులెంట్, యాంటీ-హైపర్‌టెన్షన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాల ఉనికిని ఇటీవలి పరిశోధనలో కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటిథ్రాంబోటిక్, యాంటిట్యూమర్‌గా పని చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి.

సీ కుకుంబర్‌‌లలో కొండ్రోయిటిన్ సల్ఫేట్ వంటి మ్యూకోపాలిసాకరైడ్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇది కీళ్ల నొప్పిని తగ్గించడంలో, హెర్పిస్ వంటి వైరస్‌లను నిరోధించడంలో అలాగే హెచ్‌ఐవీ చికిత్సకు ఇది ప్రసిద్ధి చెందింది.

ఈ సీ కుకుంబర్‌‌ శరీర భాగాల నుంచి రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారు. వాటిలో జ్యూస్, బామ్, క్రీమ్, టూత్‌పేస్ట్, జెల్ ఫేస్ వాష్, బాడీ లోషన్, సబ్బు, లైనిమెంట్ ఆయిల్ వంటి వాణిజ్య ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆర్థిసీ, సీకుమ్యాక్స్ (ఆర్థరైటిస్) సీ జెర్కీ వంటి బ్రాండెడ్ ప్రోడక్టులూ ఉన్నాయి.

సీ కుకుంబర్‌‌లను అమ్మడానికి ముందు ఒక్కొక్కటి తీసుకొని వాటి లోపల భాగాలను కత్తితో తొలగిస్తారు, అనంతరం ఒక డ్రమ్‌లో వాటిని ఉడకబెడతారు. చల్లారిన తర్వాత కుకుంబర్‌ను ఉప్పులో ఉడకబెట్టి, తర్వాత ఎండలో ఆరబెడతారు. వాటి ఎగుమతి కోసం సిద్ధమయ్యే సమయానికి అవి ముడుచుకొని కనిపిస్తాయి. ఆ సమయంలో వాటి బరువు 30 రెట్ల వరకు తగ్గుతుంది.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

సముద్ర పర్యావరణానికి కీలకం..

సముద్ర పర్యావరణ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడంలో సీ కుకుంబర్‌‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇసుకను క్లీన్ చేయడంలో, సముద్రంలో ఆక్సిజన్, నీటి pH స్థాయి పడిపోకుండా చూస్తాయి.

సీ కుకుంబర్‌‌లు తొలగిస్తే పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని డాక్టర్ వాంగ్యూమెర్ట్ హెచ్చరిస్తున్నారు.

దీంతో ఆల్గేలు మొదట చనిపోతాయని, ఇది చిన్న చేప జాతులకు ఆహారం లేకుండా పోతుందని, చివవరకు అది పెద్ద చేపల ఆహారపు కొరతకు దారి తీస్తుందని చెప్పారు.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

చేపల వ్యర్థాలనూ తినేస్తాయి: పరిశోధకులు

సీ కుకుంబర్‌‌లలో యాంటీ బాక్టీరియల్, యాంటీకాన్సర్ లక్షణాలు ఉంటాయని స్టిర్లింగ్ యూనివర్శిటీలోని ఆక్వాకల్చర్ ఇన్‌స్టిట్యూట్ పీహెచ్‌డీ పరిశోధకులు కార్ల్ కటజార్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్, ఫార్మా రంగాలలో వీటిపై ఎక్కువగా పరిశోధనలు జరుగుతాయని అంటున్నారు.

"సీ కుకుంబర్‌‌లు చేపల నుంచి వచ్చే వ్యర్థాలను తీసుకుంటాయని, ఆ వ్యర్థాలు సీ కుకుంబర్‌లు పెరగడానికి ఎలా సహాయపడుతుందనేది మా రిజల్ట్స్ చూపిస్తున్నాయి'' అని కార్ల్ తెలిపారు.

"ఇది సముద్రపు ఒడ్డుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే సేంద్రీయ వ్యర్థాలను తొలగిస్తుంది, వీటికి ఆహారం అందించాల్సి అవసరం లేదు" అని ఆయన చెప్పారు.

కార్ల్ కటజార్ ప్రకారం, సీ కుకుంబర్‌‌ మనుగడ, పెరుగుదలకు సరైన స్థానం అవసరం. మధ్యధరా సముద్రంలో ఒక వాణిజ్య చేపల పెంపకం దగ్గర సీ కుకుంబర్‌‌‌లు బాగా పెంచుతుంటారు.

మధ్యధరా సముద్రపు సీ కుకుంబర్‌లు ఎండినవి కిలోకు రూ.2,600 వరకు పలుకుతాయి, ప్రాసెస్ చేసినవైతే కిలోకి రూ.10,700 వరకు విక్రయిస్తారు.

సీ కుకుంబర్‌

ఫొటో సోర్స్, Getty Images

వీటి సంతతి ఎలా ఉంటుంది?

సీఎంఎఫ్ఆర్ఐ ప్రకారం.. సీ కుకుంబర్‌‌లు ప్రధానంగా గోనోకోరిక్; అంటే మగ, ఆడవి విడివిడిగా ఉంటాయి. ఆడ సీ కుకుంబర్‌లలో కలిసిపోయిన మగవాటిని వాటి బాహ్య రూపం కారణంగా గుర్తించడం కష్టం.

సీ కుకుంబర్‌‌ జనాభా లింగ నిష్పత్తి 1:1 ఉంటుంది. వీటిలో ఎక్కువగా బ్రాడ్‌కాస్ట్ స్పాన్సర్స్ టాయి, అంటే స్పెర్మ్‌లు, ఓసైట్‌లను (ఫలదీకరణం కానివి) నీటిలో విడుదల చేస్తుంటాయి.

ఆడ సీ కుకుంబర్ వేల నుంచి లక్షల ఓసైట్‌ (ఎగ్)లను విడుదల చేస్తుంటాయి. మోటైల్ స్పెర్మ్ కణాలు (స్పర్మాటోజోవా) ఓసైట్‌లను గుర్తించి ఫలదీకరణం చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)